Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాల్వల్లో పారాల్సింది నీళ్లా.. నెత్తురా?

-కేంద్రంలో రానున్నది రైతుల ప్రభుత్వం
-ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ గద్దలు
-ధరలను పెంచి లక్షల కోట్లు మేస్తున్నరు
-బీజేపీ ముక్త్‌ భారత్‌ కావాలి.. దేశమంతా అందుకు సన్నద్ధమవ్వాలి
-మనం ఆత్మగౌరవంతో బతుకుదామా?.. ఢిల్లీ గజదొంగలకు గులాం అవుదామా?
-పెద్దపల్లి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నూతన సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభం

ప్రధానికి ఏమన్న తెలివితేటలున్నయా? ఇయాల ధాన్యం కొనాలని అడిగితే కొనుడు చేతకాదు.. మేం యాడ పెట్టుకోవాలని మాట్లాడుతరు. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికే కాదు.. నూకలకు కూడా కొరత ఏర్పడుతున్నది. గోధుమపిండికి కూడా కొరత వస్తున్నది. ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల ఇయాల గోధుమలు, బియ్యం కూడా దిగుమతి చేసుకొనే పరిస్థితి వస్తున్నది. ముందుచూపు లేక, పరిపాలన చేతకాక, పిచ్చిపిచ్చి విధానాలతోని అట్టర్‌ ఫ్లాప్‌చేసి, దేశ ఆర్థిక స్థితిని దిగజార్చి రూపాయి విలువ పతనంచేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దేశ ప్రతిష్ఠను దిగజార్చి, పేదల ఉసురు పోసుకొనే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం గురించి ఆలోచన చేయాలె.

– పెద్దపల్లి సభలో సీఎం కేసీఆర్‌

ఇక్కడున్న వాళ్లను గులామ్‌లు చేసుకొని బూట్లు, చెప్పులు మోపిచ్చి, ఆ చెప్పులు మోసే వెధవలు కూడా ఎటుపడితే అటు కారుకూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్నరు. సింగరేణి కార్మికలోకం కన్నెర్ర చేసి పిడికిలి ఎత్తాలె. సింగరేణి గనులు కూడా ప్రైవేటు వాళ్లకు, షావుకార్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్న మోదీకి బుద్ధి చెప్పాలె.
– సీఎం కేసీఆర్‌

మన కాల్వల్లో పారాల్సింది నీళ్లా, మత కల్లోలాలతో చిందే నెత్తురా? ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గుజరాత్‌ మాడల్‌ అంటూ దేశ ప్రజలను దగాజేసి అధికారానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. అడ్డగోలుగా ధరలు పెంచి, ప్రజల ఉసురు తీస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు ప్రజలపై పన్నుల భారం మోపుతూ, మరోవైపు బీజేపీ అవినీతి గద్దలు ఎన్పీఏల పేరుతో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీ ముక్త్‌ భారత్‌కు దేశమంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చిన సీఎం.. కేంద్రంలో రానున్నది రైతుల ప్రభుత్వమని పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయం, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

కలగన్నమా.. ఇంత సాధిస్తమని..
పెద్దపల్లి జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలే. తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డది. అద్భుతమైన పరిపాలన భవన నిర్మాణం చేసుకోగలిగినం. పేదలు, రైతులు, మహిళల గురించి భారతదేశమే ఆశ్చర్యపోయేలా చాలా మంచి కార్యక్రమాలు చేసుకొంటూ ముందుకు పోతు న్నం. ఇంతకుముందే కారులో నాతోపాటు ఎంపీ దామోదర్‌రావు ఉంటే వారితో చెప్తు న్నా.. మేము గోదావరిఖని దాటేటప్పుడు గోదావరిలో డబ్బులేసేవాళ్లం. ఉద్యమ సమయంలో గోదావరిఖని పట్టణంలో అనేకసార్లు జెండా ఎగురవేశాను. ఇప్పుడు ఈ ప్రాంతం లో ఏం జరుగుతున్నదో నేను చెప్పే అవసరం లేదు. సింగరేణిలో ఎన్ని వేల మందికి డిపెండెంట్‌ ఉద్యోగాలు దొరుకుతున్నయో, దేశంలోనే అత్యధికంగా సింగరేణి కార్మికులకు బోనస్‌ ఏ విధంగా ఇస్తా ఉన్నమో.. రామగుండం పట్టణాన్ని ఏ విధంగా కార్పొరేషన్‌ చేసుకొన్నమో.. పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని పట్టణాలను ఎలా మున్సిపాలిటీలుగా చేసుకొన్నమో మీకు తెలుసు.

ఎన్పీఏల పేర లక్షల కోట్ల కుంభకోణాలు..
నిన్నగాక మొన్న 26 రాష్ట్రాల నుంచి నన్ను కలవడానికి దాదాపు వందమంది రైతు నాయకులు వచ్చినారు. ‘మేం తిరిగినం, చూసినం, రైతులతో మాట్లాడినం.. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క కార్యక్రమం కూడా మా దగ్గరలేదు.’ అని వాళ్లు నాతో చెప్తున్నరు. నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నరు. పోదామా జాతీయ రాజకీయాల్లోకి? ఈ రోజు గుజరాత్‌ మాడల్‌ అని చెప్పి దేశ ప్రజలను దగాజేసి అధికారానికి వచ్చిన బీజేపీ అడ్డగోలుగా ధరలు పెంచింది. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలే కాదు.. శ్మశానాల మీద పన్ను, సచ్చిపోయి కాలపెడదమంటె కూడా పన్ను, పాల మీద జీఎస్టీ వేసిన్రు. పేద ప్రజల ఉసురుపోసుకొంటూ.. ఎన్పీఏల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మేస్తూ.. ఈ బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. గాంధీ పుట్టిన రాష్ట్రం అని చెప్పి మద్యపాన నిషేధం చేసినమని చెప్పిన్రు. ప్రధాని ప్రాతినిధ్యం వహించే ఈ రాష్ట్రంలోనే కల్తీ మద్యం ఏరులై పారుతున్నది. 70-75 మంది కల్తీ మద్యం తాగి సచ్చిపోయారు. దీనికి మోదీ ఏం జవాబు చెప్తారు?

నీళ్లు పారాల్నా, నెత్తురు పారాల్నా?
మోసపోతే గోసపడతం. ఒక్కసారి దెబ్బతింటే చాలా వెనకకు పోతం. మీ బిడ్డగ నేను ఒక్కటే మాట చెప్తున్న. కూలగొట్టడం చాలా అల్కటి పని. కట్టడమే చాల కష్టం. ఇయాల మనం బాగుపడే సమయంలో ఈ దుర్మార్గులు, లంచగొండులు, లక్షల కోట్లను దోస్తున్న ఈ గజదొంగలొచ్చి మతం పేరుమీద కొట్లాడుండ్రని చెప్తున్నరు. శ్రీరాంసాగర్‌ కాల్వలో స్వచ్ఛమైన నీళ్లు పారాల్నా, మతకలహాల మంటలు రేగి నెత్తురు పారాల్నా? ప్రజల మధ్య ద్వేషం లేపే ఈ పిశాచులకు.. ఏ గ్రామానికాగ్రామంలో, ఏ జిల్లాకాజిల్లాలో చైతన్యవంతులమై తగిన బుద్ధిజెప్పాలి. ఈ దొంగల బారిన పడితే చాల ప్రమాదం వస్తది. నేను చెప్పే మాటల్లో సత్యమున్నది.. అందుకే ఆ ఆకాశం నుంచి చినుకులు కూడా పడతున్నయి. రైతులకు మేలుచేస్తే, రైతు కూలీలకు పెన్షన్‌ ఇస్తే.. పేదవాళ్లను ఆదుకొంటే వాటిని బందు పెట్టాల్నట. రైతులకి ఫ్రీ కరెంటిస్తే.. ఇయ్యవద్దు.. మీటరు పెట్టాలంటరు. నాకర్థం కాదు.. ఎందుకు పెట్టాల మీటరు? ఈ పెద్దపల్లి నుంచి నేను ఎనౌన్స్‌ చేస్తావున్న.

రేపు రాబోయే భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతావున్నది. ఈ గోల్‌మాల్‌ ప్రధానమంత్రి, ఈ గోల్‌మాల్‌ కేంద్ర ప్రభుత్వం చేప్పేది పచ్చి అబద్ధం. దేశంలో ఉన్న మొత్తం రైతులు, ఇరిగేషన్‌ ప్రాజక్టులు కలిపి వ్యవసాయానికి వాడే కరెంటు 20.8% మాత్రమే. దాని ఖరీదు రూ.లక్షా 45 వేల కోట్లు మాత్రమే. ఒక కార్పొరేటు దొంగకి దోచిపెట్టినంత కాదు కదా మోదీ గారూ! ఎందుకు రైతుల ఉసురుబోసుకోవాలి? ఎందుకు మీటర్లు పెట్టాలి? నిన్న 26 రాష్ర్టాల నుంచి వచ్చిన రైతులు నాకు చెప్పిన్రు.. ‘కేసీఆర్‌గారు దయచేసి మీరు బయలుదేరండి.. దేశమంతా మీకు స్వాగతం పలుకుతమని జేజేలు పలుకుతున్నరు. రైతులకు మీటర్లు పెట్టాలని ఎమ్మటపడే బీజేపీ నరేంద్రమోదీకే మనందరం కలిసి మీటరు పెట్టాల. ఆ పనిచేస్తే మన పీడపోతది. అందరం కలిసి, ప్రతిజ్ఞ బూని 2024లో బీజేపీ ముక్త్‌ భారత్‌ (బీజేపీ లేని భారతదేశాన్ని) సృష్టించేందుకు సన్నద్ధం కావాలి. ఆ రకంగా పోతనే ఈ దేశాన్ని కాపాడగలుగుతం తప్ప వేరే విధంగా కాపాడలేం. రూ.12 లక్షల కోట్లు ఎన్‌పీఏ పేరుతో కార్పొరేట్‌ దొంగలకు దోచి పెట్టిన మోదీకి.. లక్షా నలభై ఐదు వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. శ్రీలంక పోయి ఈయన దోస్తులు, షావుకార్లకు దోచిపెట్టడానికి అక్కడ వ్యాపారం ఇప్పిస్తే.. మొట్టమెదటిసారి పరాయి దేశంలో నరేంద్ర మోదీ గో బ్యాక్‌.. ఇండియన్‌ పీఎం గో బ్యాక్‌.. అని శ్రీలంక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేశారు. ఇదేనా దేశ గౌరవాన్ని కాపాడేది? ఇదేనా విశ్వగురువు అని చెప్పేది?

బూట్లు మోసే వెధవలకు బుద్ధిజెప్పాల
ఇక్కడున్న వాళ్లను గులామ్‌లు చేసుకొని బూట్లు, చెప్పులు మోపిచ్చి, ఆ చెప్పులు మోసే వెధవలు కూడాఎటుపడితే అటు కారుకూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేస్తా ఉన్నారు. సింగరేణి, పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, మంథని ప్రాంతంలో ఉన్న పెద్దలు, మేధావులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులకు నేను ఒక్కటే చెప్తున్నా.. ముర్మూరుకు చెందిన సదాశివ ‘తలాపున పారుతుంది గోదారి.. నా చేను నా చెలక ఎడారి’ అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపెల్లి గడ్డ. చైతన్యం ఉన్న గడ్డ.. అదే చైతన్యంతో పురోగమించి పెద్దపల్లి, మంథని, పక్కన ఉన్న భూపాలపల్లి జిల్లా ఏదైనా కావచ్చు.. సింగరేణి కార్మికలోకం కన్నెర్ర చేసి పిడికిలి ఎత్తాలి. సింగరేణి గనులు కూడా ప్రైవేటు వాళ్లకు, షావుకార్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్న మోదీకి బుద్ధి చెప్పాలి. ఎక్కడికక్కడ మేధావులు, బుద్ధిజీవులు, యువకులు మేల్కొని ప్రతి ఊరులో చర్చ పెట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. ఈ దుర్మార్గుల బారినుంచి, ఈ బీజేపీ బారి నుంచి, ఈ మత పిచ్చిగాళ్ల నుంచి, ఈ ఉన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ముందుకు పోవాలి. ఎవలమన్న అనుకున్నామా.. తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ వస్తదని? భగీరథ లాంటి పథకం వచ్చి మన మంచినీళ్ల బాధ తీరుతదని ఎన్నడన్న కల కన్నమా? ఇందులో ఏవీ కూడా గుజరాత్‌లో లేవు. కానీ ఇక్కడికొచ్చి ‘మా బూట్లు మోయండి.. మా చెప్పులు మోయం డి’ అనే పద్ధతిలో గుండాగిరీ చేసి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి వాళ్లకు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లాలో 266 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నా. రామగుండం కార్పొరేషన్‌కు రూ.కోటి, మిగిలిన మూడు మున్సిపాలిటీలకు ఒకొక్కదానికి రూ.కోటి మంజూరు చేస్తున్నా. బ్రహ్మాండంగా మీరు అభివృద్ధి చెందాలని కోరుకొంటున్నా.

ఢిల్లీ ఏజెంట్ల గులాంగా మారుదామా?
తెలంగాణలో ఉన్న ఏ ఒక్క మంచి కార్యక్రమం కూడా గుజరాత్‌లో లేదు. 24 గంటల కరెంటు రాదు. రూ.2 వేల పెన్షన్‌ రాదు, ఆరోగ్యశ్రీలాంటి పథకమూ లేదు. దోపిడీ తప్ప ఏమీ లేదు. అక్కడి నుంచి వచ్చేటటువంటి గులాంగాళ్లు, దేశాన్ని దోచేసే దోపిడీ దొంగలు.. వాళ్ల బూట్లు మోసే సన్నాసులు మనకు కనపడుతున్నారు. అరవై ఏండ్లు కొట్లాడి తెచ్చుకొ న్న తెలంగాణలో ఆత్మగౌరవంతో ఉందామా? మరోసారి ఢిల్లీ నుంచి వచ్చే ఏజెంట్లకు, దొంగలకు, గజదొంగలకు సద్ది గట్టి గులాంలుగా మారుదామా? దయచేసి ఆలోచన చేయండి. మన వడ్లు కొనరు. మీరందరూ చూసినారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నేను.. స్వయంగా పోయి ఢిల్లీలో ధర్నాచేసే పరిస్థితి. ప్రధానికి ఏమన్న తెలివితేటలున్నయా? ఇయాల ధాన్యం కొనాలని అడిగితే కొనుడు చేతకాదు. మేం యాడ పెట్టుకోవాలని మాట్లాడుతరు. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికే కాదు.. నూకలకు కూడా కొరత ఏర్పడుతున్నది. గోధుమపిండికి కూడా కొరత వస్తున్నది. ఈ తెలివి తక్కువ కేంద్రం వల్ల ఇయాల గోధుమలు, బియ్యం కూడా దిగుమ తి చేసుకొనే పరిస్థితి వస్తున్నది. ముందుచూపు లేక, పరిపాలన చేతకాక, పిచ్చిపిచ్చి విధానాలతోని అట్టర్‌ ఫ్లాప్‌చేసి, దేశ ఆర్థిక స్థితిని దిగజార్చి రూపాయి విలువ పతనంచేసి, అంతర్జాతీయ మార్కెట్‌లో దేశ ప్రతిష్ఠ దిగజార్చి, పేదల కడగండ్లు పోసుకొనే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం గురించి ఆలోచన చేయాలె.

పెద్దపల్లి కలెక్టరేట్‌ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ సంగీత

పెద్దపల్లి.. పింక్‌సిటీ
కేసీఆర్‌ పెద్దపల్లి జిల్లా పర్యటనతో మంగళవారం జిల్లా కేంద్రం గులాబీమయమైంది. సోమవారం పెద్దపల్లి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంతోపాటు జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం పెద్దకల్వల శివారులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. సభకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి, అలాగే మంచిర్యాల జిల్లా నుంచి ప్రజలు తరలి వచ్చారు. లక్ష మందితో సభ నిర్వహించనున్నట్లుగా ముందుగానే పార్టీ శ్రేణులు ప్రకటించినప్పటికీ.. అంతకు మించి జనం రావడంతో.. వేల మంది రోడ్లపైనే నిలబడాల్సి వచ్చింది. అంచనాలకు మించి జనం రావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఒకవైపు కమ్ముకొచ్చిన మేఘాలు.. మరోవైపు చిరుజల్లుల నేపథ్యంలో ముఖ్యమంత్రి 17 నిమిషాల పాటు ప్రసంగించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షత వహించగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 4.24 గంటలకు సీఎం సభాస్థలికి చేరుకోగా ఆయన చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఉత్తేజితులను చేసింది. ప్రసంగం మధ్యలో ముఖ్యమంత్రి ప్రశ్నలకు సభికుల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం లభించింది. సభకు కేటాయించిన దారులన్నీ జనంతో నిండిపోయాయి. పెద్దపల్లి-కరీంనగర్‌ రోడ్డులో సభకు వచ్చిన వాహనాలు నిలిచిపోయాయి. కళాకారుల ఆటా పాటలు సభకు వచ్చిన జనాలతో చిందులేయించాయి.

పెద్దపల్లి జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ను ఆశీర్వదిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు గంగుల, కొప్పుల, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.