-రానున్న పది రోజులు అత్యంత కీలకం.. -గడప గడపకూ ప్రచారం చేయాలి -ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి -గ్రామీణ నేతల సేవలను ఉపయోగించుకోవాలి -ప్రజల్లో స్పందన బాగున్నది -అయినా ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు -టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపు -మున్సిపల్ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో సమీక్ష

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రానున్న పదిరోజులు మరింత కష్టపడి పనిచేయాలని, మున్సిపల్ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు.
టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచినవారితో నామినేషన్లను ఉపసంహరించుకొనేలా ప్రయత్నించాలని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు నియోజకవర్గాలవారీగా ఆయా నేతలతో విడివిడిగా సమావేశమై.. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. నామినేషన్ల దాఖలు అనంతర రాజకీయ పరిస్థితులపై సమీక్ష జరిపారు. క్షేత్రస్థాయిలో ప్రచారవ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు.
నామినేషన్లు వేయ డం పూర్తయినందున, ఇక ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇటీవలి సమావేశంలో చేసిన మార్గనిర్దేశనం మేరకు పనిచేయాలని సూచించారు. బీ ఫారాలను అందజేయడంలో జాగ్రత్త వహించాలని స్పష్టంచేశారు. పార్టీ రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నవారితో చర్చలు జరిపి వారికి నచ్చజెప్పాలని నాయకులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం గత ఆరేండ్లలో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను.. భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు విస్తారంగా తెలియజేయాలని పేర్కొన్నారు.
వార్డుల్లోని ప్రతి ఇంటికీ పార్టీ అభ్యర్థులు వెళ్లి ప్రచారం చేసేలా కార్యాచరణ ఉండాలని తెలిపారు. పార్టీ ప్రచార సామగ్రి చేరవేత వంటి అంశాలపై పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయంచేసుకోవాలని సూచించారు. పురపాలికలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోని పార్టీ నాయకుల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పార్టీపరంగా ఇంచార్జీలు ఎన్నికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్టీ ఇంచార్జీలు లేని పురపాలికల్లో పార్టీకి చెందిన ఇతర నాయకులు సేవలు అందిస్తారని చెప్పారు.

ప్రజల్లో స్పందన బాగున్నది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని, పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక మున్సిపాలిటీలు ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డితో పీర్జాదిగూడ, బోడుప్పల్ సహా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితిని.. అభ్యర్థుల విజయావకాశాలను ఆరా తీశారు. పీర్జాదిగూడతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమని కేటీఆర్‌కు మల్లారెడ్డి చెప్పారు..
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డితో తాండూరు మున్సిపాలిటీపై చర్చించారు. మంత్రి నిరంజన్‌రెడ్డితో వనపర్తిసహా ఇతర మున్సిపాలిటీలపై మాట్లాడారు. ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, జీ రంజిత్‌రెడ్డి, మాలోత్ కవితతో వారివారి నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై చర్చించారు. నిజామాబాద్ కార్పొరేషన్‌కు సంబంధించి ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్ని వివరాలు అందజేశారు. జగిత్యాల మున్సిపాలిటీపై ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌తో, చొప్పదండి మున్సిపాలిటీపై సుంకె రవిశంకర్‌తో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
కేటీఆర్‌తో భేటీ అయినవారిలో విప్‌లు గంప గోవర్ధన్, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, చిరుమర్తి లింగయ్య, సోలిపేట రామచంద్రారెడ్డి, నోముల నర్సింహయ్య, జైపాల్ యాదవ్, రెడ్యానాయక్, గాదరి కిశోర్, శంకర్‌నాయక్, బొల్లం మల్లయ్యయాదవ్, దివాకర్‌రావు, సుధీర్‌రెడ్డి, రవీంద్రకుమార్, అబ్రహం, క్రాంతి కిరణ్, విఠల్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, బేతి సుభాష్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కే నవీన్‌కుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

టీఆర్ఎస్దే విజయం: మంత్రి మల్లారెడ్డి కేటీఆర్‌ను కలిసిన అనంతరం మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అన్నింటిలోనూ టీఆర్ఎస్దే విజయమని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదని, ప్రతిపక్షాలు అడ్రస్‌లేకుండా పోయాయన్నారు. మేడ్చల్ నియోజకవర్గ నాయకుడు దయాకర్‌రెడ్డి మంచి మిత్రుడని, ఆయనకు కాంగ్రెస్ లీడర్లు బలవంతంగా వాళ్ల పార్టీ కండువా కప్పారని చెప్పారు. తాను ఆయన ఇంటికి వెళ్లేసరికి ఏడుస్తూ కూర్చున్నారని చెప్పారు. దయాకర్‌రెడ్డిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, టీఆర్ఎస్లోనే ఉన్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంచేశారు.
బాధపడకండి: మంత్రి తలసాని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్లోనే పోటీ పెరిగిందని, అవకాశం దక్కనివారు కూడా నామినేషన్లు వేశారన్నారు. వారందరినీ బుజ్జిగిస్తున్నామని, ఎందుకు టికెట్టు ఇవ్వలేకపోయామో వివరిస్తున్నామని చెప్పారు. గెలిచే పార్టీ కావడంతో అశావహుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. ఇప్పుడు టికెట్టు రాకపోయినా అనేక పదవులు ఉన్నాయని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.
మా నాయకుడు కేసీఆరే: మాజీ మంత్రి జూపల్లి తమ నాయకుడు ఎప్పుడూ సీఎం కేసీఆరేనని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పునరావృతం కాబోతున్నాయని చెప్పారు. చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజమని, తాను పదవులు కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. రెబల్స్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎక్కడో ఏదో జరిగితే తనకు అంటగట్టడం సరికాదన్నారు. రెబల్స్ అనేది ఇప్పుడు కొత్త కాదని, గతంలోనూ వాళ్లు ఉన్నారని చెప్పారు. కుటుంబం అన్న చోట చిన్నచిన్న తగాదాలు ఉంటాయని పేర్కొన్నారు.
రానున్న పదిరోజులు మరింత కష్టపడి పనిచేయాలి, మున్సిపల్ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారంచేయాలి. – టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు