Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరం అభివృద్ధికి వంద కోట్లు

-అద్భుత ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుతాం
-అర్చకులకు క్వార్టర్లు.. వేదపాఠశాల.. కళాశాల నిర్మాణం
-మరింత విశాలంగా ఆలయ ప్రాంగణం
-ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
-ఆలయ విస్తరణకు 600 ఎకరాల సేకరణకు ఆదేశాలు
-కాళేశ్వరం ఆలయంలో సీఎం దంపతుల పూజలు

పవిత్ర గోదావరి నదీతీరాన ఉన్న కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేవాలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెంటనే రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయంతోపాటు కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉన్నదన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా కుటుంబసమేతంగా ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ఆలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని, పార్వతిమాతను దర్శించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆలయ ప్రాంగణంలోనే అర్చకులతో కాసేపు కూర్చొని మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యం దృష్ట్యా ఇక నుంచి ఆలయానికి, ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలివస్తారని, దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు, ఫారెస్టు స్థలాలను సేకరించాలని ఆదేశించారు. కల్యాణమండపంతోపాటు పెద్దస్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి ప్రత్యేక వేదికకు వీలుగా ఆలయ ప్రాంగణాన్ని మరింతగా విస్తరించాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. కాళేశ్వరం ఆలయ అర్చకులకోసం క్వార్టర్లను నిర్మిస్తామని, వేదపాఠశాల, కళాశాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌ను కూడా నిర్మిస్తామన్నారు. గోదావరి పుష్కర ఘాట్స్ దగ్గర జాలీలు ఏర్పాటుచేసి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గొప్ప యాగానికి సంకల్పం
కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంలో ఒక మహత్తరమైన యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. యజ్ఞయాగాదులకు గోదావరి తీరంలోని కాళేశ్వర ఆలయ ప్రాంతం అనువుగా ఉంటుందని, ఆలయ పునర్నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామిని ఆహ్వానించామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని బరాజ్‌లు పూర్తైన తర్వాత గోదావరి జలాలు.. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి పాదాలను తాకేవరకు సుమారు 170 కిలోమీటర్ల మేర నిలిచి ఉంటాయని సీఎం తెలిపారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దయవల్ల ఈ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందివ్వనున్నట్లు సీఎం వివరించారు. ఉద్యమకాలంలో రామగుండం దగ్గర గోదావరిని చూస్తే దుఃఖం వచ్చేదని, తెలంగాణకు తరలిరావాలని మొక్కుతూ గోదావరినదిలో నాణేలు జారవిడిచేవాడినని, ఇప్పుడు తెలంగాణలో కష్టాలు తీరబోతున్నాయని కేసీఆర్ తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.