Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వర గంగ పొంగేది నేడే

-చారిత్రక ఘట్టానికి ముస్తాబైన గోదావరి తీరం
-మేడిగడ్డ బరాజ్ వద్ద నీటిని విడుదల చేయనున్న సీఎం కేసీఆర్
-ఆపై కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటర్ల ద్వారా నీటి విడుదల
-తాడేపల్లి నుంచి మేడిగడ్డకు నేరుగా ఏపీ సీఎం జగన్
-నాందేడ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
-వివిధ నిర్మాణాల వద్ద మంత్రుల పూజలు
-విలేజ్‌లుక్‌తో మేడిగడ్డ బరాజ్ హోమశాల
-బరాజ్‌లో రెండు అడుగులకు చేరిన నీటినిల్వ
-వెట్న్ ప్రారంభానికి కన్నెపల్లి మోటర్లు రెడీ
-ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, ఈటల
-మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన సీఎస్ జోషి
-రామడుగు, మేడారం సందర్శించిన బ్యాంకర్ల బృందం
-వాడవాడలా సంబురాలకు సిద్ధమైన తెలంగాణ

మరికొన్ని గంటల్లో తెలంగాణ యవనికపై మహా జలదృశ్యం ఆవిష్కారమవుతున్నది. పాతాళ గంగమ్మ ఉరికురికి.. ఉబికుబికి.. పైపైకి ఎగిసిపడే క్షణంకోసం యావత్ తెలంగాణ సమాజం ఆత్రంగా ఎదురుచూస్తున్నది. ఏ నీళ్ల కోసం ఏండ్ల తరబడి కొట్లాడినమో.. ఆ నీళ్లను రెండున్నరేండ్ల స్వల్ప కాలంలోనే సాధించుకొన్న అపూర్వ సందర్భమిది. తడారిపోయిన తెలంగాణ బీడుభూములు గోదారమ్మ తాకిడితో పులకించిపోనున్నాయి. ఇక నీటికోసం తండ్లాట పడాల్సిన పనిలేదు. ఈరోజు తెలంగాణ సమాజానికి నిజమైన పండుగరోజు.. తెలంగాణ రైతు దశాబ్దాల తరబడి పడిన గోస తీరుతున్న రోజు. మన కాలపు భగీరథుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వప్నించి.. అతి తక్కువ కాలంలోనే అనితర సాధ్యమైన ఆ స్వప్నాన్ని సాకారంచేసుకొని మన జాతికి భారీ ప్రాజెక్టును సమర్పణంచేస్తున్న అద్భుతఘట్టం మరికొన్ని గంటల్లోనే సాక్షాత్కరించనున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం రికార్డుస్థాయిలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో గవర్నర్, ఇరుగుపొరుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమక్షంలో నీటిని విడుదలచేయనున్నారు. ఈ చారిత్రాత్మక సన్నివేశంలో యావత్ తెలంగాణ ప్రజానీకం సంబురంగా పాలుపంచుకుంటున్నది. గ్రామగ్రామాన రైతులు, ప్రజలు వేడుకలకు సిద్ధమయ్యారు.

తెలంగాణవ్యాప్తంగా నేడు చారిత్రక కాళేశ్వర సంబురం. సంవత్సరంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజుగా ప్రసిద్ధి చెందిన ఈ జూన్ 21.. తెలంగాణ రైతాంగంతోపాటు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైన రోజు. సీఎం కేసీఆర్ ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం ఉదయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. గోదావరితీరం అన్నిరకాలుగా ముస్తాబైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద మహా ఘట్టానికి సన్నాహాలు పూర్తయ్యాయి. శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించడంతోపాటు మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద హోమా లు నిర్వహించాలని సంకల్పించడంతో ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. మహారాష్ట్ర, ఏపీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొంటున్నారు.

మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కూడా హాజరవుతున్నారు. సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు ఎర్రవెల్లి గ్రామం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ చేరుకొంటారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి నుంచి ఉదయం 7.50 గంటలకు హెలికాప్టర్‌లో నేరుగా మేడిగడ్డకు వస్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉదయం 8 గంటలకు నాందేడ్ విమానాశ్రయం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకొని అక్కడినుంచి మేడిగడ్డ బరాజ్‌కు వెళ్తారు. ఉదయం 8.30 గంటలకు మేడిగడ్డ బరాజ్ వద్ద నిర్వహించే పూజాకార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం విశిష్ట అతిథి గవర్నర్ సమక్షంలో ముఖ్యఅతిథులతో కలిసి ఉదయం 10.30 గంటలకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బరాజ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల ద్వారా నీటి విడుదలచేస్తారు. అనంతరం అతిథులతోకలిసి డెలివరీ సిస్టర్న్ వద్దకు వెళ్లి గోదావరిజలాలు పైపుల ద్వారా ఎగిసిపడే దృశ్యాల్ని వీక్షిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లిలోనే సీఎం కేసీఆర్ అతిథులతో కలిసి భోజనంచేస్తారు. ప్రారంభోత్సవంలో భాగంగా కాళేశ్వరం పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా అతిథులు వీక్షిస్తారు.

వివిధ ప్యాకేజీల్లో మంత్రుల పూజలు
సీఎం కేసీఆర్ మేడిగడ్డ బరాజ్‌తోపాటు కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటిని విడుదలచేయనుండగా.. మిగతా కీలక నిర్మాణాల వద్ద రాష్ట్ర మంత్రులు పూజలు నిర్వహిస్తారు. గురువారం సాయంత్రానికే పలువురు మంత్రులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. అన్నారం పంపుహౌస్ వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి, సుందిల్ల పంపుహౌజ్ వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్యాకేజీ-6లో భాగంగా నందిమేడారం పంపుహౌస్‌లో మంత్రి మల్లారెడ్డి, ప్యాకేజీ-8లో భాగంగా రామడుగు పంపుహౌస్‌లో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పూజలు చేస్తారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నెపల్లి పంపుహౌస్ వద్ద పూజలో పాల్గొంటారు.

పూర్తయిన ఏర్పాట్లు
ప్రాజెక్టు ప్రారంభానికి ముందు మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద నిర్వహించనున్న హోమాలకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేడిగడ్డ బరాజ్ వ్యూ పాయింట్ వద్ద 30 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో హోమశాల నిర్మించారు. మట్టితో ఫ్లోరింగ్‌చేసి ఆవుపేడ కలిపి హోమశాలకు విలేజ్ లుక్ తెచ్చారు. వర్షం కురిసినా ఎలాంటి అంతరాయం కలుగకుండా హోమశాలపై కప్పువేశారు. దాదాపు గంటన్నరపాటు హోమం జరిగే అవకాశమున్నదని అధికారులు చెప్తున్నారు. కన్నెపల్లి వ్యూపాయింట్ వద్ద కూడా హోమశాల నిర్మాణం పూర్తయింది.

ఐదు గేట్ల నుంచి నీటి విడుదల
మేడిగడ్డ బరాజ్ వద్ద నీటిని ఎత్తిపోసేందుకు ఏడు గేట్లు మూసివేసి గోదావరి జలాలను నిల్వచేశారు. దీంతో బరాజ్ వద్ద గోదావరిలో దాదాపు రెండడుగుల నీరు నిల్వ ఉన్నట్లు సాగునీటిశాఖ ఇంజినీర్లు తెలిపారు. సీఎం కేసీఆర్ మొదట హోమంలో పాల్గొన్న అనంతరం మేడిగడ్డ బరాజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బరాజ్‌లోని ఐదు గేట్లు ఎత్తి గోదావరిలో నీటిని విడుదలచేస్తారు.

కన్నెపల్లి వద్ద వెట్న్ మేడిగడ్డ బరాజ్‌నుంచి గోదావరి జలాల ఎత్తిపోతకు కన్నెపల్లి వద్ద నిర్మించిన పంపుహౌస్‌లో మోటర్ల వెట్న్ ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు మేడిగడ్డ బరాజ్ వద్ద కార్యక్రమం ముగిసిన తర్వాత హెలికాప్టర్ల ద్వారా కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకొంటారు. ఇక్కడ హోమంలో పాల్గొన్న అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత మోటర్లను ప్రారంభిస్తారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటర్ల పరీక్షలు నిర్వహించి వెట్న్ ప్రారంభానికి సిద్ధంచేశారు. పంప్‌హౌస్‌ను అందులోని మోటర్లను సర్వాంగసుందరంగా అలంకరించారు. మోటర్ల వెట్న్ మొదలయ్యాక ఇవి నీటిని ఎత్తిపోసే డెలివరీ సిస్టర్న్ వద్దకు ముఖ్యమంత్రి ఇతర అతిథులు చేరుకొంటారు. కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కెనాల్‌లో పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోత ద్వారా వచ్చే గోదావరి జలాలను పరిశీలిస్తారు. చివరగా కన్నెపల్లి పంపుహౌస్ వద్ద అతిథులతో కలిసి భోజనాలు చేస్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన కన్నెపల్లి గ్రామస్థులకు ఇక్కడ భోజనాలు ఏర్పాటుచేశారు. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. అతిథుల రాకపోకల కోసం 17 హెలిప్యాడ్లను సిద్ధంచేశారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తదితరులు కన్నెపల్లి పంపుహౌస్‌ను గురువారం సందర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు చల్లా నారాయణరెడ్డి, జీ కేశవరావు, కల్లెపు రఘుపతిరావు తదితరులు మంత్రుల వెంటఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి బ్యాంకర్లతో కలిసి మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మేడిగడ్డబరాజ్, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ భద్రతాఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

తెలంగాణభవన్‌లో..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భం తెలంగాణ భవన్‌లో భారీ ఎత్తున సంబురాలు జరపాలని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిర్ణయించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసానిశ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సంబురాలు నిర్వహిస్తారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కళాకారులతో కలిసి పెద్దఎత్తున వేడుకలు జరుపుతారు.

రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం సంబురాలు
– మేడిగడ్డలో ఏర్పాటుచేసిన హోమగుండం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతులు సంబురాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందనున్న నేపథ్యంలో ఆ సంతోషాన్ని సంబురంగా జరుపుకొనేందుకు ప్రజలు, రైతులు సిద్ధమయ్యారు. వారి ఆనందంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కానున్నారు. వాడవాడనా, గ్రామగ్రామానా సంబురాలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు. పటాకులు పేల్చడం, మిఠాయిలు పంచడం, పాలాభిషేకాలు చేయడం వంటి అనేక రూపాల్లో ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తంచేయబోతున్నారు. కాళేశ్వరం ప్రారంభం సందర్భంగా భారీ బహిరంగసభ ఏర్పాటుచేయాలని ఆలోచించినప్పటికీ అక్కడున్న భద్రతా కారణాలు, స్థలం ఇతరత్రా కారణాలతో రద్దుచేసుకొన్నారు. రైతులు, ప్రజలు తమ గ్రామాల్లోనే వేడుకలు జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

కాళేశ్వరం.. ప్రపంచ రికార్డు: మంత్రి ఈటల
– హోమాల నిర్వహణ కోసం మేడిగడ్డలో ఏర్పాటుచేసిన హోమశాల
తెలంగాణ కార్యసాధకుడు, సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిలా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రెండురోజులుగా కాళేశ్వరంలోనే మకాంవేసి కాళేశ్వరం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆయన గురువారం కన్నెపల్లి పంప్‌హౌస్‌తోపాటు అక్కడ నిర్మిస్తున్న యాగశాల.. ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణను సస్యశ్యామ లం చేయాలనే సంకల్పంతో గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలవకుండా ఉండాలనే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి.. నిర్ణీత సమయంలో పూర్తిచేసి ప్రపంచ రికార్డు సృష్టించారని చెప్పారు. మూడేండ్లలోనే ఎక్కడికక్కడ బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు నూతన టెక్నాలజీని వినియోగించుకుంటూ పూర్తిచేసిందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా జెడ్పీ చెర్మన్ పుట్ట మధు, ఇతర పార్టీ నాయకులు మంత్రి ఈటల వెంట ఉన్నారు.

కన్నెపల్లిలో మంత్రి ఎర్రబెల్లి
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శించారు. పంప్‌హౌస్ వ్యూ పాయింట్ నుంచి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడినుంచి యాగశాల స్థలాన్ని పరిశీలించారు. పంప్‌హౌస్ వెట్న్ అనంతరం డెలివరీ సిస్టర్న్ వద్దకు నీరు వెళ్లే పద్ధతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు ఇద్దరు గవర్నర్లు, మరో ఇద్దరు సీఎంలు వస్తున్నందున కావాల్సిన ఏర్పాట్లన్నీ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.