Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కర్ణాటకలో కల్లుకు కాటు.. గౌడన్నకు చేటు

-బీజేపీ సర్కారు కల్లుకార్మికులకు వెన్నుపోటు
-కర్ణాటకలో కల్లుగీతపై నిషేధం.. ఎత్తివేతకు గీత కార్మికుల ఉద్యమం
-4 ఏండ్లుగా పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం.. ఇక ఇక్కడ ఉద్ధరిస్తుందట
-కల్లుగీత వృత్తితో బీజేపీ డేంజర్‌ గేమ్‌
-అక్కడ ఉరితాళ్లు.. ఇక్కడ గారడీలు
-2023లో బీజేపీని ఓడిస్తాం: ఈడిగలు
-మునుగోడులో నిలదీస్తున్న గౌడన్నలు

కర్ణాటకలో కల్లుగీత వృత్తికి ఉరితాడు పేనిన బీజేపీ.. తెలంగాణలో వృత్తిదారులను ఆదుకుంటామంటూ ఉత్తమాటలు చెప్తున్నది. అక్కడ గీతవృత్తిపై నిషేధాన్ని కొనసాగిస్తూ.. ఇక్కడ గౌడన్నలకు గారడీలు చూపుతున్నది. రాష్ర్టానికో వైఖరితో వృత్తిదారులతో రాజకీయ క్రీడ ఆడుతున్నది.

2000 సంవత్సరంలో కల్లుగీత వృత్తిని, కల్లు అమ్మకాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. రెండు దశాబ్దాలకు పైగా ఈడిగ కులస్థులు నిషేధం ఎత్తివేతకు ఉద్యమిస్తున్నారు. 22 ఏండ్లలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు మారుతూ వచ్చినా.. కల్లుగీత కార్మికులను పట్టించుకోలేదు. వృత్తి అస్తిత్వంపై ఆలోచన చేయలేదు.

అధికారంలోకి రాగానే నిషేధం ఎత్తివేస్తామంటూ ఈడిగ కులస్థులను బీజేపీ మోసగించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి ఆందోళనల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొన్న కమలం పార్టీ.. అధికారంలోకి రాగానే హామీని అటకెక్కించింది. నిషేధాన్ని కొనసాగిస్తూ.. నిరసనలను అణచివేస్తున్నది.

తెలంగాణలో మాత్రం వృత్తిదారుల సంక్షేమం శిఖరాగ్రంలో ఉంది. సమైక్య పాలనలో దెబ్బతిన్న కల్లుగీత వృత్తికి ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారు జవసత్వాలను ఇచ్చింది. గౌడన్నకు తోడుగా నిలిచి, ముందుకు నడిపిస్తున్నది. కర్ణాటకకూ తెలంగాణకూ అదే తేడా. టీఆర్‌ఎస్‌కూ బీజేపీకీ అదే వైరుధ్యం.

మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గౌడ కులస్థుల ఓట్లను కొల్లగొట్టడానికి భారతీయ జనతాపార్టీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. గీతకార్మికుల సంక్షేమానికి, ఆ సామాజికవర్గం అభ్యున్నతికి ఏదో ఒరగబెడుతామని మాయమాటలు చెబుతున్నది. తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వృత్తిదారుల పొట్టగొడుతూ.. కల్లువృత్తికి ఉరితాడు పేనుతున్న విషయాన్ని మాత్రం దాచేస్తున్నది. మన పొరుగున ఉన్న బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీతపై నిషేధాన్ని కొనసాగిస్తున్నది. దీన్ని నిరసిస్తూ ఈడిగ (తెలంగాణలో గౌడ్స్‌) కులస్థులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ నిషేధం ఎత్తివేస్తామని ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ హామీ ఇస్తున్నది. తీరా ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నది. డొల్ల హామీలను నమ్మి మోసపోతే.. అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఏం చేస్తుందో అనేదానికి కర్ణాటకే పెద్ద ఉదాహరణ. ఎన్నికలకు ముందు ఈడిగల ఆందోళనలో స్వయంగా పాల్గొని మద్దతు ప్రకటించిన బీజేపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక నిషేధం ఎత్తివేయకపోగా, నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అదే బీజేపీ.. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో గౌడసంక్షేమం గురించి మాట్లాడటం నవ్వులపాలవుతున్నది.

వృత్తిపై నిషేధం.. రెండు దశాబ్దాలుగా పోరాటం
కల్లుగీత వృత్తిదారుల్ని మనం గౌడన్నలని పిలుస్తున్నట్టుగానే కర్ణాటకలో వారిని ఈడిగ కులస్థులు అంటారు. రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నమ్ముకున్న ఈడిగ కులస్థుల జనాభా అత్యధి కం. రాష్ట్రంలోని 17 శాసనసభ నియోజకవర్గా ల్లో పూర్తి అధిపత్యం కలిగిన వీరి జనాభా ప్రధానంగా దక్షిణ కర్ణాటక, హైదరాబాద్‌ కర్ణాటక (రాయచూర్‌, బీదర్‌, గుల్బర్గా) ప్రాంతాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉంది. 2000 సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వం కల్లుగీత వృత్తిని నిషేధించింది. చెట్లు గీయడం, అమ్మడంపై ఈ నిషేధం కొనసాగుతున్నది. అప్పటినుంచి గీతకార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనాధారమైన వృత్తిపై నిషేధం విధించడంతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఈడిగ కులస్తులు రెండు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నారు.

బీజేపీని నమ్మి మోసపోయిన ఈడిగలు..?
కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు బీజేపీ కల్లుగీత వృత్తిని అస్త్రంగా వాడుకుంది. తప్పంతా గత ప్రభుత్వాలదేనని నమ్మబలుకుతూ ఈడిగలకు చేరువయ్యే ప్రయత్నం చేసింది. తాము అధికారంలోకి రాగానే నిషేధం ఎత్తివేస్తామని పదే పదే చెప్పారు. ప్రధానంగా 2019 ఎన్నికల సమయంలో దాన్ని బలంగా ముందుకు తెచ్చారు. ఈడిగలు నిజమేనని నమ్మారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ దాని ఊసే ఎత్తలేదు. యెడియూరప్ప ముఖ్యమంత్రి అయినా ఈడిగల బతుకులు మారలేదు. కులవృత్తిని కాపాడుకునేందుకు ఈడిగలు ఆందోళనబాట పట్టారు. బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహమండలి ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. అయితే బవసరాజ్‌ బొమ్మై ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. నిషేధం తొలగలేదు. కుల వృత్తులను నాశనం చేసి తమ జీవనాధారమైన కల్లు నిషేదాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి వచ్చే ఏడాది 2023లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఈడిగ రాష్ట్రీయ మహమండలి హెచ్చరిస్తోంది. ఈ మండలి ప్రతినిధి బృందం పలుమార్లు ముఖ్యమంత్రి బొమ్మైని కలిసి నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పైగా ఆందోళనపైనా బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టింది. ప్రజా నిరసనలను ఎక్కడికక్కడ అణచివేస్తున్నది. కల్లుగీతపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామి ఈ ఏడాది మూడు పర్యాయాలు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఒక గీతకార్మికుడు ఏకంగా చెట్టుపైనే నిరవధిక దీక్షకు దిగడం ఉద్యమం తీవ్రతకు అద్దం పడుతున్నది.

గౌడన్నల తోడు నిలిచిన తెలంగాణ సర్కారు
కర్ణాటకలో కల్లుగీత వృత్తి అస్థిత్వాన్ని పాలకులే ప్రమాదంలో పడేయగా.. తెలంగాణలో మాత్రం కేసీఆర్‌ ప్రభుత్వం వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. సమైక్యపాలనలో దెబ్బతిన్న కులవృత్తులకు స్వరాష్ట్రంలో పూర్వవైభవం కల్పిస్తున్నది. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి, గౌడ కులస్థుల ఆర్థికాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్నన్ని చర్యలు దేశంలో మరే రాష్ట్రంలోనూ తీసుకోలేదని ఆ సామాజికవర్గం నేతలే కొనియాడిన సందర్భాలనేకం. ఇతర రాష్ర్టాల్లో ఉన్న ఆ సామాజికవర్గం నేతలు సైతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలకు కితాబివ్వడంతోపాటు, తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేయాలని డిమాండ్‌ చేసిన ఉదంతాలూ ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ వృత్తిని నమ్ముకున్న వారికి అమలు చేస్తోన్న కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి కర్ణాటక, కేరళ రాష్ర్టాల అధ్యయన బృందాలు కూడా తెలంగాణకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే.

బీజేపీకి గుణపాఠం చెప్తాం
పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడులో లేనివిధంగా కల్లుగీతపై నిషేధం కర్ణాటకలోనే అమలవుతున్నది. నిషేధం ఎత్తివేయాలని మా ఆందోళన రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. నిషేధం ఎత్తివేస్తామని నమ్మబలికిన బీజేపీ అధికారంలోకి రాగానే మాటమార్చింది. బసవరాజ్‌ బొమ్మై నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తాం. 17 నియోజక వర్గాల్లో ఈడిగలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. కులవృత్తిని దెబ్బతీసినవారిని వారు ఎప్పటికీ వదలిపెట్టరు.
– ప్రణవానంద, జాతీయ అధ్యక్షుడు (ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి)

తెలంగాణలో గీతకార్మికుల సంక్షేమ కార్యక్రమాలెన్నో
-వైఎస్‌ హయాంలో హైదరాబాద్‌లో కల్లు అమ్మకాన్ని నిషేధించగా.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే తిరిగి కల్లు దుకాణాలను తెరిపించింది.
-370 ఏండ్ల కిందే బహుజనులను ఏకం చేసి బహుజన రాజ్యం స్థాపించిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది.
-మద్యం దుకాణాల్లో గౌడన్నలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఈ సామాజిక వర్గానికి 393 దుకాణాలు దక్కాయి. వారి ఆర్థికాభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడింది.
-50 ఏండ్ల వయస్సు పైబడిన గీత కార్మికులకు ప్రతి నెలా రూ.2016 పెన్షన్‌ చెల్లిస్తున్నది. దీనివల్ల 70 వేల మందికి లబ్ధి చేకూరుతున్నది.
-ప్రమాదవశాత్తు మరణించిన గీతకార్మికుల కుటుంబాలకు అందించే సహాయాన్ని రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. శాశ్వత అంగవైకల్యం కలిగితే ఇచ్చే బీమా పరిహారాన్ని రూ.50 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు దీని ద్వారా 4,092 మంది కార్మికులకు లబ్ధి చేకూరింది.
-నీరా పాలసీని రూపొందించి గౌడ కులస్థులకే నీరాపై పూర్తి హక్కులు కల్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో రూ.10 కోట్ల వ్యయంతో 5 ఎకరాలలో నీరా ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది.
-కల్లు దుకాణాల లైసెన్స్‌ కాలపరిమితి 5 ఏండ్ల నుంచి 10 ఏండ్లకు పెంచడంతోపాటు చెట్టు పన్ను రద్దు చేసి, కల్లు రవాణాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది.
-శాశ్వతంగా కల్లు దుకాణాలను రెంటల్స్‌ రద్దు చేసి, రూ.18కోట్ల పాత బకాయిలను మాఫీ చేసింది.
-గౌడ కులస్థుల ఆత్మగౌరవ భవనం కోసం కోకాపేటలో 5 ఎకరాల భూమిని, రూ.5 కోట్ల నిధులను కేటాయించింది.
-నీరా, నీరా సంబంధిత ఉత్పత్తుల అ మ్మకం, విస్తరణ, ప్రచారం కోసం హై దరాబాద్‌ నగర నడిబొడ్డున నెక్లెస్‌రోడ్‌లో నీరా కేఫ్‌ నిర్మాణం చేపట్టింది.
-కల్లు గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.25వేలు చెల్లిస్తున్నది. ఒకవేళ ప్రమాదంలో గాయపడితే వైద్య ఖర్చుల కోసం రూ.15వేలు చెల్లిస్తున్నది.
-హరితహారంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 5 కోట్ల తాటి, ఈత, జీలుగ, ఖర్జూర మొక్కలు నాటింది.
-టీఎఫ్‌టీ లైసెన్సుదారులు కల్లుగీత సహకార సంఘాలుగా మార్చుకొనేందుకు అవకాశం కల్పించింది.
-ఆరోగ్య ప్రదాయిని అయిన ఔషధ విలువలుగల పానీయంగా కల్లును ప్రోత్సహిస్తున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.