Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కబ్జాలపై కఠిన చట్టం

హైదరాబాద్ ఇట్లనె ఉంటె మనం బతకలేం. అందుకే ఈ మహా నగరాన్ని ఊహించనిరీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమైనయి. షార్ట్ పీరియడ్‌లోనే అవి మీ ముందుకొస్తయి. ఈ ప్రణాళికల ద్వారా హైదరాబాద్‌ను ఫలవంతమైన గ్లోబల్ సిటీ (ఫ్రూట్‌ఫుల్ గ్లోబల్ సిటీ)గా మార్చుకుందాం… శుక్రవారం నెక్లెస్‌రోడ్డులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్న మాటలివి. హైదరాబాద్ అభివృద్ధిపై ఇప్పటికే వందల గంటలు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కార్యాచరణ దిశగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐదుగంటల పాటు సాగిన సమావేశంలో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి ఎలా ఉండాలో, ఎక్కడెక్కడ ఏ పని చేపట్టాలి అధికారులకు నిర్దేశించారు. గతంలో నిర్ణయించిన ప్రతిపాదనలు ఎంతమేర వచ్చాయి? ఆరా తీశారు. శుక్రవారం నాస్‌డాక్‌లో జరిగిన ఈ సమావేశానికి నగరాభివృద్ధితో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులను పిలిపించి ప్రణాళికలపై చర్చించారు.

KCR-Review-on-Hyderabad-Development

-రాజధానిలో సర్కారు భూముల తనిఖీకి ఏరియల్ సర్వే -నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి -ఇరవై ఏండ్ల దూర దృష్టితో రహదారుల నిర్మాణం -మూసీనుంచి వనస్థలిపురం దాకా వనాల పెంపకం! -నగర అభివృద్ధిపై సీఎం సమీక్ష -వరంగల్‌లో మూడు మల్టీ లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆదేశం

నగరంలోని ముఖ్య రహదారులు, జంక్షన్లు, వాటి ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో అక్కడ ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రద్దీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు అన్నీ చర్చలో చోటుచేసుకున్నాయి. ఈ అంశాలపై తదనంతర చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ఒక్కో జంక్షన్, ఒక్కో రహదారి అభివృద్ధి గురించి ఓపికగా విశ్లేషించారు. ప్రస్తుతం నగరంలోని రహదారులు, జంక్షన్లు, ఫ్లైఓవర్లు ఇప్పడున్న రద్దీనే తట్టుకోలేకపోతున్నాయని.. వీటిని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు. రాబోయే 20 ఏండ్ల వరకు ఇబ్బంది రాకూడదన్నారు. నగరంలో ఎక్కడెక్కడ మల్టీలెవల్నిఫ్లైఓవర్లు నిర్మించాలి? ఏయే రోడ్డును ఎంత వెడల్పు చేయాలి? ఏ మార్గంలో స్కైవే నిర్మించాలి? అనే అంశాలపై విస్తృత చర్చించి, ఆ మేరకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశించారు.

రద్దీ రహదార్లు ఇవే.. సమీక్షలో భాగంగా హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే రహదార్ల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తానే అధికారుల ముందు పెట్టారు. ఈ హైప్రెషర్ కారిడార్స్(రద్దీ అధికంగా ఉండే రహదార్లు)లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలోని బంజారాహిల్స్ పార్కు చుట్టూ ఉన్న జంక్షన్లు, ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ చౌరస్తా, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం, ఆబిడ్స్, చాదర్‌ఘాట్, జేఎన్‌టీయూ, ఓవైసీ హాస్పిటల్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డు, కొత్తగూడ ఎక్స్‌రోడ్డు, కోఠి, కూకట్‌పల్లి వై జంక్షన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అంబర్‌పేట, హబ్సీగూడ, తిరుమలగిరి, ప్యారడైజ్, మైండ్ స్పేస్, కేపీహెచ్‌బీ, బాలానగర్, బోయినపల్లి, వేంపల్లి, సుచిత్ర, మారియట్ హోటల్, బుద్ధభవన్, మాసబ్‌ట్యాంక్, బీహెచ్‌ఎఈల్, మెహిదీపట్నం, మియాపూర్, ఓల్డ్ రాయదుర్గం, లకిడీకాపూల్, గ్రీన్‌ల్యాండ్, ఎంజే మార్కెట్, చార్మినార్, గోషామహల్, నల్లకుంట, నాంపల్లి తదితర జంక్షన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఈ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడా ఆగకుండా వెళ్లే రీతిలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను సమర్పించాలని ఆదేశించారు.

మూసీనుంచి వనస్థలిపురం దాకా వనాలు, పార్కులు.. సీఎం సమీక్షలో రహదార్లతో పాటు నగరంలోని ఉద్యానవనాల అంశం కూడా చోటు చేసుకుంది. నగరంలో మూసీ నది నుంచి వనస్థలిపురం వరకు వందల ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉందని దాన్ని అధీనంలోకి తీసుకుని వనాలు పెంచడానికి, పార్కులు ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తామని సీఎం ప్రకటించారు. అధికారులు కూడా వాతావరణ సమతౌల్యాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని అన్నారు. హైదరాబాద్ పరిధిలో 1.60 లక్షల ఎకరాల మేర అటవీ భూమి ఉందని, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఈ భూముల్ని రక్షించి వాటిని అందమైన ఉద్యానవనాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. వాకర్లకు, జాగింగ్ చేసే వారికి, సైక్లిస్ట్‌లకు వేర్వేరుగా ట్రాక్‌లు నిర్మించాలని సూచించారు. చాలా నగరాలకు లంగ్ స్పేస్‌లేదని, కానీ హైదరాబాద్‌కు ఆ ఇబ్బంది లేకున్నా.. పార్కులు, గ్రీన్‌ల్యాండ్, రిజర్వు ఫారెస్టు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు. ఆఖరుకు బొటానికల్ గార్డెన్‌ను కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగితే స్థానికులే పోరాడి గార్డెన్‌ను కాపాడుకున్నారని చెప్పారు.

నగరంలోని ప్రతిచోటా ప్రజల్లో ఇలాంటి చైతన్యమే రావాలని సీఎం ఆకాంక్షించారు. పార్కుల కోసం కేటాయించిన స్థలాన్ని రక్షించుకోవడానికి సిటిజన్ కమిటీలు కూడా వేయాలని నిర్ణయించినట్టు సీఎం చెప్పారు. నగరంలో భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించేందుకు పటిష్టమైన చట్టాలు తెస్తున్నామని చెప్పారు. ఇక మీదట నగరంలో ఎలాంటి నిర్మాణాలు జరగాలన్నా… కేవలం జీహెచ్‌ఎంసీ అనుమతి మాత్రమే కాకుండా ప్రభుత్వ అనుమతిని కూడా తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించనున్నట్టు చెప్పారు. కాగితాల మీద లెక్కలు కాకుండా కొద్దిరోజుల్లోనే తానే నగరంలో ఏరియల్ సర్వే నిర్వహించి, అసలు ఎక్కడెక్కడ భూమి ఉంది స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. ఆయా చోట్ల పార్కుల అభివృద్ధికి ఎలాంటి అవకాశాలున్నాయి అనేది నిర్ణయిస్తానని చెప్పారు.

వరంగల్‌లో మూడు మల్టీ లెవల్ ఫ్లెఓవర్లు.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల మీద కూడా ఇప్పుడే దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. వివిధ నగరాల పరిస్థితిని సీఎం విశ్లేషించారు. అధికారులకు ఇచ్చిన నిర్దేశాలలో వరంగల్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే మూడు చోట్ల మల్టీలెవల్ ఫ్లైఓవర్లు అవసరమని చెప్పారు. మడికొండ నుంచి హన్మకొండ చౌరస్తా, ఎంజీఎం, పోచమ్మ మైదాన్, నర్సంపేట రోడ్డు వరకు ఉన్న రహదారులను 150 అడుగుల వరకు విస్తరించాలని చెప్పారు. హంటర్ రోడ్డు, కరీంనగర్ రోడ్డు, ఆర్‌ఈసీ-కేయూసీ రోడ్లు అభివృద్ధి పరచాలని అన్నారు. అలాగే వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో రింగ్ రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎంపీ కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, అటవీ శాఖ ఓఎస్డీ ప్రియాంక, ఆర్ అండ్ బీ అధికారులు బిక్షపతి, రవీందర్‌రావు, లీ అసోసియేట్స్ ప్రతినిధులు టీఎస్ రెడ్డి, ఫణిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.