Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కలతవద్దు..కాపాడుకుంటాం..

రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తాత్కాలిక ఉపశమనాలతోపాటు దీర్ఘకాలిక చర్యలు చేపట్టినప్పుడే రైతులను సమస్యల నుంచి బయటపడేయగలమని తెలిపారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నదని చెప్పారు. రైతులెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది మీ చావులు చూడటానికేనా? ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది. సమస్యలుంటే పరిష్కరించుకుందాం. విలువైన ప్రాణాల్ని తీసుకోవద్దు. మీకోసమే బంగారు తెలంగాణ. అందుకు కోసం కృషిచేస్తున్నం అని పేర్కొన్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చకు బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.

KCR in Assembly

-60 ఏండ్ల దగాను సరిదిద్దుతున్నాం.. మీ కోసమే బంగారు తెలంగాణ -రాష్ర్టాన్ని తెచ్చుకున్నది మీ చావులు చూడటానికి కాదు -ప్రభుత్వం రైతులకు అండగా ఉన్నది: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ భరోసా -ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తనే తెలంగాణ పచ్చబడుతది -తక్కువ సమయంలోనే రైతులకు చాలా చేసినం -ఒకేదఫాలో రుణమాఫీకి మార్గాలను అన్వేషిస్తున్నాం -వచ్చే ఏప్రిల్ నుంచి రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ -వ్యవసాయ వర్సిటీలో పరిశోధనలు పెరగాలి -రైతు చైతన్యంకోసం విత్తన కంపెనీలకు మండలాల దత్తత -16 నెలల పిల్లగాడిని 58 ఏండ్లవారు నిలదీస్తారా? -ప్రతిపక్షాల విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 1.50 గంటల వరకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రైతు శ్రేయస్సు కోసం అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని వివరించిన ముఖ్యమంత్రి.. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను సభ ముందుంచారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలు అమలైతే తప్ప రైతు ఆత్మహత్యలు ఆగవని స్పష్టంచేశారు. సీఎం ప్రసంగాన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా శ్రద్ధగా విన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి తాత్కాలిక ఉపశమనాలు ఉండాలె. కానీ, అంతకంటే మించి శాశ్వత పరిష్కారాలు కావాలి. కొందరు సభ్యులు ఇతర పద్దులకు నిధులు తగ్గించి రైతులకు ఇవ్వమన్నరు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కచ్చితంగా ఇద్దాం.

బేషజాలకు పోకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తది. ఒకటిరెండు రోజుల్లోనే ఈ సమస్యలన్నీ బంద్ అయితయా? అది నమ్మదగిందేనా? అందరం ఓపెన్ మైండ్‌తో చర్చించాల్సిన అవసరముంది. ప్రజాప్రతినిధులు పట్టుబట్టి రైతుల కన్నీళ్లు తుడవాలి. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని పేర్కొన్నారు. రైతు రుణ మాఫీలో భాగంగా మిగిలిన రెండు విడతల్ని ఒకేదఫాగా చెల్లించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చా రు. వచ్చే ఏడాది మార్చి ముగియగానే రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. రైతు సమస్యల లోతులను స్పృశిస్తూ, వాటికి పరిష్కాలను సూచిస్తూ సీఎం ప్రసంగం ఇలా సాగింది.

ధర్మాసనానికి ధన్యవాదాలు సభ్యుల నుంచి ఉత్తమ, మౌలిక సలహాలు వస్తాయని ఆశించిన. కానీ నాకు నిరాశే కలిగింది. హైకోర్టులో ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని రైతు సమస్యలు, ఆత్మహత్యలు, ఒడిదుడుకులపై పిల్ దాఖలు చేసినరు. దానిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం చక్కటి కామెంట్ చేసింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాత్కాలిక ఉపశమనాలు కాదు. నష్టపరిహారం ఇవ్వడం కాదు. రెండు ప్రభుత్వాలు సమస్యల మూలాల్లోకి వెళ్లి లోతుగా పరిశీలన చేసి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించినరు. ప్రభుత్వ పక్షాన ఆ సలహాను స్వీకరిస్తున్నం. అందుకు ధర్మాసనానికి ధన్యవాదాలు కూడా చెబుతున్నం.

ఆత్మహత్యలు కొత్త సమస్య కాదు! రైతు ఆత్మహత్యలనేవి తెలంగాణలోనే కాదు. దురదృష్టవశాత్తు ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. పొరుగు రాష్ట్రంలోనూ ఇబ్బడిముబ్బడిగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరని ఎన్సీఆర్బీ, ఇతర సంస్థలు, వార్తా పత్రికలు, రైతు శ్రేయస్సు కోరే ఎన్జీవోలు వెల్లడిస్తున్నయి. ఇద్దరు, ముగ్గురు మినహాయిస్తే సభలోని అందరం కూడా గ్రామీణ, వ్యవసాయ నేపథ్యమున్నవారమే. సొంత అనుభవంగానీ, సామాజిక అనుభవం నేపథ్యంతోపాటు ప్రజాప్రతినిధులుగా సుదీర్ఘ అనుభవం ఉన్నవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 15 నెలలు గడిచి, 16 నెలలోకి వచ్చినం.

1969 నుంచి గత ఏడాది జూన్ రెండువరకు ఉద్యమాలతోనే గడిపినం. ఎంపీగా నేను కూడా పార్లమెంటులో ఇదే డిమాండు వినిపించిన. రైతులు పెరుగన్నం బదులు పురుగుల మందు తాగుతున్నరని 2001లో నేను స్వయంగా పాట రాసిన. ఇది కొత్త సమస్య కాదు. దీనికి అనేక మూలాలున్నయి. ఈ సమస్య రాత్రికి రాత్రి పోతదనుకుంటే బేలతనం, పిచ్చితనమైతది. అందుకే సభలోని అందరు సభ్యులకు నేనొకటే విజ్ఙప్తి చేస్తున్న.. రైతును ఒడ్డున పడేసేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలతో కూడిన కార్యాచరణతో ముందుకుపోవాల్సిన అక్కర ఉంది.

నిరంతర తప్పుల వల్లే ఈ దుస్థితి నీళ్ల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో భయంకరమైన దగా జరిగింది. 60 ఏండ్ల దగాను ఇప్పుడు సరిచేస్తున్నం. ఏ ప్రభుత్వమో, వ్యక్తో దీనికి కారణమని చెప్తలేను. దశాబ్దాలుగా నిర్రనీలుగుతున్న ఎస్సెల్బీసీ ఎందుకు మొదలుకాలేదు? కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టుల పరిస్థితి ఇంతే. 1960లో మొదలైన ఎస్సారెస్పీ ఇప్పటికీ రెండోదశ పూర్తి కాలె. దీనికి ఫలానా వాళ్లు బాధ్యులని చెప్తలేను. కానీ 58 ఏండ్ల వివక్ష దీనికి కారణం. అనుకున్న ప్రాజెక్టులు కట్టలె. విచక్షణారహితంగా అడవులను నరికేసిండ్రు. కరువుతో బావులు ఎండిపోయినయి. 600-1000 ఫీట్ల బోర్లు వేసినా నీళ్లు రాలె. ఒక్కో రైతు అనేక బోర్లు వేసిండు. నల్లగొండ జిల్లా ముషంపల్లి గ్రామానికి చెందిన బైలా రాంరెడ్డి 54 బోర్లు వేసిండు. ప్రజలు జోక్‌గా ఆయన్ని బోర్‌వెల్ రాంరెడ్డి అని పిలుస్తరు. ఒకవైపు భూగర్భజలాలు లేకుండాపోతే, మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు కరెంటు కోతలు, బిల్లుల మోతలు.

గతంలో నేను కూడా ఈ సభలో ఉన్న. అప్పటి స్పీకర్ ఆలపాటి ధర్మారావు నలుగురికి ఇచ్చే సమయాన్ని నాకిస్తే 80 నిమిషాలు మాట్లాడిన. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంచి పరిశోధనలు జరిగేవి. ఐఆర్-56 అనే వరి వంగడం కోసం రైతులు క్యూ కట్టి కొనేవాళ్లు. ఇప్పుడు ఆ పరిశోధనలు ఎక్కడికి పోయినయి? ఒక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంటే దానిని టప్ మనిపించినరు. ఒక వ్యక్తి, ఒకరోజు చేసిన తప్పులు కాదు.. నిరంతర తప్పుల సమాహారంగా వచ్చిందే ఈ పరిస్థితి. ఇప్పటికీ తెలంగాణలో వర్షాలు పడకుంటే పరిస్థితి ఎట్ల ఉంటదో నాకు తెలుసు. నేను స్వయంగా రైతును. నా సంగతే తీసుకుందాం.. 30-40 ఎకరాల్లో అల్లం వేసిన. వర్షాభావం. పండుతుందో పండదో కూడా నాకు తెల్వదు. ఇదీ తెలంగాణ బతుకులు అని మొన్న ఎర్రవల్లి గ్రామ రైతులతో బాధను పంచుకున్న. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగాలె. కానీ జరగడం లేదు. దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే ఒక చట్టం కూడా తేవాల్సిన అక్కర ఉంది.

చెరువుల ధ్వంసానికి బాధ్యులెవరు? తెలంగాణలో రెడ్డిరాజులు 75వేల చెరువులు తవ్వించినరు. చెరువు గట్లమీద కట్ట మైసమ్మ గుడి పక్కన ఆ శిలా శాసనాలు కూడా కనిపిస్తయి. వరంగల్ జిల్లాలోని లక్నవరం, రామప్ప, పాకాల వంటి చెరువులు ఇప్పటికీ 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నయి. కానీ మిగిలిన చెరువులు ధ్వంసమైనయి. నేను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు మైనర్ ఇరిగేషన్‌కు నయా పైసా ఉండకపోయేది. రూ.10వేలు పెట్టి చెరువు బాగు చేసుకుందామన్నా దిక్కు మొక్కూలేదు. నిజాం కృషి ఫలితంగా నల్లగొండలోని డిండి, ఆర్డీఎస్ వంటి మధ్యతరహా ప్రాజెక్టులు ఆస్తులుగా మిగిలిపోయినయి. నిజాంసాగర్ ప్రపంచంలోనే మొదటి భారీ నీటి ప్రాజెక్టు. 1890లో కట్టినరు. ఏమైంది? నిజాంసాగర్, మెదక్‌లోని ఘన్‌పూర్, అప్పర్ మానేరు, కరీంనగర్‌లోని శనిగరం ఎట్ల ధ్వంసమైనయి? 15 నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదంతా చేసిందా?

ఒక్కో విత్తన కంపెనీకి ఒక్కో మండలం దత్తత దేశంలో ఎక్కడాలేని విత్తన కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నయి. నిన్ననే వాళ్లతో నేను, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశమైనం. హైదరాబాద్ చుట్టుపక్కల 364 విత్తన కంపెనీలున్నయి. కంపెనీల అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్‌ఎన్ రెడ్డితో మాట్లాడితే దేశంలోనే హైదరాబాద్ విత్తన భాండాగారం అని చెప్పినరు. అందరం కలిసి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుందామని హామీ ఇచ్చినరు. దేశంలో సరఫరా అయ్యే విత్తనాల్లో 60 శాతం ఇక్కడ నుంచే వెళ్తున్నయి. 26 ఇతర దేశాలకు కూడా దిగుమతి చేస్తున్నరు. 45 లక్షల చదరపు ఫీట్ల విస్తీర్ణం గోడౌన్లు ఉన్నయి. 60 లక్షల క్యూబిక్ ఫీట్ల కోల్డ్ స్టోరేజీలు ఉన్నయి. గంటకు 650 మెట్రిక్ టన్నుల విత్తనాల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం.. అంటే ఒకే ప్రదేశంలో ఒక్కచోట ఇంత ఉత్పత్తి సామర్థ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు.

ఈ రంగంలో 17వేల మంది పనిచేస్తున్నరు. అందుకే ఈనెల ఐదో తేదీన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన కంపెనీలతో సమావేశం నిర్వహిస్తున్నరు. వ్యవసాయశాఖ మంత్రి పోచారంతోపాటు అన్ని పక్షాలవాళ్లం ఐదో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడికి పోదాం. వాళ్లతో మాట్లాడుదాం. అయితే, 364 కంపెనీలు ఉంటే రాష్ట్రంలో 438 మండలాలున్నయి. అందుకే ఒక్కో కంపెనీ ఒక్కో మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరిన. సాంకేతిక సలహాలివ్వడం, విత్తనాలు సరఫరా చేయడం, ఉత్పాదకత పెంచడం వంటివి చేయాలని చెప్పిన. ఇందుకు వాళ్లు కూడా అంగీకరించినరు. వచ్చే జనవరి నాటికి కనీసం సగం మండలాల్లోనైనా రైతులే స్వయంగా విత్తనాలు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుందాం. దీనిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా.

ఎన్ని సమస్యలున్నా వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చినం ఉమ్మడి రాష్ట్రంలో మనకు న్యాయం జరగలేదు. ఆ భావనతోనే ఈ దశ ఉద్యమాన్ని నేనే మొదలుపెట్టిన. తొలిరోజుల్లో ఎన్ని అవమానాలు. అయినా కొట్లాడినం. చివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తొలుత ఉమ్మడి రాష్ట్రంలోని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన బడ్జెట్‌తో నడిచింది. ఆ తర్వాత గవర్నర్ పాలన.. ఎన్నికలు. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉంటది.. ఫైనాన్షియల్ ట్రెండ్ ఎట్ల ఉంటదనేది ఏమీ తెల్వదు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఆర్థిక మేధావి జీఆర్ రెడ్డిని సలహాదారుగా పెట్టుకున్నం.

ఐఏఎస్ వేణుగోపాల్, హన్మంతరావువంటి పెద్దల సలహాలు తీసుకున్నం. మొదటి ఆరేడు నెలలు అంతా గజిబిజి. ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులు జరగలేదు. ఆ తర్వాత ఉన్నంతలో కొంత బడ్జెట్ పెట్టినం. అప్పుడే నేను ఇది అంత వాస్తవరూపంగా ఉండదని చెప్పిన. మనకే కాదు.. కొత్తగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ పరిస్థితి కూడా ఇట్లనే ఉందని నేను ఆ రాష్ట్ర సీఎస్‌ఎలతో మాట్లాడినపుడు చెప్పినరు. ఉన్నంతలో వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చి కొంత పని చేసినం.

విద్యుత్ కోసం విస్తృత చర్యలు రాష్ట్రంలోని రైతులు ప్రధానంగా కరెంటు సమస్య ఎదుర్కొంటున్నారని ముందుగ గుర్తించినం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కారణం కాదు. కేంద్రం పెట్టిన చట్టాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఎగదోసి కరెంటు ఇయ్యలె. సీలేరుతో కూడిన ఏడు మండలాల్ని కలుపుకుంది. కేంద్రం వేసిన కమిటీ మాట కూడా పెడచెవిన పెట్టింది. దీంతో కొంత కరెంటు కొన్నం. కేరళ నుంచి ఎన్టీపీసీ ద్వారా కూడా కొనుగోలు చేసినం. ఛత్తీస్‌గఢ్ సీఎంతో సంప్రదించి వెయ్యి మెగావాట్లు కొనుగోలు చేసినం. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేనేదో కట్టెపుల్లలు వేసైనా సరే ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు తెస్తనన్నట్లు అన్నరు. బాధ్యతగల వ్యక్తి ఎవరైనా అట్ల చెప్తరా? అది సాధ్యమేనా? తలకాయ ఉన్న ఎవరైనా అట్ల అంటరా? అనని మాట అన్నట్లు చెప్తే ఎట్ల? వాస్తవంగా ఛత్తీస్‌గఢ్ నుంచి మనకు కారిడార్ లేదు.

పీజీసీఎల్‌ఐ (పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా) ఈ కారిడార్లను వేస్తది. ఏ రాష్ట్రమైనా ముందుగా అడ్వాన్సు ఇచ్చి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటది. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు షోలాపూర్ నుంచి రాయచూర్‌కు కారిడార్ వేస్తున్న సమయంలో వెయ్యి మెగావాట్లకు స్లాట్ బుక్ చేసుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఎనిమిదిసార్లు ఆయన దగ్గరికి పంపిన. కానీ ఎందుకో ఆయన మా మాట పెడచెవిన పెట్టినరు. అయితే, పీజీసీఎల్‌ఐ దగ్గర స్లాట్ బుక్ చేసుకోవాలంటే పీపీఏ (పవర్ పర్చేస్ అగ్రిమెంట్) ఉండాలనేది భారత ప్రభుత్వ నిబంధన. అందుకే ఛత్తీస్‌గఢ్‌తో వెయ్యి మెగావాట్లకు పీపీఏ చేసుకోవడమే కాకుండా పీజీసీఎల్‌ఐ దగ్గర రెండువేల మెగావాట్లకు స్లాట్ కూడా బుక్ చేసుకున్నం.

ఒకవైపు విద్యుత్ కొరత.. మరోవైపు మిగులు మనం రూ.25వేల కోట్ల రుణం తీసుకున్నందున పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారి శర్మ రూ.16వేల కోట్ల చెక్ నాకే స్వయంగా అందిస్తానని వచ్చి ఇచ్చినరు. ఆ సమయంలో దేశంలో కరెంటు పరిస్థితి ఎలా ఉందని అడిగితే ఆయన మిగులు కరెంటు ఉందని చెప్తే ఆశ్చర్యపోయిన. ఒకవైపు మేం కరెంటు లేక చస్తుంటె దేశంలో ఎక్కువుందా? అని అడిగిన. అయితే దేశంలో రెండున్నర లక్షల మెగావాట్ల స్థాపిత కరెంటు ఉంటే ప్రస్తుతం అందులో 1.50 లక్షల మెగావాట్ల కరెంటు మాత్రమే వాడుకుంటున్నరట. ఛత్తీస్‌గఢ్ తాను వాడుకొని, అమ్మేది కాకుండా 25వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కేంద్రాలను కొనుగోలు చేసేవారు లేక మూసేసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ర్టాలు తీవ్ర కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నయి. పది గంటల కోతలు విధిస్తున్నరు.

విద్యుత్ కోతల ప్రస్తావనలేని తొలి అసెంబ్లీ ఇదే ముప్పై ఏండ్ల నుంచి నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ సభలో ఉన్న. ఈ సీజన్‌లో అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షాలు కందులు, ఎండిపోయిన మొక్కజొన్న, వరి కంకులు తెచ్చి ప్రదర్శించేవారు. కానీ మొదటిసారి అలాంటి దృశ్యాలు లేని, కరెంటు కోతల్లేని సభగానీ ఇదే. ఇది నిజం. చైనా పర్యటనలోనూ నేను పలు సమావేశాల్లో ఇదే విషయాన్ని చెప్పిన. పరిశ్రమలకు 24/7 కరెంటు ఇస్తన్నం. వాళ్లంత సంతృప్తిగ ఉన్నరు. రైతులకు తొలుత చెప్పినట్లుగనే ఆరేడు గంటల కరెంటు ఇస్తున్నం. అదీ నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నం. అందుకే రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు రిపేర్ చేసే కేంద్రాలు మూతపడినయి. 30 ఏండ్లు కరెంటు కోతలు, బషీర్‌బాగ్‌లాంటి సంఘటనలు చూసినం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కరెంటు కోతల భయం లేనేలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌ను ఇస్తమని హామీ ఇస్తున్న. అంతేకాదు 2018 ముగిసే నాటికి 24 గంటల త్రీఫేజ్ కరెంటు కూడా ఇస్తం.

16 నెలల్లో చేసింది ఇదీ.. దయచేసి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నం. తెలంగాణ తెచ్చుకున్నది మీ చావులు చూడటానికి కాదు. ప్రభుత్వం మీకు అండగా ఉంది. రూ.25వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం పనులు శరవేగంగా నడుస్తున్నయి. ఇందుకోసం రూ.40వేల కోట్ల రుణం తీసుకున్నం. రూ.6వేల కోట్లతో సింగరేణి, రూ.24వేల కోట్లతో ఎన్టీపీసీ పనులు కొనసాగుతున్నయి. మణుగూరులో 4×270 మెగావాట్లు, దామరచర్ల కేంద్రాల పనులు కూడా టేకాఫ్ అయినవి.

అతి తక్కువ సమయంలో తెలంగాణ ప్రభుత్వం రూ.91,500 కోట్లతో ప్రాజెక్టులను మొదలుపెట్టింది. ఇక రాష్ట్రంలో కరెంటు కోతలనేవి ఉండవు. ఈ 16 నెలల్లో ఏం చేశారంటే గిదే చేసినం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఐదేండ్లనుంచి ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిల్ని రూ.480 కోట్లతో మరో రూ.60 కోట్లను చెల్లించినం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా విడుదల చేసినం. అదేవిధంగా గతంలో ఆత్మహత్యలు చేసుకున్నవారికి కూడా 239 మదికి నష్టపరిహారం చెల్లించినం.

విత్తనాలకు కొరతేలేదు గతంలో విత్తనాలు, ఎరువులకు లడాయి జరిగేది. దుకాణాల ముందు రైతులు క్యూ కడితే లాఠీఛార్జీలు, కాల్పుల వరకు వెళ్లేది. 8-9 గంటలు నిలబడలేక చెప్పులు క్యూలో ఉంచి వెళ్లేవాళ్లు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి దేశంలో డిమాండులేని సమయంలోనే ఏప్రిల్, మే నెలల్లోనే వీటిని కొనుగోలు చేసుకొని బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశించినం. అందుకే ఇప్పుడు ఆ సమస్యలు రావడం లేదు. రబీకి కూడా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ రూపంలో సిద్ధంగా ఉంచుకున్నం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో బియ్యం, ఎరువులు, ధాన్యం నిల్వ ఉంచుకునే గోదాంలు నాలుగు లక్షల టన్నుల సామర్థ్యంతో మాత్రమే ఉన్నయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యను గుర్తించి రూ.1000 కోట్ల నాబార్డు రుణం తెచ్చి 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 330 గోదాంలను నిర్మిస్తున్నం. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.1,011 కోట్లతో కొనసాగుతున్న గోదాంల నిర్మాణం పూర్తయితది.

రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాల్లోని ఆరేడు మండలాలు మినహా ప్రతి మండల కేంద్రంలో గోదాం ఏర్పాటవుతుంది. దూర ప్రాంతాల నుంచి మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు మధ్యాహ్న భోజనం ఇప్పటికే ప్రారంభించినం. ఇకముందు అన్ని ప్రాంతాలకు దానిని విస్తరిస్తం. మైక్రో ఇరిగేషన్ కింద గతంలో ఒక హెక్టారు సీలింగ్‌గా ఉండేది. కానీ దానిని ఐదు హెక్టార్లకు పెంచడంతో పాటు సన్న, చిన్నకారు రైతుల్లో దళిత, గిరిజనులకు వందశాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు (సన్న, చిన్నకారు రైతులైతే 90 శాతం) 80 శాతం సబ్సిడీ ఇస్తున్నం. మొక్కజొన్న దిగుబడిలో కొంత ఖరాబయినా ఎలాగూ కోళ్ల పరిశ్రమకు కావాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఏ-1 గ్రేడ్ రేటు రూ.1,310 ధర చెల్లించి కొనుగోలు చేసినం. నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతులకు సంబంధించి రూ.11కోట్ల బకాయిలను చెల్లించినం.

మిషన్ కాకతీయను ప్రపంచమంతా మెచ్చుకున్నది ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు తపేలాలుగా మారినయి. కొన్ని కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నయి. మిషన్ కాకతీయ కార్యక్రమంతో ఏడాదికి 9వేల చొప్పున రాష్ట్రంలోని 46,500 చెరువులను పునరుద్ధరించే పనులు మొదలుపెట్టినం. ఈ ఏడాది 6వేల పైచిలుకు చెరువు పనులు పూర్తయినయి. వందశాతం మిషన్ కాకతీయ పనులు అద్భుతంగా జరిగినయి. ఊహించనిరీతిలో రైతుల నుంచి స్పందన వచ్చింది. లక్షల ట్రిప్పుల పూడికను రైతులే సొంత ఖర్చులతో పొలాలకు కొట్టుకున్నరు.

వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసే అవార్డు గ్రహీత రాజేందర్‌సింగ్‌లాంటి వారు ఈ విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చి వరంగల్ జిల్లాలో ఒక చెరువు గట్టుమీద తన పుట్టిన రోజు జరుపుకున్నరు. మొన్న చైనా పర్యటనకు వెళ్లినపుడు కూడా యూఎన్‌డీపీ, వరల్డ్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ వాళ్లు ఈ కార్యక్రమాన్ని అభినందించినరు. దీర్ఘకాలిక పరిష్కారమైన కార్యక్రమాన్ని చేపట్టారని బయటి వాళ్లు గుర్తించినరు. కానీ మన రాష్ట్రంలో ఏమైందోగానీ టెండర్లు కూడా పూర్తికాకముందే కమీషన్ కాకతీయ అంటూ ఆరోపణలు చేసినరు.

ఒకే దఫాలో రుణాల మాఫీ! ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా లక్ష రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసినం. రూ.8,300 కోట్ల పైచిలుకు మొత్తాన్ని కూడా విడుదల చేసినం. రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకు సంబంధించిన వ్యవహారమిది. 22వేల ఆవాసాలు, 8700 గ్రామపంచాయతీలు.. కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తయి. అలాంటివి ఏమైనా ఉంటే వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకువస్తే సరిదిద్దుదాం. ఇప్పటివరకు 24 లక్షల మంది రైతులకు సంబంధించి మీ రుణాలు మాఫీ అయినయి అని సర్టిఫికెట్లు కూడా ఇచ్చినట్లు సంబంధిత మంత్రి వివరాలు సేకరించినరు. మిగతా రెండు విడతలు కూడా ఒకేసారి మాఫీ చేయాలనేదానిపై సానుభూతితో పరిశీలించాలని నిర్ణయించినం. ఈ అంశాన్ని ఆషామాషీగా తీసుకోవడం లేదు. కచ్చితంగా చేయాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నం. దీనిపై ఇప్పటికే సమావేశం పెట్టి ఎట్ల చేయొచ్చనే కార్యాచరణ రూపొందించాం.

ఉత్పాదకత పెంపునకు కృషి తక్కువ కాలంలోనే కొన్ని చర్యలు తీసుకున్నం. దీర్ఘకాలికంగా ఏం చేయాలనే దానిపైనా ప్రభుత్వం మథనం చేసింది. రైతులకు మించి ప్రాధాన్యం ఏదీలేదనే ఉద్దేశంతోనే ఉత్పాదకతను పెంచాలని యోచిస్తున్నం. దేశంలోనే వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉంది. ఉత్పాదకతలో టాప్‌లో ఉన్న దేశాలతో పోలిస్తే మనదేశం మూడింట ఒక వంతుగా ఉంది. అదే ప్రపంచంలోని అన్ని దేశాల ఉత్పాదకతతో బేరీజు వేస్తే 50 శాతం కంటే తక్కువగా ఉంది.

అందుకే ఉత్పాదకత పెంచడంతోపాటు రైతులకు మేలైన సూచనలు ఇచ్చేందుకు 438 మంది మండల వ్యవసాయాధికారులను అగ్రానమిస్టులుగా మార్చాలని నిర్ణయించినం. అయితే, ఇందుకు వారిని ఇజ్రాయిల్ పంపాలా? అక్కడి శాస్త్రవేత్తల్ని ఇక్కడకు పిలిచి శిక్షణ ఇవ్వాలా? అనే దానిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు కసరత్తు చేస్తున్నరు. దీనితోపాటు 1,500 వ్యవసాయ విస్తరాణాధికారుల పోస్టులను మంజూరు చేసి, 5వేల ఎకరాలకు ఒక అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటున్నం.

15 నెలల పిల్లగాడ్ని అడిగితే ఎట్ల? నిజాం చక్కెర కర్మాగారానికి సంబంధించిన 400 మంది రైతులతోపాటు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మహారాష్ట్రకు పంపినం. అక్కడి చెరుకు రైతులతో నేరుగా వీళ్లు మాట్లాడి వచ్చిన తర్వాత నేను వివరాలు అడిగిన. అయితే ఎకరానికి ఎంత దిగుబడి వస్తదని మన రైతుల్ని అక్కడి వాళ్లు అడిగితే 30-40 టన్నుల వరకు వస్తుందని చెబితే.. అలాంటప్పుడు వ్యవసాయం ఎందుకు చేస్తున్నరు? కూలీ చేయొచ్చు కదా అని అన్నరట. ఇది వాస్తవమే. మహారాష్ట్ర ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి అక్కడి రైతులు ఎకరానికి 130-140 టన్నుల చెరుకు దిగుబడిని సాధిస్తున్నరు. అట్లయితేనే గిట్టుబాటు అవుతుంది. మరి 15 నెలల్లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశోధనలు చేసి 300 టన్నులను పండిస్తదా? మాయా మశ్చీంద్ర చేస్తదా? 58 ఏండ్లోళ్లు 15 నెలల పిల్లగాడ్ని అడిగితే ఎట్ల?

ఈ సమావేశాల్లోనే మనీ లెండర్స్ బిల్లు రైతులు రుణాలు పొందడంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నరు. ప్రతిసారి పహాణీ నఖలు కావాల్సి వస్తుంది. అందుకే నిన్న సమావేశంలో రెవెన్యూ యంత్రాంగంతో నిర్ణయం తీసుకున్నం. రెండుమూడు నెలల్లో అనుసంధాన వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈ-పహాణీ వచ్చేలా చేస్తం. దీంతో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగే ఖర్మ లేకుండా సులువుగా ఉంటుంది. అదేవిధంగా కమతాల ఏకీకరణ (రద్దు బదులు పథకం) విధానాన్ని కూడా రేపోమాపో ప్రకటిస్తం. కొందరు సన్న, చిన్న కారు రైతులకు ఉండేదే ఎకరన్నర పొలం. అదీ నాలుగైదు దిక్కుల ఉంటది.

అలా కాకుండా రైతులు పరస్పరంగా కమతాలను మార్పిడి చేసుకుంటే ఒకేచోట పెద్ద కమతాలు ఏర్పాటయ్యే అవకాశముంటది. గతంలో మనీ లెండర్స్ యాక్ట్ ఉండేది. కానీ అది ల్యాప్స్ అయింది. దానిని పునరుద్ధరించాల్సిన అక్కర ఉంది. ఈ సమావేశంలోనే ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదించుకుందాం. రాష్ట్ర విత్తన చట్టాన్ని వందశాతం కఠినంగా అమలు చేసి తీరుతం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అదనపు గ్రాంటు ఇచ్చి పూర్వ వైభవాన్ని తీసుకువస్తం.

పంటల బీమాపై కేంద్రంపై ఒత్తిడి తెద్దాం కరువు మండలాలు, పంటల బీమా అనేది దేశంలో ఒక జోక్‌లాంటివి. నా పొలం దగ్గర జూన్ మొదట్ల భయంకర వర్షముంది. రైతులు విత్తనాలు వేసుకున్నరు. ఆ తర్వాత 23, 24 రోజులు వర్షాలు లేకపోగా వేడి.. కొన్ని మొలకెత్తలేదు. మరికొన్ని మాడిపోయినయి. మెదక్ జిల్లాలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గంలో మాత్రమే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అసలు పంటల బీమా, ఈ డాటా మొత్తం అశాస్త్రీయం. క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఉంటయి. రైతు, గ్రామాల యూనిట్‌గా పంటల బీమా ఉండాలని ఈ సభలో తీర్మానం చేసి పంపినం. మేం కొట్లాడతమని టీడీపీ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నరు. ఇప్పుడు కొట్లాడండి. అంతేకాదు అందరం అఖిలపక్ష ప్రతినిధి బృందంగా వెళ్లి కేంద్రాన్ని అడుగుదాం. అయితే కరువు మండలాలది అదో తతంగం. రెండుమూడు నెలల తర్వాత కేంద్ర బృందం వస్తది. అప్పటిలో గట్టి వర్షమొస్తే అంత పచ్చగ ఉంటది.

రాష్ట్రంలో 200 వరకు కరువు మండలాలు రాష్ట్రంలో 175-200 వరకు కరువు మండలాలు ఉంటాయని అంచనా. అయితే దీనిని క్రాప్ కట్టింగ్ ప్రయోగం ద్వారా నిర్ధారించాలి. దానికి ఆలస్యమైతది. ఎందుకంటే మొక్కజొన్న ఒకసారి.. మరో పంట ఇంకోసారి వస్తది. వరి అయితే జనవరి దాకా పోతది. పైగా మూడేండ్ల డాటా తీసుకోవాలి. 19 శాతం తక్కువ వర్షపాతం ఉండాలి.

అయితే నల్లగొండ జిల్లా కథ వేరు అక్కడ 50 శాతానికిపైగా పంటలు ఎండిపోయినయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో అక్కడ ఆరు శాతం ఎక్కువ వర్షపాతం ఉంది. అందుకే కరువు జిల్లాలకు ఫిట్ కాదు. ఇవి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు. సభ్యులందరికీ తెలుసు. ఇంకా కరువు మండలాల జాబితా ఎందుకు పంపలేదని చాలామంది సభ్యులు అంటున్నరు. కానీ సెప్టెంబర్ 30 తర్వాతనే జాబితా పంపాలని స్పషంగా కేంద్రం నుంచి ఆదేశాలున్నయి. మందుగా పంపలేం.

ఉపాధిహామీలో కేంద్రం వెసులుబాటు ఈసారి కేంద్రం ఒక వెసులుబాటు ఇచ్చింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద రోజులకు అదనంగా 50 రోజుల పనిదినాలు పెంచుతమన్నరు. వీటికి పెద్దగా నిబంధనలు లేవు. ఖమ్మం, ఆదిలాబాద్, జనగాం మినహా వరంగల్ జిల్లా కరువు జాబితాలోకి రావు. అయితే మండలమా! జిల్లా ప్రాతిపదికన జాబితా పంపాలా! అనేదానిపై కసరత్తు జరుగుతున్నది. అయితే జిల్లావారీగా పంపితే జనగాం వంటి ప్రాంతాలు నష్టపోతాయి. అందుకే మండలాలవారీగా పంపాలని నిర్ణయించినం.

కౌలు రైతుల అంశాన్ని అర్థం చేసుకోవాలి కౌలు రైతులకు సంబంధించి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ (కౌలుదారు చట్టం) చాలా పవర్‌ఫుల్. జాగీర్లు, భూస్వాములు, వెట్టిచాకిరి ఉన్నందున ఈ చట్టాన్ని కఠినంగా పెట్టినరు. రైతులు భూమి లీజుకు ఇయ్యాలంటే కనీసంగా ఐదేండ్లు ఉండాలి. ఆరేండ్లయితే కౌలుదారుకు హక్కు వస్తది. అందుకే రైతులు నగదు మీద, పంటకింత, ఏడాదికింత అన్నట్లు లీజుకు ఇచ్చుకుంటున్నరు. అందుకే ఈ అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.

దీర్ఘకాలిక ప్రణాళికలే పరిష్కారం దీర్ఘకాలిక ప్రణాళిక అమలుచేస్తే తప్ప రైతు ఆత్మహత్యలు ఆగవు. పరిశోధనలు, ఉత్పాదకత పెంచాలి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తనే తెలంగాణ పచ్చలడతది. రైతులకు సాగునీరు అందాలి. గోదావరి, కృష్ణాలో తెలంగాణ వాటా 1,280 టీఎంసీలను వాడుకోవాలి. రాష్ట్ర విభజన బిల్లు వచ్చిన సమయంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇదే అసెంబ్లీలో ప్రాజెక్టులవారీగా వివరాలు ఇచ్చినరు. అందులో ఏపీలోనే తెలంగాణకు 1,280 టీఎంసీల వాటా ఉంది. ఆ కేటాయింపుల్ని రైతుల దగ్గరికి చేర్చాలి. సాగునీటి రంగంపై మూడేండ్లలో ఏడాదికి రూ.25వేల కోట్ల చొప్పున ఖర్చు పెడతం. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలతో పాటు 25 ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లు ఇస్తం. అందుకే రైతు సోదరులకు ఒక్కటే మనవి చేస్తున్నా.. ప్రభుత్వం మీకు అండగా ఉంది. సమస్యలుంటే సమయానుగుణంగా పరిష్కరించుకుందాం. విలువైన ప్రాణాల్ని బలితీసుకోవద్దు. అన్నింటికీ ప్రభుత్వం అండగా ఉంటది.

ఒకే దఫా చెల్లింపునకు మార్గాలివీ.. -ప్రభుత్వం దగ్గర డబ్బులు సూట్‌కేస్‌ల ఉండవు. కేంద్ర నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటా, రాష్ర్టానికి నేరుగా వచ్చే ఆదాయం నెల, త్రైమాసికంగా వస్తయి. అయితే తెలంగాణ వాణిజ్య పన్నులశాఖకు సంబంధించిన బకాయిలు రూ.4,500 కోట్లు ఉన్నయి. ఆ శాఖ మంత్రి, అధికారులతో సమీక్ష చేసినపుడు వెంటనే వాటిని వసూలు చేయాలని చెప్పినం. రూ.30-40 కోట్లు వచ్చినయి. ఇంకా రూ.4,200 కోట్లు రావాలి. అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్లను పెట్టి రెండు ట్రిబ్యునల్స్ ఏర్పాటుచేసైనా ప్రయత్నించాల్సిందిగా అడ్వకేట్ జనరల్‌కు చెప్పినం.

-పద్నాలుగో ఆర్థిక సంఘం (నీతి అయోగ్) దేశంలో గుజరాత్, తెలంగాణ రాష్ర్టాలకు మాత్రమే ఎఫ్‌ఆర్‌బీఎంలో కొంత వెసులుబాటు ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన సమావేశంలో సాధారణంగా అన్ని రాష్ర్టాలకు మూడుశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఉంటే ఈ రెండు రాష్ర్టాలకు 3.5 శాతం ఇచ్చారు. 0.5 శాతం అంటే అదనంగా రూ.3000 కోట్ల వరకు వెసులుబాటు దొరికింది.

-ప్రభుత్వం ఇచ్చిన జీవో 58 జీవో ద్వారా లక్ష మందికి పట్టాలిచ్చినం. 59 జీవో ద్వారా 3-4 నెలల్లో రూ.1000 కోట్లు సమకూరే అవకాశముంది. వీటితోపాటు కొంత విలువైన భూములు అమ్మడం ద్వారా రూ.2-3వేల కోట్ల వరకు వస్తుందని ఆశిస్తున్నం. తొలి విడతగా కొన్ని బిట్లను అమ్మే ప్రక్రియ మొదలు కానుంది. ఇలా వీటిలో ఏవి సాధ్యమైనా రైతుల రుణమాఫీకి సంబంధించి మిగిలిన రెండు విడతల్ని ఒకేసారి చెల్లించేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాం. వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు.

-నీళ్ల విషయంలో సమైక్య రాష్ట్రంలో భయంకరమైన దగా జరిగింది. 1960లో మొదలైన ఎస్సారెస్పీ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు. నీళ్లు వస్తలేవు. 58 ఏండ్ల వివక్షనే దీనికి కారణం. -మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి అక్కడి రైతులు ఎకరానికి 130-140 టన్నుల చెరుకును పండిస్తున్నారు. ఇక్కడ 30-40 టన్నులు మాత్రమే పండిస్తున్నారు. 15 నెలల్లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశోధనలు చేసి 300 టన్నులు పండిస్తదా? మాయా మశ్చీంద్ర చేస్తదా? 58 ఏండ్ల వ్యక్తి 15 నెలల పిల్లగాడ్ని అడిగితే ఎట్లా?

-రాష్ట్రంలో 2009-14 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ 1.38 కోట్ల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఏడాది కాలంలోనే 84 సీసీఐ కేంద్రాల ద్వారా 1.80 కోట్ల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయించింది. పండిన పంటలో 91 శాతం దిగుబడిని సీసీఐ కొనుగోలు చేయడం దేశంలోనే రికార్డు. సీసీఐ అధికారులు కూడా తెలంగాణ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసిందంటూ అభినందించారు.

-తెలంగాణ ఉద్యమంలో ఏ నాయకుడు మాట్లాడినా.. ఏ కవి పాట కట్టినా.. ఏ గాయకుడు పాడినా ప్రధానంగా నిధులు, నీళ్లు, నియామకాలపైనే నినదించారు. -గతంలో విత్తనాలు, ఎరువులకు లడాయి జరిగేది. దుకాణాల ముందు రైతులు చెప్పులను క్యూలో ఉంచేవారు. లాఠీల చప్పుళ్లు, కాల్పుల చప్పుళ్లూ విన్నాం. గత ప్రభుత్వాల ఘనత ఇది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ముందుగా అధికారులతో సమీక్షించి ఏప్రిల్, మే నెలల్లో సరిపోయినంత బఫర్ స్టాక్‌ను నిల్వ ఉంచుకునేలా చర్యలు తీసుకున్నాం. అందుకే ఇప్పుడు ఆ సమస్య రాలేదు. రబీకికూడా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్‌స్టాక్ రూపంలో సిద్ధంగా ఉంచుకున్నాం.

-నిజాంసాగర్.. ప్రపంచంలోనే మొదటి భారీ నీటి ప్రాజెక్టు. 1890లో కట్టిండ్రు. ఏమైంది..? నిజాంసాగర్, మెదక్‌లోని ఘన్‌పూర్, అప్పర్ మానేరు, కరీంనగర్‌లోని శనిగరం ఎట్లా ధ్వంసమయ్యాయి? దీనంతటికీ 15 నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమా..? దీనికి ఎవరు బాధ్యులు?

-రాష్ట్రంలో 2009-14 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ 1.38 కోట్ల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఏడాది కాలంలోనే 84 సీసీఐ కేంద్రాల ద్వారా 1.80 కోట్ల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయించింది. పండిన పంటలో 91% దిగుబడిని సీసీఐ కొనుగోలు చేయడం దేశంలోనే రికార్డు. సీసీఐ అధికారులు కూడా తెలంగాణ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసిందంటూ అభినందించారు.

-రైతుల ఆత్మహత్యలకు తాత్కాలిక ఉపశమనాలు, నష్టపరిహారం కాదు. సమస్యల మూలాల్లోకి వెళ్లి కార్యాచరణ రూపొందించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వపక్షాన ఆ సలహాను స్వీకరిస్తున్నాం. ధర్మాసనానికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం.

-తెలంగాణ ప్రాంతంలో భూముల కొనుగోలుకు సాదా బైనామా తెల్ల కాగితాలపై రాసుకుంటారు. ఇలాంటివాళ్లు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు ఆర్‌ఓఆర్‌లో నమోదు చేస్తాం. కమతాల ఏకీకరణ (రద్దు బదులు పథకం) విధానాన్నికూడా రేపో మాపో ప్రకటిస్తాం.

ఎఫ్‌ఆర్బీఎం లెక్కల్లో తప్పులేదు -14వ ఫైనాన్స్ కమిషన్ సైతం సిఫారసు చేసింది -ప్రతిపక్ష నేత జానా వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ స్పందన హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ర్టానికి రుణ పరిమితి పెంచేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్బీఎం అంశానికి సంబంధించిన లెక్కల్లో ఎక్కడా తప్పులేదన్నారు. ఎఫ్‌ఆర్బీఎంను 3.5 శాతం పెంపునకు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థికమంత్రి, నీతి అయోగ్ వైస్‌చైర్మన్ సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. తాను కూడా నీతి అయోగ్‌లో సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతు ఆత్మహత్యలపై బుధవారం శాసనసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభా పక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ ఎఫ్‌ఆర్బీఎం 3.5 శాతం సాధ్యం కాదని.

తప్పుడు లెక్కలు ఉన్నాయని అనడంతో దీనిపై సీఎం స్పందించారు. ఈ సంఖ్య తాము ఖరారు చేసింది కాదన్నారు. స్వయంగా 14వ ఫైనాన్స్ కమిషన్ ఎఫ్‌ఆర్బీఎంను 3.5 శాతంగా ఖరారు చేసి కేంద్రానికి సిఫారసు చేసిందని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ చీఫ్‌తోపాటు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు వేర్వేరు కార్యక్రమాల్లో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రుణ పరిమితి పెంపుపై చర్చించామని అన్నారు.

దీర్ఘకాలిక ప్రణాళికలే పరిష్కారం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సోదాహరణంగా వివరించారు. శాశ్వత పరిష్కారం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

ఇప్పటివరకు చేపట్టిన చర్యలు -ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసినం. -పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియాకు రెండువేల మెగావాట్ల కరెంటు కోసం స్లాట్లు బుక్ చేసినం. -రైతులకు తొలుత చెప్పినట్లుగనే ఆరేడు గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. -రూ.91వేల కోట్లతో 24వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తికి ఇప్పటికే పనులు ప్రారంభించినం. -రాష్ట్రంలోని 1.08 లక్షల వ్యవసాయ ట్రాక్టర్లపై ఉన్న రూ.70 కోట్ల రవాణా పన్ను బకాయిల్ని రద్దు చేసినం.

-ఐదేండ్లుగా ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిల్ని రూ.480 కోట్లతో మరో రూ.60 కోట్లను చెల్లించినం. -ఆత్మహత్యలు చేసుకున్న 239 రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించినం. -బఫర్ స్టాక్‌తో రైతులకు నిర్ణీత సమయంలో సాఫీగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేసినం. రబీకి ముందుగానే 1.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వల్ని సిద్ధంగా ఉంచినం. -రూ.1,011 కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 330 గోదాంలను నిర్మిస్తున్నం. -మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ ఇరిగేషన్‌కు సీలింగ్‌ను ఐదు హెక్టార్లకు పెంచడంతోపాటు సన్న, చిన్నకారు రైతుల్లో దళిత, గిరిజనులకు వంద శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు (సన్న, చిన్నకారు రైతులైతే 90 శాతం) 80 శాతం సబ్సిడీ ఇస్తున్నం.

-ఏడాది కాలంలోనే 84 సీసీఐ కేంద్రాల ద్వారా 1.80 కోట్ల క్వింటాళ్ల పత్తిని (పండిన పంటలో 91 శాతం) కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నం. -మొక్కజొన్న పంటను ఎలా ఉన్నా ఏ-1 గ్రేడ్ రేటు రూ.1,310 ధర చెల్లించి కొనుగోలు చేసినం. -నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతులకు సంబంధించి రూ.11 కోట్ల బకాయిలను చెల్లించినం.

చేపట్టనున్న చర్యలు -ఈ ఏడాది 6వేల పైచిలుకు చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయినయి. -హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 364 కంపెనీలు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకుంటయి. వచ్చే జనవరి వరకు సగం మండలాల్లో రైతులు విత్తనాలు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటం. దీనిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. -ఒకేదఫాలో రైతు రుణమాఫీలోని రెండు విడతల్ని ఒకేదఫాగా చెల్లించేందుకు ప్రయత్నిస్తం. -వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు 438 మండల వ్యవసాయాధికారులను అగ్రానమిస్టులుగా మార్చేందుకు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలతో శిక్షణ ఇప్పిస్తాం. -గిట్టుబాటు ధర లేనపుడు రైతులు పంటను గోదాంలో నిల్వ ఉంచుకొని 75 శాతం వడ్డీలేని రుణం పొందేందుకు రైతుబంధు పథకం కింద అవకాశం కల్పిస్తున్నం. -రెండుమూడు నెలల్లో ఈ-పహాణీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తం. -భూమి కొనుగోళ్లలో సాదా బైనామా తెల్ల కాగితాలపై రాసుకున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్, ఆర్‌ఓఆర్‌లో నమోదు చేయిస్తం.

-రాష్ట్రంలో చిన్న కమతాల ఏకీకరణ విధానాన్ని ప్రకటిస్తం. -ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలోనే మనీ లెండర్స్ బిల్లును ప్రవేశపెడతం. -రాష్ట్ర విత్తన చట్టాన్ని వంద శాతం కఠినంగా అమలు చేసి తీరుతం. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తది. -వ్యవసాయ విశ్వ విద్యాలయానికి అదనపు గ్రాంటు ఇచ్చి పూర్తి వైభవాన్ని తీసుకువస్తం. -దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేస్తే తప్ప రైతు ఆత్మహత్యలు ఆగవు. ఇందుకోసం పరిశోధనలు, ఉత్పాదకత పెంచేందుకు కృషి చేస్తం.

వ్యవసాయాన్ని అభివృద్ధి బాటన నడపడం మా లక్ష్యం. ఆత్మహత్యల నివారణకు శాశ్వత పరిష్కారాలను వెతుకుతున్నాం. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, కరెంటు సమస్యలు పరిష్కరించాం. తెలం గాణ గడ్డపై గోదావరి, కృష్ణా నదులను పారించేలా ప్రయత్నాలు మొదలుపెట్టాం. రైతులకు చేతులెత్తి చెప్తున్నాం. ప్రభు త్వం మీకు అండగా ఉంటుంది. ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. ఏదైనా సమస్య ఉంటే వ్యవసాయ అధికారి, వీఆర్‌ఓకి చెప్పండి. సమస్య పరిష్కరిస్తారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దు. మీ కుటుంబాలకు అన్యాయం చెయ్యొద్దు. ఈ ప్రభుత్వం రైతులది. ఇకనుంచి ఆత్మహత్యలు జరుగొద్దు. – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

రైతు రుణాలను ఒకే దఫా మాఫీ చేయాలి. ఆత్మహత్యలనేవి ఈనాటివి కాకున్నా ప్రభుత్వం వీటికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరు నెలలు లేదా సంవత్సరంలో ప్రణాళికలు సాధ్యంకావు. పూర్తిస్థాయిలో అధ్యయ నం చేసి దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు తయారుచేయాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా వారిలో ఆత్యైస్థెర్యాన్ని నింపి వ్యవసాయాన్ని పండుగలా మార్చాలి. 70 నుంచి 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలి. – సీఎల్పీ నేత జానారెడ్డి

గత చరిత్ర చూసుకుంటే చాలా ఉంది. రెండువేలమంది రైతులు చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వని పార్టీ మీది. రైతులను గుర్రాలతో తొక్కించి, కాల్చి చంపిన మీరా మాట్లాడేది. వ్యవసాయం దండుగ.. ఉచిత కరెంట్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళనగా మాట్లాడిన టీడీపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు.. ప్రతిపక్షాలకు రాజకీయం తప్ప రైతు సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశం లేదా? రైతులపై ప్రేమ లేదా? వారి గోస పట్టదా? – భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

రైతన్న పెరుగన్నం బదులు పురుగుమందులన్నం తింటున్నాడని 2001లో నేను స్వయంగా పాట రాసిన. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. దీనికి అనేక మూలాలున్నాయి. ఈ సమస్య రాత్రికి రాత్రి పోతదనుకుంటే బేలతనం, పిచ్చితనమైతది. రైతులను గట్టునపడేసేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలతో కూడిన కార్యాచరణతో ముందుకుపోవాల్సిన అక్కర ఉన్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.