-కొంగరకలాన్ దారుల్లో జనజాతరే -రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్ర క్యాబినెట్ భేటీ -ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధం -ఆకట్టుకుంటున్న బాహుబలి సెట్టింగులు -గులాబీమయంగా సభాస్థలం -మార్గాలు 19.. పార్కింగ్ స్థలాలు 14 -అడుగడుగునా ట్రాఫిక్ హెల్ప్లైన్లు

తెలంగాణ కదిలింది! జనజాతరకు ప్రజలు తరలిరావడం మొదలైంది! ప్రభలు కట్టుకుని పండుగలకు పోయినట్టు.. ఊళ్లన్నీ హైదరాబాద్ రోడ్డెక్కుతున్నాయి! అందంగా అలంకరించిన వేలకొద్దీ ట్రాక్టర్లు.. లారీలు.. బస్సులు.. ఇతర వాహనాలు.. వాటినిండా వాడితగ్గని ఉద్యమ ఉత్సాహంతో 31 జిల్లాల నుంచి ప్రజలు ప్రగతి నివేదన సభాప్రాంగణాన్ని గులాబీమయం చేసేందుకు కొంగరకలాన్ బాటపట్టారు!.. మరోవైపు ప్రగతి నివేదన సభ ప్రారంభానికి ముందే ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. కొంగరకలాన్ సభకు ముందు జరుగుతున్న ఈ క్యాబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
బంగారు తెలంగాణ లక్ష్యాన్ని ముద్దాడే ఆశతో కదంతొక్కుతూ పదంపాడుతూ అన్ని జిల్లాల నుంచి ప్రజలు కొంగరకలాన్వైపు అడుగులేస్తున్నారు! నాలుగేండ్ల ప్రభుత్వ ప్రగతిని నివేదించేందుకు కనీవినీ ఎరుగనిస్థాయిలో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న అద్భుతమైన సభలో భాగస్వాములయ్యేందుకు ప్రజానీకాన్ని తీసుకుని బారులుతీరిన వాహనాలతో రాష్ట్రంలోని రోడ్లన్నీ జాతర శోభను సంతరించుకున్నాయి! హైదరాబాద్ నగరాన్ని, కొంగరకలాన్‌లోని సభాప్రాంగణాన్ని, ఔటర్రింగురోడ్డును గులాబీ జెండాలు, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ ముఖ్యనాయకుల భారీ కటౌట్లు, స్వాగత తోరణాలతో అలంకరించారు. కేసీఆర్ పిలుపుమేరకు ముందురోజే సభకు వచ్చేవారికోసం.. ఔటర్రింగురోడ్డు పక్కన, ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక షెడ్లు నెలకొల్పారు. వారికి భోజనాలు, స్నానాల విషయంలోనూ ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారు. ప్రగతి నివేదన సభ నిర్వహణకు మరో ఇరవై నాలుగు గంటలే మిగిలి ఉండటంతో ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. భారీ వేదిక.. ఎత్తయిన స్తంభాలపై నెలకొల్పిన ఫ్లడ్‌లైట్లు.. భారీ సౌండ్‌సిస్టమ్స్.. సభ మొత్తానికీ ప్రధాన వేదిక కనిపించేలా నెలకొల్పుతున్న పెద్ద ఎల్ఈడీ తెరలతో ప్రగతి నివేదన సభాస్థలం బాహుబలి సెట్టింగులను తలపిస్తున్నది.

మార్గాలు 19.. పార్కింగ్ స్థలాలు 14 -కేటాయించిన స్థలాల్లోనే వాహనాలు పార్క్‌చేయాలి -ట్రాక్టర్ల మీద వచ్చేవారు ఒకరోజు ముందే చేరుకోవాలి -సాధారణ ప్రజలు ప్రయాణాలను వాయిదావేసుకోవడం మంచిది -అడుగడుగునా ట్రాఫిక్ హెల్ప్లైన్లు ఏర్పాటు
హైదరాబాద్ శివారు కొంగర్‌కలాన్‌లో ఆదివారం జరిగే ప్రగతి నివేదన సభకు పకడ్బందీ ఏర్పాట్లుచేశారు. భారీ బహిరంగసభ నేపథ్యంలో సాధారణ ప్రజానీకం ఇబ్బందులు పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సభకు తరలివచ్చేవారికి మొత్తం 19 మార్గాలను నిర్దేశించారు. ఈ మార్గాల్లో వచ్చేవాహనాల కోసం 14 పార్కింగ్ స్థలాలను కేటాయించారు. వాహనాల కోసం జిల్లాలవారీగా ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. ఓఆర్ఆర్మీదుగా వచ్చేవారికి ప్రత్యేకమార్గాలను సూచించారు. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ పోలీసుల సేవలను పొందేందుకు ప్రత్యేక హెల్ప్లైన్లను అందుబాటులో ఉంచారు. దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలలో వచ్చే పార్టీ కార్యకర్తలు ఒకరోజు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ప్రజలు ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తిచేశారు. ఓఆర్ఆర్పై భారీ వాహనాల రాకపోకలను నిషేధించి.. వాటిని ఇతరమార్గాల ద్వారా మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. సభ పూర్తయ్యాక వాహనాలు వచ్చిన మార్గాల్లోనే తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. సెప్టెంబరు 2న ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
సభకు వచ్చే వాహనాలకు టోల్ ట్యాక్స్ లేదు: హెచ్ఎండీఏ కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ నిర్వహించే ప్రగతి నివేదన బహిరంగసభకు తరలివచ్చే వాహనాలకు ఓఆర్ఆర్పై టోల్‌ట్యాక్స్ చెల్లించనక్కర్లేదు. బహిరంగసభకు వచ్చే వాహనాల టోల్పన్నును భరిస్తామంటూ టీఆర్ఎస్ చేసిన అభ్యర్థనను మేరకు హెచ్ఎండీఏ ఈ నిర్ణయం తీసుకున్నది. సభకు వచ్చే వాహనాలతో ప్రజల రవాణా ఇబ్బందులు, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
ట్రాక్టర్లు నేడే చేరుకోవాలి – ఔటర్ రింగ్‌రోడ్డుపైకి అనుమతి ఉండదు తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించే ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్ల ద్వారా వచ్చే శనివారం రాత్రిలోగా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు చేరుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఇతర వాహనాలను ఇబ్బందులు ఎదురుకాకుండా ముందురోజే వచ్చేలా చేరుకోవాలని, ఆదివారం ట్రాక్టర్లను అనుమతించమని స్పష్టం చేశారు. ట్రాక్టర్ల ద్వారా సభకు చేరుకునే వారికి పార్కింగ్ ప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు పెద్దఎత్తున సభకు హాజరుకావడానికి సిద్దంగా ఉన్నారన్నారు. వారి ఉత్సాహంతో వేలసంఖ్యలో ట్రాక్టర్లు బయలుదేరుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే రెండు వేల ట్రాక్టర్లు బయలుదేరాయని, వారికి అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మంచినీరు, టాయిలెట్లు, పొయ్యిలు, కట్టెలు, మైక్‌లు ఏర్పాటు చేశామన్నారు. నాలుగు వైద్యశిబిరాలను, 30అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ట్రాక్టర్లకు ఔట్రింగ్ రోడ్డుపైకి అనుమతి లేదని, వారు ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు ద్వారా కొంగరకలాన్‌లోని ప్రగతిప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు.

ప్రగతి నివేదనకు సర్వం సిద్ధం -రెండు గంటల కల్లా సభకు చేరుకోవాలి -ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్ -సభా ప్రాంగణంలో వలంటీర్ల కవాతు
తెలంగాణ ప్రభుత్వం నాలుగున్నరేండ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన భారీ బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయని, మిగిలిన కొన్ని ఏర్పాట్లను కూడా త్వరగా పూర్తిచేయలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతాలు, కొత్తగా నిర్మించిన రోడ్లు, ట్రాక్టర్ల ద్వారా వచ్చేవారికి చేసిన ఏర్పాట్లను పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. వేదికను పరిశీలించి.. వేదిక వెనుకభాగంలో ఏర్పాటుచేసే బ్యానర్‌పై సూచనలు చేశారు. మంత్రి కేటీఆర్‌తోపాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రగతి నివేదన సభ ప్రాంగణానికి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల కల్లా చేరుకోవాలని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. వేలసంఖ్యల్లో వాహనాలు, లక్షలాదిగా ప్రజలు ఒకేసారి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని వచ్చినవారు వచ్చినట్టే మధ్యాహ్నం కల్లా సభా ప్రాంగణంలో ఆశీనులు కావాలని కోరారు. ప్రగతి నివేదన సభకు వచ్చే వారికి సేవలు అందించడానికి వలంటీర్స్ సభాప్రాంగణంలో కవాతు నిర్వహించారు.
నాలుగేండ్లలో 400 రకాల పథకాలు: హోంమంత్రి నాయిని టీఆర్ఎస్ ఆదివారం నిర్వహించే ప్రగతి నివేదన సభ దేశంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కొంగర కలాన్‌లో శుక్రవారం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రగతి నివేదన సభకు ప్రజల స్పందన అద్భుతంగా ఉన్నదన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, సభ నిర్వహణలో ఎక్కడా అధికార దుర్వినియోగం లేదన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా నాలుగున్నరేండ్లలో 400 రకాల పథకాలను ప్రవేశపెట్టిన చరిత్ర సీఎం కేసీఆర్దిఅని చెప్పారు. దేశంలోనే చారిత్రాత్మకమైన సభ రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నదని రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, రాములు నాయక్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్రకార్యదర్శి మారెడ్డి శ్రీనివాస్రెడ్డిపాల్గొన్నారు.
తరలివచ్చేందుకు ఉత్సాహంగా ముస్లింలు: ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ ప్రగతి నివేదన సభకు ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలంటూ ముద్రించిన పోస్టర్‌ను శుక్రవారం తెలంగాణభవన్‌లో ఆయన ఆవిష్కరించారు.
ఇంటికి ఒకరు చొప్పున కదిలిరావాలి: ఇంద్రకరణ్‌రెడ్డి ప్రగతి నివేదన సభకు ప్రతిఇంటినుంచి ఒక్కరు చొప్పున కదిలిరావాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో శుక్రవారం ప్రగతి నివేదన సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ప్రగతి సభకు ఏడువేల ఆర్టీసీ బస్సులు: సోమారపు ప్రగతి నివేదన సభకు ఏడువేల ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. పెద్దమొత్తంలో బస్సులను అద్దెకు ఇచ్చినప్పటికీ సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. శుక్రవారం బస్‌భవన్‌లో ఆయన మాట్లాడుతూ అద్దెకు కేటాయించడంలో ఏ పార్టీలైనా, ఏ వ్యక్తులైనా సంస్థకు ఒక్కటేనని అన్నారు.