Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్ బాటలో..

-అనుసరణే కానీ.. అంతంతమాత్రం సాయం
-ఐదెకరాల్లోపువారికి ఆరువేలకే పరిమితం
-ఆపైబడి సాగురైతులకు శూన్యహస్తం
-రాష్ట్రంలో ఎకరానికి పదివేల చొప్పున ఎంతైనా
-ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం.. అంతటా ఆసక్తే
-ఇప్పటికే ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాల అమలు
-ఏపీలో గెలిస్తే అమలుచేస్తామంటున్న జగన్

రైతుబంధు.. రాష్ట్రంలో రైతులకు కొండంత అండగా నిలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వినూత్న పథకం. అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడకుండా నిలువరించిన పథకం. నిజంగా ఇది అవస్థలపాలవుతున్న అన్నదాతల పట్ల ఆపద్బంధు అయింది. రైతన్నల బతుకుతీరునే మార్చింది. అందుకే ఈ పెట్టుబడి సాయం పథకం అంతటా ఆసక్తిని రేపింది. వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణలో పర్యటించి అమలుతీరును తెలుసుకున్నారు. ఇప్పటికే ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు ఆయా రాష్ర్టాల్లో ఈ తరహా పథకాలను ప్రవేశపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే తామూ అమలుచేస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. మరిన్ని రాష్ర్టాలు ఇదే బాటన నడువాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ తరహాలో కొత్త పథకాన్ని ప్రకటించింది.

శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) ప్రకారం.. రెండు హెక్టార్ల వరకు సాగుభూమి ఉన్న రైతులకు మూడు విడతల్లో రూ.2000 చొప్పున ఏడాదికి రూ.6000 అందజేస్తారు. ఈ రకంగా రైతులను ఆదుకునే అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలిచింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం నుంచి స్ఫూర్తిపొందిన జాబితాలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా చేరినట్లయింది. రాష్ట్ర పథకంతో పోలిస్తే కేంద్ర పథకం రైతులకు తక్కువగా సాయపడేదే. తెలంగాణలో ఎన్ని ఎకరాలున్న రైతులకైనా ఈ పథకం వర్తిస్తుండగా, కేంద్రం మాత్రం రెండు హెక్టార్లు.. అంటే ఐదెకరాలలోపువారికే సాయమందిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు విడుతల్లో ఎకరానికి రూ.నాలుగువేల చొప్పున రూ.ఎనిమిదివేలు అందించారు. ఇకముందు ఐదువేల చొప్పున ఏడాదికి మొత్తంగా ఎకరానికి రూ.పదివేలు అందజేస్తారు. కేంద్ర పథకంలో ఐదెకరాల వరకున్న రైతులకు ఏకమొత్తంగా ఆరువేలు మాత్రమే లభిస్తాయి. ఆపైబడి సాగురైతులకు ఏమాత్రం సాయం అందదు.

రైతుబంధునే కొంతమార్చి..
రాష్ట్ర పథకాన్ని ఆదర్శంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ స్థాయిలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించలేక.. ఏదోస్థాయిలో సాయపడే ప్రయత్నం మాత్రం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులను దుస్థితి నుంచి గట్టెక్కించాలని, రైతే రాజు కావాలని ఆలోచించిన ముఖ్యమంత్రి అందుకోసం పెట్టుబడి సాయాన్ని అందించాలని సంకల్పించారు. వ్యవసాయం చేసుకునేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుక్కునేందుకు, కూలీలకు చెల్లించేందుకు వీలుగా రైతుబంధు పథకాన్ని రూపొందించి అమలుచేస్తున్నారు. తెలంగాణలో రైతుల ఆదరాభిమానాలు అందుకున్న రైతుబంధులాంటి పథకాన్నే లోక్‌సభ ఎన్నికలకు ముందు బడ్జెట్‌లో ప్రకటించాలని భావించిన నరేంద్రమోదీ ప్రభుత్వం.. ఈ పథకాన్ని కొన్ని మార్పుచేర్పులతో దేశవ్యాప్తంగా అమలుకు ప్రకటించింది. వాస్తవాలను పరిశీలిస్తే.. తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబంధు పథకం కింద అందుతున్న మొత్తం రైతులను ఆదుకునేలా ఉండగా తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం మాత్రం రైతులకు కంటి తుడుపు చర్యగానే చెప్పవచ్చు. తెలంగాణ రైతుబంధుతో పోల్చితే కేంద్రం ఇచ్చేది తక్కువైనా కనీసం ఇప్పటికైనా రైతులకు సాంత్వన కలుగడం ప్రారంభమవుతుందని, దీనిని స్వాగతించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంటివాళ్లు వ్యాఖ్యానించడం గమనార్హం.

రాష్ట్రాలను ఆకట్టుకున్న పథకం
కేసీఆర్ ఈ పథకం ప్రారంభించిన తరువాత.. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాలు స్పందించాయి. వివిధ రాష్ర్టాల అధికారులు, ప్రజాప్రతినిధులు తెలంగాణకు వచ్చి అమలుతీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ప్రపంచంలోనే మొట్టమొదటగా.. రైతులకు నేరుగా నగదును అందించేలా కేసీఆర్ రూపొందించిన రైతుబంధు పథకానికి అంతటా ప్రశంసలు లభించాయి. ఈ పథకం నుంచి స్ఫూర్తిపొంది తొలుత అమలుచేసింది ఒడిశా. తెలంగాణకు వచ్చిన ఒడిశా అధికారులు క్షేత్రస్థాయిలో రైతుబంధు పథకాన్ని పరిశీలించి.. ప్రశంసించారు. వెంటనే ఒడిశాలోనూ కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్‌కం ఆగ్మెంటేషన్ (కాలియా) అనే పథకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చిన్న, సన్నకారు రైతులకు ఐదు సీజన్లకోసం రూ.25వేల మొత్తాన్ని ఒకేసారి నగదు బదిలీగా ప్రకటించింది. బెంగాల్ అధికారులు కూడా రైతుబంధు నుంచి స్ఫూర్తిపొంది ఆ రాష్ట్రంలో ఈ తరహా పథకాన్ని ప్రారంభించారు. ఇక పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ తాము గెలిస్తే రైతుబంధు పథకాన్ని అమలుచేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో రైతుబంధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ రైతుబంధు
-రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా రైతుబంధు పథకం వర్తిస్తుంది.
-ఎకరానికి రూ.నాలుగువేల చొప్పున రెండుసార్లు అందిస్తారు.
-వానకాలం, యాసంగి పంటలకు రెండు విడుతలుగా మొత్తం రూ.ఎనిమిది వేలు లభిస్తాయి.
-ఈ వర్షాకాలం నుంచి ఈ మొత్తాన్ని విడతకు రూ.5 వేలుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంటే ఎకరానికి రైతుబంధు కింద అందే సాయం మొత్తం రూ.10 వేలు.
-రాష్ట్రంలో ఇప్పటికే 58 లక్షల మంది రైతులకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
-రెండు హెక్టార్లు.. అంటే 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
-ఎన్ని ఎకరాల భూమి (5 ఎకరాల వరకు) ఉన్నా రూ. ఆరువేలు మాత్రమే వస్తాయి.
-మొత్తం మూడు విడతలుగా.. రూ. రెండు వేల చొప్పున అందిస్తారు.
-సంవత్సరంలో మొత్తం రూ.ఆరువేలు లభిస్తాయి.
-దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది రైతులు ఈ పథకానికి అర్హులవుతారని గుర్తించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.