-కార్యకలాపాలు ప్రారంభించని -పరిశ్రమల భూములు వాపస్ -వెంటనే నోటీసులు జారీచేయండి -పరిశ్రమల సమాచారంతో బ్లూబుక్ -అధికారులకు కేటీఆర్ ఆదేశాలు -అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు.. -టీ ఫైబర్‌లో కేటీఆర్ సమీక్ష

ఫార్మాసిటీ కాలుష్యరహితంగా ఉండాలని, అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లుచేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఫార్మాసిటీపై సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకు ముందుకువెళ్లాలని అధికారులకు సూచించారు. ఫార్మాసిటీలో కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్మాణం, కంపెనీల నుంచి వస్తున్న స్పందన తదితర అంశాలపై మంగళవారం టీ ఫైబర్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సమీక్ష నిర్వహించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫార్మాసిటీకి మంచి స్పందన వస్తున్నదని అధికారులు వివరించారు. ఇప్పటికే పరిశ్రమల శాఖాధికారులు పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించి వచ్చారని గుర్తుచేసిన మంత్రి.. హైదరాబాద్ ఫార్మాసిటీ సైతం అదేస్థాయిలో ఉండాలని సూచించారు. విండ్ఫ్లో అధ్యయనం సైతం చేశారని, ఆ మేరకే మాస్టర్ ప్లానింగ్ ఉన్నదన్నారు.
ఫార్మా యూనిట్లు అత్యధికశాతం జీరో లిక్విడ్ డిశ్చార్జిగా ఉంటాయని, ఫార్మాసిటీ వ్యర్థ్ధాలు కేంద్రీకృతంగా శుద్ధి జరిగేలా ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిపారు. ఫార్మాసిటీ లివ్, వర్క్, లేర్న్ స్ఫూర్తిగా ఏర్పాటవుతున్న నేపథ్యంలో, అందులో పనిచేసేవారికి అక్కడే నివాస సౌకర్యాలుంటాయన్నారు. అనుబంధంగా అత్యుత్తమ విద్యాసంస్థలు కూడా ఏర్పాటవుతాయని వివరించారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించే అంశాన్ని సమావేశంలో మరోసారి చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్‌కుమార్, జయేశ్‌రంజన్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ మాణిక్‌రాజ్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఫార్మాసిటీని ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాక్లస్టర్గా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 19 వేల ఎకరాలకుగాను ఇప్పటికే 10 వేల ఎకరాలు సేకరించింది. ఫార్మాలో ప్రధానమైన పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర పథకానికి ఎంపికైతే నిధులు వచ్చి, పనులు మరింత వేగంగా జరుగనున్నాయి. 80% వైద్య పరికరాలను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నందున వాటిని తగ్గించి రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందుకోసం నగరశివారు సుల్తాన్పూర్ గ్రామంలో 250 ఎకరాల్లో మెడ్‌టెక్ పార్క్‌ను ఏర్పాటుచేసింది. ఇప్పటికే అక్కడ 20కి పైగా కంపెనీలు యూనిట్లను స్థాపించాయి. అందులో కొన్ని ఉత్పత్తులను ప్రారంభించాయి. మెడికల్ డివైజెస్ పార్కులను ప్రోత్సహించడానికి ఒక్కోదానికి రూ.100 కోట్లు రాయితీగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన దరిమిలా సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్‌కు నిధుల కోసం దరఖాస్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిని మరో 250 ఎకరాల మేర విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర పథకానికి ఎంపికైతే రెండు పార్కులు శరవేగంగా పూర్తవుతాయి.