Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కరీంనగారా

కరీంనగర్ గడ్డమీద నుంచి ఓ పాలసీని ప్రకటిస్తున్నా… తెలంగాణ రాష్ట్ర సమితి నూటికి నూరుశాతం సెక్యులర్ పార్టీ. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరంలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమిలో చేరం. మతతత్వ పార్టీలతో చేతులు కలిపే ప్రసక్తే లేదు అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు.

KCR Karimnagar Meeting

-ఎన్డీఏలో చేరం.. మతతత్వ పార్టీలతో చేతులు కలుపం – టీఆర్‌ఎస్ నూటికి నూరుశాతం సెక్యులర్ పార్టీ -కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ అధికారంలోకి రాదు -అధికారంలోకి రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమే -రెండు ఓట్లు టీఆర్‌ఎస్‌కే వేయాలి -కాంగ్రెస్‌వాళ్లతో చేతులు కలుపొద్దని చెప్పింది తెలంగాణ సమాజమే -ఏమరుపాటు వద్దు.. మోసపోతే ఒక తరానికి దెబ్బ అవుతుంది -పార్టీ మ్యానిఫెస్టోను అమలుచేసి తీరుతాం -ఆంధ్రోళ్లతో పంచాయితీ ఒడువలేదు -కరీంనగర్ శంఖారావం సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన టీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభావేదికపైనుంచి ఒకవైపు కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెడుతూనే మరోవైపు ఎన్డీఏలో చేరబోమని కేసీఆర్ స్పష్టంచేశారు. మరోవైపు టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను విప్పిచెప్పిన ఆయన అందులోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా గులాబీ అధినేత మాట్లాడుతూ, తెలంగాణ గంగాజమున తహజీబ్‌కు పెట్టింది పేరు. అన్ని మతాలు, కులాలు కలసి ఉంటాయి..ఉండాలి. అందుకే నూటికి నూరుపాళ్లు తెలంగాణ రాష్ట్ర సమితి సెక్యులర్ పార్టీ అని చెపుతున్నా.

ఇక్కడ హిందూ,ముస్లిం,సిక్కులు.. ఇలా అందరూ భాయి భాయి అంటూ కలిసి బతకాల్సి ఉంది. అందుకే మేం ఏ పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమిలో చేరేది లేదు అని స్పష్టం చేశారు. దేశంలోని వివిధ పార్టీల నాయకులు జయలలిత, మమతాబెనర్జీ, బిజూ జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ వంటి అనేక మంది తనతో మాట్లాడుతున్నారన్నారు. అందుకే చెపుతున్నా.. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు. ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని లెక్కలు చెపుతున్నారు. వాటిని చూసి మోసపోవద్దు. నేను చెపుతున్నా.. ఈ ఎన్నికల్లో 200 సీట్లకు మించి ఎన్డీఏ కూటమికి రావు. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల కూటమి మాత్రమేనని కేసీఆర్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకే వేయాలి.

కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనడం ధర్మం కాదు. తెలంగాణ సాధనకోసం కష్టపడింది ఎవరో గుర్తించాలి. ఒక్క మాట స్పష్టంగా చెపుతున్నా…ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. వీటికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ప్రజలు తమ తలరాతలు తామే రాసుకునే సమయం ఇది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. అలక్ష్యం ప్రదర్శించినా.. ఓ తరానికి దెబ్బ తగులుతుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. ఆంధ్రావాళ్లతో ఇంకా పంచాయతీ ఒడువలే.. చంద్రబాబు, వెంకయ్యనాయుడు మధ్య జరుగుతున్న పొత్తు ఏమిటి.. చంద్రబాబూ, నీ రాష్ర్టానికి నీవు పోక ఇక్కడ నీ దుకాణం ఎందుకు పెట్టినవ్? ఇంకా ఆంధ్రా పార్టీలు మనకు అవసరమా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్ అవిర్భావం జరిగిన సమయంలో చంద్రబాబు టీఆర్‌ఎస్‌పై వెకిలి మాటలు మాట్లాడారని, పుబ్బలో పుట్టి మగలో పోతుందని ఎద్ద్దేవా చేసారని గుర్తు చేసారు. పోయింది ఆ పార్టీయే తప్ప టీఆర్‌ఎస్ కాదన్నారు. మనం సకల జనుల సమ్మెలో ఉంటే జల్సాల్లో ఉన్నది వాళ్లు కాదా? మనం సమరం చేస్తుంటే.. వెకిలి నవ్వులు నవ్వింది కాంగ్రెస్ వాళ్లు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా.. ఒక్క మాటంటే రెండు మాటలంటాం.. ఒక్క విమర్శ చేస్తే వంద విమర్శలు చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అందుకే మీ తీర్పు కోరుతున్నాం.. తెలంగాణ పునర్‌నిర్మాణం కావాలన్నా.. బంగారు తెలంగాణ కావాలన్నా.. మన కలలు నెరవేరాలన్నా మీ బాధలు తెలిసిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే అధి సాధ్యం అవుతుంది అని కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకునే అంశంపై తెలంగాణ సమాజమే తమను వద్దని చెప్పిందని ఆయన చెప్పారు. ఎంతోమంది అమరుల త్యాగం, ఉద్యమాల పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

ప్రణాళిక అమలుచేసి తీరుతాం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలుచేసి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేసారు. ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నారు. టీ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల మా ఎన్నికల ప్రణాళికపై విమర్శలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన ప్రణాళిక అమలుకావాలంటే ఎనిమిది వేల కోట్లు కావాలని చెపుతున్నారు. అది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. ఆయన చెప్పేది నిజమే.. ఆ ప్రణాళిక అమలు కాంగ్రెస్‌కు సాధ్యం కాదు. ఎందుకంటే పావులా పనిచేసి బారాణా దిగమింగితే పనులు ముందుకు పోతాయా అన్ని ప్రశ్నించారు.

నేను చెపుతున్నా.. తూచా తప్పకుండా, వందకు వందశాతం టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలను ఖచ్చితంగా అమలుచేసి తీరుతాం. మ్యానిఫెస్టోను ఆషామాషిగా తయారు చేయలేదు. నాలుగైదు నెలలు కష్టపడి తయారు చేసాం. బలహీనవర్గాలకు 120 చదరపు గజాల స్థలంలో రెండు గదులు, ఒకహాల్, ఒక వంటగదితో కూడిన ఇల్లును రూ.3లక్షలతో కట్టి తీరుతాం. సంవత్సరానికి లక్ష ఇళ్లకు మూడువేల కోట్లు అవసరం అవుతాయి. .మేం బలహీనవర్గాలకు ఇళ్లు కడితే… అది ఎలా సాధ్యం అని పొన్నాల అంటున్నారు. ఎందుకు సాధ్యం కాదో చెప్పాలి అని కేసీఆర్ ప్రశ్నించారు. అంతే కాదు ఇళ్ల మంజూరు నుంచి నిర్మాణం వరకు ప్రస్తుతం ఉన్నట్లు తాబేదార్లు, పైరవీకారులు, దోపిడీ దారులు ఉండరన్నారు. ప్రస్తుతం ఉన్న లోన్లు రద్దుచేసి తీరుతామన్నారు. ఇంతా చేస్తామంటే పొన్నాలకు నచ్చడం లేదని విమర్శించారు.

వృద్ధులకు నెలకు రూ.వేయి, వికలాంగులకు నెలకు రూ. 1500 పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి తీరుతామన్నారు. గతంలో టీడీపీ నెలకు రూ.70, కాంగ్రెస్ రూ.200లు ఇస్తూ, దానికి గొప్పగా చెప్పుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు రైతుల సంక్షేమం గురించి హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మరిచిపోవడం ఆ పార్టీలకు ఆనవాయితీగా మారిందన్నారు. అయితే టీఆర్‌ఎస్ ఇచ్చిన మాట నిలుపుకుంటుందని, లక్ష రూపాయల లోపు అప్పులను మాఫీచేసి తీరుతామన్నారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్యను అమలుచేసి తీరుతామన్నారు. 15 ఎకరాల స్థలంలో సువిశాల పాఠశాలలు నిర్మించి తీరుతామన్నారు. ఈ పాఠశాలల్లో ఒక్క తరం చదివిస్తే చాలు తెలంగాణలో ఉన్న దరిద్రంతో పాటు కులాల పిచ్చి పోతుందన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల ఆయకట్టును సాగులోకి తెస్తామన్నారు. గోదావరి నుంచి 900టీఎంసీలు, కృష్ణ నుంచి 300 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయని, వీటిని తీసుకొని నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఆటో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి పన్ను మాఫీ చేయనున్నట్లు చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను అమలుచేసి తీరుతామని చెప్పామని, అధికారంలోకి వచ్చిన ఐదు అరు నెలల్లోనే అమలుచేసి తీరుతామన్నారు. అలాగే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మూడు సంవత్సరాల తదుపరి రైతులకు 24గంటల పాటు ఉచిత విద్యుత్తును ఇచ్చి తీరుతామన్నారు. టీఆర్‌ఎస్ తమ మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలనే కాంగ్రెస్ తిప్పి చెపుతోందన్నారు. నకలు కొట్టెదానికైనా అకల్ ఉండాలె అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, ఇతర నాయకులు నాయిని నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డితో పాటుగా కరీంనగర్ బరిలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.

ఏకవీరుడు కేసీఆర్ : కే కేశవరావు తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ ఏకవీరుడని, ధన్యజీవుడని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు అన్నారు. 14 సంవత్సరాల క్రితం ఈ గడ్డపై నుంచే ఉద్యమాన్ని ప్రారంభించినపుడు ఎవరు ఏమన్నారో తనకు తెలుసునని, కేసీఆర్ ఉద్యమం, అమరుల త్యాగ ఫలితంగానే నేడు తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. నేడు తెలంగాణ తెచ్చింది మేము అనే వాళ్లంతా నాడు వెన్నుపోటు పొడిచినవారు, వద్దన్నవారేనంటూ కాంగ్రెస్ నేతలపై విమర్శలు సందించారు.

ఇది కర్మ భూమి, యుద్ధభూమి అని, ఇక్కడివారు జైలుపాలైనందుకు కారకులైన వారు కూడా నేడు జై కొడుతుంటే సిగ్గు వేస్తున్నదన్నారు. నవ తెలంగాణ, బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్‌లో శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను గెలిపించడానికి అందరు నడుం బిగించాలన్నారు.

తెలంగాణ అడ్డ కరీంనగర్: నాయిని తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల క్రితం ఇక్కడే ప్రారంభమైంది, ఇది పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ అడ్డ అని టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహరెడ్డి అభివర్ణించారు. తెలంగాణ పునఃనిర్మాణం కోసం ఇదే గడ్డపై మొదటి సభ జరుగడం సీమాంధ్ర పార్టీలకు సింహ స్వప్నంగా నిలిచిందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్లే.. జాగ్రత్త సుమా అని హెచ్చరించారు. తెలుగుదేశం మళ్లీ పడగవిప్పింది, దానిని దెబ్బకొట్టాలన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష, అమరుల త్యాగఫలితంగా తెలంగాణ వచ్చిందని అన్నారు. మేము లాఠీ దెబ్బలు తిన్నప్పుడు ఏనాడు కాంగ్రెస్ వారు జై తెలంగాణ అనలేదని గుర్తుచేశారు. కారు చాల స్పీడుగా దూసుకుపోతుందని, ఎవరూ ఆపలేరని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం : వినోద్‌కుమార్ బంగారు తెలంగాణ, నవతెలంగాణ నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యులు, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. 14 సంవత్సరాల క్రితం మే 17, 2001న ఇదే గడ్డపై సింహగర్జన చేసిన కేసీఆర్, ఇదే గడ్డపై తెలంగాణ పునర్‌నిర్మాణం కోసం ప్రణాళికను ప్రకటించడం అభినందనీయమన్నారు. ఇదే గడ్డపై అవురేక్ దక్కా తెలంగాణ పక్కా అని చేసిన నినాదం కూడ నిజమైందన్నారు. తెలంగాణ సాధనకోసం కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

ఉద్యమ కేసులే నా ఆస్తులు: బాల్క సుమన్ నాదగ్గర డబ్బులు లేకపోవచ్చు. పరిశ్రమలు లేకపోవచ్చు. కానీ, వందలాది ఉద్యమ కేసులే నా ఆస్తులు. మీ బిడ్డగా ఆశీర్వదించండి ఈ పేదోడు గెలుస్తాడని టీఆర్‌ఎస్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. భారతదేశ చరిత్రలో దళిత విద్యార్థి నాయకుడికి టికెట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని, ఇందుకు యావత్ తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించాలని కోరారు.

మానకొండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఆరెపల్లి మోహన్ ఒక్కరోజు కూడా అమరుల కుటుంబాలను ఓదార్చలేదు. నేను మానకొండూరు నియోజకవర్గ పరిధిలో తెలంగాణ కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలతో కలసి నామినేషన్ దాఖలు చేశాను అని తెలిపారు. కరీంనగర్ కధనానికి తూట అని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి జై కొట్టిన ఆరెపల్లిని పక్కనపెట్టి ప్రజలు తనకు అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణను అభివద్ధిపరిచే శక్తి కేసీఆర్‌లోనే ఉందని రామగుండం అసెంబ్లీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. తెలంగాణ మేమే తెచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందని, కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర నేతలకు తొత్తులుగా పనిచేశారని ధ్వజమెత్తారు.

టీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నేడు పునర్నిర్మాణం కోసం కంకణం కట్టుకున్న పార్టీ కూడా టీఆర్‌ఎస్సే అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు అవుతుందని కోరుట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కే విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించి బంగారు తెలంగాణ సాధించుకుందామని, సీమాంధ్ర పాలకులకు చెంపదెబ్బ కొట్టేవిధంగా ప్రజాతీర్పు ఉండాలని సూచించారు. కాంగ్రెస్ మాటలను నమ్మకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి, టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని చొప్పదండి అభ్యర్థి బొడిగ శోభ పిలుపునిచ్చారు.

మంథని గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని ఆ నియోజకవర్గం అభ్యర్థి పుట్ట మధు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. యువత భవిష్యత్తు కోసం బంగారు తెలంగాణ అవసరమని జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్తు రావాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీకి ఓటు వేస్తే టీడీపీకి వేసినట్లేనని కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. పేరంటానికి పోతే భోజనం చేసి కట్నం ఇచ్చే సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని, చావుదాక పోయి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కు 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించి కానుకగా ఇద్దామన్నారు. సీమంధ్ర నేతలు చంద్రబాబు, కిరణ్, కేవీపీలు ఒక్కటయ్యారని, బీజేపీ ముసుగులో తెలుగుదేశం, కాంగ్రెస్ ముసుగులో కేవీపీ వస్తున్నారని చెప్పారు. అమరుల త్యాగఫలితంగా, కేసీఆర్ ఆమరణ దీక్ష, పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ దశ, దిశను నిర్ణయించేవి ఈ ఎన్నికలని వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ అన్నారు.

కేసీఆర్ ఎన్నికల శంఖారావం లో ప్రజలకు ఇచ్చిన మాటలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించి కేసీఆర్‌ను సీఎం చేస్తే.. నవ, బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నా రు. కరీంనగర్ గడ్డపై నుంచి 2001 మే 17న సింహం లా గర్జించిన కేసీఆర్ తెలంగాణ వచ్చేవరకు మడమ తిప్పకుండా పోరాటం చేశారని హుస్నాబాద్ అభ్యర్థి సతీష్‌కుమార్ అన్నా రు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ శంఖారావం సభ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కేసీఆర్ రాకకుముందు అభ్యర్థులతో మాట్లాడించారు. సభలో ఎమ్మెల్సీ మహమూద్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుల ఉమ, పార్టీ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సింగ్, మహిళా, మైనార్టీ, యువజన విభాగం అధ్యక్షులు రేవతిరావు, అక్బర్, కట్ల సతీష్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.