-ప్రజలకు నాణ్యమైన సరుకులు అందాలె -ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతమైతేనే ఇది సాధ్యం -అందుకే పీడీఎస్, మహిళాసంఘాల సమన్వయం -డీలర్ల కమీషన్ పెంచాలి.. ఖాళీలుంటే భర్తీచేయాలి -కల్తీ నివారణపై త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం -యాసంగినాటికి సమన్వయసమితులకు కొత్త అధ్యక్షులు -అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్

బజార్లలో ఏది కొందామన్నా కల్తీనే. మిర్చిపొడిలో రంపంపొడి.. పసుపు కొందామంటే కల్తీ. ఇట్ల కాకుండా గ్రామాల్లోనే స్వచ్ఛమైన సరుకులు ప్రజలకు అందాలంటే, హైదరాబాద్‌లోగానీ, ఇతర పట్టణాల్లోగానీ స్వచ్ఛమైన కూరగాయలు అందుబాటులో ఉండాలంటే ఒక కొత్త విధానానికి రూపకల్పన చేయాలె. దానికి ఒక వేదిక ఏర్పాటుకావాలె అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. దీనికోసం డీలర్ల వ్యవస్థను పటిష్ఠపర్చుకోవటంతోపాటు డీలర్ల పోస్టులు ఖాళీ ఉంటే వాటిని రాబోయే రెండుమూడు నెలల్లో భర్తీచేస్తామన్నారు. వాళ్లకుకూడా కొంత కడుపు నిండేటట్టు కమీషన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతమైతేనే కల్తీని నివారించవచ్చని, తద్వారా ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కల్తీ నివారణకు పీడీఎస్, మహిళాసంఘాలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉన్నదని పునరుద్ఘాటించారు. విజయ డెయిరీకి మంచి పాపులారిటీ ఉండేదని ముఖ్యమంత్రి చెప్పారు. బొంబాయి మార్కెట్లో విజయ నెయ్యికి డిమాండ్ ఉంటుందని, అటువంటి డెయిరీని కొందరు దుర్మార్గులు చెడగొట్టారని అన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలన్న దూరదృష్టితోనే రైతు సమన్వయ సమితులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. యాసంగినాటికి సమన్వయ సమితులకు కొత్త అధ్యక్షులను నియమిస్తామని తెలిపారు. బడ్జెట్ పద్దులపై బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
పీడీఎస్ బలోపేతంతో నాణ్యమైన సరుకులు కొందరు దుర్మార్గులు పసిపిల్లలు తాగే పాలుకూడా కల్తీ చేస్తున్నరు. దీనిమీద వాళ్లు ఏం సంపాదిస్తరో? ఆ డబ్బును ఏం చేసుకుంటరోగానీ చిన్నపిల్లలు తాగే పాలు కూడా కల్తీచేసి సింథటిక్ మిల్క్ తయారుచేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ పరిస్థితి పోవాలంటే పీడీఎస్ బలోపేతంకావాలి. పీడీఎస్ ఎంత బలోపేతమైతే అంత నాణ్యమైన సరుకులు ప్రజలకు అందుతయి. వ్యవసాయ ఉత్పత్తులు, పీడీఎస్ వ్యవస్థను సమన్వయంచేస్తం. రాష్ట్రంలో చాలా బలోపేతమైన, ఆరోగ్యవంతంగా పనిచేస్తున్న మహిళాసంఘాలున్నాయి. ఐకేపీ పిల్లలు కూడా చాలా యాక్టివ్ అయి, శిక్షణ పొంది ఉన్నరు. వారి సేవలు కూడా వినియోగించుకుంటామని ఎన్నికలప్పుడు ప్రజలకు చెప్పినం. ఒక్క బియ్యం మాత్రమే కాకుండా, ఇతర సరుకులు కల్తీలేకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అందేలా ఏంచేస్తే బాగుంటుందో చర్చ జరుగాల్సిందే.
త్వరలోనే ఎమ్మెల్యేలతో మీటింగ్ పీడీఎస్‌లో లోపాలు.. కొన్ని బియ్యం పట్టివేత.. అనే వార్తలు చూస్తే అప్పుడప్పుడు బాధ కలుగుతది. అదికూడా పూర్తిస్థాయిలో పోతే రేషన్ డీలర్లకు కూడా కమీషన్లు పెంచి, వారికి కూడా ఇబ్బంది లేకుండా చేసినట్టయితే ఒక పర్ఫెక్ట్ విధానం తీసుకురాగలుగతమేమో అనే ఆలోచన ప్రభుత్వంలో ఉన్నది. ఆ ప్రాసెస్‌లో ఇతర సరుకులు కూడా ప్రజలకు పకడ్బందీగా అందాలె. ఉన్న రేషన్షాపులనే వాడుకోవాల్నా? డీలర్ల కమీషన్ కొంత పెంచాల్నా? వారికి ఇంకొంత విస్తృతంగా పనిచేసే అవకాశం కల్పించాల్నా? వీటిపై అందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. త్వరలోనే ఎమ్మెల్యేల మీటింగ్ కూడా పెట్టుకుని దానిని కూడా విచారిస్తం. కొత్త రైతు సమన్వయ సమితులను యాక్టివేట్ చేస్తం.
అసలు పని ఇప్పుడు మొదలైతది మన దగ్గర వ్యవసాయ విస్తరణ జరిగింది. వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. కానీ ఉత్పాదకత అనుకున్నంత పెరుగలేదు. దానిని పెంచాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్‌లో ఆ దిశగా ముందుకు సాగేందుకు మంత్రి పనిచేస్తున్నరు. వ్యవసాయ ఉత్పత్తితోపాటు ఉత్పాదకత కూడా పెరుగుతది. కాబట్టి చాలా జాగ్రత్తపడాలి. మధ్యప్రదేశ్‌లో నేను స్వయంగా చూశాను. గత సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్ కూడా మనం చేసినట్టే ఇరిగేషన్ బాగుచేసినారు. ఇబ్బడిముబ్బడిగా పంటలు వచ్చాయి. వచ్చిన పంట అమ్మడంలో ఇబ్బంది ఏర్పడి కొన్నిచోట్ల మిస్మేనేజ్ వల్ల పోలీస్ ఫైరింగ్‌కు కూడా దారితీసింది. మండ్సర్ ఏరియాలో దురదృష్టవశాత్తూ కాల్పులు జరిగి కొంతమంది చనిపోయారు. అందుకే దూరదృష్టితోనే రైతు సమన్వయ సమితులకు శ్రీకారం చుట్టాం. ఎక్కడా పని మొదలుకాలేదని చాలామంది అనుకుంటున్నరు. అసలు పని ఇప్పుడు మొదలవుతుంది. శాసనసభ్యులందరికీ అవగాహన రావాలె. వారిద్వారా ప్రజలకు కూడా తెల్వాలె. అతి త్వరలోనే వ్యవసాయమంత్రి నాయకత్వంలో రైతు సమన్వయసమితులను పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేయాలి. అందులో పౌరసరఫరాలశాఖ మంత్రి కూడా భాగస్వామి కావాలి.
సమన్వయసమితి సభ్యులు సంపూర్ణపాత్ర వహించే దిశగా తీసుకెళ్లాలె. మనకు ప్రధానమైన పంటలు పత్తి, మొక్కజొన్న, వరి. ఇందులో వరిధాన్యం కొనుగోళ్లే మనకు సవాల్‌గా ఉంటది. మనది పెద్ద డొమెస్టిక్ మార్కెట్. రాష్ట్రంలో 90% బియ్యమే తింటం. అచ్చంగా రొట్టె తినేవాళ్లు తక్కువ ఉంటరు. కాబట్టి 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మనకే వినియోగం ఉంటది. ఇంకో 25 లక్షల మెట్రిక్ టన్నులు వస్తదని, గన్నీ బ్యాగులతో సిద్ధంగా ఉన్నామని వ్యవసాయశాఖ మంత్రి చెప్తున్నరు. కొన్ని ఇతరపంటల్లో పసుపు సమస్య ఉన్నది. మిర్చితో పెద్దగా సమస్యలేదు. అన్ని పంటలు ఒకేసారి మార్కెట్‌కు పోవటం, నియంత్రణ లేకపోవటంతో పని జరుగటం లేదు. అందువల్ల మనందరం యాక్టివ్ అయి, గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. నీళ్లు వచ్చిన తర్వాత డెఫినెట్‌గా ఉత్పత్తులు పెరుగతయి. రామప్ప నుంచి గణపురం వచ్చే కాల్వ ను కొద్దిగా తవ్వాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తున్నరు. ఎందుకంటే రెండుపంటలు సుభిక్షంగా పండుతయ్. అప్పుడు గ్యారెంటీగా అవుట్‌పుట్ ఎక్కువ వస్తది.
ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు తేవాలి ఇప్పటికీ డీలర్స్ పటిష్ఠంగానే ఉన్నరు. మన పీడీఎస్ సిస్టం కూడా బాగున్నది. కమిషనర్ అకున్ సబర్వాల్ చాలా కృషిచేస్తున్నరు. మిస్యూజ్ రోజురోజుకూ తగ్గుతున్నది. డీలర్ల వ్యవస్థను పటిష్ఠంచేయడంతోపాటు మహిళాసంఘాలను కూడా కొంత యాక్టివేట్చేసి, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకురావాలి. ఇందులో పౌరసరఫరాలశాఖ మంత్రికి ప్రధాన బాధ్యత ఉంటది. దీనికోసం సంబంధిత మంత్రి కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రతినిధులను తీసుకుని విదేశాలకు వెళ్లిరావాలి. ఐదారు దేశాలు తిరిగి మన అవసరాలకు తగ్గట్టు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కడ ఉన్నయో పరిశీలించాలి. డీలర్ల వ్యవస్థను, ఎక్కడిక్కడే మహిళా సంఘాల ద్వారా తయారీ సంస్థలను ఏవిధంగా అనుసంధానం చేయాలనే విషయంపై విశేషమైన కృషిచేయాల్సిన అవసరం ఉంటది. మరో 15 రోజుల్లో వర్షాలు తగ్గుతాయంటున్నరు. కృష్ణానదిలో ఇంకొక్కసారి వరదలు వస్తయని చెప్తున్నరు. వర్షాలు ఒక్కసారి తగ్గితే, వ్యవసాయ పనులు నెమ్మదించి రెండో క్రాప్‌కు వచ్చే గ్యాప్‌లో రైతు సమన్వయ సమితులకు కొత్త అధ్యక్షులను నియమించాలి.