Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కార్యాచరణ సిద్ధం..

-కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రణాళిక -ప్రజాభిప్రాయానికి పెద్దపీట -రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఏర్పాటు -బలవంతంగా కలిపారన్న భావన రాకూడదు -జిల్లాలు, మండలాల పునర్విభజనపై సీఎం కేసీఆర్ -పది జిల్లాల కలెక్టర్లు,అధికారులతో సమీక్ష -తెలంగాణలో అభివృద్ధి సూచి ఎక్కువ -2024 నాటికి 5 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ -ఎస్సీ, ఎస్టీ, ఈబీసీల్లో పేదలను అభివృద్ధి చేయాలి

CM-KCR-meeting-with-district-collectors

కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రణాళిక రూపుదిద్దుకున్నది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చేలా కార్యాచరణకు రంగం సిద్ధమయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయానికి పెద్ద పీటవేయాలని, అదే సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లాల కలెక్టర్లకు స్పష్టంచేశారు. తమను ఇతర మండలాల్లో బలవంతంగా కలిపారన్న భావన ప్రజలకు రానీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒక్క జిల్లాలే కాదు.. మండలాలను కూడా పునర్విభజిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రచించాలని దిశానిర్దేశం చేశారు. 2024 వరకు తెలంగాణ బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు ఉంటుందని, తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందించడమే ప్రభుత్వం మీదున్న బాధ్యతని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చక్రవడ్డీ మాదిరిగా రెట్టింపు అవుతూ, వేగంపుంజుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాగునీరు, సాగునీరు మీద యుద్ధం పూర్తి కాగానే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఈబీసీల్లో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్పారు. జిల్లాలు, మండలాల పునర్విభజనకు కొనసాగుతున్న కసరత్తు, పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దైవ కృపవల్ల అనుకున్న దానికంటే ఎక్కువగానే తెలంగాణలో అభవృద్ధి సూచీ కనిపిస్తున్నది.

కాలం ఇదేవిధంగా అనుకూలిస్తే ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2019-2020 వరకూ బడ్జెట్ అంచనా రెండు లక్షల కోట్లకు చేరుకుంటది. ఐదేండ్లకు సహజంగా రెట్టింపు అయితది. అంటే నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటది. అయితే, అంచనాలకు మించి మరో లక్ష కోట్లు జమ అయ్యి 2024 వరకు ఐదు లక్షల కోట్ల రూపాయలకు తెలంగాణ బడ్జెట్ అంచనా వ్యయం చేరుకుంటది అని సీఎం వివరించారు. పెరిగే అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో ఉంచుకుని పాలనా ఫలాలు ప్రజలకు క్షేత్రస్థాయిలోకి చేరుకునేలా ప్రణాళికలు రచించడమే ప్రజా ప్రభుత్వం మీదున్న బాధ్యతగా కేసీఆర్ అభివర్ణించారు.

పేద కుటుంబాల అభివృద్ధి… ప్రస్తుతం తాగునీరు, సాగునీరు పునరుద్ధరణే లక్ష్యంగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొద్దికాలంలోనే పూర్తవుతాయని పేర్కొన్న సీఎం.. తదనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఇప్పటినుంచే రూపకల్పన చేయాలన్నారు. 2024కల్లా ఐదు లక్షల కోట్ల బడ్జెట్‌తో ఎంతో రిచ్‌గా ఉంటాం. మరి, ఆ వనరులన్నీ ఎటు పోవాలి? తాగునీరు, సాగునీరు మీద యుద్ధం అయిపోతే తర్వాత పేదరికం కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు ఈబీసీల్లో ఉన్న ఒక్కొక్క పేద కుటుంబాన్ని టార్గెట్ చేసి అభివృద్ధి చేస్తం అని సీఎం తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయవలసిన మండలాల గురించి ఇప్పటిదాకా చేసిన కసరత్తును ఒక్కో జిల్లా కలెక్టర్ నుంచి ఆరా తీశారు. ఆయా మండలాల్లో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి? వారితో మాట్లాడిండ్రా? స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించిండ్రా? అని సీఎం కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలను గుర్తించి దగ్గరలో ఉన్న మండల కేంద్రానికి కలిపే సందర్భంలో ప్రజాభిప్రాయం ముఖ్యమన్నారు. దేరీజ్ నో థంబ్ రూల్.. ఓన్లీ లిబరల్ (ఇట్లనే ఉండాలని కాదు.. ప్రజల సౌకర్యం దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలుండాలె) అని స్పష్టం చేశారు. ప్రస్తుత జిల్లానుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా? ఒక నియోజకవర్గం ఒకటికి మించి జిల్లాల్లో విస్తరించి ఉందా? అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏమిటి? అని సమీక్షించాలన్నారు. మీరు మీ కసరత్తు పూర్తి చేయండి. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కూర్చుని చర్చించండి. ఓ అవగాహనకు రండ్రి. ఆ తర్వాత అభ్యంతరాల కోసం ప్రజా ప్రకటన ఇద్దాం. ఆ తర్వాత చివరిగా నోటిఫికేషన్ జారీ అయితది అని చెప్పారు.

కొత్త మండలాలు.. రెవెన్యూ డివిజన్లు ఎన్ని?: సీసీఎల్‌ఏ కమిషనర్ రేమండ్ పీటర్ అందించిన వివరాలతో ప్రారంభమైన సమావేశంలో మంగళవారం జరిగిన కసరత్తుపై సీఎం సమీక్షించారు. ఎన్ని కొత్త మండలాలుండాలి? ఎన్ని రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాలుండాలి? ఎన్ని కొత్త జిల్లాలుంటే ప్రజలకు సౌకర్యం? అనే అంశాలు మంగళవారం నాటి సమావేశంలో చర్చించినట్టు రేమండ్ పీటర్ ముందుగా వివరించారు. సుమారు నలభై వేల నుంచి యాభై వేల జనాభా ఉండేలా ఒక మండలం ఏర్పాటు; దాదాపు ఇరవై మండలాలతో జిల్లా ఏర్పాటు; సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్ మండల ఏర్పాటు; ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో పది నుంచి పన్నెండు మండలాలు, రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు; ఒక అసెంబ్లీ సెగ్మెంటుకు ఐదు నుంచి ఆరు మండలాలు ఉండే విధంగా కసరత్తులు చేయాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

-ప్రస్తుత నియోజకవర్గాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. -బలవంతంగా తమను వేరే మండలంలో కలిపారన్నభావన ప్రజలకు రాకూడదు. -ఆయా గ్రామాలను వివిధ మండలాలలో కలుపుతున్న, తీసివేస్తున్న సందర్భాల్లో ప్రజాభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుంది. -పెద్ద మండలాలను రెండుగా చేసే అంశాలను పరిశీలించాలి. -ప్రజల అవసరాలు, సెంటిమెంట్లను సమన్వయం చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. థంబ్ రూల్ కాదు.. స్వేచ్ఛగా ఆలోచించాలి

-అటవీ ప్రాంతంలో ఉండే మండలాల విషయంలో భౌగోళిక విస్తీర్ణతను పరిగణనలోకి తీసుకోవాలి. హార్డ్ అండ్ ఫాస్ట్ థంబ్ రూల్ పద్ధతిలో కాకుండా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆలోచించి జిల్లాలు, మండలాల పునర్విభజన నిర్ణయాలు తీసుకోవాలి. -కలెక్టరేట్లు, కలెక్టర్ల వ్యవస్థను సమాంతరంగా బలోపేతం చేయాలి. -నూతన జిల్లా కేంద్రాలు తెలంగాణలో అభివృద్ధి కేంద్రాలుగా మారాలి. -మండలాల వ్యవస్థను అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి. -తెలంగాణను క్షేత్రస్థాయిలోకి అభివృద్ధి చేసుకోవాలంటే కఠిన వైఖరితో కార్యచరణ చేపట్టాలె. కింది స్థాయి ఉద్యోగులతో పద్ధతి ప్రకారం పని చేయించుకోవాలె.

కాలంతోపాటు మారాలి.. మారుతున్న కాలంతో మారుతూ అభివృద్ధిని అందుకోవాలని లేకుంటే తెలంగాణ ప్రగతి సాధ్యం కాదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో మరికొద్ది సంవత్సరాల్లో ఊహించినంత అభివృద్ధి జరుగబోతున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్ ట్రాఫిక్‌ను భవిష్యత్తులో హెలిక్యాప్టర్లద్వారా పర్యవేక్షించే పరిస్థితులు వస్తాయి అన్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్ల అంశం కూడా సమావేశంలో చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, లక్ష్మా రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీసీఎల్‌ఏ కమిషనర్ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితాసబర్వాల్, ప్రియాంకవర్గీస్, పది జిల్లాల కలెక్టర్లు, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ షెడ్యూల్ -జూన్ 20న జరిగే కలెక్టర్ల సమావేశంలో అన్ని జిల్లా కలెక్టర్లు సమగ్ర నివేదికను భూపరిపాలన (సీసీఎల్‌ఏ) ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్‌కు అందించాలి. దానికి సీసీఎల్‌ఏ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తుది రూపునిస్తారు.

-జూన్ 30లోపు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో జరపాల్సిన అభిప్రాయ సేకరణ చర్చతోపాటు ఇతర రాజకీయ ప్రక్రియ పూర్తిచేయాలి. జూలై 5న తిరిగి కలెక్టర్లతో సమీక్షాసమావేశం. -జూలై 10 లేదా 11 తేదీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. -ఆగస్టు 4 నుంచి 10లోపు ముసాయిదా నోటిఫికేషన్ తయారీ, జారీ. -ఆగస్టు 10 నుంచి నియమిత గడువు నెలలోపు వచ్చే అభ్యంతరాలను ఆయా జిల్లా కలెక్టర్లు క్రోడీకరించి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ కమిషనర్‌కు అందించాలి. తర్వాత జిల్లా ఏర్పాటు ప్రక్రియలన్నింటినీ పూర్తి చేయాలి. -అక్టోబర్ 11 (విజయదశమి) నాటికి కొత్త జిల్లాల ఆవిర్భావం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.