Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాకతీయనగరికి పూర్వవైభవం

-అదే నా పర్యటన లక్ష్యం -భవిష్యత్ అవసరాలకు నగరాన్ని సిద్ధం చేయాలి -ప్రజల్లో విశ్వాసం నింపేందుకే నాలుగురోజుల మకాం -ముఖ్యమంత్రి కేసీఆర్ కాకతీయులు పాలించిన వరంగల్‌కు పూర్వవైభవం తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అతి పెద్ద నగరం వరంగల్.. హైదరాబాద్ అస్తవ్యస్తమైపోయింది. ఆ అనుభవం దృష్టిలో ఉంచుకొని వేగంగా అభివృద్ధి చెందే వరంగల్‌ను భవిష్యత్ తరాల అవసరాలను అనుగుణంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ నగర జనాభా 10 లక్షలు. రేపు అన్ని విధాలా పరిశ్రమలు, విద్యాలయాలు ఏర్పాటు చేస్తే జనాభా రెండింతలు అవుతుంది.

KCR-press-meet

ఆ పెరిగే జనాభాకు అనుగుణమైన సదుపాయాలు కల్పించాలన్న ముందుజాగ్రత్తే నా పర్యటన అసలు ఉద్దేశం అని కేసీఆర్ చెప్పారు. వరంగల్‌ను వస్త్ర పరిశ్రమకు కేరాఫ్‌గా.. సూరత్, బీవండి, షోలాపూర్, తిర్పూర్ ప్రాంతాలను తలదన్నేలా, దేశం గర్వించే విధంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి తన నాలుగు రోజుల పర్యటన ఉద్దేశాన్ని, తన దార్శనికతను ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా విజన్ వరంగల్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ బాగా కిక్కిరిసిపోయిందని, వరంగల్ ఆ విధంగా మారిపోకముందే రహదారుల వెడల్పు కార్యక్రమాలు, మురికివాడలలో పేద ప్రజలకు పక్కా ఇండ్ల నిర్మాణం, మొక్కల పెంపకం, పార్కులతో కాకతీయ పురి కళకళలాడే విధంగా తయారు చేస్తామన్నారు.

అన్ని వస్ర్తాలు ఇక్కడే.. వరంగల్‌ను టెక్స్‌టైల్ హబ్‌గా మార్చాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం దేశంలో చీరెలు, చద్దర్లు, గార్మెంట్స్, స్పిన్నింగ్, వీవింగ్, ప్రింటింగ్, డైయింగ్ లాంటి ఉత్పత్తులు సూరత్, షోలాపూర్, బీవండి, తిర్పూర్ లాంటి భిన్న ప్రాంతాల్లో ఉన్నాయని ఆ పరిశ్రమలన్నీ ఒకే చోట అదీ వరంగల్‌లో ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నదని అన్నారు. ఈ దిశగా వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు పాపారావుతో కూడిన అధ్యయన కమిటీ ఇప్పటికే సూరత్, బీవండిలో పర్యటించిందని ఆయన గుర్తుచేశారు.

సూరత్, బీవండి, షోలాపూర్ ప్రాంతాల్లో దాదాపు నాలుగు లక్షల మంది జిల్లా వాసులు ఉన్నారని వారంతా ఉద్యమ సమయం నుంచి మన దగ్గర పరిశ్రమ పెడితే తిరిగి ఇక్కడికి వస్తామని మాట ఇచ్చారని చెప్పారు. మనవాళ్లు వలస వెళ్లడం బాధాకరమైనా వాళ్ల కారణంగా మనకు మంచి అనుభవం ఉన్న మానవవనరులు రెడీమేడ్‌గా లభ్యమవుతున్నాయని అన్నారు.

ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించాలి.. గత ప్రభుత్వాల హయాంలో ప్రజలకు ఏం ఒరిగిందో తన బస్తీ పర్యటనల్లో బయటపడిందని అన్నారు. ఇవాళ నాయకులు, అధికారులు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలేదు..వాళ్లకు నమ్మకం పోయిందని కేసీఆర్ అన్నారు. అందుకే వాళ్లలో ప్రభుత్వం మీద విశ్వాసం పాదుకొల్పేందుకే తాను నాలుగురోజులు ఇక్కడే ఉండి ఇచ్చిన హామీ మేరకు ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశానని అన్నారు.

మురికివాడలలో ఇళ్ల నమూనాను హైదరాబాద్‌లో తయారు చేసి త్వరలోనే పంపిస్తానని తెలిపారు.వరంగల్‌ను ఒక ఆదర్శవంతమైన, సుందరమైన నగరంగా, మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే ముందు ఆ దిశగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాల్సి ఉంటుందని తన నాలుగు రోజుల పర్యటన గురించి వివరించారు.

నగరాభివృద్ధికి చేయాల్సింది ఎంతో.. నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా ముందుకు రావాలని కేసీఆర్ అన్నారు. ఇక్కడ రహదారుల విస్తరణ కూడా అవసరమని చెప్పారు. నగరంలో ఉన్న సెంట్రల్ జైలు, ఆటోనగర్‌లను ఊరికి బయటకు మార్చాల్సి ఉందన్నారు. అలాగే కంతనపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగించుకునేందుకు మూడు నాలుగు రిజర్వాయర్లు నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేశానన్నారు. తాను మళ్లీ వచ్చినప్పుడు ఎంజీఎం పరిస్థితిని అధ్యయనం చేస్తానని తెలిపారు. వరంగల్ ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణం పూర్తయ్యేందుకు 36 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, పార్లమెంట్ సభ్యులు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, బోయినపల్లి వినోద్‌కుమార్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జీ పద్మ, శాసన మండలి సభ్యులు బోడకుంటి వెంకటేశ్వర్లు, శాసనసభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, శంకర్‌నాయక్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మికాంతరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నెబోయిన రాజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు, అర్బన్ పార్టీ అధ్యక్షులు నన్నపనేని నరేందర్, ఎం సహోదరరెడ్డి పాల్గొన్నారు.

గుడుంబాపై త్వరలో నిర్ణయం గుడుంబాపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ గుడుంబా ఒక మహమ్మారిలా దయ్యం పట్టినట్టు పట్టి ప్రజల్ని పీడిస్తుంది. నేను ఎక్కడికిపోయినా జనం గుడుంబాను బంద్ చేయాలంటున్నారు. అందరూ అంటున్నరు ఆ సర్కారు సారా ఉన్నప్పుడే మంచిగుండేది అంటున్నరు. అయితే దానిపై అన్ని ఆలోచించి జనానికి పనికొచ్చే ఒక మంచి నిర్ణయం రాబోయే కొద్ది రోజుల్లోనే తీసుకుంటాం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణలో పుట్టగతుల్లేని పార్టీ.. బీజేపీపై సీఎం విసుర్లు టీఆర్‌ఎస్‌కు పునాదుల్లేవంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన వ్యాఖ్యపై కేసీఆర్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు పునాదుల్లేవా?.. తెలంగాణలో ఎవరికి పునాదుల్లేవో జనానికి తెలియదా. పొత్తుల్లేకుండా ఎన్నికల్లో గెలిచింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఒక పుట్టగతుల్లేని పార్టీ అని వ్యాఖ్యానించారు. అనవసరంగా లేనిపోని మాటలు అని నోరుపారేసుకోవద్దని బీజేపీ నేతలకు ఆయన హితవు పలికారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.