కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉన్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారు. మునుగోడులో మాత్రం రూ.3 వేల పింఛన్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఇంతకంటే మోసం, దగా మరొకటి ఉండదని చెప్పారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీవన్నీ జుమ్లా మాటలని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లచట్టాలు తెచ్చి ప్రధాని మోదీ రైతుల ఉసురుసోసుకున్నాడని విమర్శించారు. 750 మంది రైతులను పొట్టనపెట్టుకన్న మోదీ.. చివరకు రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ఏడాదైనా అమలు చేయలేదన్నారు.
దుబ్బాక ఉపఎన్నిక సమయంలో రూ.3 వేల పింఛన్ ఇస్తామన్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని మంత్రి హరీశ్ రావు బీజేపీ నాయకులను నిలదీశారు. ఆ పార్టీ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.3 వేల పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారివి అమలుకాని హామీలు, అబద్ధపు ప్రచారాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మోసం బీజేపీ నైజం..
రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.2 వందలుగా ఉన్న పెన్షన్‌ను రూ.2016కు పెంచామని తెలిపారు. డయాలసిస్, బీడీ, గీత, నేత కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మోసపోవడానికి మునుగోడు ప్రజలు అమాయకులు కాదని, చైతన్యవంతులన్నారు. మోసం చేయడం బీజేపీ నైజమని ఆ పార్టీ నేతలే చెప్పారన్నారు. ఆ పార్టీ మోసాలు ఒక్క ఓటు రెండు రాష్ట్రాల నుంచి మొదలయ్యాయని విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే అవమానించిన పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అన్నారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే తెలంగాణకు చెందిన ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో కలిపిందన్నారు. కృష్ణా నీళ్లలో వాటా తేల్చడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పిందని, ఇప్పటివరకు 24 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ఏడు దశాబ్దాలుగా ఫ్లోరైడ్‌తో మునుగోడు బాధపడిందని, గతంలో పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఫ్లోరైడ్ బాధలు పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ తెచ్చారని, మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని వెల్లడించారు. మునుగోడు ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మోదీకి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. యాదాద్రిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీరు పారించిన ఘనత ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో భూమికి భారమయ్యేలా పంటలు పండుతున్నాయని చెప్పారు. ఎస్సారెస్పీ నుంచి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట జిల్లాల చిట్టచివరి భూముల వరకు సాగునీళ్లు ఇస్తున్నామని చెప్పారు. నల్లగొండలో బత్తాయి మార్కెట్, నకిరేకల్‌లో నిమ్మకాయల మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు. పోరాటాల జిల్లా నల్లగొండ ప్రజలను మోసం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని చెప్పారు.
రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వల్లే..
ఎనిమిదేండ్లుగా అన్యాయం చేస్తున్న బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనే అహంకారంతో బీజేపీ ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి రాజీనామా చేశాడని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌కు అప్పగించేందుకే నల్లచట్టాలు రూపొందించాని విమర్శించారు. అన్ని ధరలు పెంచి ప్రజలపై బీజేపీ మోయలేని భారాలు వేసిందని విమర్శించారు. బీజేపీ పాలనలో దేశంలో ఆకలి పెరిగిపోయిందని, ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 107వ స్థానానికి పడిపోయిందన్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరుగలేదన్నారు.