Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరం ప్రారంభానికి జగన్‌కు ఆహ్వానం

-తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ నిర్ణయం!
-కాళేశ్వరం ప్రారంభానికి రావాలంటూ జగన్‌కు ఆహ్వానం
-9,10 షెడ్యూల్ సంస్థలు, విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యలపై ఇరు రాష్ర్టాల సీఎంల చర్చ
-బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్
-అమ్మవారి పాదాల చెంత కాళేశ్వరం ఆహ్వాన పత్రిక

ఈ నెల 21న నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం విజయవాడ చేరుకున్న కేసీఆర్.. ఏపీ నూతన రాజధాని అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన జగన్.. ఆయనను సాదరంగా లోనికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను జగన్‌కు కేసీఆర్ అందజేశారు. అనంతరం దాదాపు గంటన్నరపాటు ఇద్దరు సీఎంలు విభజన సమస్యలు సహా వివిధ అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. రెండు రాష్ర్టాల మధ్య జలవివాదాలు ఉండొద్దని నిర్ణయించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో తమ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై ఇద్దరు సీఎంలు చర్చించినట్టు సమాచారం. ప్రభుత్వరంగసంస్థల విభజనపై దృష్టిపెట్టడంతోపాటు.. విద్యుత్ ఉద్యోగుల విభజనపైనా చర్చించినట్టు తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై సమాలోచనలు జరిపిన సీఎంలు.. కృష్ణా, గోదావరి జలాలపై కోర్టులు, ట్రిబ్యునళ్లకు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 24న హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం జరుగనున్నది.

కేసీఆర్‌కు జగన్ విందు
రాష్ట్ర పర్యటనకు వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ విందునిచ్చారు. ఇద్దరు సీఎంలు కలిసి భోజనం చేశారు. కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలు, జగన్‌తోపాటు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నివాసంలో తిరుమల తిరుపతి దేవస్థాన వేదపండితులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించారు. వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని కేసీఆర్‌కు అందజేశారు.

కనకదుర్గమ్మ సన్నిధిలో సీఎం కేసీఆర్
ఏపీ పర్యటనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు కేసీఆర్ బృందానికి స్వాగతం పలికారు. తొలుత బెజవాడ కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, ఆహ్వాన పత్రికను అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం అర్చకస్వాములు కేసీఆర్‌కు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహూకరించారు. దాదాపు అరగంటపాటు కేసీఆర్ ఆలయంలో గడిపారు. అక్కడినుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ప్రకాశం బరా జ్ వద్ద కాసేపు కారు నిలిపి, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. బరాజ్ కట్టిన తీరును, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నదిలోకి నాణేలు వదిలారు.

శిలాఫలకాలపై ముగ్గురు సీఎంల పేర్లు
-గవర్నర్ సమక్షంలో కాళేశ్వర ప్రారంభోత్సవంచారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతున్నది. ప్రారంభోత్సవ ఘట్టాన్ని చరిత్రలో నిలిపే శిలాఫలాకాలు సిద్ధమవుతున్నాయి. మేడిగడ్డ బరాజ్‌తోపాటు కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి విడుదలకు సంబంధించి రెండు శిలాఫలకాలను సిద్ధంచేయడంలో ప్రొటోకాల్ ప్రకారం పేర్లను నిర్ణయించారు. ఈ రెండింటిపై గోదావరి బేసిన్‌లోని ప్రధాన రాష్ర్టాలైన మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రుల పేర్లు ఉండనున్నాయి. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వీటిని ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర జీ ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్లు ఉండనున్నాయి. మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి నీటి విడుదల.. ఈ రెండు కార్యక్రమాల్లో ఈ పేర్లు ఉండనున్నాయి. గౌరవ అతిథులుగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బీ వెంకటేశ్ నేతకాని, కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, మంథని శాసనసభ్యుడు డీ శ్రీధర్‌బాబు, మహాదేవ్‌పూర్ ఎంపీపీ ఆకుల సదానందం, మహాదేవ్‌పూర్ జెడ్పీటీసీ మహ్మద్ హసీనా బాను, అంబట్‌పల్లి ఎంపీటీసీ రాచపల్లి సంపూర్ణ పేర్లు ఉండనున్నాయి. మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి స్థానిక అంబట్‌పల్లి సర్పంచ్ ఎర్రవెల్లి విలాస్‌రావు, కన్నెపల్లి పంపుహౌస్ నీటి విడుదలకు సంబంధించి మెట్‌పల్లి సర్పంచ్ ములుకల శోభ పేర్లు శిలాఫలకాలపై ఉండనున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.