
-ఎక్కువ ఆయకట్టుకు నీరందేలా కార్యాచరణ -రైతులకు సాగునీరు ఇచ్చేందుకే ఇదంతా చేస్తున్నాం -కాళేశ్వరం పనుల పురోగతిపై సమీక్షలో సీఎం కేసీఆర్
సాగునీటి ప్రాజెక్టు కాల్వలద్వారా వచ్చే నీరు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ చెరువులకు మళ్లాలని, దీనికోసం కావాల్సిన కాల్వలను సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని చెరువులు, కుంటలతోపాటు కాల్వలు, వాగులు, వంకలపై పెద్దఎత్తున నిర్మించిన చెక్‌డ్యాంలలో కూడా నీరు నిల్వ ఉండాలని, తెలంగాణ భూభాగమంతా నీటితో కళకళలాడాలని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులవారీగా సాగునీటి సమర్థ వినియోగానికి సంబంధించి వర్క్‌షాప్ నిర్వహించుకొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణాలపైనా సీఎం సమీక్షించారు. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న కాల్వల పనుల పురోగతిపై ఆరాతీశారు. అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల పనులు, కాల్వలు, టన్నెల్ పనులపై కూలంకషంగా సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణం ఈ ఎండాకాలంలో పూర్తవుతున్నందున గోదావరి నీటిని ఎత్తిపోసి చెరువులు నింపాలని సీఎం ఆదేశించారు. ఈ వర్షాకాలంలో చెరువులన్నీ నింపాలని, దీని కోసం కాల్వలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి, పనులు చేపట్టాలన్నారు.
ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడంతోనే నీటిపారుదలశాఖ బాధ్యత పూర్తికాదని, ఆ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ప్రణాళిక సిద్ధంచేసుకోవాలన్నారు. భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా తెలంగాణలోని భూములకు సాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టింది. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నది. కేంద్ర జలసంఘం ఆమోదం పొందింది. అటవీశాఖతోపాటు అనేక శాఖల అనుమతులు తీసుకున్నది. క్రాసింగ్ సమస్యలను అధిగమించింది. భూసేకరణ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తయింది. పెద్ద ఎత్తున వ్యయంచేస్తున్నది. బడ్జెట్ నిధులే కాకుండా ఇతర ఆర్థికసంస్థల నుంచి కూడా నిధులు సేకరించింది. ఇంత చేసిందీ.. తెలంగాణ రైతులకు సాగునీరు ఇచ్చేందుకే. అందుకే అధికారులు ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మొదటిదశలో చెరువులు నింపాలి అని సీఎం చెప్పారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు అవసరమైన బరాజ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు తదితర వ్యవస్థ సిద్ధంగా ఉన్నదని, కానీ కాళేశ్వరంతోపాటు ఇతర కొత్త ప్రాజెక్టులకు అవసరమైన వ్యవస్థలను అంతా కొత్తగా రూపొందించుకోవాల్సి ఉంటుందని అన్నారు. కొత్త వ్యవస్థలకు రూపకల్పన చేసే క్రమంలో జాగ్రత్తగా, వ్యూహ్మాతకంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రణాళిక ఉండాలన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరిరాం, ఎస్ఈలు కేఎన్ ఆనంద్, టీ వేణు, శ్రీనివాస్, ఈఈలు సీహెచ్ బుచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డి, బద్రినారాయణ, సత్యవర్ధన్, అశోక్, పోచమల్లు, కనకేశ్, హైదర్‌ఖాన్ పాల్గొన్నారు.