ఆ పేరు సార్థకమైంది: ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కేసీఆర్ అంటే అందరికీ తెలిసింది కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కానీ మంత్రి కే తారకరామారావు సరికొత్త నిర్వచనం చెప్పారు. కేసీఆర్‌లో ‘కే’ అంటే కాలువలు, ‘సీ’ అంటే చెరువులు, ‘ఆర్’ అంటే రిజర్వాయర్లు అని శుక్రవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్ వరకు 82 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీళ్లను ఎత్తిపోస్తున్న అద్భుతఘట్టం ఆవిష్కృతమైందన్నారు. ప్రపంచంలోనే అత్యంత భారీ మల్టీస్టేజ్ నీటిపారుదల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ మూడేండ్లల్లోనే ఇంతటి భారీ ప్రాజెక్టును పూర్తిచేసి సత్తా చాటిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌వాసుల తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చే కేశవాపూర్ రిజర్వాయర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.