Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కరంటు, నీళ్లు ఎందుకియ్యలె?

-సీతారామ ప్రాజెక్టును అడ్డుకున్న చంద్రబాబూ.. జవాబు చెప్పి ఖమ్మంలో అడుగుపెట్టు
-ఖమ్మంను ఎండబెట్టేందుకు కేంద్రానికి బాబు లేఖ
-టీడీపీవాళ్లు ఏం ముఖం పెట్టుకొని ఓట్లడుగుతరు?
-గోదావరి జిల్లాలకు దీటుగా ఖమ్మం పచ్చబడాలె
-కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ కరంటు పోతది
-ప్రపంచం, దేశంలో కనీవినీ ఎరుగనిరీతిలో రాష్ట్రంలో సంక్షేమం
-సంపద పెరిగేకొద్దీ ప్రజాసంక్షేమాన్ని పెంచుతాం
-సొంతజాగాలోనూ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తం
-మేం చెప్పేది అబద్ధమైతే మాకు డిపాజిట్ రాకుండా చేయాలి..వాళ్లు చెప్పేది అబద్ధమైతే అవతలివాళ్లకు డిపాజిట్ దక్కొద్దు
-ఖమ్మం, పాలకుర్తి సభల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్న అరవై ఏండ్లలో తెలంగాణకు నీళ్లు, విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోని మహానుభావులు, ప్రపంచ మేధావి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. రాష్ట్రంలో కరంటు తెచ్చామన్న సీఎం.. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరంటు పోతదని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించి ఖమ్మంలో, అనంతరం వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభల్లో ఆయన మాట్లాడుతూ సంపదను పెంచి, రైతులకు, పేదలకు పంచుతున్నామని తెలిపారు. రూ.43వేల కోట్లతో మానవీయకోణంలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని సీఎం చెప్పారు. వందశాతం ఎన్నికల ప్రణాళిక అమలుచేసిన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో టీఆర్‌ఎస్ అన్నారు. దీనిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని చెప్పారు. మేం చెప్పేది అబద్ధమైతే మాకు డిపాజిట్ రాకుండా చేయాలి. వాళ్లు చెప్పేది అబద్ధమైతే అవతలి వాళ్లకు డిపాజిట్ రాకుండా చేయాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఖమ్మం పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తికావాలన్న సీఎం.. వచ్చే రెండేండ్లలో సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి ఖమ్మంజిల్లాలో అంగుళం భూమి మిగులకుండా సాగులోకి తీసుకువచ్చే బాధ్యత తనదేనని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసి, వంద టీఎంసీల నీటితో వరంగల్‌ను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. అడ్డం పొడుగు చెప్పి, ఏం చేయకుండ ఎగబెట్టుడు కాంగ్రెస్, టీడీపీ నైజమైతే.. సంపద ఎట్ల పెరుగుతదో ఆలోచించి రాష్ట్ర ప్రజలకు బాగుచేయడం టీఆర్‌ఎస్ నైజమని చెప్పారు.

రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అభినందనలు వస్తుంటే.. కాంగ్రెస్, టీడీపీలకు కనిపించడంలేదని విమర్శించారు. ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు బుర్రలేక, మానవీయకోణం లేక ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని అన్నారు. ధనవంతులైన రైతులు తెలంగాణలోనే ఉన్నారనే పేరు వచ్చేవరకు రైతాంగం పక్షాన ఉంటానని చెప్పారు. భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఘోరంగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్న అరవై ఏండ్లలో తెలంగాణకు నీళ్లు, విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో మహానుభావులు, మేధావులు ఉన్నా రు. టీడీపీ వాళ్ల డంబాచారం చెప్పేదేలేదు! వీళ్లేకదా పాలించింది? కరంటు ఎన్ని గంటలు వచ్చేది? వీళ్ల మేధావితనం ఎక్కడపోయింది? ఎందుకు ఇవ్వలేకపోయారు? 60 ఏండ్లు ఏడిపించినరు. నేనూ రైతునే. నా మోటరు కాలిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినయి. టీడీపీ మేధావులు, కాంగ్రెస్ ఘనాపాటీలు ఎక్కడ పండుకున్నరు? చంద్రబాబు ప్రపంచమేధావి. ఆయన ఎందుకు ఇయ్యలేకపోయిండు? అని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కరంటు తెచ్చినం. కరంటు ఇక పోదు. కాంగ్రెస్ గనక వస్తే గ్యారంటీగా కరంటు పోతది జాగ్రత్త! అని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించి ఖమ్మంలో, అనంతరం వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పాలేరులో తుమ్మల నాగేశ్వర్‌రావును, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్‌ను, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైరవీలేకుండా పాసుబుక్కు వస్తదని రైతు సోదరులు మీ జిందగీలో ఆలోచించినారా? దరఖాస్తు, దఫ్తర్ లేకుండా రైతుబంధు చెక్కులు నేరుగ చేతులకి వస్తయని ఊహించినారా? పారదర్శకమైన, మంచి పద్ధతి, నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తున్నది అని చెప్పారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

మానవీయ కోణంలో సంక్షేమ పథకాలు
ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు బేసిక్‌శాలరీలో రిస్క్ అలవెన్స్ 30% ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. గతంలో ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా? టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.43వేల కోట్లతో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడాలేవు. మానవీయకోణంలో అమలుచేస్తున్నాం. ఉద్యమంలో ఏమేం చెప్పినానో తెలంగాణ వచ్చిన తరువాత అవి జరుగుతున్నాయి. ప్రజలకిచ్చిన మాట ప్రకారం వందశాతం ఎన్నికల ప్రణాళిక అమలుచేసిన ఒకే ఒక్క పార్టీ దేశంలో టీఆర్‌ఎస్. దీనిపై చాలెంజ్ చేసి మాట్లాడటానికి టీఆర్‌ఎస్ సిద్ధం. మేం చెప్పేది అబద్ధమైతే మాకు డిపాజిట్ రాకుండా చేయాలి. వాళ్లు చెప్పేది అబద్ధమైతే అవతలి వాళ్లకు డిపాజిట్ రాకుండా చేయాలి. ప్రజలు ఓట్లు వేసేది వాస్తవాల పునాదుల మీద ఉండాలి. కులం, మతం పునాదుల మీద కాదు. కులం, మతం ఎవరికి అన్నం పెట్టాయి? ఎవరిని కాపాడాయి? ఎవరో కులపాయన సీఎం అయితే ఆ కులంలో దరిద్రం పోతదా? ఇంత దిక్కుమాలిన ఆలోచన ఉంటదా? ఈ ఎన్నికల్లో ఆ ముసుగులో వచ్చేవాళ్ల చెంప ఛెళ్లుమనిపించాలి.

సమాజ అధ్యయనం నుంచే పథకాల
టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014లో వచ్చింది. టీఆర్‌ఎస్ వచ్చి చెడగొట్టిందా? అసైన్‌మెంట్ భూములు ఇచ్చినారు? పరిష్కారమైందా? మొత్తం బంగారం వచ్చేసిందా? జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారం అయిందా? కాలే! ఆ పెద్దలే.. రెండు మూడేండ్లు అధికారంలో లేకపోంగనే.. హిమాలయాలకుపోయి ఆకుపసరు తాగి పవిత్రులు అయినట్టు.. ఆరు చందమామలు, ఏడు సూర్యులు పెడుతమని మాట్లాడుతున్నరు. వేయి రూపాయల పింఛన్లు ఇచ్చినం. ఇండియాలోనేకాదు.. ప్రపంచంలో చాలా దేశాల్లో లేదు. మేం ఆలోచనలు ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోలేదు. మేం నడుపుతున్న సమాజం నేర్పిన గుణపాఠాలు. నా నియోజకవర్గంలో ఎర్రవల్లిని ఆదర్శ గ్రామం చేద్దామని కంటిశిబిరం పెట్టాం. ఒక్క గ్రామంలోనే ఇంతమంది ఉంటే.. రాష్ట్రంలో ఎంతమంది ఈ సమస్యతో బాధపడుతున్నారోనని ఆలోచించి రూపొందించిందే కంటివెలుగు.

ఖమ్మం.. గోదావరి జిల్లాలను తలపించాలి
గోదావరి నది ఉమ్మడి ఖమ్మం జిల్లాను 160 కిలోమీటర్లు అనుకుని పారుతుంది కాబట్టి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకంటే దీటైన జిల్లా కావాలి. రైస్‌బౌల్ ఆఫ్ ఇండియా కావాలి. రైతాంగం కళకళలాడాలి. దీనికోసం ప్లాన్ తయారుచేసినం. పాలేరును ఉపశమనం చేసుకొన్నాం. కొంత పంటలు పడుతున్నాయి. హెలికాప్టర్ నుంచి చూశా.. చెరువులన్నీ నిండి ఉన్నాయి. తుమ్మల మంచి పనిచేశారు. సంతోషం. పాలేరు పచ్చబడ్డది. పాలేరు బాటలోనే ఖమ్మం పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తికావాలి. రెండేండ్లలో సీతారామ పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత నాదే.

సంపద పెంచే తెలివి మాది..
ఇసుక అమ్మకాల్లో అక్రమాలకు తావులేకుండా చేసినం. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ పది జిల్లాల ఇసుక ఆదాయం రూ.9.56 కోట్లు. ఇప్పుడు నాలుగున్నరేండ్లలో రూ.2057 కోట్లు. దొంగతనాలు, స్మగ్లింగ్ అరికడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడకుండా, దొంగ కాంట్రాక్టర్లకు దోచి పెట్టకుండా ఉంటే.. దొంగలపాలయ్యే సొమ్ము రాష్ట్ర ఆదాయంగా వస్తుంది. రాత్రింబవళ్లు కష్టపడి సంపద పెంపొందిస్తున్నాం. పెంచిన సంపదను పేదలకు పంచుతున్నాం. సంపద పెంచే, కష్టంచేసే తెలివి, నీతినిజాయితీ ఉంటేనే ఇట్ల సాధ్యమయితది. అడ్డంపొడుగు చెప్పి, ఏం చేయకుండ ఎగబెట్టుడు కాంగ్రెస్, టీడీపీ నైజం. సంపద ఎట్ల పెరుగుతదో ఆలోచించి రాష్ట్ర ప్రజలకు బాగుచేయడం టీఆర్‌ఎస్ నైజం. నేను చెప్పేవన్నీ మీ కండ్ల ముందున్నయి. కేసీఆర్ కిట్లు, బోదకాలు బాధితులకు పింఛన్లు ఎవరూఅడగలే. ఆదాయం పెరిగిన మేర సంక్షేమం పెంచినం. ఎవరూ అడుగని 77 స్కీంలు అమలుచేసినం. కల్యాణలక్ష్మి ఇస్తమని మ్యానిఫెస్టోలో చెప్పలే. వరంగల్ జిల్లా ములు గులోని ఒక లంబాడీ ప్రాంతంలో ఈ పథకం పుట్టింది.

కంటివెలుగు కార్యక్రమం కావాలని ఎవరూ ధర్నా చేయలే. ఇండియాలో ఏ రాష్ట్రంలోనైనా, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఉందా? ప్రజలపట్ల చిత్తశుద్ధి, ప్రజలకు మేలుచేయాలనే నిబద్ధత ఉంటే కంటివెలుగులాంటి కార్యక్రమాలు అమలయితయి. గజ్వేల్‌లోని చిన్న గ్రామంలో పుట్టిన కంటివెలుగు ఆలోచన ఇప్పుడు రాష్ట్రమంతా అమలవుతున్నది. ఇప్పటికే 80 లక్షలమందికి లాభం జరిగింది. మానవీయ కోణంలో చేపట్టిన 70-80 పథకాలు యథాతథంగా కొనసాగిస్తం. రాష్ర్టానికి చాలా అవార్డులు వచ్చాయి. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. పథకాన్ని ఎలా అమలుచేస్తున్నారో వివరించాలని ఆహ్వానించింది. ఇవి కాంగ్రెస్, టీడీపీలకు కనిపించడంలేదు.

బుర్రలేకనే పథకాలు చేయలేదు..
రైతుబంధు పథకాన్ని మించినది రైతుబీమా. గుంట భూమి ఉన్న రైతుకూ వర్తింపజేస్తున్నాం. ఇప్పటికి 2,546 మంది రైతుల కుటుంబాలకు బీమా అం దించాం. చాలామంది రెండెకరాల్లోపు ఉన్నవారే. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయలేదు? బడ్జెట్ లేకనో, నిధులు లేకనో కాదు.. బుర్రలేక, మానవీయకోణం లేక. ఎన్నికల్లో కులమో, మతమో, టక్కుటమార విద్యలు, డబ్బులు ప్రవాహంచేసి ఓట్లు దండుకునే ఆలోచన చేశారు కానీ రైతులకు, పేదలకు అవసరమైన పథకాలు రూపొందించలేదు.

నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్…
స్వయంసహాయక బృందాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నయి. కాళేశ్వరం, పాలమూరు పూర్తవుతున్నయి. దేవాదుల కూడా పూర్తయితది. బ్రహ్మాండంగా నీళ్లొస్తయి. పంటలు బాగా పండుతయి. ఇండియాలో ధనవంతులైన రైతులు ఎక్కడున్నరంటే తెలంగాణల ఉన్నరనే పేరు రావాలి. అప్పటిదాకా రైతుల పక్షాన ఉంటా. ఆ పేరు రావాలంటే.. ఏ పంట ఎక్కడ వేయాల్నో అక్కడే వేయాలి. పండిన పంట ఆన్ డిమాండు అమ్ముడుపోవాలి. అందుకే మహిళాసంఘాల శక్తి వృథా కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తది. మహిళా సంఘాలన్నింటినీ యాక్టివేట్ చేసి, ఐకేపీ సిబ్బందిని పర్మినెంట్ ఉద్యోగులుగా చేసి వాళ్లకు జీతాలు కూడా పెంచి, బ్రహ్మాండంగా పనిచేయిస్తం. దేశంలోనే ఆదర్శ మహిళలు తెలంగాణలో ఉన్నారనే పేరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తం.

ఖమ్మంలో పదికి పది పక్కా
ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ చైతన్యం బాగా ఉండేది. రాజకీయానికి వచ్చేసరికి అనేక కారణాలవల్ల సరైన ఫలితాలు వచ్చేవికావు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల గురించి మిత్రుల మధ్య చర్చ జరుగుతుంటే ఉత్తర తెలంగాణ పుణ్యమా అని టీఆర్‌ఎస్ నేరుగా అధికారంలోకి వస్తది. మీకు ఖమ్మం, హైదరాబాద్ మైనస్. అక్కడ కొట్లాడాలి అని చెప్పాను. ఈ మధ్య ఎన్నికల చర్చ ప్రారంభమైనప్పుడు.. ఈశాన్యంలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఉన్నారు.. పవిత్ర గోదావరి నది ఉన్నది. చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్నది. గొప్ప పోరాటాలు చేసిన గడ్డ. అనేకమంది తలపండిన రాజకీయ నాయకులు పుట్టిన గడ్డ. చైతన్యం ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి.. ఈ మధ్య వ్యూహకర్తల సమావేశంలో ఈ రోజు ప్లస్ ఖమ్మంతో మొదలుపెట్టండని చెప్పాను. ఆ రోజు మైనస్ ఖమ్మం అన్నాను. ఈ రోజు ప్లస్ అంటున్నాను. నా అంచనానుబట్టి ఈసారి ఖమ్మంలో టీఆర్‌ఎస్ పదికి పది స్థానాలు గెలవబోతున్నది. ఎన్నికలన్న తరువాత చాలా ఉంటాయి. కులాల కుళ్లు, దొంగ డబ్బు ప్రవాహం ఉంటంది. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలుంటాయి. కానీ ఖమ్మంచైతన్యం ముందు అవి నిలబడవు. ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని శక్తులు, వ్యక్తులు స్వార్థంకోసం కొన్ని చెప్తుంటారు. చైతన్యం ఉన్న ప్రజలు నిశితంగా పరిశీలన చేయాలి. వాటిలో కొట్టుకొని పోవద్దు. మనమెవ్వరం శాశ్వతం కాదు.. మన జిల్లా శాశ్వతం.. ప్రజలు శాశ్వతం, ప్రజల అవసరాలు శాశ్వతం. దాని దృష్ట్యా ఆలోచన చేయాలి.

జగమెరిగిన తుమ్మల అజయ్ మా కుటుంబ సభ్యుడు
ఒక యాగం చేశాను. ఏకాదశి.. కార్తీక సోమవారం. మంచి రోజు. బ్రహ్మాండంగా ఖమ్మం జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నాను. తుమ్మల నాగేశ్వర్‌రావు గురించి చెప్పడమంటే.. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యం వేసినట్టు ఉంటది. నాకు ఆప్తమిత్రుడు. నాగేశ్వర్‌రావుకు సంస్కారం ఉన్నది. భక్తరామదాసు నేను చేసిన అని చెప్పారు. ఒక డైనమిక్, చేవగలిగిన, సత్తాకలిగిన మంత్రి లేకపోతే భక్తరామదాసు వచ్చి పాలేరు పచ్చపడుతుందా? ఆ ప్రాజెక్టును సీఎంగా నేను మంజూరు చేయవచ్చు.. కానీ, రాత్రి పగలు పనిచేసి నీళ్లు అందించిన విషయం వాస్తవం కాదా? ఇదే టీడీపీ, కాంగ్రెస్‌లు వారి పాలనలో ఎందుకు ప్రయత్నించ లేదు? పాలేరు నుంచి బరిలో ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావు గురించి అందరికీ తెలుసు. లక్ష మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలి. పాలేరు మరింత అభివృద్ధి చెంది, మరింత పచ్చబడాలంటే తుమ్మల గెలువాలి. పువ్వాడ అజయ్.. నా కుమారుడు రాములాంటోడు. మా కుటుంబ సభ్యుడు. యువకుడు, మంచి భవిష్యత్తు ఉన్న అజయ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. నామా నాగేశ్వర్‌రావును గెలిపిస్తే సీతారామ ప్రాజెక్టుకు అడ్డుకుని, నామాలు పెట్టిపోతాడు. పువ్వాడను గెలిపిస్తే పువ్వులల్ల పెట్టుకుని చూసుకుంటాడు.

ఎర్రబెల్లికి హుషారు ఎక్కువ
ఎర్రబెల్లి దయాకర్ మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. హుషారు ఎక్కువ ఉన్నడు. ఒక ఊర్లో ఇంటికి ఒక చుట్టమొచ్చిండట. నేను జల్దిపోత.. జల్దిపోత అంటే.. ఇంట్ల పెద్దవ్వ ఉండి ఇంకా అన్నం కాలేదు బిడ్డా. రాత్రిది ఇంత సలన్నం ఉంది తింటవా అంది. ఎందుకవ్వా.. సలన్నం తింట.. ఉడుకన్నం అయ్యేదాకా ఉంట అన్నడట. గోదావరి కాల్వల నీళ్లు కావాలంటే.. నిజామాబాద్ జిల్లా వాళ్లు లొల్లి పెడ్తా ఉంటే కూడా కాల్వల నీళ్లు తెచ్చినం. అందరూ సమానంగ తీస్కొమని చెప్తే… చాలా హుషారు చేసి చెరువులన్నీ నింపుకొన్నడు. మంచి ఎమ్మెల్యే ఉన్నడు సంతోషం. దేవాదుల ప్రాజెక్టు పూర్తయి ఈ జిల్లాకు వంద టీఎంసీల నీళ్లు వస్తయి. జిల్లా మంత్రి కడియం, దయాకర్‌రావు, మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఒత్తిడిచేసి మల్కాపురం రిజర్వాయర్ మంజూరు చేయించుకున్నరు. ఒక్కసారి అది పూర్తయితే వరంగల్ సస్యశ్యామలం అవుతుంది. ఆ పని నేను చేస్త అని మీకు హామీ ఇస్తున్నా. దయాకర్‌రావు గెలిచిపోతడు.. అది తెలిసిపోయింది. కానీ భారీ మెజార్టీతో గెలిపించాలి. మిమ్మల్ని చూసిన తర్వాత కడుపు నిండిపోయింది. సభలో ఎంత మంది ఉన్నరో.. ఇంచుమించు బయట అంతమంది ఉన్నరు. ఈ సభను చూస్తుంటే దయాకర్‌రావు 60వేల పైన భారీ మెజార్టీతో గెలుస్తారని అర్థమవుతున్నది.

ఒక్కటీ మనోళ్ల పేరు లేదు…
ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టుకూ మనోళ్ల పేర్లు లేవని కేసీఆర్ చెప్పారు. ఈ మధ్య బెంగళూరు పోయినాను. అదేమిటి అనడిగితే.. చిన్నస్వామి స్టేడియం అని చెప్పారు. మద్రాసు వెళ్లినప్పుడు పొన్నుస్వామి స్టేడియం! ఈయన ఎవరు? అని అడిగితే.. తమిళనాడులోని ఓ పెద్దమనిషి అని చెప్పారు. ఇక్కడ రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్. నెహ్రూ పేరు.. గొల్లయ్య పేరు.. మల్లయ్య పేరు! ఒక్కదానికీ కుమ్రంభీం పేరు పెట్టలేదు. మన గొప్ప నాయకుల పేర్లు ఉండవు. ఇందిరా, రాజీవ్ భజన తప్ప ఇంకోటిలేదు. పేరుగొప్ప ఊరుదిబ్బ. ఏమైనాయి ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్? చంద్రబాబు అక్రమంగా ఆర్డినెన్స్ ద్వారా లాగేసుకున్నవాటిల్లో ఆ ప్రాజెక్టుల హెడ్‌వర్క్స్ పోయినాయి. ఖర్చుచేసిన డబ్బులు మునిగిపోయినాయి. కాల్వలు పోయినాయి. అవి ఎవరు పెట్టినారు? తెలంగాణ జలదోపిడీ చేసిన వైఎస్ పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఒకటి పోలవరం కట్టుకోవాలి.. రెండోది దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టు! రెండు ప్రాజెక్టులూ తెలంగాణ నోరుకొట్టి, ఖమ్మంలో వేల ఎకరాలు, వేలమంది గిరిజనులను ముంచి ఆంధ్రకు నీళ్లు తీసుకుపోయేవి. పోలవరం మీద మేం యుద్ధంచేసినం. భద్రాచలంలో సభ పెట్టినం. జార్ఖండ్ నేత శిబుసోరెన్ వచ్చారు. మనం మాట్లాడుతుంటే, పోరాడుతుంటే.. కంటితుడుపు చర్య కింద పెట్టిన ప్రాజెక్టులు ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్. అవి నీళ్లు ఇచ్చేటివి కావు.

చంద్రబాబు.. ఖమ్మంకు డేంజర్
సీతారామ ప్రాజెక్టు కట్టనీయొద్దని కేంద్రానికి లేఖరాసిన చంద్రబాబు ఖమ్మంజిల్లా ప్రచారానికి వచ్చే ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఖమ్మంజిల్లాకు సాగునీరు రాకుండా అడ్డుకున్నోళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నారు? జిల్లా ప్రజలు మౌనం పాటిస్తే మీ గొంతుకు మీరు ఉరి బిగించుకున్నట్టే. చంద్రబాబు ఖమ్మంకు డేంజర్. ఈ జిల్లాకు అన్యాయాల పరంపర మళ్లీ జరుగబోతున్నది. తస్మాత్ జాగ్రత్త! మన వేలుతో మనమే పొడుచుకుందామా? మనకు మనమే ఉరితాడు బిగించుకుందామా? 50% అడవులుంటాయి. 14 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉంటుంది. 150 కిలోమీటర్లు గోదావరి ఉంటుంది.. అయినా ఈ జిల్లాలో కరువు ఉంటుందా? ఎంత మేధావులు కాంగ్రెస్, టీడీపీ నాయకులు? సిగ్గులేకుండా మళ్లీ పోటీకి వస్తున్నారు. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించేవారిని మనం గెలిపిస్తామా? మనం గొర్రెలమా? ఖమ్మంజిల్లా ప్రజలకు ఉరిపెడుతా.. సీతారామ ప్రాజెక్టు రానీయ.. అయినా మా ముగ్గురు అభ్యర్థులను గెలిపించాలి అంటూ బాబు ఇక్కడకు ఎలా వస్తాడు? చంద్రబాబు కుట్రలను పటాపంచలు చేయాలి. ఇంకా మౌనంపాటిస్తే.. అమాయకులుగా ఉంటే బతుకులు వ్యర్థమవుతాయి. జిల్లాకు నీళ్లురావు. చంద్రబాబుకు నీతి, నిజాయతీ ఉంటే.. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాసిన లేఖను వాపసు తీసుకున్న తర్వాతనే జిల్లాలో అడుగు పెట్టాలి. లేకుంటే మర్యాదగా ఉండదు.

రెండుతరాల కోసం డబుల్ బెడ్‌రూం ఇండ్లు
ఒక్కసారి ఇల్లు కడితే.. రెండు తరాలవారికి ఇంటి బాధ ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల వెనుక ఫిలాసఫీ ఏంది? మేం కడుతున్న ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు.. కాంగ్రెస్, టీడీపీలు కట్టిన ఏడు ఇండ్లతో సమానం. రాష్ట్రంలో 2.70 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణంలో ఉన్నవి. అంటే.. ఆ రెండు పార్టీల పాలనలో 16 లక్షల ఇండ్లకు సమానం. వాటిలోనూ అప్పులు! వాళ్లు ఎవరికీ ఫ్రీగా కట్టలే. పైరవీలు చేయాల్సి వచ్చేది. రూ.4వేల కోట్ల పాత రుణాలు నేను మాఫీచేసిన. మేం కడుతున్న డబు ల్ బెడ్‌రూం ఇండ్లు ఆ పద్ధతిలో లేవు. ఒక్క రూపాయి కూడా లోన్ లేదు. వందశాతం సబ్సిడీ. ఒక్కసారి కట్టిస్తే రెండుతరాలు ఇంటికోసం బాధపడొద్దు. లక్ష రూపాయలు ఎక్కువైనా ఫర్వాలేదు.. పిల్లర్లు పోసి కట్టమన్నం. శాశ్వత ప్రయోజనం ముఖ్యం. డబ్బాలాంటి ఇండ్లు కాదు.. ఇంట్లో మహిళలు, పసిపిల్లల ఆత్మగౌరవం ముఖ్యం. ఇది.. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేది. ఆరునెలలు ఆలస్యం కావచ్చు. ఒకసారి వచ్చిందంటే 70-80 ఏండ్లవరకు ఇంటి బాధ లేకుండా తీరిపోతది. దటీజ్ ద ఫిలాసఫీ! సొంత జాగాలు ఉన్నవారికి కూడా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టుకునే అవకాశం వచ్చే గవర్నమెంటులో కల్పిస్తం. కాంగ్రెస్ హయాంలో రూ. 5వేల కోట్లు మంజూరు చేసి, అంతా కుంభకోణం చేశారు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడే అప్పుడు ఇండ్ల మంత్రిగా కుంభకోణానికి పాల్పడిండు. కానీ మేం అట్ల చేయదలచుకోలేదు. పారదర్శకంగా ముందుకు పోతున్నం.

జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలి
టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ఎవరూ దిక్కులేనప్పుడు తెలంగాణకోసం గొంతు ఎత్తిన. భారతదేశం ఇవాళ దిక్కు, దిక్సూచి లేకుండా ఉంది. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఘోరంగా విఫలమయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని మోదీకి అధికారమిస్తే ఆయన కూడా చతికిలబడిపోయినాడే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ఈ దేశానికి ఇలాంటి పొలిటికల్ సిస్టమ్స్ పనికిరావు. అధికారాలను కేంద్రీకృతం చేస్తున్నారు. రాష్ర్టాల అధికారాలను హస్తగతం చేసుకుంటున్నారు. కర్రపెత్తనం చెలాయించే డిక్టేటర్ సిస్టమ్‌తో పనిచేస్తున్నారు. ఇలాంటివారిని ప్రతిఘటించి, నిలువరించి రాష్ర్టాల అధికారాలను పెంపొందించే కచ్చితమైన ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలి. చిల్లర మాటలు నాకురావు. ఢిల్లీలో చక్రంతిప్పుతా, తోకతిప్పుతా అనే మాటలు చెప్పను. కానీ ఢిల్లీని అదుపుచేసే రాజకీయాలు మాత్రం టీఆర్‌ఎస్ చేస్తది. పాలనలో కాంగ్రెస్, బీజేపీ ఫెయిల్ అయ్యాయి. అందుకే టీఆర్‌ఎస్ ఈ పాత్రను తీసుకుంటుంది.

సంక్షేమంలో మనమే నంబర్‌వన్
కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లవంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలుసు. సంక్షేమంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంది. ఇంతస్థాయిలో అభివృద్ధి ఎలా సాధ్యమైంది.. కేసీఆర్ ఏం చేస్తున్నాడనే విషయం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. కడుపుకట్టుకుని, నిబద్ధతతో పనిచేస్తున్నాం. అవినీతిని అంతమొందించి, రాత్రింబవళ్లు కష్టపడితేనే సాధ్యమవుతున్నది. రాష్ట్రం 17% వృద్ధి సాధిస్తున్నది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రవంటి పెద్ద రాష్ర్టాలు మనదాంట్లో సగంకూడా లేవు. రెండంకెల వృద్ధి సాధించిన రాష్ర్టాలు తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్ మాత్రమే. ఠంచన్‌గా ఒకటో తారీఖున పింఛన్లు ఇస్తున్నాం. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డకు రూ.12వేలు ఇస్తున్నాం. పేద విద్యార్థులకు విద్యనందించడంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఒక్కో విద్యార్థికి రూ.25వేలు ఖర్చు పెట్టి విద్య నేర్పుతున్నాం. దేశంలో ఎక్కడాలేని విధంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాచేస్తున్న రాష్ట్రం మనదే.

ఖమ్మంకున్న డేంజర్ చంద్రబాబు..
మన వేలితో మన కన్నే పొడుచుకుందామా? మన ఉరితాడును మనమే బిగించుకుందామా? 180 కిలోమీటర్లు గోదావరి పారే ఖమ్మం జిల్లాలో కరువు ఎట్లుంటది? కాంగ్రెస్, టీడీపీ నాయకులు సిగ్గులేకుండా మళ్లీ పోటీకి వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు ఖమ్మంకున్న డేంజర్.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.