Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కబోది కమలం

-కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిది బాధ్యతారాహిత్యం
-బండి సంజయ్‌లో విషయం లేదు
-నీటి వాటాలపై తెలంగాణ అడగలేదని అపనిందలా?
-ఆరేండ్లుగా రాసిన లేఖలే సాక్ష్యాలుమీ మంత్రుల హామీ తెలియదా?
-బీజేపీ రాష్ట్ర నేతలు నిజాలు చూడలేరా?
-చూసినా వారికి అవి గుర్తుండవా?
-బీజేపీ నేతలపై వినోద్‌కుమార్‌ ఆగ్రహం

నీళ్ల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పడమంటే నవ్వాల్నా, ఏడ్వాల్నా తెలియడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్‌ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు రాసిన లేఖ తొలిసారి అని చెప్పడం వారి అవగాహనలేమిని బయటపెడుతున్నదని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కార బాధ్యత ముమ్మాటికీ కేంద్రానిదేనని, రాష్ర్టాల పరిధిలోని అంశం కాదని స్పష్టంచేశారు. జలాల విషయంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు.

జల వివాదాన్ని ఆరేండ్లుగా నాన్చుతున్నది కేంద్రం కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజల్లో తప్పుడు అవగాహన కల్పించేలా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన మొదలైందని వినోద్‌ గుర్తుచేశారు. రాష్ర్టానికి నీటి కేటాయింపుల విషయంలో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రులుగా ఉన్న ఉమాభారతి, నితిన్‌గడ్కరీలతోపాటు.. ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలను, అప్పటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి.. కేంద్ర కార్యదర్శులకు రాసిన లేఖలను మీడియాకు అందజేసిన వినోద్‌.. వీటిని కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కు ట్విట్టర్‌లో పంపిస్తానని తెలిపారు.

కేంద్రం వల్లే సమస్య పెండింగ్‌లో
‘కేంద్ర ప్రభుత్వం చట్టప్రకారంగా నీటి కేటాయింపుల్లో నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం- 1956 చెప్తున్నది. దాని ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం వేచి చూసి.. 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం వల్ల పిటిషన్‌ ఇంత వరకు తేలలేదు’ అని వినోద్‌ చెప్పారు. తెలంగాణ ప్రజలు, రైతుల బతుకుదెరువులపై దాడి జరగొద్దు, ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కానీ.. ఈ విషయాల్లో అవగాహన లేని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

‘కిషన్‌రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడు. బండి సంజయ్‌ ఎంపీగానే కాకుండా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఇద్దరూ వెంటనే ప్రధానమంత్రి దగ్గరకు వెళ్లి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని అడగండి. తెలంగాణ ప్రజలకు కృష్ణా నదీజలాల్లో ఉన్న వాటాను వెంటనే తేల్చమని చెప్పండి. రాష్ట్రంలో కృష్ణానదిపై కడుతున్న ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అడగండి. శ్రీశైలంలో నీటిని తరలించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఆపండి’ అని డిమాండ్‌ చేశారు. నీటి వాటాలు తేల్చడం అనేది కేంద్రం చేయాల్సిన పనేనన్న వినోద్‌.. ఈ విషయంలో కేంద్రం మధ్యవర్తిత్వం వహిస్తుందని కిషన్‌రెడ్డి చెప్పడాన్ని ఎద్దేవాచేశారు.

‘అసలు మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తరు? వివాదం ఉంటే సంబంధం లేనివాళ్లు మధ్యలో ఉండి పరిష్కరించాలి. కానీ ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఈ విషయంలో కేంద్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈ జల వివాదం కొనసాగుతున్నది’ అన్నారు. సరిహద్దు రాష్ర్టాల సీఎంలతో వివాదాలు పెట్టుకోవద్దని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలని విశాల దృక్పథంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. పొరుగు రాష్ర్టాలతో ఘర్షణ వైఖరి వల్ల దశాబ్దాల నుంచి అనేక ప్రాజెక్టులు అమలుకు నోచుకోలేదని వినోద్‌కుమార్‌ గుర్తుచేశారు.

కిషన్‌రెడ్డిది బాధ్యతారాహిత్యం
కిషన్‌రెడ్డి బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అంతర్రాష్ట్ర నదీజలాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిపై ఏమాత్రం అవగాహన లేకుండా బండి సంజయ్‌ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. వీరిద్దరికీ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం దగ్గరకు వెళ్లి.. రాష్ర్టానికి నీటి కేటాయింపు చేయించాలని డిమాండ్‌ చేశారు. ‘రాష్ర్టానికి నీటి కేటాయింపు విషయంలో పార్లమెంటులో నాటి సభ్యులం అనేక సందర్భాల్లో కేంద్రమంత్రి ఉమాభారతి, నితిన్‌గడ్కరీలను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. ఈ విషయాలు వందలసార్లు టీవీల్లో, పత్రికల్లో 2014-2019 వరకు వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాలను చేయాలని అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి నిర్ణయానికి వచ్చిన సందర్భంలో మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించిన బీజేపీ, శివసేన ఎంపీలు ఒకరోజు పూర్తిగా పార్లమెంటును వాళ్ల ప్రభుత్వానికి వాళ్లే వ్యతిరేకంగా స్తంభింపజేశారు. అంటే తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను సాధించే క్రమంలో అడ్డుపడ్డది బీజేపీ పార్టీనే. అది కూడా వీళ్లకు అవగాహన లేదు’ అని వినోద్‌ చెప్పారు. ప్రధానమంత్రిని సీఎం కేసీఆర్‌ కలిసిన ప్రతి సందర్భంల్లోనూ ఈ విషయంపై నివేదించారని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.