Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరంతో వ్యవసాయ స్థిరీకరణ

– మారుతున్న తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం
– రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
– రైతుల చేతికే నేరుగా ‘రుణమాఫీ
– త్వరలో యాసంగి రైతుబంధు
– జాతీయ వేరుశనగ పరిశోధన కేంద్రం ఉమ్మడి పాలమూరులో ఏర్పాటుకు కృషి
– పకడ్బందీగా వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు
– ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావడంతో వ్యవసాయ స్థిరీకరణ జరిగి గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారుతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందుచూపుతో రూపొందించిన కార్యక్రమాలు తెలంగాణ ప్రజల ఆర్థికశక్తిని, గ్రామాల రూపురేఖలను మార్చివేస్తున్నాయని, ప్రపంచదేశాలకు ఆదర్శంగా మారాయని చెప్పా రు. సమగ్ర రైతు సర్వే ద్వారా రైతుల పరిస్థితులను అధ్యయనంచేసిన సీఎం.. ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, పంటలకు గిట్టుబాటు ధర, రాయితీపై ఎరువులు, విత్తనాలు, యంత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టి అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయరంగం, భవిష్యత్తు పరిస్థితిపై ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. వివిధ అంశాలపై మంత్రి స్పందన.. ఆయన మాటల్లోనే..

ఏటేటా ఆయకట్టు పెరుగుతున్నది
రాష్ట్రంలో పంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏటా ఆయకట్టు పెరుగుతున్నది. ఈ ఏడాది సీజన్‌ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనా.. అధిక వర్షపాతం నమోదైంది. అన్ని రిజర్వాయర్లలో నీళ్లు చేరుకోవడంతోపాటు.. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక, తెలంగాణ ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను కండ్ల చూడటం తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయం. వరి, పత్తి, మక్కలు, ఇతర పంట లు విస్తారంగా సాగయ్యాయి.

రుణమాఫీ డబ్బు నేరుగా రైతులకే ..
బ్యాంకులో పాత రుణ బకాయి కట్టి.. కొత్తపంట రుణాలు తీసుకునేందుకు రైతులంతా రెన్యువల్‌ చేసుకోవాలి. గత డిసెంబర్‌నాటికి రైతుకున్న అప్పు ప్రకారం రుణమాఫీ కింద రైతులకు నేరుగా సొమ్ము అందజేయాలని యోచిస్తున్నాం. త్వరలోనే స్పష్టత రానుంది.

క్రాప్‌కాలనీ ప్రణాళికలు
రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు ఎక్కడ ఏ పంట పండించాలో ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక ఉన్నది. దీని ప్రకారం కూరగాయలు, ఇతర ఆహారపంటల సాగువిస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్రాప్‌కాలనీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఉల్లిగడ్డల కొరత తీర్చడంపై దృష్టిసారించి, కేంద్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం రెండు రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.40కి అమ్ముతున్నారు. మరికొన్ని ఉల్లిగడ్డలు పంపాలని కేంద్రాన్ని కోరాం. త్వరలోనే ఉల్లి కొరత తీరనున్నది.

పామాయిల్‌ సాగును ప్రోత్సహిస్తాం..
తెలంగాణలో ఖమ్మం జిల్లాకాకుండా సగం జిల్లాలు పామాయిల్‌ సాగుకు అనుకూలమని శాస్త్రీయసర్వే వెల్లడించింది. దీనిపై కేంద్ర వ్యవసాయమంత్రికి లేఖ ఇచ్చాను. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న పామాయిల్‌ సాగు విస్తీర్ణమే కాకుండా మరో 50 వేల ఎకరాల్లో సాగుచేస్తే ఆర్థికంగా సాయంచేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నది.

బిందుసేద్యానికి చేయూత
రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణను పెద్దఎత్తున తీసుకురావాలని మంత్రివర్గ ఉపసంఘంలో సీఎం చర్చించారు. వచ్చే బడ్జెట్‌లో దీనికి ఎక్కువ నిధులివ్వాలని ప్రతిపాదించాం. రాష్ట్రంలో బిందుసేద్యం పథకానికి నిధులకోసం నాబార్డు నుంచి రూ.1500 కోట్లు రుణం తీసుకుంటున్నాం. సీఎం కేసీఆర్‌ అనుమతించగానే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 2వేల మంది రైతులకు మంజూరు చేస్తాం.

పాలమూరులో పరిశోధన కేంద్రం లక్ష్యం
ఉమ్మడి పాలమూరులో జాతీయ వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు.. నాకున్న బలమై న ఆకాంక్ష. ప్రపంచవ్యాప్తంగా పాలమూరు వేరుశనగకు మంచి డిమాండ్‌ ఉన్నది. దేశంలోనే అతితక్కువ అప్లాటాస్కిన్‌ ఫంగస్‌ తెలంగాణ వేరుశనగలో నమోదవుతున్నది. పరిశోధన కేంద్రం ఏర్పాటైతే కేంద్రంనుంచి అధిక నిధులు తెచ్చుకోవచ్చు. రైతుల ఆదాయాలను పెంచుకోవచ్చు.

జర్మనీ దేశానిది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం
విత్తనోత్పత్తి, శుద్ధి, నాణ్యతపై తెలంగాణతో కలిసి జర్మనీ ప్రాజెక్టును చేపడుతున్నది. విత్తనోత్పత్తి, శుద్ధి, నాణ్యతలో ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం జర్మనీ సొం తం. దాన్ని రాష్ట్రంలో విత్తనోత్పత్తికి వినియోగించాలని నిర్ణయించాం. నెదర్లాండ్స్‌ నుంచి అధునాతన పరిజ్ఞానం తీసుకుని ఇక్కడి రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం.

పకడ్బందీగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు
వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలుచేస్తున్నాం. కొనుగోళ్లకు నిధుల కొరత లేదు. ప్రతిగింజను కొనుగోలుచేయాలని సీఎం కేసీఆర్‌ పౌరసరఫరాలు, మార్కెటింగ్‌శాఖను ఆదేశించారు. ఏటా పెరుగుతున్న సాగువిస్తీర్ణం, గణనీయమైన దిగుబడికి అనుగుణంగా పంటలను మద్దతుధరకు కొనేందుకు ప్రత్యేక విధానం రూపొందిస్తున్నాం. ఇందు కు వచ్చే బడ్జెట్‌లో ‘మార్కెట్‌ స్థిరీకరణ నిధి’ ఏర్పాటుచేసేందుకు సీఎం ఆలోచిస్తున్నారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఇప్పటికే పత్తిని మద్దతుధరకు కొనుగోలుచేస్తున్నది. మక్కల కొనుగోళ్లను మార్క్‌ఫెడ్‌ చేపడుతున్నది. ఇతర పంటలకు సకాలంలో మద్దతు ధర చెల్లించేందుకు మార్క్‌ఫెడ్‌కు ఇటీవలే రూ.1537 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతిచ్చాం. రైతు పంట అమ్మిన 72 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నాం.

కాళేశ్వరం ప్రాజెక్టుతో మారిన గ్రామీణ ముఖచిత్రం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారింది. దేశంలో వ్యవసాయరంగంలో అగ్ర రాష్ట్రంగా, సుస్థిరమైన, బలమైన రాష్ట్రంగా.. సంపన్నులైన రైతులుగా ఎదిగే ఆస్కారం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ముఖచిత్రం కనిపిస్తున్నది. భవిష్యత్తులో నాలుగు పంటలు పండితే తెలంగాణ రైతు అప్పులుచేయడు.. సాయంకోసం ఎదురుచూడడు. తనకాళ్లపై తాను నిలబడి పంటలు సమృద్ధిగా పండిస్తాడు. ఈ ప్రాజెక్టుల అన్ని వర్గాలవారు.. అన్ని వృత్తులవారు చేతినిండా పనితో సంతోషంగా బతుకుతున్నారు. వ్యవసాయ స్థిరీకరణతో గ్రామ ఆర్థిక ముఖచిత్రం మారుతుందని సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

త్వరలో యాసంగి ‘రైతుబంధు’ సొమ్ము
యాసంగి సీజన్‌ రైతుబంధు సొమ్మును త్వరలో రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేస్తాం. గతేడాదికన్నా రైతులసంఖ్య పెరిగింది. అందరికీ ఇస్తాం. రైతుబంధు అమలు తర్వాత రైతుల్లో వ్యవసాయంపై భరోసా పెరిగిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. కుటుంబ పెద్ద అకాలమరణం చెందితే ఆ రైతు కుటుంబం వీధిన పడకూడదని ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ రైతుబీమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది రైతుల కుటుంబాలకు అండగా ఉంటున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.