-భారీ ప్రాజెక్టుకు పైసా కూడా విదిలించలేదు -ఇదా కేంద్రప్రభుత్వ సమాఖ్య స్ఫూర్తి? -కేంద్ర పథకాలు గోరంత..తెలంగాణ కార్యక్రమాలు కొండంత -దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది -మహిళలపై పెరిగిన నేరాలు -రాజ్యసభలో టీఆర్ఎస్ పక్షనేత కేశవరావు

తెలంగాణ ప్రభుత్వం 80 లక్షల మంది ప్రజల ప్రయోజనాల కోసం రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో అద్భుతమైన రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని, అంత పెద్ద ప్రాజెక్టుకు కేంద్రం ఇంతవరకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్షనేత కే కేశవరావు విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతానని చెప్తున్న కేంద్రం.. రాష్ర్టాలకు తగిన విధంగా సహకరించడం లేదని ఆక్షేపించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేశవరావు మంగళవారం రాజ్యసభలో మాట్లాడు తూ, కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులు, మాతృత్వ వందన స్కీంలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో పోలికే లేదని స్పష్టంచేశారు. కేంద్రం కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిందని, అయితే, అవి తమ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా లేనందున తిరస్కరించామని తెలిపారు.రాష్ర్టాలు తిరస్కరించిన ఆయుష్మాన్ భారత్‌ను కేంద్రం అమలుచేయటాన్ని తప్పుపట్టారు. బీజేపీ సర్కార్ కొత్తగా ప్రతిపాదిస్తు న్న సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు గోరంత ఉంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కొండంత ఉన్నాయనిచెప్పారు.
తిరోగమనంలో ఆర్థికరంగం బీజేపీ పాలనలో ఆర్థికరంగం తిరోగమనంలో ఉన్నదని కే కేశవరావు విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నట్టు దేశం ఆర్థికాభివృద్ధిబాటలో ఏమీలేదని స్పష్టంచేశారు. వాస్తవాలకు విరుద్ధంగా జీడీపీ వృద్ధిరేటును 2.5% ఎక్కువచేసి చూపారన్నారు. ఇది తాను చెప్తున్న విషయంకాదని, బీజేపీకి చెందిన ఆర్థికవేత్త సుబ్రహ్మణ్యం పేర్కొన్న విషయమేనని సభ దృష్టికి తెచ్చారు. కేంద్రంలో 2014లో తాము పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాతనే దేశం అభివృద్ధి చెందుతున్నదని బీజేపీ నాయకులు చెప్పుకోవడంలో అర్థంలేదని చెప్పారు. నిజాని కి 1951 నుంచి చేపట్టిన పంచవర్ష ప్రణాళికలతోనే దేశంలో అభివృద్ధి ప్రారంభమైందని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం 2014 నుంచే అభివృద్ధి మొదలైందన్నట్టు మాట్లాడుతున్నదని ఆక్షేపించారు. బీజేపీ హయాంలో జీడీపీ వృద్ధిరేటు 7.2% నుంచి 6.8 శాతానికి తగ్గిందని వివరించారు. అదే సమయంలో పొరుగున ఉన్న చైనా దేశ ఆర్థికవృద్ధి స్థిరంగా పెరుగుతున్న విషయాన్ని గమనించాలన్నారు. వ్యవసాయం, మైనింగ్, పరిశ్రమలు, విద్యు త్.. ఇలా అన్ని కీలకరంగాల్లో వృద్ధిరేటు తగ్గిందని కేకే విశ్లేషించారు. కానీ బీజేపీ వాస్తవాలను మరిచిపోయి జాతీయవృద్ధిరేటును పెంచి చూపుతున్నదని, తప్పుడు లెక్కలువేసి, అభివృద్ధిని భూతద్దంలో చూపెడుతున్నదని విమర్శించారు. ఒకేసారి జీడీపీని 2.5%గా పెంచి చూపారని ఆర్థికవేత్తలు చెప్తున్నారన్నారు.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గాలి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బాండ్లపేరి ట ఎక్కువ డబ్బులను వసూలుచేసి, భారీగా ఖర్చుచేసిందని కేకే విమర్శించారు. మనీ, మజిల్, మీడియా ప్రభావాన్ని ఎన్నికల్లో తగ్గించాల్సిన అవసరమున్నదని సూచించారు. బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు 80%, లైంగికదాడులు 62% పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలన్న చట్టం ఇంకా చేయలేకపోవడంపై విచారం వెలిబుచ్చారు. నిజానికి ఈసారి బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా 1984తో పోలిస్తే ఇది అతిపెద్ద విజయం ఏమీకాదని కేశవరావు స్పష్టంచేశారు. 1984లో కాంగ్రెస్ పార్టీ 404 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు.