Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్ చైనా టూర్ సక్సెస్

-ప్రపంచవేదికపై తెలంగాణ గళం -వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆకట్టుకున్న సీఎం కేసీఆర్ ప్రసంగం -తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించిన రాష్ట్ర బృందం -అప్పటికప్పుడు స్పందించిన పలు కంపెనీలు -రాష్ట్రంవైపు దృష్టిసారించిన పెట్టుబడిదారులు -హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ బృందం

బంగారు తెలంగాణ నిర్మాణానికి అనుక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించేలా చేయగలిగారు. నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటారు. పది రోజుల చైనా పర్యటనలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులు, సీఈవోలు, చైర్మన్లతో సమావేశాలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూలంకషంగా వివరించడమే కాకుండా వారి దృష్టిని తెలంగాణవైపు మళ్లించగలిగారు.

అన్నింటికన్నా మిన్నగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రసంగంలో చెప్పాల్సిన అంశాలను సూటిగా, క్లుప్తంగా చెప్పిన వైనం అందరినీ ఆకట్టుకుంది. మన దేశం నుంచి వెళ్లిన ఏకైక ప్రతినిధి కావడంతో.. అదే స్థాయిలో దేశంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతోపాటు.. తెలంగాణలో అవకాశాలనుకూడా వివరించడంలో సఫలీకృతులయ్యారు. 10 రోజుల చైనా పర్యటన ముగించుకుని సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రతినిధి బృందం బుధవారం రాత్రి 8.15 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నది.

CM-KCR-china-tour-success

దేశం నుంచి ఒక్కరికే అవకాశం చైనాలోని డాలియన్ నగరంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న ఒకే ఒక నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రమే. ఈ సందర్భంగా తెలంగాణ గళంతోపాటు భారతీయత ఉట్టిపడేలా ప్రసంగించారు. ప్రపంచ వ్యాపారవేత్తల దృష్టి భారత్‌పై ఉంది. భారత్‌లో అవకాశాలను చూస్తే తెలంగాణ అగ్రస్థానంలో కనపడుతుంది అంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి హాజరైన సభికులందరినీ ఆకట్టుకుంది.

ప్రపంచదేశాల నుంచి వచ్చిన మహామహుల దృష్టిని ఇటు భారతదేశంతోపాటు.. 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణవైపు ఆకట్టుకునేలా ఇక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న సంస్కరణలు, విధానాలను సూటిగా చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడానికి, పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలు, భారత ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలతోపాటు రాష్ట్రంలో అమలుచేస్తున్న టీఎస్ ఐపాస్‌ను పరిచయం చేసిన వైనం అందరినీ ఆకట్టుకుంది.

చైనాలో తాజాగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకులను ఉటంకిస్తూ.. సీఎం కేసీఆర్ ప్రసంగించిన తీరు, ఆయన వ్యక్తంచేసిన ధీమా, అంతర్జాతీయ అంశాలపై ఉన్న పట్టు, ఆశావహదృక్పథాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతూనే.. అటు దేశానికి ప్రతినిధిగా గౌరవాన్ని నిలబెట్టారు. రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 56 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్టు చెప్పడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు ఎర్ర తివాచీని పరిచిందని మరోసారి సీఎం స్పష్టం చేశారు.

ప్రముఖ కంపెనీలతో సమావేశాలు పది రోజులపాటు చైనా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్, ఆయన బృందం బిజీ బిజీగా గడిపారు. మాది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అయినా ప్రపంచం యావత్తూ ప్రశంసించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాం. పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు సంబంధించిన అనుమతులను నిర్దిష్టమైన కాలంలో పొందడాన్ని ఒక హక్కుగా తీర్చిదిద్దాం.

ప్రపంచంలో ఇంతటి వినూత్నమైన పారిశ్రామిక విధానం మరెక్కడా లేదు అని స్పష్టం చేశారు. లియోనింగ్ రాష్ట్రంలోని 30 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో 3 గంటలపాటు సమావేశమైన సీఎం కేసీఆర్ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని వారికి వివరించారు. దీనితో రూ.1000 కోట్లతో హెవీ డ్యూటీ పంపుల పరిశ్రమ స్థాపిస్తామంటూ లియో కంపెనీ చైర్మన్ అప్పటికప్పుడు ప్రకటించారు. ఇక 20 మిలియన్ డాలర్లతో ఎల్‌ఈడీ టీవీల తయారీకేంద్రం ఏర్పాటుచేస్తామంటూ సెల్‌కాన్, మెకెనో సంస్థలు కేసీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

సెల్‌ఫోన్ విడిభాగాలు, హెడ్‌ఫోన్లు తయారుచేసే మరో రెండు కంపెనీలు పెట్టుబడుల ప్రతిపాదనతో ముందుకు వచ్చాయి. 40 బిలియన్ డాలర్ల విలువైన షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో హైపవర్డ్ పైపుల తయారీ, సరఫరా విభాగాలను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. పలు బ్యాంకుల ప్రతినిధులతోనూ సానుకూలంగా సమావేశాలు నిర్వహించారు. ప్రపంచస్థాయి ఆకర్షణ కలిగిన తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని చాలామంది పెట్టుబడిదారులు స్వాగతించారు. తమ కంపెనీలను సందర్శించాలని పోటీపడి మరీ ఆహ్వానాలు అందించారు. అందులో భాగంగానే ఈ నెల 14న షెంజెన్ నగరాన్ని సందర్శించారు. పారిశ్రామిక పార్కులను సందర్శించి.. తెలంగాణలో అవకాశాలను బేరీజు వేశారు. చోంగ్‌క్వింగ్‌లాంటి అంతర్జాతీయ నిర్మాణ సంస్థ, ఇన్‌స్పైర్, ఫార్చ్యూన్ లాండ్ డెవలప్‌మెంట్ లాంటి మెగా కంపెనీలతో సమావేశమై సానుకూలతను సాధించారు. త్వరలోనే తెలంగాణలో పర్యటించి మరింత చర్చించే దిశగా వారిని ఆకర్షించారు. బీజింగ్, హాంగ్‌కాంగ్‌లోనూ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

చారిత్రక కట్టడాల సందర్శన.. ఇటు కంపెనీలు, ఔత్సాహిక పెట్టుబడిదారులతో ఎడతెరపిలేకుండా సమావేశాలు నిర్వహిస్తూనే.. చైనాలోని అద్భుత, చారిత్ర కట్టడాలు, నిర్మాణాలను సీఎం కేసీఆర్ బృందం సందర్శించింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఫర్‌బిడెన్ సిటీ, భారీ కంచు బుద్ధుడి ప్రతిమ, తియాన్మెన్ స్కేర్ సందర్శించి అక్కడి చరిత్ర, విశేషాలు, సంస్కృతి గురించి తెలుసుకున్నారు. పది రోజులుగా ఎడతెరపి లేకుండా కంపెనీల ప్రతినిధులు, ముఖ్యులతో సమావేశమై చైనా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నది.

CM-KCR-and-his-team-at-Hong-kong
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.