Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరం ఆగేదికాదు

-చంద్రబాబూ.. ఒడిశా వద్దన్నదని పోలవరం ఆపుతవా?.. -బ్రహ్మదేవుడు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేరు -నాడు కాంగ్రెస్, టీడీపీలు ఏకమై తెలంగాణకు అడ్డుపడినయి -నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలనుకుంటున్నయి -జగిత్యాల జిల్లా కలికోట సభలో మంత్రి హరీశ్‌రావు -సూరమ్మ రిజర్వాయర్ కాల్వ పనులకు శంకుస్థాపన -దసరానాటికి సూరమ్మ చెరువు నింపుతామని హామీ -తెలంగాణ ప్రాజెక్టుల గురించి ప్రపంచం చెప్పుకొనే రోజులొచ్చాయి -ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ -ఆంధ్రల నీ పదోట్లకోసం తెలంగాణ ప్రాజెక్టుల్ని ఆపాల్నా?: మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్, టీడీపీలు ఏకమైనా, ఆఖరుకు ఆ బ్రహ్మదేవుడు దిగివచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు ఆగబోదని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఒడిశా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఆపాలని కోరుతున్నందున ఆ ప్రాజెక్టును ఆపుతవా? అని చంద్రబాబును హరీశ్ సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెసోళ్లు వందల కేసులతో రాష్ట్రం లోపల ప్రయత్నిస్తుంటే.. రాష్ట్రం బయట చంద్రబాబు ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పెడుతున్నాడని విమర్శించారు. నాడు కాంగ్రెస్, టీడీపీలే తెలంగాణకు అడ్డుపడ్డాయని, ఇప్పుడు ఆ రెండు పార్టీలే కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు చేస్తున్నాయని, అంటే.. కాంగ్రెస్, టీడీపీ నాయకుల లోపలిసూత్రం ఒకటేనని హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట శివారులో రూ.204 కోట్లతో తలపెట్టిన సూరమ్మ రిజర్వాయర్ కాల్వ పనులకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపనచేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు కండ్లల్ల కారం పోసుకుంటున్నాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలని చంద్రబాబు మళ్లీ నిన్న ఢిల్లీకి దరఖాస్తు పెట్టిండు. ఆంధ్రల ఆయనకు ఓట్లు పడకపోతే మనల్ని తిట్టాల్నా? కేసీఆర్‌ను తిడితెనో.. తెలంగాణల ప్రాజెక్టుల్ని ఆపబడితెనో ఆయనకు ఓట్లు పడతయా? అని ప్రశ్నించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అఫిడవిట్ ఇచ్చిందని గుర్తుచేసిన హరీశ్‌రావు.. ఆ వాటాను సంపూర్ణంగా వాడుకునేందుకే సీఎం కేసీఆర్.. కాళేశ్వరం, సీతారామ, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌లు కడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులూ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే.. చంద్రబాబు మాత్రం కాళేశ్వరం అనుమతుల్ని రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతున్నారని.. మరి ఒడిశా ప్రభుత్వం కూడా పోలవరం వద్దంటున్నదని అందుకని, పోలవరం ప్రాజెక్టును ఆపుతారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీలో రాజకీయ లబ్ధి కోసం, ఏదో పదోట్లు పడతయని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రజల సంకల్పమైన కాళేశ్వరం ప్రాజెక్టును బ్రహ్మదేవుడు దిగొచ్చినా ఆపలేరన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి, ఇదే సంవత్సరం సాగునీరు కూడా ఇస్తామని హరీశ్‌రావు స్పష్టంచేశారు.

కాళేశ్వరం నీళ్లలో కాంగ్రెస్ కొట్టుకుపోతుంది ఒకవైపు చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీకి ఫిర్యాదు చేస్తుంటే.. కాంగ్రెసోళ్లు కూ డా జత కలుస్తున్నారని మంత్రి హరీశ్ విమర్శించారు. ప్రాజెక్టు పూర్తయితే వచ్చే ఆ నీటిలో కొట్టుకుపోతామనే భయంతో కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం మీద కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఇంజినీర్ అవతారమెత్తి, తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకుంటే నీళ్లున్న మేడిగడ్డను గుర్తించి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. అలాంటి ప్రాజెక్టును చంద్రబాబు అపాలని అంటుంటే తెలంగాణలో ఉన్న పిడికెడుమంది టీడీపీ నాయకులు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు సభ్యుడి పదవి తెచ్చుకున్న పెద్దిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు ను ఎందుకు నిలదీయడం లేదన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులకు పౌరుషం, చీమూనెత్తురు ఉంటే కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల్ని ఆపాలంటున్న చంద్రబాబు పార్టీలో ఎలా కొనసాగుతారని అన్నారు. ఇప్పటికైనా ఆయన మొహం మీద రాజీనామాలు విసిరి కొట్టాలని హరీశ్‌రావు హితవుపలికారు.

కరువు ప్రాంతాలు సస్యశ్యామలం సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణలోని కరువు ప్రాంతాలు సస్యశ్యామలమవుతున్నాయిని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులు సహకరించి 300 ఎకరాల భూములు అప్పగిస్తే వచ్చే దసరా నాటికి సూరమ్మ చెరువును ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో నింపే బాధ్యత తమదని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినా చుక్క నీరు నింపలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే పనులు వేగంగా పూర్తిచేసి 2014లో ఐదు టీఎంసీలు, 2015లో 10 టీఎంసీలు, 2016లో 20 టీఎంసీలు నింపామని చెప్పారు. ఎల్లంపల్లి కింద రైతులకు నీరిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మధ్య మానేరులో 4.70 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయాల్సి ఉండగా, ఏడేండ్లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల క్యూబిక్ మీటర్ల పనులే చేసిందని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేండ్లలోనే రూ.1600 కోట్లు వెచ్చించి, 3.20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తిచేసి మిడ్‌మానేరును ప్రజలముందు నిలిపిందని వివరించారు. వానకాలం సీజన్‌లో మిడ్‌మానేరు నుంచి కాల్వలద్వారా హుస్నాబాద్, మానకొండురు మండలాల్లో 75 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తామని మంత్రి స్పష్టంచేశారు.

ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరదకాల్వ 365 రోజులూ నిండుకుండలా ఉంటుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా త్వరలోనే కోనసీమను తలపిస్తుందని హరీశ్ చెప్పారు. కాళేశ్వరం నీళ్లు ఫుల్లుగా రాగానే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ కొట్టుకుపోతుందన్నారు. సూరమ్మ నీళ్లు రాగానే కథలాపూర్, మేడిపల్లి మండలాల ప్రజలు గల్ఫ్‌బాటకు స్వస్తి పలికి స్థానికంగానే పనిచేసుకునే రోజులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తంచేశారు. అన్ని గ్రామాల్లోని ప్రతి కుంటను, చెరువును నింపుతామని, ఈ విషయంలో రైతులు అనుమానపడొద్దని విజ్ఞప్తిచేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్నివర్గాలవారూ సంతోషంగా ఉండేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఇటీవల తాను పాలమూరు జిల్లా గుండారం చెరువుకు వెళ్తే.. రాములు అనే రైతు కలిసి నీళ్లు వచ్చాయి.. కరంటు వచ్చింది.. పంట బాగా పండుతుంది సార్ అని తనవద్ద సంబురపడ్డాడని హరీశ్ తెలిపారు. గతంలో ఏం చేసేవాడివని ప్రశ్నిస్తే, హైదారాబాద్ ఎల్బీనగర్‌లో అడ్డా కూలీగా ఉండేవాడిని చెప్పాడని, మళ్లీ హైదరాబాద్ పోతావా? అనడిగితే నీళ్లు ఫుల్. కరంట్ ఫుల్. చేపలు ఫుల్.. ఇంకా ఎందుకు పోతా! నా రెండెకరాలు నాకు చాలు సార్ అని చెప్పాడని వివరించారు.

విడుతలవారీగా మహిళా సంఘాలకు రుణాలు: ఈటల మహిళాసంఘాలకు విడుతలవారీగా వడ్డీలేని రుణాలిస్తామని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కలికోట బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మహిళాసంఘాల భవనానికి స్థలం ఉంటే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ వలసజీవుల్లో తెలంగాణవాసులే ఎక్కువగా ఉన్నారు. వారి కన్నీళ్లు తుడిచేందుకు ప్రత్యేక తెలంగాణ అవసరమని అప్పుడు చెప్పాం. ఇప్పుడు తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెంచుతూ ఇది నిజం చేస్తున్నాం అని చెప్పారు. వ్యవసాయం కోసం అధికంగా ఖర్చుచేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణేనని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.