Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కళాకారుల జీవితాల్లో కొత్తవెలుగులు

ఏ రాజకీయోద్యమమైనా విజయవంతం కావాలంటే, దానికి సమానంగా సాంస్కృతికోద్యమం ఉండాలి. ఇందుకు సజీవ ఉదాహారణే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది ఇక్కడి సాంస్కృతిక కళారంగం. అందుకు తమ జీవితాలను అంకితం చేశారు తెలంగాణ కళాకారులు. ఇల్లు మరిచి, ఊరు మరిచి తెలంగాణ కోసం జబ్బకు డప్పేసుకొని తిరిగిన చరిత్ర మరువలేనిది. అలా కళాకారులు, కవులు, రచయితలు, విద్యార్థులు, ఉద్యోగులు ఐక్యంగా చేసిన పోరాటం, ఉద్యమనేతగా కేసీఆర్ విలువైన త్యాగం తెలంగాణ కలను సాకారం చేసింది. మరి ఎవరైతే ఉద్యమం కోసం అంకితమయ్యారో ఆ కళాకారుల కృషికి పట్టం కట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

ఐదువందలమంది కళాకారులకు ఉద్యోగభృతి కల్పించి దేశ చరిత్రలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ర్టం సిద్ధించిన తర్వాత ఉద్యోగం పొందిన తొలి నిరుద్యోగి కళాకారుడే! ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాల నోటిఫికేషన్‌లు సిద్ధం చేస్తున్నది. త్వరలోనే వారి త్యాగాలకు కూడా సార్ధకత లభించనుంది. స్వయంగా ఉద్యమ నాయకుడే ప్రజలను పాలించే స్థానంలో ఉండడం వల్ల అట్టడుగు ప్రజలకు అవకాశాలు లభిస్తున్నాయి. పైగా సీఎం కేసీఆర్ కూడా కళతో సంబంధం కలిగిన సృజనకారులు. వారికి కళ విలువ తెలుసు. కళాకారులు పడ్డ కష్టం తెలుసు. అందుకే కవులు, కళాకారులను కేసియార్ ఏనాడు తక్కువగా చూడలేదు. వారికి పెద్ద పీట వేశారు. అందుకు సాక్ష్యమే కళాకారులకు ఉద్యోగాలు.

అమరవీరుల త్యాగాల కలబోత, తెలంగాణ కళాకారుల వలపోత తెలంగాణ రాష్ర్టం. రాజకీయ నాయకులు ఓట్లు, సీట్ల కోసం ఉద్యమాన్ని వాడుకోవచ్చు. ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నప్పుడు ముందుకొచ్చిన నేతలు, ఉద్యమం ఏ కొంచె సద్దుమణిగినా తమ దారి తాము చూసుకున్నారు. కానీ, కవుల కళాకారులు మాత్రం ఉద్యమం నుంచి ఏ మాత్రం పక్కకు జరిగింది లేదు. తిన్నా, తినకున్నా ఉద్యమం గెలువాలని కాలికి గజ్జె కట్టుకొని తిరిగింది కళాకారులే. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కంటే మిన్నగా తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది కళాకారులు అలుపెరుగని కృషిని చేశారు. అర్థంకాని దోపిడీని, కనిపెంచని శత్రువును మట్టిబిడ్డలకు అర్థం చేయించింది పాటే.

పాటకు, మాటను జతచేసిన ధూంధాం సభలు వందలు వేలు. ఊరూర పాటల ప్రవాహం సరికొత్తగా ప్రవహించింది. అప్పటిదాకా కొనసాగిన ఉద్యమాల అనుభవాల రికార్డులను తిరగరాసింది. దేశంలోనే ఇలాంటి సాంస్కృతిక ఉద్యమం మరొకటి లేదని మేధావులంతా కొనియాడారు. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం కళాకారులు పడ్డ కష్టం మామూలుది కాదు. కళాకారులంతా నిరుపేద కుటుంబాల నుండి వచ్చినవాళ్లే. వీరిలో చదువులేని వారే కాదు, పెద్ద చదువులు చదివినవాళ్లు కూడా ఉన్నారు. అయినా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయకుండా, తమలో ఉన్న కళ తమ నేల విముక్తి కోసం ఉపయోగపడితే చాలనుకున్నారు.

అందుకోసం ఆలు పిల్లలను వదిలి ఉద్యమం కోసం ఊరూరు తిరిగారు. ఇలాంటి కళాకారుల్లో వయో బేధాలు కూడా ఉన్నాయి. ప్రాథమిక విద్యను అభ్యసించే విదార్థి కళాకారుల నుంచి మొదలు, యాభై యేళ్లు పైబడిన వాళ్లు కూడా లేకపోలేదు. ఇలాంటి వారందరి కృషి ఫలితం తెలంగాణ రాష్ర్టం. వీరందరి కృషికి పట్టం కట్టడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎవరి కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి దక్కాలన్న న్యాయపూరిత ఆలోచన చేశారు. అందుకే ఈ ఉగాది పండుగ సందర్భంగా కళాకారులందరిని పిలిచి ఐదువందల మంది జీవితాల్లో వసంతోత్సాహాన్ని నింపారు. కవులను, కళాకారులను మరిచిపోయేతనం తెలంగాణ సర్కారుకు లేదని తేల్చిచెప్పారు.

కడుపు కట్టుకొని పాటుపడ్డ వాళ్ల కృషికి ఫలితం దక్కాలి. తెలంగాణ నేల మీద ఎన్నో ఉద్యమాలు వచ్చాయి, పోయాయి. వాటన్నింటికి ఊతమిచ్చింది కళాకారులే. అట్లా మూడుతరాల పాటు కళాకారులు దేనికీ కొరగాని జీవితం గడిపారు. ఆఖరికి తిండికిలేక ఆకలి చావు చచ్చిన కళాకారులు కూడా ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఆయా ఉద్యమాలు పలుచబడ్డప్పుడు కళాకారుని బతుకు మరింత అగాథాల పాలైంది. తన పాట, మాట ఏ ఉద్యమాలకు ధారపోశారో, ఆ ఉద్యమాలు గమ్యస్థానాలకు చేరకపోగా, కళాకారులకు చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. ఈ దుర్మార్గం కళాకారులనే కాదు, వారిని నమ్ముకున్నవారి కుటుంబాలను కూడా దిక్కులేనోళ్లను చేశాయి.

అలా కూలిన కుటుంబాలకు తెలంగాణలో లెక్కేలేదు. ఇలాంటి చరిత్రను తలుచుకున్నప్పుడాల్ల కళ్లు చెమరుస్తాయి. ఉద్యమాలకు ఊపిరిపోసిన కళాకారులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ చరిత్ర తెలిసిన కళాకారుల కుటుంబ పెద్దగా సీఎం కేసియార్ చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక మీదట తెలంగాణలో ఏ కళాకారుడు ఆకలి చావు చావొద్దు. కుటుంబాలను పట్టించుకోని నిరుద్యోగ జీవితానికి ఇక తెరపడాలి. కళాకారుడంటే సమాజంలో గౌరవం ఏర్పడాలి. నలుగురిలో తలెత్తుకొని నిలవాలంటే ఆర్థికపరిపుష్టి ఉండాలి.

అందుకే తెలంగాణ సర్కార్ వీరందరికి ఉద్యోగాలిచ్చి ఆదుకునే చారిత్రక బాధ్యతను భుజానేసుకున్నది. కళాకారుల్లోని ప్రముఖ రచయితలు, వాగ్గేయకారులను పిలిపించి, స్వయంగా సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఉద్యమం కోసం అహోరాత్రులు శ్రమించిన కళాకారులను నేను గుర్తుపడతానని స్వయంగా చెప్పారు. అలాంటి వారు తెలంగాణ వ్యాప్తంగా పదిజిల్లాలల్లో వందలాది మంది ఉన్నారు. వారిలో పూర్తిగా గోసి, గొంగడితో ఆడిపాడిన కళాకారులకు ముందు న్యాయం జరగాలన్నారు. అందుకు అనుగుణంగానే కళాకారులకు కాల్ లెటర్‌లు పంపి,

ఇంటర్వ్యూలు జరిపింది సాంస్కృతిక శాఖ. అట్లా ఐదువందల మంది కళాకారులను ఎంపిక చేసి, వారికి కాల్ లెటర్‌లు పంపింది. వచ్చి జాయిన్ కమ్మని ఆదేశాలు కూడా జారీ చేసింది. కాల్ లెటర్‌లు అందుకున్న కళాకారుల ఆనందానికి పట్టాపగ్గాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఆ కాల్ లెటర్‌లో అన్నం మెతుకులు కనపడ్డాయి. ముసలి తల్లిదండ్రులకు పెట్టే బుక్కెడు బువ్వ కనిపించింది. యేండ్లతరబడి తమ యిండ్లల్లో నిండుకున్న పేదరికాన్ని తరిమే కొత్త శక్తియేదో కనిపించింది. అప్పటిదాకా నిరాశ నిస్పృహలతో అల్లాడిన ముఖాల మీద రంగుల సింగిడి పూసింది.

గతపాలకులు కళాకారులను కల్యామాకులా వాడుకున్నారు. కనీస భృతి కల్పించడానికి కూడా ముఖం చాటేశారు. అంతేతప్ప వారి బాగోగులను ఏనాడు పట్టించుకున్న చరిత్ర లేదు. కాని, తెలంగాణ ఉద్యమం చేసిందే తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడాలని కాబట్టి, ఉద్యమం కోసం పాటుపడ్డ ప్రతి ఒక్కరికిని సగౌరవంగా సత్కరిస్తున్నది తెలంగాణ సర్కార్. వాస్తవానికి కళాకారులు చేసిన కృషికి వారిని శాలువాలతో, పూలమాలతో సత్కరించవచ్చు. కాని, అట్లా చేస్తే కళాకారులు ఒక్కరోజు మాత్రమే సంతోషపడి మరిచిపోతారు. మళ్లీ ఆకలి పోరాటం వారిని వెంటాడుతూనే ఉంటుంది. కాని, వారికి, వారి కుటుంబానికి ఆసరగా నిలిస్తే అది తరాల పాటు నిలిచి ఉంటుంది.

సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారంటే గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఇక మీదట కళాకారులు కూడా పొందబోతున్నారు. కళాకారుడి కుటుంబానికి వారి ఊళ్లల్లో కూడా సరికొత్త గౌరవం కలలుగనుంది. ఇప్పటి వరకు కళకారులుగా పాటుపడినందుకు, ఊళ్లల్లో గౌరవం ఉంది. కాని ఆర్థికవిషయాల ముచ్చటవచ్చే సమయంలో మాత్రం కళాకారులను తక్కువ చూపు చూశారు. ఈ పరిస్థితిని అనుభవించిన కళాకారులు వందలాది మంది ఉన్నారు. చదివిన చదువుకు నౌకర్లు రాక, పాడిన పాటకు గుర్తింపులేక మానసిక సంఘర్షణను అనుభవించిన తరమొకటి మన కళ్లముందే ఉంది. కుటుంబాన్ని పోషించలేక, కళాకారుడనే పేరును కాపాడుకోలేక నరకయాతన అనుభవించారు.

కళాకారుడు బతకడానికి ఏ కూలీపనికో పోతే అందరు హేళన చేస్తారు. కళాకారుడు దేనినైనా సహిస్తాడు కాని అవమానాన్ని భరించలేడు. ఎందుకంటే చప్పట్ల మోతల్లో సాగిన ప్రయాణం కళాకారునిది. మరి చప్పట్లు కడుపు నింపవు. ఆలుపిల్లలు ఆకలితో అలమటిస్తుంటే కళాకారుని మనసు విలవిలాడుతుంది. సమాజానికి అన్నంపెట్టే రైతు బతుకు మారాలని ఆకాంక్షించే వాడికే అన్నం లేకపోతే పరిస్థితి ఎంత విషాదకరం. ఇలాంటి పరిస్థితుల నడుమే కళాకారుడు నైతికంగా పతనమై, తాగుడులాంటి వ్యసనాలకు బానిసవుతాడు. అప్పుడు కూడా ఈ లోకం కనికరించదు. మళ్లీ తిడుతూనే ఉంటుంది. కళాకారులను గౌరవించాల్సింది పోయి,

అవమానాల పాలుచేసే పరిస్థితి మన చుట్టూ ఉంది. కాని, ఇక మీదట ఈ పరిస్థితి మారనుంది. కళాకారులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించడానికి దారులు పడనున్నాయి. ఈ విధంగా కళాకారుల తలరాత మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కనుంది. ఎక్కడైతే మనిషి తలెత్తుకొని జీవించగలడో, ఆ లోకానికి నన్ను నడిపించుమన్న విశ్వకవి మాటలను నిజం చేసి చూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి . అందుకు ప్రతి కళాకారుడు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాడు. ఐదువందల మంది కుటుంబాల తరుపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కళాకారుల చరిత్ర సరికొత్త రూపుకట్టనుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. రచయిత: రసమయి  బాలకిషన్సాం , సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.