Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరానికి పర్యావరణ అనుమతి

-పర్యావరణానికి ఎలాంటి హాని జరుగదు -తేల్చి చెప్పిన ఈఏసీ పదో సమావేశం -సాగునీటి నిర్మాణాలకు మార్గం సుగమం – మరింత వేగంగా ప్రాజెక్టు పనులు -అడ్డుకునే శక్తుల నోళ్లకు తాళం

రాష్ట్రంలో 37 లక్షలకుపైగా ఎకరాలకు గోదావరిజలాలతో జీవంపోసే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతి లభించింది. ఈ నెల ఐదున జరిగిన పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) పదో సమావేశం ఈ మేరకు కాళేశ్వరానికి పర్యావరణ అనుమతిని మంజూరుచేసింది. ఈ సందర్భంగా పలు షరతులను ఈఏసీ విధించింది. ముంపు ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణ దశలో, నిర్మించిన తర్వాత ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను నివేదించాలని సూచించింది. అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, రిజర్వాయర్ రిమ్ ట్రీట్‌మెంట్‌ను చేపట్టాలని, దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలను భూమిలో నిక్షిప్తం చేయొద్దని స్పష్టంచేసింది. శాస్త్రీయ విధానంతో ఆ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలని పేర్కొంది. భూమిని కోల్పోయిన వారికి భూసేకరణ చట్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలని తెలిపింది. ఆధునీకరణ పనులు పూర్తయ్యే వరకు చెన్నైలోని కేంద్ర అటవీ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి అర్ధవార్షిక నివేదికలు సమర్పించాలని షరతు విధించింది.

అనుమతుల్లోనూ రికార్డే రాష్ట్రంలో 37 లక్షలకుపైగా ఎకరాలకు గోదావరిజలాలతో జీవంపోసే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సాగునీటి రంగ చరిత్రలో శరవేగంగా పనులు జరుగుతున్న ప్రాజెక్టుగానే కాకుండా.. అంతే వేగంతో వివిధ రకాల అనుమతులను కూడా పొందడంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నది. గత నెలలోనే వరుసగా కేంద్ర జల సంఘం నుంచి అనుమతులను సాధించిన ఈ ప్రాజెక్టుకు తాజాగా అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతి కూడా వచ్చింది. దీంతో ప్రతిపక్షాలు, ఇతరత్రా ప్రాజెక్టును అడ్డుకునే శక్తులకు అడ్డకట్ట పడింది. పర్యావరణ ప్రభావిత అధ్యయానికి అనుమతినిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మార్చి 31వ తేదీన టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్)ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అనంతరం నీటిపారుదల శాఖ అత్యంత వేగంగా చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణంవల్ల దాని పరిధిలో పర్యావరణంపై ప్రభావం ఎలా ఉంటుంది? ప్రయోజనాలేంటి? ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే వాటి నిర్మూలనకు ఎలాంటి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారనే వివరాలను పై అధ్యయనం చేసి నివేదిక రూపొందించే బాధ్యతను జాతీయ పర్యావరణ, పరిరక్షణ, శిక్షణ పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ)కు అప్పగించింది. ఈపీటీఆర్‌ఐ అందించిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ నెల ఐదున డాక్టర్ శరద్‌కుమార్‌జైన్ అధ్యక్షతన ఆయన సహా పదకొండు మందితో నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) పదో సమావేశం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ ప్రభావిత అధ్యయన నివేదికను ఈ సందర్భంగా కమిటీ పరిశీలించింది. పలు సందేహాలు వ్యక్తంచేయగా.. సంబంధిత ప్రాజెక్టు అధికారులు, ఈపీటీఆర్‌ఐ ప్రతినిధులు వాటిని నివృత్తి చేశారు.

ఎన్జీటీపై హైకోర్టుకు… ఢిల్లీ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఉన్న కేసు అంశాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. ఒక వ్యక్తి ఎన్జీటీని ఆశ్రయించగా… ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో గత నెల ఎనిమిదో తేదీన కోర్టు పలు సూచనలు చేస్తూ పనులకు అనుమతినిచ్చింది. తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాలని, కేంద్రం నుంచి అటవీ అనుమతులు వచ్చేవరకు అటవీ భూముల్లో పనులు చేపట్టవద్దని, పర్యావరణ అనుమతి వచ్చేవరకు సాగునీటి రంగానికి సంబంధించి డిస్ట్రిబ్యూటరీలు, కాల్వల నిర్మాణం చేపట్టవద్దని సూచించినట్లు పేర్కొన్నారు.

వచ్చే నెల మూడున ఎన్జీటీ విచారణ… ప్రాజెక్టు పనులకు సంబంధించి ట్రిబ్యునల్ స్టేను తొలిగిస్తూ అనుమతినిచ్చిన హైకోర్టు.. తిరిగి కేసును ట్రిబ్యునల్‌కు రిఫర్‌చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నెల ఆరో తేదీన విచారణ జరుగగా, తదుపరి విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదావేశారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రావడంతో ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ ఎన్జీటీ దృష్టికి తీసుకువెళ్లనుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రధానంగా పర్యావరణ, అటవీ అనుమతులకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని, ఎలాగూ ప్రాజెక్టుకు ఆ రెండు వచ్చిన దరిమిలా ఇక సమస్య ఏమీ ఉండదని రిటైర్డ్ ఇంజినీర్ ఒకరు స్పష్టంచేశారు.

మంత్రి పోచారం హర్షం కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు నిరంతర శ్రమతోనే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి సాధ్యమైందన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగం ముఖచిత్రం మార్చే ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రైతుల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు.

కమిటీ ముందు ఇచ్చిన ప్రజెంటేషన్‌లోని వివరాలు క్లుప్తంగా.. తెలంగాణలోని 13 జిల్లాల్లో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో ఏకంగా 37.08 లక్షల ఎకరాలకు జీవంపోసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు చేపడుతున్నాం. హైదరాబాద్ మహానగరంతోపాటు వేల గ్రామాలకు తాగునీరు అందించడమేకాకుండా పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టుద్వారా నీటి వసతి కలుగుతుంది. రూ.80,499.71 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తిచేయనున్నాం. ప్రాజెక్టు పరిధిలో మొత్తం 82 పంపులు ఏర్పాటుచేస్తున్నారు. ప్రాజెక్టుకు కావాల్సిన 4,227 మెగావాట్ల విద్యుత్‌ను టీఎస్ జెన్‌కో సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టుకు టీవోఆర్ క్లియరెన్స్‌ను 31.3.2017న జారీచేశారు. తెలంగాణ పరిధిలో 15 జిల్లాల్లో 22.8.2017 నుంచి 26.8.2017 వరకు, మహారాష్ట్ర పరిధిలోని ఒక జిల్లాలో 27.9.2017న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రధాన ప్రాజెక్టుకు పది కిలోమీటర్ల పరిధిలోని పరీవాహక, ముంపు ప్రాంతాలతోపాటు ప్రభావిత ప్రాంతాల పరిధిలోని పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేశాం. భౌగోళిక, జీవావరణ, సామాజిక తదితరాలకు సంబంధించిన వివరాల్ని సమీకరించాం. ముఖ్యంగా 2016, సెప్టెంబర్ నుంచి 2017, అక్టోబర్‌వరకు మూడు సీజన్లలో గాలి, శబ్దం, జలం, నేల, పర్యావరణ కోణాల్లో అధ్యయనం చేశాం. పలు చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రూపొందించాం.

-ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం 36,35,437 హెక్టార్లు. దీనిలో 3,28,308 హెక్టార్ల పరిధిలో సబ్ వాటర్‌షెడ్ ప్రాజెక్టు చేపట్టనున్నాం. ఇందుకు రూ.362.04 కోట్లు కేటాయించాం. -ప్రాజెక్టువల్ల 1,480 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలు (నిర్మాణానికి సంబంధించిన) ఉత్పత్తి అవుతాయి. దీనిని ముఖ్యంగా కాల్వలకు ఇరువైపులా, సొరంగ నిర్మాణాల ప్రవేశ, వెలుపలికి వచ్చే ప్రాంతాల్లో వినియోగిస్తాం. మిగిలినది డంపింగ్ యార్డులకు తరలించి.. అన్ని రకాల ప్రమాణాలతో కప్పి, వాటిపై పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇందుకు రూ.32.79 కోట్లు కేటాయించాం. -ప్రాజెక్టుకోసం వినియోగించిన అటవీ భూముల విస్తీర్ణానికి రెట్టింపు విస్తీర్ణంలో అంటే 5,333.817 హెక్టార్లలో ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకాన్ని చేపట్టనున్నాం. ఇందుకు 22 రకాల మొక్కలను ఎంపిక చేశాం. 51,44,393 లక్షల మొక్కలను నాటనున్నాం. -అటవీశాఖతో కలిసి వన్యప్రాణి నిర్వహణ, అటవీ, వన్యప్రాణి పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నాం. జీవ వైవిధ్య కార్యక్రమానికి రూ.3.36 కోట్లు కేటాయించాం. -రూ.19.21 కోట్లతో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధిచేస్తాం. ప్రాజెక్టు పరిధిలోని 15 జిల్లాల్లో రూ.484 కోట్లతో మత్స్య సంపద అభివృద్ధి అవుతుంది..

పర్యావరణ పరిరక్షణకు చర్యలివి ప్రాజెక్టు పరిధిలో పర్యావరణానికి విఘాతం కలుగకుండా ఏయే అంశాల్లో ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు? అందుకు ఎంత వ్యయాన్ని కేటాయించారనే అంశాలను కూడా నివేదికలో పొందుపరిచారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.