Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కట్టడి లేకుంటే..కట్టుడే!

-ఆంధ్రప్రదేశ్‌ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తానంటే ఇక కుదరదు
-తెలంగాణ నీటిని కొల్లగొడతామంటే.. దేనికైనా సిద్ధమే
-రాయలసీమ లిఫ్టు, పోతిరెడ్డిపాడు విస్తరణ వెంటనే ఆపాలి
-లేకపోతే అలంపూర్‌-పెద్దమరూర్‌ బరాజ్‌ను నిర్మిస్తాం
-అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ
-కేంద్ర ఆదేశాల్ని ఉల్లంఘించి సీమ లిఫ్టుకు ఏపీ టెండర్లు
-కృష్ణాపై కేంద్రం ట్రిబ్యునల్‌ వేస్తే సుప్రీంలో కేసు వాపస్‌
-968 టీఎంసీల వాటా మేరకే మా గోదావరి ప్రాజెక్టులు
-ఉమ్మడి ఏపీలోనే తెలంగాణ ప్రాజెక్టులు మొదలు
-అపెక్స్‌ భేటీలో గట్టి వాదనలు వినిపించిన సీఎం
-ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు అభ్యంతరాల్లేవు

ఆరేండ్లుగా నానుతున్న సెక్షన్‌-3 సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైంది. తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇందులో రహస్యం ఏమీలేదు. నిర్మాణక్రమానికి అనుగుణంగా కొ న్ని మార్పులు చోటుచేసుకోవడం వల్ల డీపీఆర్‌లు సమర్పించడంలో కొంత సమయం తీసుకోవాల్సి వస్తున్నది. అంతేతప్ప డీపీఆర్‌లు సమర్పించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.
– ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా, కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుండా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్‌-పెద్ద మరూర్‌ దగ్గర బరాజ్‌ నిర్మించి తీరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఈ బరాజ్‌తో రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఖాయమని తేల్చిచెప్పారు. నదీజలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తెలంగాణకు అన్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్‌ ఇష్టారీతిన వ్యవహరిస్తే కుదరదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూస్తే తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని సీఎం పునరుద్ఘాటించారు. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి వెబినార్‌ ద్వారా పాల్గొన్నారు. తెలంగాణ వైఖరిని స్పష్టంచేశారు. కృష్ణా, గోదావరి నదీజలాలపై తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులు, వాటాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, కేంద్రమంత్రి షెకావత్‌తోపాటు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు విస్పష్టంగా చెప్పారు.

ప్రాజెక్టులవారీగా కేటాయించాలి
తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నదీజలాలపై కేంద్రానికి వివరించిన సీఎం కేసీఆర్‌.. తమకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటైన ప్రారంభంలోనే 2014, జూలై 14న అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్‌-3 కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని లేఖ రాశామని సీఎం తెలిపారు. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల.. సంవత్సరం వేచిచూసి, సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామన్నారు. తక్షణమే ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ సమయంలో కేంద్రమంత్రి షెకావత్‌.. తెలంగాణ డిమాండ్‌ను అంగీకరిస్తామంటూనే, సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉన్నందున ఎలాంటి చర్య తీసుకోలేకపోతున్నామని చెప్పారు. దీనిపై కేసీఆర్‌ తక్షణమే స్పందించి.. ఒకవేళ కేంద్రం ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు హామీ ఇస్తే సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్‌-89 కింద కృష్ణా నదీజలాల వివాద ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-2)కు ‘టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌’ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు.

అక్రమ ప్రాజెక్టుల్ని ఏపీ ఆపాలి
నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యా యం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైన వాటా పొందే హ క్కు ఉన్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామని స్పష్టంచేశారు. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశామని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఆ దిశగా స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు. ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మాణమవుతున్న పోతిరెడ్డిపాడు కాలువను ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా పోతిరెడ్డిపాడును మరింత విస్తరించడాన్ని సీఎం కేసీఆర్‌ తీవ్రంగా ఖండించారు.

కేటాయింపుల తర్వాతే బోర్డు పరిధి
రెండు రాష్ర్టాల మధ్య జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వస్తే తెలంగాణ సహకరిస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. అయితే బో ర్డులు సమర్ధంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు జరిపి, వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందన్నా రు. నాలుగేండ్ల కిందట జరిగిన తొలి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వివరాలను సరిగా నమోదు చేయలేదని చెప్పారు. నేటి రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం చర్చను, తీసుకున్న నిర్ణయాలను వీడియోలో, రాతపూర్వకంగా నమోదు చేయాలని కేంద్రాన్ని కోరారు. సమావేశంలో పాల్గొన్న కేం ద్రమంత్రి, సీఎంల సంతకాలు తీసుకున్న తర్వాతే మినిట్స్‌ను అధికారికంగా విడుదల చేయాలని సూచించారు.

అంతర్‌బేసిన్లలోనే తరలింపు కేసీఆర్‌ వాదనతో కేంద్రమంత్రి ఏకీభావం
అంతర్‌ బేసిన్లలోనే నదీజలాలను తరలించాలనే జల న్యాయసూత్రాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ‘ఒక నదీబేసిన్‌లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే, ఇంకా అదనపు జలాలు ఉంటేనే బేసిన్‌ అవతలికి నదీజలాలను తరలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన మార్గనిర్దేశాలను ఈ సందర్భంగా సీఎం వివరించారు. ఈ నేపథ్యంలో బేసిన్‌ అవతలికి కృష్ణాజలాలను తరలించే వీలు ఏపీకి లేదన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర జల్‌శక్తిశాఖతోపాటు కృష్ణాబోర్డు.. ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టం చేయడాన్ని సరైన చర్యగా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వాదనతో కేంద్రమంత్రి కూడా ఏకీభవించారు.

సెక్షన్‌-3 పరిష్కారంతో తెలంగాణకు మేలు
ఆరేండ్లుగా పెండింగులో ఉన్న సెక్షన్‌-3 ద్వారా ట్రిబ్యునల్‌ ఏర్పాటు అంశం తెలంగాణ ఒత్తిడి మేరకు రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పరిష్కారం కావడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణకు సాగునీటి వినియోగంలో మేలు చేకూర్చే అంశమని సమావేశం అనంతరం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫిర్యాదులు ట్రిబ్యునల్‌ ద్వారా పరిష్కారమైతే కృష్ణాజలాల్లో మన వాటా మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో రాష్ట్ర వాదనను గట్టిగా వినిపించేందుకు కృషిచేసిన అధికారులందరినీ సీఎం అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, నీటిపారుదల శాఖ సలహాదారు ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీలు మురళీధర్‌రావు, నాగేందర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లు, హరిరాం, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ ప్రాజెక్టుల్ని నిలిపివేయండి…
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని ఏపీకి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఈ ఏడాది ఆగస్టు 20న లేఖ రాసిన విషయాన్ని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి, పనులు కొనసాగించడం పట్ల కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఏపీ అమలుచేస్తున్న అక్రమ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం మొండి వైఖరితో అక్రమ ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే తాము కూడా మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ బరాజ్‌ మాదిరిగా కృష్ణానదిపై అలంపూర్‌-పెద్దమరూర్‌ దగ్గర బరాజ్‌ నిర్మించి తీరుతామని స్పష్టంచేశారు. దీని ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకుంటామని చెప్పారు.

తెలంగాణ ప్రాజెక్టులు తెరిచిన పుస్తకమే
తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలోనే వాటి నిర్మాణం మొదలైందని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని పునరుద్ఘాటించారు. డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్రమంత్రి కోరడం పట్ల కేసీఆర్‌ స్పందిస్తూ.. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ బహిరంగమేనని, ఇందులో రహస్యం ఏమీలేదని చెప్పారు. నిర్మాణక్రమానికి అనుగుణంగా కొన్ని మార్పులు చోటుచేసుకోవడం వల్ల డీపీఆర్‌ల సమర్పణలో కొంత సమయం తీసుకోవాల్సి వస్తున్నదని, అంతేతప్ప డీపీఆర్‌లు సమర్పించేందుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టంచేశారు. గోదావరిపై (జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం నాటి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవహిస్తున్న మొత్తం నీటిని వినియోగించుకోవచ్చని, ఒకవేళ ఏపీకి ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే 1956 చట్టం కింద ట్రిబ్యునల్‌కు నివేదించుకోవచ్చని చెప్పారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి.. రెండు రాష్ర్టాలు కలిసి లేఖ ఇస్తే గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను నదీయాజమాన్య బోర్డుకు సమర్పించి, అనుమతి వచ్చిన తర్వాతే చేపట్టాలని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్‌లను కృష్ణాబోర్డుకు సమర్పించాలని ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి సూచించారు. ఇందుకు జగన్‌ అంగీకరించారు. తెలంగాణలోని కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కోరారు. కేంద్ర మంత్రి షెకావత్‌ నేతృత్వంలో మంగళవారం రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెబినార్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్లు, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌, సంయుక్త కార్యదర్శి కనోడియా కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన సమావేశం 2 గంటలపాటు జరిగింది. కేంద్ర జల్‌శక్తి ముందుగా నిర్ణయించిన నాలుగు ప్రధాన ఎజెండాలపై చర్చించారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను కేంద్ర జల్‌శక్తి శాఖ మీడియాకు వెల్లడించింది.

బోర్డు పరిధిని నిర్ణయించనున్న కేంద్రం సమావేశంలో నిర్ణయాలు ఇవే
-కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధుల్ని నిర్ధారించేందుకు (నోటిఫై) కేంద్రం ముందుకుపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులవారీగా కేటాయింపులు జరుపనిదే పరిధులు నిర్ధారించవద్దని స్పష్టంచేశారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సంప్రదింపులు అవసరం లేకుండానే నోటిఫై చేసే అధికారం కేంద్రానికి ఉన్నది.
-కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించేందుకు రెండు రాష్ర్టాలు అంగీకరించాయి. ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలైనంత తక్కువ సమయంలో వాటి సాంకేతిక పరిశీలన ప్రక్రియను పూర్తిచేస్తామని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హామీ ఇచ్చారు.
-అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్‌-3 ప్రకారం రెండు రాష్ర్టాల మధ్య జలాల పంపిణీని తేల్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నది. సెక్షన్‌-3 ప్రకారం కృష్ణాజలాల పంపిణీని వెంటనే చేపట్టి, ప్రాజెక్టులవారీగా కేటాయింపులు చేస్తామని హామీ ఇస్తే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంగీకరించారు.
-రెండు రాష్ర్టాల మధ్య గోదావరి జలాల పంపిణీని కొలిక్కి తీసుకొచ్చేందుకు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్‌-3 ప్రకారం రెండు రాష్ర్టాలు అభ్యర్థనలు పంపేందుకు అంగీకరించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరుసటి రోజు (బుధవారం) అభ్యర్థనను పంపనున్నట్లు తెలిపారు. కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఏకాభిప్రాయం కుదిరింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.