Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరం ఆగదు

-కాళేశ్వరం నీళ్లతో నల్లగొండ సస్యశ్యామలం.. -కష్టపడి సాధించుకున్న రాష్ట్రం.. ఇష్టపడి అభివృద్ధి చేస్తా -సూర్యాపేట బహిరంగసభలో సీఎం కేసీఆర్ -ఎవరు అడ్డొచ్చినా ప్రాజెక్టు కట్టి తీరుతాం -ఏ ఒక్కప్రాంతంపైనా నాకు పక్షపాతం లేదు -రాష్ట్రంలో ప్రతి తండా, ప్రతి పల్లె కేసీఆర్‌దే -సూర్యాపేట, నల్లగొండలకు వరాలు -రెండు జిల్లాల్లో మెడికల్ కళాశాలలు -త్వరలో యాదాద్రి థర్మల్ పనులు -మూసీ ద్వారా సాగర్‌కాల్వలకు గోదావరి నీళ్లు

కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరూ ఆపలేరని, లక్షమంది అడ్డొచ్చినా కట్టి తీరుతమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. తెలంగాణలోని ప్రతి ఇంచుకూ న్యాయంచేస్తానని ఆయన స్పష్టంచేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలకుల అసమర్థత వల్లే దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, పాలమూరు జిల్లాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. కాకలు తీరిన ఇంజినీర్లే ఆశ్చర్యపోయేలా నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నామని.. నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. గురువారం ముఖ్యమంత్రి సూర్యాపేట జిల్లా నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపనలు చేశారు. డబుల్ బెడ్రూం అపార్ట్‌మెంట్లు, మిషన్ భగీరథ, 400కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జూనియర్ కాలేజీ మైదానంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రగతిసభలో ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

చెప్పినవన్నీ చేసినం సరిగ్గా మూడున్నరేండ్ల కిందట ఆగమేఘాల మీద వందకిలోమీటర్ల స్పీడ్‌లో వచ్చి ఇదే సూర్యాపేట సభల మాట్లాడిన.. ప్రతిస్పందనగా మీరు జగదీశ్‌రెడ్డిని గెలిపించిన్రు. అనాడు చెప్పుకున్నట్టు వందకు వందశాతం తెలంగాణ సాధించుకున్నం. తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ర్టానికి ఏం చెయ్యాల్నో టీఆర్‌ఎస్‌కు తెలిసినంతగా మరెవ్వరికీ తెల్వదు. సాధించుకున్న స్వరాష్ట్రంల పరిపాలన వికేంద్రీకరణకోసం చాలా జిల్లాలుగ చేసుకోవాల్సిన అక్కరుండె. మొట్టమొదటి ప్రాధాన్యంలో సూర్యాపేట జిల్లా చేస్త అని చెప్పిన. వంద శాతం జేసి అప్పగించిన. జగదీశ్‌రెడ్డిని గెలిపిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండరని చెప్పిన.. గత మూడున్నరేండ్లుగా ఆయన రాష్ట్రమంత్రిగా సేవలందిస్తున్నరు. చెప్పిన మాటలన్నీ చేసినం.

ఎత్తు, దొడ్డున్న పాలకులతో ఒరిగిందేమీ లేదు ఉమ్మడి నల్లగొండ జిల్లా చైతన్యంలో ముందు నిలిచిన జిల్లా. పోరాటాల ఖిల్లా. కానీ ఏం జరిగింది? ఏమీ జరుగలేదు. మనుషులు గెలువలేదా? మంత్రులు కాలేదా? ఎత్తు తక్కువున్నరా? దొడ్డు తక్కువున్నరా? అంటే.. అదేం లేదు. ప్రజలకు ఒరిగింది ఏంది? ఫ్లోరైడ్ యాత్ర పేరుతో ఎనిమిది రోజులు జిల్లాలో తిరిగిన. వివిధ ప్రాంతాల్లో పండుకున్న. ఏడ్సిన కొన్నిచోట్ల. మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో కండ్లకు నీళ్లు తీసుకొన్నం. సమస్య పరిష్కారం కాలే. పోరాటాలు చేసినం. ఎవ్వరూ పట్టిచ్చుకోలే. సమస్యలు మిగిలిపోయినయి. సమైక్యవాదులు ఆనాడు మనకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో మోసం చేసిన్రు. ఒరిజనల్ పేరు నాగార్జునసాగర్ కాదు. దాని పేరు నందికొండ ప్రాజెక్టు. కట్టుకోవాల్సింది ఇప్పుడున్న కాడ కాదు. 19 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం దగ్గర కట్టాల్సి ఉండె. ఆరోజు దగా జరిగింది. మోసం జరిగింది. ఏలేశ్వరం దగ్గర్నే కట్టి ఉంటే నల్లగొండ మొత్తానికి నీళ్లొచ్చేది. 10లక్షల ఎకరాలు పారేది. దగా జరుగడానికి హైదరాబాద్ స్టేట్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, బూర్గుల రామకృష్ణారావే కారణం. చాలా పెద్దమోసం జరిగింది. 180 టీఎంసీలు తెలంగాణకు.. 60 టీఎంసీలు ఆనాటి మద్రాస్‌రాష్ర్టానికి అని నిజాం ప్రతిపాదించారు. ఫౌండేషన్ నాటికి మీకు 132.. మాకు 132 అన్నరు. ఫైనల్‌గ మళ్లీ 25 టీఎంసీలు కట్‌చేసి నందిగామ, జగ్గయ్యపేటను కలిపిన్రు. ఆ నీళ్లయిన సరిగ్గా ఇస్తరా? ఇయ్యరు! ఎడమకాల్వ మీద కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసిన. సాగర్‌లో మాకు మొదటికే అన్యాయం జరిగింది. కుడి కాల్వ లిఫ్టుల నిర్వహణ ఖర్చులేమో ప్రభుత్వమే భరిస్తది. ఎడమ కాల్వ మీద రైతులే బిల్లులు కట్టాలె. ఇదేం న్యాయం? అని ఆ రోజు ముఖ్యమంత్రిని అడిగిన. తర్వాత వెంటనే ఇరిగేషన్ మంత్రి జీవో ఇస్తున్నం.. మేమే బిల్లు కడ్తం అని చెప్పిండు. ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఏం చేయలేదు. ఏం ఆలోచన జేయలేదు.

వెనుకబాటుకు కాంగ్రెస్ నేతలే కారణం దక్షిణ తెలంగాణలో పాలమూరు, నల్లగొండ నిర్లక్ష్యానికి గురైన జిల్లాలు. అన్నిరకాలుగా దగాపడ్డ జిల్లాలు. కరెంటు ప్రాజెక్టులు మొత్తం ఉత్తర తెలంగాణల్నే పెట్టిన్రు. కొత్తగూడెం నుంచి రామగుండం వరకు గోదావరి ఒడ్డున్నే పెట్టిండ్రు. పవర్ బ్యాలెన్స్ కావాలె. 23జిల్లాల రాష్ట్రంల గూడ అన్ని జిల్లాల కంటే అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లున్న జిల్లా నల్లగొండ. పరిశ్రమలు గూడా సరైన పద్ధతిలో రాలేదు. అందుకోసం ఈరోజే 400కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించుకున్నం. 60ఏండ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడూ చేయని విధంగా రూ.24,950 కోట్లతో భారతదేశంలోనే మొట్టమొదటి అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్ యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని దామరచర్ల వద్ద నిర్మిస్తున్నం. ఏడాది, ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభిస్తది. దాంతో నల్లగొండ జిల్లా స్వరూపమే మారుతది. అద్భుతమైన వెలుగు వస్తది. రామగుండంలో ఎన్టీపీసీ 2700 మెగావాట్లు ఉత్పత్తి చేస్తేనే ఆ పట్టణం రూపు మారిపోయింది. ఇక్కడ నాలుగు వేల మెగావాట్లు.. అదికూడా ఎన్టీపీసీ కాదు.. మన జెన్‌కో సొంతం. సౌత్ ఇండియాలో నంబర్‌వన్.. నేనే కొట్లాడి పెట్టించిన.

పోతిరెడ్డిపాడు పొక్క పొడుస్తుంటే నోరు తెర్వలేదు.. వర్షాకాలం వచ్చింది. సాగర్ కింద కొంత, బోర్ల కింద కొంత సాగుచేసిన్రు. సాగర్ మొత్తం నిండలే. ఇప్పుడిప్పుడే నీళ్లొస్తున్నయ్. నిండాలని భగవంతుణ్ని ప్రార్థిద్దాం. కానీ ఎంతకాలం ఈ బాధ? కాంగ్రెస్ జమానాలో రెండు కథలు జరిగినయ్. ఒకటి.. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం. ఆనాడు పోరాడినం. జైలుకు బోయినం. లాఠీదెబ్బలు తిన్నం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్‌నేతలు డ్రామాలుచేసిండ్రు. తర్వాత రాజశేఖర్‌రెడ్డికి సహకరించి నోరుమూసుకోని కూసున్నరు. భూములు మునిగితే ఆనాడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పించిన నష్టపరిహారం ఎంత? ఈరోజు మేం ప్రాజెక్టులు కడితే పరిహారం గురించి మాట్లాడుతున్నడు. ఏ నోరు, ఏ మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నడు? సమాధానం చెప్పాలె! ఖమ్మం జిల్లాలో 9వేల ఎకరాలు, నల్లగొండలో వేల ఎకరాలు ముంచేసి నోరుగొట్టి సాగర్ నీళ్లు రాకుంట చేసి.. శ్రీశైలం దగ్గర రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు పొక్క పొడిసి 65వేల క్యూసెక్కుల కాల్వ తవ్వితే రెండు జిల్లాల దక్షిణ తెలంగాణ నాయకులు నోరు తెర్వలె. మేమే పోరాటం చేసినం. వాళ్లెవ్వరూ రైతుల క్షేమాన్ని కోరి పని జెయ్యలె. చేస్తే ఇట్ల ఉండేది కాదు. మన హక్కులు మనకు ఉండేవి. ఆరునూరైనా సరే.. లక్ష ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అడ్డుకున్నా సరే.. కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తీరుతం. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లా ప్రజలకు శాశ్వతంగా కరువు దూరం కాబోతున్నది. తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు గురించీ నా హృదయం అంతే కొట్టుకుంటది. అంతే తన్లాడ్తది. నేను ఉద్యమం చేసిన్నాడు కోటి ఆశలతోని నా నాయకత్వాన్ని బలపర్చిన్రు. నన్ను నడిపించింది మీరే. అవసరమైతే నా రక్తపు బొట్టు రంగరించైనా సరే, న్యాయం జేయడానికి ప్రయత్నం జేస్త.

సాగర్ ఆయకట్టుకు నీళ్లిస్తాం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 20టీఎంసీల ప్రాజెక్టులు రెండు.. గంధమల్ల, బస్వాపూర్ నిర్మాణం జరుగుతున్నయ్. పేరుకు ప్రాజెక్టులు అక్కడ ఉన్నయ్. లాభపడేది మొత్తం జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, నకిరేకల్లే. మూసీ ప్రాజెక్టు 365రోజులు నిండే ఉంటది. ఎండేది లేదు. కొంచెం కాల్వ పెంచితే.. మిడ్‌మానేరు నుంచి వచ్చే ఎస్సారెస్పీ కాల్వ.. కాళేశ్వరం అయిపోతే సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ చరిత్రలో ఊహించని నీళ్లొస్తయి. సాగర్ ఎడమకాల్వ ఉన్నది.. సాగర్‌ల గోదావరిని పడేయండి అని చాలామంది అడుగుతున్నరు. దానికంటే ఉత్తమ ఆలోచన చేసినం. సాగర్ ఎడమకాల్వ 42వ కిలోమీటర్ దగ్గర పెద్దదేవులపల్లి రిజర్వాయర్ 0.85టీఎంసీలతో ఉన్నది. ఆ రిజర్వాయర్ పైన పారకం ఉన్నది కేవలం 77వేల ఎకరాలే. మిగతా 3.2లక్షల ఎకరాలు పెద్దదేవులపల్లి కిందనే ఉన్నది. బస్వాపూర్, గంధమల్లకు నీళ్లు తెచ్చే కాల్వ సైజు కొంచెం పెంచి కేతేపల్లి, నకిరేకల్ మండలాల ద్వారా 30కి.మీ. మేర తవ్వితే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కింద పానగల్లు వాగులో పడ్తది. డైరెక్టుగ పెద్దదేవులపల్లికి వస్తది. కింద ఉన్న 3.2లక్షల ఎకరాలు రెండు పంటలు నల్లగొండ రైతులు మీసంమెలేసి పండించుకునే పరిస్థితి త్వరలోనే వస్తది. మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ ఎన్‌ఎస్పీ ఆయకట్టు సంపూర్ణంగా పండించుకోవడమే కాదు.. ఆ నీళ్లు మళ్లీ పాలేరుకు కూడా వెళ్లిపోయే పరిస్థితి వస్తది.

నల్లగొండ, సూర్యాపేటలకు మెడికల్ కాలేజీలు.. సమాన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా.. వెనుకబడ్డ సూర్యాపేట జిల్లా అభివృద్ధి కావాలె కాబట్టి జిల్లాలోని 323గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.15లక్షలు మంజూరు చేస్తున్న. జిల్లాలో 323 తండాలున్నయి. ఒక్కో తండాకు రూ.10లక్షలు మంజూరు చేస్తున్న. ఏ తండా అయినా కేసీఆర్‌దే. ఏ ఊరు అయినా కేసీఆర్‌దే. నాకు ఆ ఊరు, ఈ ఊరు అన్న తేడా లేదు. సూర్యాపేట పట్టణంలో మూసీకాల్వ బాగు జేస్తందుకు రూ.65కోట్లు మంజూరు జేస్తున్న. మూసీ ఆధునీకరణ ఆర్నెళ్లల్ల కావాలె. వచ్చే సంవత్సరం ఆయకట్టు బాగా పెరుగాలె. మూసీ మీద ఆరు, ఏపూరు వాగు మీద మరో ఆరు చెక్ డ్యాంలు వెంటనే మంజూరు జేస్తున్న. సూర్యాపేట సద్దుల చెరువు బాగైంది. పుల్లారెడ్డి చెరువు వృద్ధికి నిధులు మంజూరు జేస్త. నేను ప్రేమతోని మంజూరు చేసిన సూర్యాపేట జిల్లా కేంద్రం అన్నిరకాలుగ బాగు పడాలె. ప్రజలు మా జిల్లా అని చెప్పి గర్వపడే విధంగ ఉండాలె. నల్లగొండ జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి హామీ ఇస్తున్న. వచ్చే బడ్జెట్‌లో నల్లగొండ, సూర్యాపేటకు రెండు మెడికల్ కాలేజీలు మంజూరుజేస్తం. సూర్యాపేటలో క్రిస్టియన్, మైనార్టీలు, వెనుకబడిన వర్గాలున్నయి. సూర్యాపేటకు బంజారాభవన్‌ను మంజూరు జేస్తం. మా చిన్నబిడ్డ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సూర్యాపేటకు జాతీయస్థాయిలో మంచి పేరుతెచ్చారు. పట్టణంలో అన్నిరకాల అభివృద్ధికి నా నిధుల నుంచి రూ.75కోట్లు మంజూరు జేస్తున్న. రేపే ఆర్డర్ ఇస్త. రోడ్లవెడల్పు, మౌలిక సౌకర్యాల కోసం ఏం చెయ్యాల్నో ఆలోచన చెయ్యాలె. మీ రు అడిగినయన్నీ చేసిన. నాదొక్కటే కోరిక. మీరు మాట తప్పొద్దు. అవసరమున్న మొక్కలు పంపిస్త. ఇంటింటికీ ఆరుమొక్కలు పెంచాలె. రెండేండ్ల తర్వాత నేను, తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ మార్గంల పోతుంటె ఇక్కడ అడివొచ్చిందా?అని ఆశ్చర్యపోవాలె. ఆనాడు ఉద్యమంల నేను కలలుగన్న నల్లగొండ జిల్లా కనపడా లె.. అంటూ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.

మంత్రి తుమ్మలపై సీఎం ప్రశంసలు తుమ్మల నాగేశ్వరరావు సీతారామప్రాజెక్టు కడుతున్నరు. దుమ్ముగూడెం నుంచి పదిలక్షల ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా ప్లాన్ చేయించిండు. భూసేకరణ జరుగుతున్నది. ఖమ్మం జిల్లా దేశంలోనే ధనిక జిల్లా కాబోతున్నది. పాలేరు భగీరథుడు నేను కాదు తుమ్మలనాగేశ్వరరావు. ఆయన ఎమ్మెల్యే కావడం ఆ నియోజకవర్గ ప్రజల అదృష్టం. 10నెలలు రాత్రింబవళ్లు కష్టపడి పాలేరు ప్రజల దాహం తీర్చిండు అని సీఎం అన్నారు.

కేసీఆర్ నం.1 సీఎం: జగదీశ్‌రెడ్డి మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ జగదీశ్‌ను గెలిపించి పంపించండి సరిపడా అభివృద్ధి చేస్తా అని ఎన్నికలకు ముందు చెప్పిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీ కంటే ఎక్కువ అభివృద్ధి చేశారు. సూర్యాపేట ప్రజల ఆశల్ని నిలబెడుతూ.. తొలిసారి అభివృద్ధి రుచి చూపిస్తూ వందల కోట్లతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నం. గతంలో గూండాల పాలనతో వ్యాపారం చేసుకునే స్వేచ్ఛలేక జనం ఇబ్బందులు పడ్డరు.. రోడ్లు లేక దుమ్ముకొట్టుకుపోయి గుర్తుపట్టలేనంతగా మారి ఇంటికి పోయేవారు. దేశంలోనే నీళ్లు కొని తాగిన తొలి పట్టణంగా సూర్యాపేట నిలిచింది.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే సూర్యాపేటకు స్వేచ్ఛ వచ్చింది. పాలేరు జలాలతో ఇంటింటికీ కృష్ణా జలాలు అందనున్నాయి. దేశంలోనే నంబర్‌వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారు. అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వచనాలు సూర్యాపేట ప్రజలకు కావాలని కోరారు.

ఇష్టపడి అభివృద్ధి చేస్తున్న.. మూసీ నుంచి పానగల్లుకు కాల్వ తవ్వొచ్చని.. నల్లగొండ నాయకులో, ఎవరైనా ముఖ్యమంత్రో, సోకాల్డ్ ఎర్రజెండా పార్టీలో ఎవరన్న చెప్పిండ్రా? ఇక్కడ చాలామంది పుట్టిన్రు. సూర్యాపేట, నకిరేకల్‌లో ఎక్కువ కనిపించేది స్తూపాలు తప్ప ఏం లేవు. నీళ్లు రావు. కరెంటు రాదు. పేదలకు సంక్షేమం అందదు. ఏమీ జరుగదు. తెలంగాణకోసం అనేక పదవులు త్యాగం చేసిన. జీవితలక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రం సాధించిన. కష్టపడి తెచ్చిన రాష్ట్రంలో భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఇష్టపడి అభివృద్ధి చేస్తున్న. ఈ జిల్లా ఆ జిల్లా కాదు.. తెలంగాణ ప్రతీ ఇంచుమీద ఆలోచన జేస్తున్న. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చెప్తుంటే ఇంజినీర్లే నివ్వెరపోయిన్రు. మూసీ ప్రాజెక్ట్ ఎఫ్‌ఆర్‌ఎల్ 196మీటర్లు ఉంటది. పెద్దదేవులపల్లి 50మీటర్ల దిగువన 146మీటర్లు. 30కిలోమీటర్ల కాల్వ తవ్వితే జారుడుబండ మీద పోయినట్లు నీళ్లు పోతయ్. సాగర్ ఆయకట్టు అంతా సస్యశ్యామలం అయితది. రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలు వస్తయి. ముఖ్యమంత్రి దగ్గర స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ పెడితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పు అని మాట్లాడిన్రు. అన్యాయం అన్నరు. అప్రజాస్వామ్యం అన్నరు. మేం పక్షపాతం వహిస్తలేదు. మిషన్ కాకతీయ ప్రతి మండలంలో ప్రతి ఏటా అయిదోవంతు తీసుకుంటున్నం. కాంగ్రెస్, సీపీఐ పార్టీలా అని మేము చూడలే. ప్రతి ఇంచు మాది అని భావిస్తం. ప్రతి గజం బాగుపడాలని గుండెలనిండ కోరుకుంటం. మిషన్ భగీరథ కింద ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీళ్లిస్తం. ఎమ్మెల్యే మా వాడా, కాదా అని మేము చూడలే. ప్రజలందరూ మావాళ్లే అన్న భావనతో ముందుకు పోతున్నం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.