Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కలిసి నడుద్దాం

-కేంద్రం కర్రపెత్తనంతో రాష్ర్టాలకు అన్యాయం
-గుణాత్మక మార్పే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్
-ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మరోమాట లేదు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
-ఫెడరల్ ఫ్రంట్‌లో చేరికపై వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ
-సీఎం కేసీఆర్ త్వరలో ఏపీకి వెళ్లి మరోసారి చర్చిస్తారని వెల్లడి
-ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
-హక్కుల కోసం రాష్ర్టాలు ఒకే వేదిక మీదకు రావాలి
-వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి

ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా జాతీయ రాజకీయాలు ఉండాలని, కానీ కేంద్ర ప్రభుత్వం అధికారాలను తనవద్ద పెట్టుకొని రాష్ర్టాలను ఇబ్బంది పెడుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో గుణాత్మక మార్పే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని, సమాఖ్య స్ఫూర్తితో ఏడాదికాలంగా పలు రాష్ర్టాల్లో పర్యటించి వివిధ రాజకీయ పక్షాలతో సమావేశమై చర్చించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో సమావేశమై ఫ్రంట్‌లో చేరికపై చర్చించామన్నారు. ఇవి ప్రాథమిక చర్చలేనని, త్వరలో సీఎం కేసీఆర్ ఏపీకి వెళ్లి వైఎస్ జగన్‌తో సమావేశం అవుతారని వెల్లడించారు. భావసారూప్యం ఉన్న నేతలంతా తమతో కలిసి వస్తారనే నమ్మకం ఉన్నదన్నారు.

టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ర్టాల హక్కులను కాపాడటానికి, ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి రావడం ఎంతో అవసరమన్నారు. తమ రాష్ట్ర ఎంపీలకు తెలంగాణ ఎంపీలు తోడైతే సంఖ్య పెరుగుతుందని, ప్రత్యేక హోదా డిమాండ్‌కు బలం పెరుగుతుందని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై మరింత విస్తృతంగా చర్చిస్తామన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసే అంశంపై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చర్చలు జరుపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, ఇతర నాయకులకు సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించింది.

ఈ సమావేశం గంటకుపైగా సాగింది. అనంతరం కేటీఆర్, జగన్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం అధికారాలను తన వద్ద పెట్టుకొని, రాష్ర్టాలపై నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తున్నదని విమర్శించారు. ఈ వైఖరి మారాలని, దేశంలో గుణాత్మక మార్పు రావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సమాఖ్య స్పూర్తితో జాతీయస్థాయిలో ప్రత్యమ్నాయ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడు ప్రతిపక్షనేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి తదితరులను సంప్రదించారని, తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారని గుర్తుచేశారు.

ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ మంగళవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఫోన్‌చేసి ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన, ప్రయత్నం గురించి వివరించారన్నారు. తమ పార్టీ ప్రతినిధి బృందం కలుస్తుందని చెప్పగా, బుధవారం రమ్మని జగన్ ఆహ్వానించారని తెలిపారు. ఈ మేరకు వచ్చి వైసీపీ బృందంతో ఫ్రంట్ లక్ష్యాలు, ఉద్దేశాలు చర్చించామన్నారు. తమ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా జాతీయ రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ ఉండాలనే ఆలోచన ఉన్న వారందరూ తమతో కలుస్తారనే నమ్మకం తమకు ఉన్నదన్నారు. వైసీపీతో ప్రస్తుతం జరిగినవి ప్రాథమిక చర్చలేనన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇతర రాష్ర్టాలకు వెళ్లి ముఖ్యమంత్రులు, ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులతో సంప్రదించినట్టే.. త్వరలో స్వయంగా ఏపీకి వెళ్లి వైఎస్ జగన్‌తో కూర్చొని మిగిలిన అన్ని విషయాల గురించి మాట్లాడుతారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్‌ఎస్ వైఖరిని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌సహా రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, లోక్‌సభలో ఎంపీ కవిత, ఇతర నాయకులు పలు వేదికల మీద స్పష్టంగా చెప్పామన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేంద్రాన్ని కోరామని గుర్తుచేశారు. ఈ విషయంలో రెండో అభిప్రాయంగానీ, రెండో ఆలోచన కానీ లేదన్నారు.

రాష్ర్టాలన్నీ ఏకం కావాలి: వైఎస్ జగన్
రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపడంతోపాటు అన్ని రాష్ర్టాలను ఏకంచేసి భవిష్యత్తులో మళ్లీ అన్యాయం జరుగకుండా చూసే వేదికను సిద్ధం చేయడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం హర్షణీయమన్నారు. కేసీఆర్ ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్ స్వాగతించదగ్గ విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకే దిక్కు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలంటే.. సంఖ్యాపరంగా చూసినప్పుడు ఒక్కో రాష్ట్రం పరిధిలోని ఎంపీలు సరిపోరని, కాబట్టి అన్ని రాష్ర్టాలు కలువాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలతో డిమాండ్ చేస్తే పట్టించుకోవడం లేదని, తమకు 17 మంది తెలంగాణ ఎంపీలు తోడై 42 మంది ఎంపీలు ప్రశ్నించగలిగితే ఏపీకి మేలు జరుగుతుందన్నారు.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని 42 మంది చెప్పగలిగితే పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. రాష్ర్టాల హక్కులు కాపాడాలంటే ఎంపీల సంఖ్యాబలం పెరుగాలన్నారు. అన్నీ ఒక్కతాటిపైకి వస్తే కేంద్ర ప్రభుత్వాలు రాష్ర్టాలకు అన్యాయం చేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫ్రంట్‌తో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసివచ్చి ఎంపీల పరంగా సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేటీఆర్ వచ్చి ఇదే విషయాన్ని తమకు తెలిపారన్నారు. కేసీఆర్ తనతో ఫోన్‌లో మాట్లాడారని, ఈ విషయంపై ఆయన త్వరలో స్వయంగా ఏపీకి వస్తారన్నారు. ప్రస్తుతం జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని, కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంకా చర్చలు జరుగుతాయని స్పష్టంచేశారు. కేటీఆర్ వెంట టీఆర్‌ఎస్ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, జోగినిపల్లి సంతోష్‌కుమార్, మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి ఉన్నారు. వైసీపీ ప్రతినిధి బృందంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథి తదితరులు ఉన్నారు.

కేటీఆర్‌కు ఘన స్వాగతం
ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించేందుకు వెళ్లిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు లోటస్‌పాండ్‌లో వైసీపీ ప్రతినిధి బృందం ఘనస్వాగతం పలికింది. ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి పార్థసారధి తదితర నేతలు వారికి పలికి లోపలికి తీసుకెళ్లారు. చర్చల అనంతరం రెండు పార్టీల నాయకులు కలిసి భోజనం చేశారు.

జగన్ ఇంటిముందు ఏపీ ఇంటెలిజెన్స్ నిఘా!
తెలంగాణ రాష్ట్రంలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలపై అమితాసక్తి ప్రదర్శించే ఏపీ ప్రభుత్వ పెద్దలు వైసీపీ, టీఆర్‌ఎస్ పార్టీల నాయకుల సమావేశంపైనా ఆరాలు తీసినట్టు తెలిసింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. రెండు పార్టీల నేతలు ఏయే విషయాలపై చర్చించారో తెలుసుకొనేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు జగన్ ఇంటిదగ్గర హడావుడి చేసినట్టు సమాచారం. జగన్ ఇంటికి ఎవరెవరు వచ్చారు? ఎంతసేపు భేటీ కొనసాగింది? ఏయే విషయాలు ప్రస్తావనకు వచ్చాయి? వంటి విషయాలను తెలుసుకునేందుకే వారు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు, ఇతర ప్రభుత్వ పెద్దలకు చేరవేసినట్టు సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.