-ప్రాజెక్టును సందర్శించిన జార్ఖండ్ మాజీ సీఎం సోరెన్ -తెలంగాణ రైతులకు కాళేశ్వరం వరం.. ఇది దేశానికి తలమానికం కాబోతున్నది -సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు.. తక్కువకాలంలో ఎక్కువ పనులు -నాణ్యతతో నిర్మించటం గొప్ప విషయం.. ఇలాంటివి చాలా రాష్ట్రాల్లో అవసరం -చిత్తశుద్ధితో పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం -మంత్రి హరీశ్‌తో బరాజ్‌లను సందర్శించిన సోరెన్ -ప్రాజెక్టు గురించి సోరెన్‌కు వివరించిన హరీశ్ -భూగర్భ టన్నెళ్లు చూసి అబ్బురపడ్డ హేమంత్

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఒక అద్భుతమైన ఎత్తిపోతల ప్రాజెక్టు అని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రశంసించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల కల సాకారం కాబోతున్నదన్నారు. ఇది రైతులకు వరంవంటిదని అభివర్ణించారు. రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో హేమంత్‌సోరెన్ పర్యటించి, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లా మంథని మండలం సుందిళ్ల వద్ద బరాజ్‌లు నిర్మాణమవుతున్నాయి. ఈ మూడు బరాజ్‌లను హరీశ్‌తో కలిసి హేమంత్ సందర్శించారు. హైదరాబాద్ నుంచి ఉదయం హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ బరాజ్ వద్దకు హరీశ్, సోరెన్ చేరుకున్నారు. అనంతరం అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను సందర్శించారు. మూడు బరాజ్‌ల నిర్మాణ పనులను వ్యూ పాయింట్ల నుంచి పరిశీలించారు. ప్రతీ వ్యూ పాయింట్ వద్ద సాగునీటిశాఖ ఇంజినీర్లు ప్రాజెక్టుకు సంబంధించి మ్యాప్‌లు ఏర్పాటుచేశారు. స్వయంగా మంత్రి హరీశ్‌రావు ఈ మ్యాప్‌ల ద్వారా సోరెన్‌కు ప్రాజెక్టు గురించి వివరించారు. గోదావరి, ప్రాణహిత.. రెండు నదులు కలిసి కిందికి రావటం వల్ల నీటి లభ్యత అధికంగా ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మేడిగడ్డ బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా మంత్రి తెలిపారు. ఈ బరాజ్ద్వారా సంవత్సరంలో 160 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని అన్నారు. జూలై, ఆగస్టు వరకు తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలో సుమారు 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు, మరో 18 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. వ్యవసాయంతో పాటు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని కూడా కాళేశ్వరం ద్వారా అందించనున్నామని వివరించారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు పనిచేసే విధానాన్ని తెలియజేశారు. బరాజ్‌లు, పంప్‌హౌజ్‌లు, విద్యుత్ సబ్స్టేషన్లు, గ్రావిటీ కెనాల్, టన్నెల్ నిర్మాణ పనుల ప్రగతిని వివరించారు. పనులు శరవేగంగా జరిగేందుకు ఉపయోగిస్తున్న అధునాతన యంత్రాలు, పరికరాలను సోరెన్‌కు చూపించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మూడు షిఫ్టుల్లో సుమారు 26వేల మంది కార్మికులు పనిచేస్తున్నట్టు చెప్పారు. వ్యూ పాయింట్ల నుంచి ప్రత్యేక వాహనాల్లో వెళ్లి క్షేత్రస్థాయిలో బరాజ్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు.
దేశంలో మరెక్కడా లేని రీతిలో అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతుండటాన్ని చూసి హేమంత్ సోరెన్ అబ్బురపడ్డారు. సిమెంటు కాంక్రీట్, గేట్లు అమర్చటం, మట్టి పనులు ఏకకాలంలో జరుగుతుండటంపట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అన్నారం బరాజ్‌వద్ద ప్రారంభమైన గేట్లు బిగించే పనులనుసైతం హరీశ్‌రావుతో కలిసి సోరెన్ పరిశీలించారు. కొద్దిరోజులక్రితం మొదలైన ఒక గేటు బిగింపు పనులు తుదిదశకు చేరిన నేపథ్యంలో ఈ గేటును అమర్చిన తీరును రెండు వైపులనుంచి చూశారు. ఈ బరాజ్ వద్ద జరుగుతున్న రెండు, మూడో గేటు బిగింపు పనులను కొద్దిసేపు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సోరెన్ మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం దేశంలోనే రికార్డు సృష్టిస్తుందని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అని, ప్రతి ఎకరానికీ సాగునీరు అందించాలనే సంకల్పంతో ఆయన ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం అభినందనీయమని చెప్పారు. ప్రజల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఆలోచించే ప్రభుత్వాలే ఇలాంటి గొప్ప పథకాలు చేపడతాయని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టు దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో అవసరమని, దేశానికే ఈ ప్రాజెక్టు తలమానికంగా ఉండబోతుందని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, దేశంలో ఎక్కడాలేని విధంగా తక్కువ కాలంలో ఇక్కడ ఎక్కువ పనులు జరిగాయని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చాలా ప్రగతి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని, నిర్దేశిత గడువులోపు పూర్తి కాగలదని స్పష్టం అవుతున్నదని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలనే పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. ఈ ప్రాజెక్టువల్ల రైతులకు చాలా మేలు జరగనుందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అవసరమైన అనుమతులన్నీ తెలంగాణ ప్రభుత్వం పొందటంపై సంతోషం వ్యక్తంచేస్తూ.. అనుమతులు రావటంవల్ల నిర్మాణపనుల్లో వేగం కూడా పెరిగిందన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరబోతున్నదని, వచ్చే వానకాలం నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందించాలనే ముఖ్యమంత్రి కల కచ్చితంగా సాకారం కాగలదనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఇంతటి పెద్ద ప్రాజెక్టు గురించి తెలుసుకొని స్వయంగా చూసేందుకే ఇక్కడికి వచ్చినట్లు వివరించారు.
అండర్ టన్నెల్ పనులను చూసి అబ్బురపడ్డ సోరెన్..
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం శివారులోని కాళేశ్వరం ప్రాజెక్ట్ 6వ ప్యాకేజీ అండర్‌టన్నెల్‌ను మంత్రి హరీశ్‌రావుతో హేమంత్‌సోరెన్ పరిశీలించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు ధర్మారం చేరుకుని, ప్రత్యేక కాన్వాయ్‌లో అండర్ టన్నెల్‌కు వచ్చారు. మొదట హరీశ్‌రావు, సోరెన్‌లు కలిసి పంప్‌హౌస్‌ను పరిశీలించారు. పనుల గొప్పతనం గురించి మంత్రి హరీశ్‌రావు వివరించగా, పనులను చూసి మాజీ సీఎం అబ్బురపడ్డారు. అండర్‌గ్రౌండ్‌లో జరుగుతున్న పనులను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం వారిద్దరూ టన్నెల్‌లోని సర్జ్‌పూల్, ఆడిట్ 1 టన్నెల్‌ను పరిశీలించారు.
కాళేశ్వరాన్ని సందర్శించిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తోపాటు పాటు పలువురు కార్పొరేటర్లు పరిశీలించారు. ప్రత్యేక వాహనాల్లో మొదట అన్నారం పంప్‌హౌజ్‌కు, అక్కడి నుంచి సుందిళ్ల బరాజ్‌కు చేరుకుని పనులు పరిశీలించారు. అనంతరం నందిమేడారంలో ఆరో ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న అండర్‌టన్నెల్ పనులను పరిశీలించారు.
రైతును రాజులా చూసేందుకే కాళేశ్వరం: గొంగిడి సునీత
రైతును రాజులా చూసేందుకే సీఎం కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణానికి పూనుకొన్నారని ప్రభుత్వ విప్ గొంగడి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను ఆలేరు నియోజకవర్గానికి చెందిన సుమారు 100 మంది ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె సందర్శించారు.
ఇది ప్రపంచస్థాయి ప్రాజెక్టు
-ఇంజినీర్ల పనితనం అద్భుతం
-దేశానికే ఆదర్శం తెలంగాణ
-మా దేశంలోనూ ఇలాంటి ప్రాజెక్టు చేపడుతాం
-టాంజానియా ప్రతినిధులు
రామడుగు: ప్రపంచస్థాయి ప్రాజెక్టు నిర్మాణాల్లో కాళేశ్వరం మొదటిస్థానంలో నిలుస్తుందని టాంజానియా ప్రభుత్వ ప్రతినిధి ఇమ్మాన్యూయెల్ ఎన్ఎం కలోబెలో అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులోని కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ పనులను శుక్రవారం మెఘా ఇంజినీరింగ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విజయ్ ఉప్లెంచ్వర్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ డీఈఈ గోపాలకృష్ణ కాళేశ్వరం అన్ని ప్యాకేజీల నిర్మాణాలను మ్యాపు ద్వారా వివరించారు. అనంతరం పనులు జరుగుతున్న ప్రాంతాలకు తీసుకువెళ్లి చూపించారు. ఈ సందర్భంగా టాంజానియా ప్రభుత్వ ప్రతినిధి ఇమ్మాన్యూయెల్ ఎన్ఎం కలోబెలో మాట్లాడుతూ కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టు అని అభివర్ణించారు. ఇలాంటి ప్రాజెక్టును తాము ఇంత వరకు చూడలేదన్నారు. రైతులకు ఎలాంటి నష్టమూ కలుగకుండా భూ అంతర్గతంగా ప్రాజెక్టును నిర్మించడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. ఇంజినీర్ల పనితనాన్ని చూసి ముగ్ధులైనట్లు చెప్పారు. లక్షల ఎకరాలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టును నిర్మించుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణం టాంజానియాలో కూడా చేపట్టాలనే లక్ష్యంతో ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ప్రాజెక్టును సందర్శించినవారిలో టాంజానియా ప్రతినిధులు మ్కామా మన్యా మా బ్వైర్, హోప్నెస్ యూజ్బియస్ లియుండి, ఎడ్వర్డ్ జాకబ్ టిండ్వా, ఆర్నాబ్ షాహా, కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ ఏఈఈలు శ్రీనివాస్, రమేశ్, సురేశ్‌కుమార్, అశోక్, మెఘా ప్రతినిధులు ఎంఎం కుమార్, రామకృష్ణ, కృష్ణారెడ్డి కూడా ఉన్నారు.