Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కలిసి నడుద్దాం

-జల సంకల్పం
-మాకు భేషజాలు.. ఇగోలు లేవు.. వివాదాలకు ఇక చరమగీతం
-ఇరు రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, జగన్ ప్రకటన
-సుహృద్భావ వాతావరణంలో చర్చలు
-జూలై 15 తర్వాత ఏపీలో ఇద్దరు సీఎంల భేటీ
-తెలుగు రాష్ర్టాల్లోని ప్రతి మూలకు సాగునీరు
-గోదావరి నీళ్లు కృష్ణకు తరలించే ప్రతిపాదన
-జూలై 15కల్లా వ్యూహం ఖరారుచేయాలి
-అధికారులు, నిపుణులు, ఇంజినీర్లతో కమిటీ
-ఉభయరాష్ర్టాల ముఖ్యమంత్రుల ఆదేశం
-సమర్థ సాగునీటి వినియోగంపై కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
-రెండురాష్ర్టాల సంబంధాల్లో గుణాత్మక మార్పు
-స్వచ్ఛమైన హృదయంతో వైఎస్ జగన్
-కత్తులు దూసేది లేదు.. చేతులు కలుపాలి
-సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
-సమస్యల పరిష్కారంలో కేసీఆర్ సహకారం గొప్పది
-తెలంగాణ, ఏపీ రెండూ ఒకటేనన్న భావనను ప్రజల్లోకి తీసుకువెళదాం
-ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

అందుబాటులో ఉన్న నీటివనరులను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించి రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రతి మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. రెండు తెలుగు రాష్ర్టాలు పచ్చగా కళకళలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటికొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. నదీజలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను గతం గతః అన్న రీతిలో మర్చిపోయి, మంచి మనసుతో రెండు రాష్ర్టాలకు ఎంత వీలయితే అంత మేలుచేసే విషయంలో రెండు ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ప్రకటించారు. రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించునే దిశగా అడుగువేయాలన్న నిర్ణయంమేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతిభవన్‌లో జరిగింది. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది.

ఈ సమావేశంలో కేసీఆర్, జగన్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ర్టాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. ఉభయరాష్ర్టాల ప్రయోజనాల కోసం రెండు ప్రభుత్వాలు పనిచేస్తాయని ప్రతినబూనారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ఎదుర్కొంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసంచేస్తూ ఏపీ సీఎం జగన్‌కు, ఏపీ అధికారుల బృందానికి స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ర్టాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. తెలుగు రాష్ర్టాలు కలిసి నడిస్తేనే ప్రగతి సాధ్యమని చెప్పారు.

గోదావరి, కృష్ణానదుల్లో కలిపి నాలుగువేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని, ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ర్టాలను సుభిక్షం చేయవచ్చునని కేసీఆర్ అన్నారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున గోదావరి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు వ్యూహం ఖరారుచేయాలని అధికారులను ఉభయ సీఎంలు ఆదేశించారు. జూలై 15లోగా ఇరు రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్లు, నీటిపారుదల నిపుణులు ఒక కమిటీగా ఏర్పడి, అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని సూచించారు. సమావేశం వివరాలను అనంతరం తెలంగాణ, ఏపీ మంత్రులు ఈటల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన శుక్రవారాన్ని చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. ప్రధానంగా నదీజలాల అంశంపైనే చర్చించినట్టు తెలిపారు.

వివాదాలతో మరో తరానికి కూడా నీళ్లివ్వలేం : సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కరలేదు. వివాదాలే కావాలనుకుంటే మరోతరానికి కూడా మనం నీళ్ళివ్వలేం. కేసీఆర్, జగన్ వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజలకోణం నుంచే ఆలోచిస్తరు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలుచేయడమే మా బాధ్యత. రెండు రాష్ర్టాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ, ఏపీల సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మకమార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో, పరిస్థితిని సంపూర్ణంగా అర్థంచేసుకుంటూ, రెండు రాష్ర్టాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకుపోవాలని నిర్ణయించుకున్నాం. ఏపీ సీఎం జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనటం మంచి సంకేతం ఇచ్చింది. మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవటం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగాం. అదేవిధంగా రెండు రాష్ర్టాల మధ్య మంచి సంబంధాలుంటే, అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు ఎంత వీలైతే అంత మేలుచేయడమే మా లక్ష్యం అని చెప్పారు.

సహజ సరిహద్దు రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత జరిగిన తొలి సమావేశం గొప్ప ప్రారంభమని సీఎం కేసీఆర్ అన్నారు. విభజన సమస్యలను సామరస్యపూర్వకంగా, సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండు రాష్ర్టాల మధ్య ఖడ్గచాలనం అవసరం లేదని, కరచాలనం కావాలన్నారు. కత్తులు దూసేదిలేదని, చేతులు కలుపాలని చెప్పారు. ఇరుగుపొరుగు రాష్ర్టాలతో ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరించాలనేది తమ విధానమని, అదే విధానంతో మహారాష్ట్రతో వ్యవహరించి ఫలితం సాధించామని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి, ప్రజలకు ఫలితాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులకు సూచించారు.

సులభమార్గంలో సాగునీటి కష్టాలు తీర్చాలి: ఏపీ సీఎం జగన్
తక్కువఖర్చుతో రెండు రాష్ర్టాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ఉత్తమమైన, సులభమైన మార్గం ద్వారా సాగునీటి కష్టాలు తీర్చాలి. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువవుతున్నది. రాబోయేకాలంలో ఇంకా తగ్గవచ్చు. అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, పాలమూరు, నల్లగొండ ప్రాం తాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి అన్నారు.

కేసీఆర్ సహకారం గొప్పది
రెండురాష్ర్టాల మధ్య సమస్యల పరిష్కారంలో, నీటిపారుదలరంగం విషయంలో కేసీఆర్ అందిస్తున్న సహకారం చాలా గొప్పదని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలంగాణ, ఏపీ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, ఇద్దరం ఒకటేననే భావన కలిగి ఉండాలని, అదే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరయ్యే విషయంలో అనేకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, కానీ రెండు రాష్ర్టాలు కలిసి నదీజలాలను ఉమ్మడి సాగునీటి అవసరాలు తీర్చే విధంగా మలుచుకుంటే ఎంతో ఉత్తమమని భావించానని వివరించారు. రెండురాష్ర్టాల మధ్య సమస్యలను ఎవరో పరిష్కరించడం కంటే, ఈ రెండు రాష్ర్టాలే పరిష్కరించుకోవాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. రెండు రాష్ర్టాలు వేసిన అడుగు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

నీటి లభ్యతపై కేసీఆర్ ప్రజెంటేషన్
సమావేశం సందర్భంగా నదుల్లో నీటి లభ్యతపై సీఎం కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటకలు గోదావరి, కృష్ణ, వాటి ఉపనదులపై లెక్కలేనన్ని బరాజ్‌లతో కిందికి నీరురాని పరిస్థితిని వివరించారు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏ పాయింట్‌వద్ద ఎంత నీటిలభ్యత ఉన్నదో వివరించారు. గోదావరి, కృష్ణానదుల నీళ్లను సమర్థంగా వినియోగించుకోవడాకి ఉన్న మార్గాలను గూగుల్ మ్యాపుల సహకారంతో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి నాలుగువేల టీఎంసీల నీటిలభ్యత ఉన్నది. ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండురాష్ర్టాలను సుభిక్షం చేయవచ్చు. ఎన్ని నీళ్లను ఉపయోగించుకుంటామన్నది మన సమర్థత మీద ఆధారపడి ఉంది. ఏటా దాదాపు మూడువేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి.

నీళ్లకోసం ట్రిబ్యునళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, మరొకరి చుట్టూ తిరుగటంవల్ల ఏ ప్రయోజనమూ లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుని, కలిసి నడిస్తే చాలు. రెండునదుల్లో ఉన్న నీటిని రెండురాష్ర్టాల ప్రజలకు వినియోగించే విషయంలో ఏకాభిప్రాయం ఉంటే చాలు. కేంద్ర ప్రభు త్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన తెస్తున్నది. మన నదుల నీళ్లు మన అవసరాలు తీర్చాక కేంద్రం ప్రతిపాదనపై మనం నిర్ణయం తీసుకోవచ్చు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నుంచి శ్రీశైలం, సాగర్‌కు నీటిని తరలించాలి. దీనివల్ల రాయలసీమ, పాలమూరు, నల్లగొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నీటి గోస తీరుతుంది. పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకుపోవాలి. వంశధార, నాగావళి నీళ్లను కూడా సముద్రంపాలు కాకుండా సమర్థంగా వినియోగిస్తే తమకు నీళ్లు రావడం లేదని, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఉత్తరాంధ్రవాసుల బాధ కూడా తీరుతుంది అని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు.

సామరస్యంగా సమస్యల పరిష్కారం
విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలన్నింటినీ సామరస్యంగా, చర్చలతో పరిష్కరించుకోవాలని ఈ సమావేశంలో రెండు రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల ఆధ్వర్యంలో చర్చలు శనివారం కూడా కొనసాగుతాయి. సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ర్టాల సీఎస్‌లను ఇద్దరు సీఎంలు ఆదేశించారు. ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన తదితర అంశాలపై చర్చిస్తారు. గోదావరి నీటిని తరలించే విషయంలో ప్రాతిపదికలు రూపొందించే బాధ్యతను రెండు రాష్ర్టాల అధికారులు సంయుక్తంగా స్వీకరిస్తారు. రెండు రాష్ర్టాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు, ఈఎన్సీల ఆధ్వర్యంలో ఈ పని జరుగుతుంది. జూలై 15లోగా అధికారులు సీఎంలకు నివేదిక ఇస్తారు. ఆ తర్వాత ఇద్దరు సీఎంలు ఆంధ్రప్రదేశ్‌లో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు.

జగన్ బృందానికి ఘనస్వాగతం
ఉదయం 11.15 గంటలకు జగన్ తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో కలిసి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో కలిసి జగన్ బృందానికి ఘనస్వాగతం పలికి తెలంగాణ అధికారులను పరిచయం చేశారు. జగన్‌ను తన చాంబర్‌కు తీసుకెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. 11.30 గంటలకు ఇద్దరు సమావేశమందిరానికి చేరుకున్నారు. రెండు రాష్ర్టాల బృందాలు కలిసి భోజనంచేశాయి. సమావేశంలో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బీ రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, సీనియర్ అధికారులు ఎల్ ప్రేమచంద్రారెడ్డి, కే ధనుంజయరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్సీ ఎం వెంకటేశ్వర్‌రావు, ఏపీ నీటిపారుదల నిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లు, తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, జెన్‌కో ట్రాన్స్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.