Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కరీంనగర్ కళకళలాడాలి

-నగరాభివృద్ధికి శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు -బ్లూప్రింట్ సిద్ధం చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి -ఉత్తర తెలంగాణకు మకుటాయమానంగా మానేరు రివర్ ఫ్రంట్ -తక్షణం రూ.25 కోట్లు విడుదల -కరీంనగర్‌లో పచ్చదనం పెంచేందుకు నాలుగైదు లక్షల మొక్కల పెంపకం -అంతర్జాతీయస్థాయిలో కరీంనగర్ కళాభారతి, రెండు హాళ్ల నిర్మాణం -నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ -జిల్లా నేతలు, అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ -హరితహారం కార్యక్రమానికి నేతలు రూ.2 కోట్ల విరాళం

రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయటం లక్ష్యంగా శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం తదితర తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి కరీంనగర్ గేట్‌వేగా ఉంటుందని, ఈ మేరకు నగరాన్ని తీర్చిదిద్దాలన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై బుధవారం ప్రగతి భవన్‌లో విస్త్రృతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ శశాంక్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, సీఎంవో అధికారులు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నా రు. మానేరు రివర్ ఫ్రంట్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.506 కోట్లలో రూ.25 కోట్లను విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు నిధులను విడుదల చేశారు.కరీంనగర్‌ను అన్నివిధాల అభివృద్ధి చేయటం కోసం శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నగరంలో వివిధ రంగాల పరిస్థితి ఎలా ఉంది? ఏం చేయాలి? అనే అంశంపై అధ్యయనం చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్‌ను ఆదేశించారు. మరోవైపు, కరీంనగర్‌తోపాటు మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్లు ఉన్న అన్ని పట్టణాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే…

నగరం మ్యాపింగ్ కరీంనగర్ నగరాన్ని మొత్తంగా మ్యాపింగ్ చేయాలి. నగరాభివృద్ధికి బ్లూప్రింట్ తయారు చేయాలి. 90 కి.మీ.ల పొడవుండే మానేరు రివర్ ఫ్రంట్‌ను ఉత్తర తెలంగాణకు మకుటాయమానంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం. విశాలమైన పచ్చిక బయళ్లు, యోగాకేంద్రాలు, వాటర్‌స్పోర్ట్స్, బోటింగ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. నదికి అభిముఖంగా స్వర్గధామంగా ఉండే నివాసగృహాలు నిర్మిస్తాం. మొదటి గృహాన్ని నేను, రెండవ గృహాన్ని ఈటల రాజేందర్ కొనుగోలు చేస్తారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాం. దీనికోసం బడ్జెట్లో కేటాయించిన నిధులలో రూ.25 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నాం. పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం. రివర్‌ఫ్రంట్‌ను మొదట చేగుర్తి లింగాపూర్ వరకు, రెండవ దశలో వేగురుపల్లి వరకు సుందరీకరిద్దాం. దీంట్లోభాగంగా నదికి ఇరువైపులా అందమైన చెట్లను పెంచాలి. పదిన్నర కి.మీ.ల పొడవున్న ఎల్‌ఎండీ కట్టపై కూడా విరివిగా చెట్లు పెంచుదాం. డ్యామ్ మీద టూరిస్ట్ స్పాట్, వ్యూపాయింట్, రెస్టారెంట్, బోటింగ్ ఏర్పాటు చేస్తాం. కాటేజీలు నిర్మిస్తాం. కేంద్రప్రభుత్వం ఇచ్చే రూ.15 కోట్లతోపాటు రాష్ట్రప్రభుత్వం మరో రూ.25 కోట్లు జతచేసి మొత్తం రూ.40 కోట్ల వ్యయంతో మానేరు డ్యామ్ సుందరీకరణ పనులు చేస్తాం. కరీంనగర్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చాలి. మానేరు నుంచి అలుగునూరు బ్రిడ్జి వరకు సర్కారు తుమ్మ చెట్లను, లొట్టపీసు చెట్లను వెంటనే తొలగించాలి. నగరంలో పచ్చదనం పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ కింద దాదాపు నాలుగైదు లక్షల మొక్కలు పెంచుతాం. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం ఐఎఫ్‌ఎస్ అధికారి వీ ఆంజనేయులను ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నాం. నగరంలో హరితహారం కార్యక్రమానికి రూ.10 కోట్లు ఖర్చు చేస్తాం. పండ్ల చెట్లు, నీడ చెట్లు, పూల చెట్లు, అలంకరణ చెట్లు… అన్నింటిని ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇంటింటికీ వెళ్లి అటవీశాఖ సర్వే జరిపి ఏ మొక్కలు అవసరమో ప్రజల అభిప్రాయాలను సేకరించాలి.

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట రోడ్లను వెడల్పు చేయాలి. బస్సులు ఆగే చోట బస్‌బేలు నిర్మించాలి. రోడ్లపై బస్సులు నిలిపే పద్ధతికి స్వస్తి పలకాలి. దీనివల్ల ట్రాఫిక్ నియంత్రణ సులభమవుతుంది. బస్ బేల నిర్మాణంలో కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలను భాగస్వాములు చేయాలి. నగరంలో మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. నగరంలో కొత్తగా పోలీసు కమిషనరేట్ ఏర్పాటైనందున దానికోసం ప్రస్తుత పోలీసు కార్యాలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా కమిషనరేట్ ఆఫీసును నిర్మిస్తాం. హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్లే కరీంనగర్‌లోకూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తాం. నగరంలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు, పోలీసు కార్యాలయాలు నిర్మించాలి. దీనికి అవసరమైన స్థలాలను రెవెన్యూ అధికారులు గుర్తించాలి. ప్రస్తుతం కలెక్టరేట్ ఉన్న ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్, జిల్లా పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను రీ మోడలింగ్ చేస్తాం. కలెక్టర్‌కు అక్కడే క్యాంపు కార్యాలయం కడతాం. కరీంనగర్‌ను ఆనుకుని జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నది. మూడున్నర కి.మీ.ల లింక్ జత చేస్తే ఓఆర్‌ఆర్ ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించాలి. -మల్టీపర్పస్ స్కూల్ ప్రాంతంలో విశాలమైన పార్క్ నిర్మిస్తాం. సర్కస్ గ్రౌండ్‌ను అలాగే ఉంచి దాని చుట్టూ పెద్ద ఎత్తున చెట్లు పెంచుతాం. సిటిజన్ క్లబ్‌ను కొనసాగిస్తాం. ప్రస్తుతం ఉన్న కళాభారతి ప్రదర్శనలకు అంత అనువుగా లేదు. కాబట్టి, హెలీప్యాడ్ కోసం ఉపయోగిస్తున్న పదెకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్ కళాభారతి నిర్మిస్తాం. 500, 1200 మంది కూర్చునే విధంగా రెండు వేర్వేరు హాల్స్ నిర్మిస్తాం. -నగరంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం నాలుగు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు మంజూరు చేశాం. వాటి నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి. -నగరంలో ఐదుప్రాంతాల్లో ఐదు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించాలి. గజ్వేల్‌లో మాదిరిగా పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వీటిని నిర్వహించాలి. రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించే ఐదు మార్కెట్ల కోసం మార్కెటింగ్ శాఖ రూ.5 కోట్లు, ఎస్డీఎఫ్ నుంచి 20 కోట్లు ఖర్చు చేస్తుంది. -నగరంలో నాలుగు చోట్ల ఖనన వాటికలు, మరో నాలుగు చోట్ల దహన వాటికలు నిర్మించాలి. దీనికోసం వెంటనే స్థలసేకరణ జరుపాలి. -నగరంలో చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తాం. అనువైన స్థలాలను వెంటనే సేకరించాలి. -కొత్తగా వస్తున్న 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో 4300 మెగావాట్లు ఉత్పత్తి చేసే అల్ట్రామెగా ప్లాంట్‌గా రామగుండం ఎన్‌టీపీసీ మారుతుంది. రామగుండానికి కరీంనగర్ ముఖద్వారంగా ఉంది. ఆటవీ అందాలను, ప్రకృతి సౌందర్యాన్ని, గోదావరి నదిని చూడాలంటే కూడా కరీంనగర్ నుంచే వెళ్లాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కరీంనగర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని సీఎం కేసీఆర్ చెప్పారు.

కరీంనగర్‌లో హరితహారం ప్రారంభం ఈసారి హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కరీంనగర్‌లో ప్రారంభించనున్నారు. అదేరోజు నగరవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటుతారు. దీనికోసం కరీంనగర్ గ్రీన్‌బ్రిగేడ్‌ను ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయి అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కరీంనగర్ హరితహారం కార్యక్రమం కోసం రాష్ట్రప్రభుత్వం కేటాయించిన రూ.10 కోట్లకు అదనంగా తాము కూడా నిధులు ఇస్తామని పలువురు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. ఎంపీ వినోద్ కుమార్ రూ.50 లక్షలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఖర్చు చేస్తామని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.