Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

KCR బాటలో..దేశం అడుగులు

-జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర
-సుపరిపాలనలో రోల్‌మోడల్
-సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ పథకాలే ఎజెండా

భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లు జయించడానికి కారణం ఏమిటని స్వామి వివేకానందను అడిగితే, ఆయన చెప్పిన జవాబు.. బ్రిటిష్ వాడిది దేశం.. మనది దేశం కాకపోవడమే. ఇవాల్టికీ భారతదేశం పరిస్థితి ఇలాగే ఉన్నది. ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం.. సమస్యలతో కొట్లాడుకుంటున్నారే తప్ప సామరస్యత లేకుండా పోయింది. దేశాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి చేసే ప్రయత్నం స్వాతంత్య్రం వచ్చిన 70 ఏండ్లలో ఎన్నడూ జరుగలేదు. యావత్ దేశానికి ఉమ్మడిగా ఉన్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఇన్నేండ్ల తర్వాత ఒక నాయకుడు దేశం గురించి గళమెత్తాడు. నిజమైన భారతదేశమంటే ఏమిటో దృశ్యమానం చేస్తున్నాడు. నిజమైన లౌకికవాదం అంటే ఏమిటో ఆచరించి చూపుతున్నాడు. కృషిప్రధానమైన భారతదేశంలో వ్యవసాయాన్ని పరిపుష్ఠం చేయడమెలాగో మార్గదర్శనం చేస్తున్నాడు. రాష్ర్టాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీస్తున్న జల వివాదాలకు పరిష్కారమేమిటో సూచిస్తున్నాడు.

ప్రాంతాలవారీగా అందుబాటులో ఉన్న వనరుల ద్వారా ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయడమెలాగో చేసి చూపిస్తున్నాడు. సమాఖ్య స్ఫూర్తి ఏ విధంగా ఉండాలో నిర్దేశిస్తున్నాడు. ప్రజలతో మమేకమై.. ప్రజల కోసం.. ప్రజల దృష్టికోణంలో పరిపాలన ఏ విధంగా చేయాలో ఆచరణలో చూపుతున్నాడు. ఆయన ఆలోచన ఇవాళ దేశానికి ఆచరణగా మారింది. యావత్ దేశం ఆయన వైపు చూస్తున్నది. ఒకనాడు ఆయన్ను ఉద్యమనాయకుడిగా పట్టు విడవకుండా చేసిన ఆయన ఉద్యమాన్ని చూసిన దేశం.. ఇప్పుడు పరిపాలకుడుగా.. ఆయన దార్శనికతను చూసి ఆశ్చర్యపోతున్నది. అబ్బురపడుతున్నది. జాతీయ స్థాయిలో ఇలాంటి ఒక నాయకత్వం కావాలని పరితపిస్తున్నది. ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ ముఖ్యమంత్రి. ఢిల్లీ వీధుల్లో మారుమోగే పేరు రావు సాబ్. నిజమైన జాతీయ నేత. దేశంలోని అత్యంత ప్రభావశీలురైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ది విలక్షణమైన శైలి. దేశంలో ఇప్పుడు ఆయన ఎందరికో రోల్‌మోడల్.

ఆనాడు సంజయ్‌గాంధీతో..
కేసీఆర్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి చాలా దగ్గరగా ఉండేవారు. యువజన కాంగ్రెస్ నేతగా ఆయన ఉన్న రోజుల్లో సంజయ్‌గాంధీతో స్నేహం ఏర్పడింది. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తనయుడి అంతరంగికుల్లో ఒకరిగా మెలిగేవారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత, 1989లో ఎన్టీఆర్ చైర్మన్‌గా ఉన్న నేషనల్‌ఫ్రంట్ విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారు.

తెలంగాణ సాధకుడిగా..
తెలంగాణ ఉద్యమసారథిగా కేసీఆర్ ఢిల్లీలో ఎక్కని గడప.. దిగని గడప లేదు. ఒక పక్క రాష్ట్రంలో ఉద్యమాన్ని అహింసాయుతంగా.. శాంతియుతంగా నిర్వహిస్తూనే.. జాతీయస్థాయిలో రాజకీయ నిర్ణయం ఏకగ్రీవం కావడం కోసం ఏండ్ల తరబడి ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం ఢిల్లీ వీధుల్లో తిరుగని నాయకుడి ఇల్లు లేదు. సాధారణంగా కేసీఆర్ వంటి నాయకుడు గతంలో ఏ జాతీయ నాయకుడికి కనపడి ఉండరు. ఒక అరుదైన వ్యక్తిత్వమాయనది. తానొకటి అనుకుంటే అది సాధించేదాకా వదిలిపెట్టని మనస్తత్వం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొత్తం 32 పార్టీలను ఒప్పించి.. లిఖితపూర్వకంగా హామీలు తీసుకోగలిగిన సామర్థ్యం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యపడింది. తెలంగాణ రాష్ట్రసాధనలో కేసీఆర్ జాతీయస్థాయిలో ప్రదర్శించిన రాజనీతిజ్ఞత అసాధారణమైంది. 2004లో సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్ఠానంతో కేసీఆర్ జరిపిన చర్చలు మొత్తం తెలంగాణ ఉద్యమంలో కీలకమైనవి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రణబ్‌ముఖర్జీ, సోనియాగాంధీలతో పలు దఫాలు చర్చించి యూపీఏ-1 కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో తెలంగాణ అంశాన్ని పెట్టించి.. ఆ తర్వాత పార్లమెంట్‌లో రాష్ట్రపతి తొలి ప్రసంగంలో తెలంగాణను ప్రస్తావించేలాచేయగలిగారు. ఆనాడు యూపీఏలో భాగస్వామిగా ఉంటూ, కేంద్రమంత్రిగా వ్యవహరించినప్పుడు కూడా చాలామంది జాతీయస్థాయి నేతలతో తెలంగాణపై చర్చించారు.

తెలంగాణ కోసమే కేంద్రమంత్రి పదవిని త్యాగంచేశారు. ఆ తర్వాత కూడా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించి తెలంగాణ ఏర్పాటుపై ఒప్పించారు. చివరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, లోక్‌సత్తా, బీజేపీ వంటి పార్టీలను కూడా తెలంగాణపై ఆయన ఒప్పించిన తీరు గొప్పది. ఇవాళ జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలను కలిగి ఉన్న అరుదైన నేతగా కేసీఆర్ నెలకొల్పగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తన సంబంధాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగించారు. ఢిల్లీకి ఆయన ఎప్పుడు వెళ్లినా అందుబాటులో ఉన్న ఇతర పార్టీలతో మాట్లాడుతుంటారు. మమతా బెనర్జీ, దేవెగౌడ, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్, నితీశ్‌కుమార్, శిబుసొరేన్, నవీన్ పట్నాయక్, స్టాలిన్‌లతో సహా అనేక మంది ఇతర రాష్ర్టాల నేతలు కేసీఆర్‌తో స్నేహితులుగా ఉన్నారు.

సామాన్యుడికి సైతం తెలిసిన రావుసాబ్
2008లో ఓ సందర్భంలో కొందరు జర్నలిస్టు మిత్రులు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ చాందీని చౌక్ వద్ద నుంచి ఆనాడు ఎంపీగా ఉన్న కేసీఆర్ నివాసానికి చేరుకోవాలన్నది వాళ్ల ఉద్దేశం. అక్కడ ఆటో స్టాండ్‌లో ఉన్న ఓ ఆటోరిక్షాను పిలిచి తుగ్లక్ రోడ్‌కు వస్తారా అని అడిగారు. దానికి ఆటోరిక్షా జర్నలిస్టులను ఒక్కసారి చూసి.. హా జాయింగే, కహా జానా హై..? రావు సాబ్‌కే కోలీ కో జానా హైక్యా? అని ప్రశ్నించాడు. జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. మీకెలా తెలుసంటూ ఆటో రిక్షా అతడిని జర్నలిస్టులు అడుగగా.. తనది బీహార్ అని, మిమ్మల్ని చూస్తుంటే తెలుగువాళ్లలా ఉన్నారు అని చెప్తు తెలంగాణ ఉద్య మం గురించి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బీహార్‌లోని తమ నేతల వద్దకు రావు సాబ్(కేసీఆర్) వచ్చారని, మాయావతితో కూడా మాట్లాడారన్నారు. సీఎం కేసీఆర్ దశాబ్దాల క్రితమే ఉత్తరాదిలోని సాధారణ ప్రజలకు కూడా చిరపరిచతం కావడం గమనార్హం.

ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు..
కేసీఆర్ ఏది చేసినా లోతుగా ఆలోచించి చేస్తారన్న పేరున్నది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో అన్ని రాజకీయ పార్టీల ముందు ఆయన ఉంచిన రాజకీయ సిద్ధాంతం తిరుగులేనిది. ఎవరూ కాదనలేనిది. దేశంలో గుణాత్మక మార్పుకోసం ఆయన చేస్తున్న ప్రయత్నానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతూ వస్తున్నది. పలు రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌చేసి ఫెడరల్ ఫ్రంట్ బాటలో నడిచేందుకు సంసిద్ధత వ్యక్తంచేస్తున్నారు. మమతాబెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి, అఖిలేశ్‌యాదవ్, దేవెగౌడ వంటివారు ఫెడరల్ ఫ్రంట్‌పై ఆసక్తిచూపడంతోపాటు దీని కార్యాచరణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా చెప్పారు. దేశంలో మార్పు రావాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ఏకీభవించారు. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఎజెండాయే అన్ని పార్టీల ప్రధాన ఎజెండాగా మారుతున్నది. అన్ని మ్యానిఫెస్టోల్లోనూ వేర్వేరు రూపాల్లో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రతిఫలించనున్నాయి.

యూపీఏ-1లో టీఆర్‌ఎస్ చేరడానికి కారణాలను కేసీఆర్ నాతో చెప్పారు. ప్రణబ్‌జీ నా కోరికేమిటో మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరు నాకు ఏ మంత్రిత్వశాఖ ఇచ్చినా స్వీకరిస్తా. అది నాకు ముఖ్యం కాదు. కానీ దయచేసి ఇకనైనా ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం గురించి ఆలోచించండి.
-ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి

-(ది కొయలేషన్ ఇయర్స్ బుక్ నుంచి)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.