Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరం బలం 110 టీఎంసీలు

-నెలన్నరలో మల్లన్నసాగర్‌కు నీళ్లు.. -రోడ్ల మరమ్మతులకు 571 కోట్లు -ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ విధానం.. -మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 110 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సారెస్పీలో నిండుకుండలాగా 90 టీఎంసీల నీళ్లున్నాయని, ఎస్సారెస్పీ కింద.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లు వస్తున్నాయని, గోదావరి నదిపై ఎల్లంపల్లి, లక్ష్మి, పార్వతి, సరస్వతి.. ఈ మూడు బరాజ్‌లలో కలిపి 60 టీఎంసీల నీరు నెట్ నిల్వ ఉంటుందని వివరించారు. శ్రీరాజరాజేశ్వర, ఎల్‌ఎండీ.. రెండు రిజర్వాయర్లు కలిపి 50 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందన్నారు. 110 టీఎంసీల నీరు ఇక్కడ ఉంటుందని తెలిపారు. మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లాలో 2.70 లక్షల ఎకరాల్లో పంటలు పండే ఆస్కారం ఏర్పడిందని, ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గమైన హుజూరాబాద్ వరకు ఈ రోజు చింతనే లేదని చెప్పారు. ఒకటి, ఒకటిన్నర నెలల్లో మల్లన్నసాగర్ నీరు వచ్చేస్తుందని వెల్లడించారు. అతి త్వరలో దేవాదుల, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు యుద్ధప్రాతిపదికన పూర్తవుతాయని తెలిపారు. త్వరలో ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరుతానని సీఎం చెప్పారు.

యాసంగి పంటకు సరిపోను నీళ్లు రాష్ట్రంలో ప్రత్యేకంగా సాగునీటి ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తిచేసుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. పాలమూరు జిల్లాల్లో గతంలో లక్ష ఎకరాల సాగు మహా కష్టంగా ఉంటే ఈరోజు 12 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు. జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు పూర్తిచేసుకున్నామని, 1500 నుంచి 1852 వరకు చెరువులు నింపుకొంటున్నామని చెప్పారు. ఫలితంగా భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫేజ్ వన్ చాలా విజయవంతంగా పూర్తిచేసుకున్నామని తెలిపారు. శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేరు) రిజర్వాయర్ నింపుకొన్నామన్నారు. ప్రాజెక్టు కొత్తగా నింపేటప్పుడు కొన్ని ప్రొటోకాల్స్ ఉంటాయని సీఎం వివరించారు. మిడ్‌మానేరును మొదట 15 టీఎంసీలతో నింపినప్పుడు చిన్న బొంగ పడిందని, నీటి పంపింగ్ ఆపి పరీక్షలు నిర్వహించారని చెప్పారు.

పరీక్షల నిర్వహణ సమయంలో ఆ నీటిని లోయర్ మానేరు డ్యాంకు పంపించారన్నారు. అన్ని పరీక్షలు, మరమ్మతులు చేసి 20.9 టీఎంసీల నీటిని నింపారని వివరించారు. ఇప్పుడు ఎల్లంపల్లితోపాటు బరాజ్‌లన్నింటినీ నింపుతున్నామన్నారు. అన్నింటినీ నింపి లోడ్ టెస్టింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీని కూడా నింపుకొంటామని వివరించారు. యాసంగి పంటకు ఇది కలిసి వస్తుందన్నారు. ఈ మధ్య సూర్యాపేటకు వెళ్లినప్పుడు సార్.. నీళ్లు చివరిదాక వస్తున్నాయి.. తుంగతుర్తి, మహబూబాబాద్, సూర్యాపేట, నడిగూడెం మండలంతోపాటు కోదాడ వరకు వస్తున్నాయి అంటూ రైతులు సంతోషం వ్యక్తంచేశారని తెలిపారు. మార్చిదాక నీళ్లు రావాలని కోరితే.. మార్చి కాదు.. ఏప్రిల్ దాకా నీళ్లు సరిపోయేంతవరకు వస్తాయని, సంతోషంగా పంటలు పండించాలని రైతులకు తెలిపినట్లు చెప్పారు.

ధాన్యం కొనుగోలుకు సర్కారు గ్యారెంటీ ప్రతి సీజన్‌లో ధాన్యం మొత్తం కొనుగోలయ్యేలా పటిష్ఠ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ మంత్రి అధ్యక్షతన సమగ్రమైన వ్యవసాయ పాలసీ తయారుచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, గతంలో పనిచేసిన మంత్రులు, అధికారులు పాలసీ రూపొందిస్తారన్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చునని, ఎలాంటి ప్రతిబంధకాలు లేవని చెప్పారు. ఈ సీజన్‌లో రైతులందరికీ కనీస మద్దతు ధర లభించేలా ధాన్యం కొనుగోళ్లు జరిగేందుకు మంత్రి చర్యలు తీసుకుంటారని తెలిపారు. పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేయడానికి రూ.7 వేల కోట్ల గ్యారెంటీ ఇచ్చామని వివరించారు. అవసరమైతే మరో నాలుగైదు వేల కోట్ల గ్యారెంటీ ఇచ్చేందుకు ఆర్థికశాఖ మంత్రికి క్యాబినెట్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఏ జిల్లాలో ఎంతపంట ఉన్నదో సమీక్షించాల్సిందిగా మంత్రులను కోరినట్టు సీఎం తెలిపారు.

పౌల్ట్రీరంగంలో మనం దేశంలో నంబర్ వన్ మన దగ్గర మూడు రకాల ప్రధానమైన పంటలు పండుతాయని సీఎం కేసీఆర్ వివరించారు. ఇందులో అతి ప్రధానమైనది పత్తి, వరి, మక్కలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 14 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు పండుతాయని, ఇవి మన పౌల్ట్రీకే సరిపోతాయని తెలిపారు. గతంలో మనం చెప్పిన మేరకు షార్ట్ పీరియడ్‌లో పౌల్ట్రీ బాల్స్ కూడా తయారుచేస్తున్నారన్నారు. పౌల్ట్రీ రంగంలో దేశంలోనే మనం నంబర్ వన్ స్థానంలో ఉన్నామని వివరించారు. వరి పంటలోనే కొద్దిపాటి సమస్యలున్నాయని తెలిపారు.

కార్పొరేషన్ల నియామకానికి ఆర్డినెన్స్ మూసీ రివర్‌ఫ్రంట్, రైతు సమన్వయసమితి లాంటి ముఖ్యమైన కార్పొరేషన్లు దాదాపు 28 వరకు ఉన్నాయని, వీటికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నియమించాలంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే ప్రతిబంధకం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వీటన్నింటికోసం చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ మేరకు ఆర్డినెన్స్ తేవాలని క్యాబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఆర్డినెన్స్ వచ్చాక రైతు సమన్వయ సమితిని కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఒక్కసారి రైతు సమన్వయ సమితి వస్తే రైతుల సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. వచ్చే జూన్‌లోపు రైతులను ఒక వ్యవస్థలా తీర్చిదిద్దాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వందశాతం రైతు పక్షపాతి అని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా నూతన రెవెన్యూ చట్టం తెస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. విత్తనం నుంచి పంట అమ్ముకునేదాక రైతులకు ఎలాంటి ఇబ్బంది రానీయమని చెప్పారు. ఈ ఒక్క విషయంలో విజయం సాధిస్తే తెలంగాణ రైతాంగం దేశంలోనే ధనిక కమ్యూనిటీ అవుతుందన్నారు. గతంలో సంక్షోభంలో ఉన్నవాళ్లం.. దీనిని అధిగమించి సంక్షేమం దిశగా పయనిస్తున్నామని తెలిపారు.

రెండుమూడు నెలల్లో రోడ్ల మరమ్మతులు ఇటీవలి భారీవర్షాలకు దెబ్బతిన్న రోడ్లన్నింటినీ రెండుమూడు నెలల్లో బాగుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనిచేయాలని, తప్పుడు పద్ధతులున్న కాంట్రాక్టర్లను, పనులు తీసుకొని పనిచేయని కాంట్రాక్టర్లను తప్పించాలని స్పష్టంచేశారు. రోడ్ల మరమ్మతులకు ప్రత్యేకంగా రూ.571 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి ఉండే ఏరియాకు సింగరేణి సంస్థ నుంచి కొన్ని నిధులు తీసివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.