Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్ ధూం ధాం

-50రోజుల ప్రచార ప్రణాళిక సిద్ధం
-జిల్లాస్థాయి సభలు కాకుండా నియోజకవర్గాల్లోనే సభలు
-పాటల సీడీలను సిద్ధంచేస్తున్న దేశపతి బృందం
-అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధానాంశాలు
-దశలవారీగా 14 మంది అభ్యర్థుల ప్రకటన
-నియోజకవర్గాలవారీగా ఇప్పటికే సంకేతాలు
-ఆశావహులను బుజ్జగిస్తున్న మంత్రి కేటీఆర్
-అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తామని హామీ
-మొదట మంత్రులు, సీనియర్ల స్థానాల్లో.. తర్వాత సిట్టింగ్‌లు ఉన్నచోట ప్రచారం
-అక్టోబర్‌లో రోజుకు రెండు, నవంబర్‌లో రోజుకు మూడు సభల నిర్వహణ
-బతుకమ్మ, దసరా, దీపావళినాడు విరామం

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే నిజామాబాద్, హుస్నాబాద్, వనపర్తి, నల్లగొండలో జిల్లాస్థాయి ప్రజా ఆశీర్వాద సభలతో ప్రచారంలో కారు జోరు పెంచిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇకపై టాప్‌గేర్‌లో వెళ్లనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాస్థాయి సభలు కాకుండా నియోజకవర్గాలస్థాయిలో సభలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని చుట్టివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి నిత్యం రెండు నుంచి మూడు సభల్లో పాల్గొననున్నారు. అక్టోబర్‌లో రోజుకు రెండు, నవంబర్‌లో రోజుకు మూడు సభల్లో పాల్గొనేలా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని 50 రోజుల్లోనే ముగించాలని భావిస్తున్నారు. పోలింగ్ సమయంలోపే బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వస్తున్నందున ఆయా పండుగరోజుల్లో ప్రచార సభలకు విరామం ఇవ్వనున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినవారిలో పార్టీ సీనియర్లు, మంత్రులున్న నియోజకవర్గాల్లో తొలుత ప్రచార కార్యక్రమాన్ని పూర్తిచేయాలని యోచిస్తున్నారు. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నది.

నిర్ణీత గడువులోపే ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేసి హైదరాబాద్ కేంద్రంగా ఎప్పటికప్పుడు ప్రచారసరళిని సమీక్షించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ఇక పార్టీకి ఉద్యమసమ యం నుంచి దన్నుగా ఉన్న కవులు, కళాకారులు పాటలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం పాటల సీడీలను రూపొందిస్తున్నది. అతిత్వరలోనే వీటిని పార్టీ విడుదల చేయనున్నది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధానాంశాలుగా పాటలను రూపొందించారు. ప్రతిపక్షాల తీరును పాటల రూపంలో కవులు, గాయకులు ఎండగట్టనున్నారు. అభ్యర్థులందరికీ పార్టీ ప్రచార సామగ్రిని అందిస్తున్నారు. ఇప్పటికే పంపిణీ కూడా పూర్తయింది.


అతిత్వరలో 14 మంది అభ్యర్థుల ప్రకటన

ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్, మిగిలిన 14 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై స్పష్టతకు వస్తున్నది. స్పష్టత వచ్చిన నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సూత్రప్రాయంగా సంకేతాలు ఇస్తున్నది. దీంతో వారంతా ఎన్నికల బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ అధికారికంగా అభ్యర్థులను అతిత్వరలోనే ప్రకటించనున్నది. టికెట్లు ఆశించి భంగపడ్డవారితో స్వయంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆశావహులకు స్థాయికి తగ్గ పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఈ పరిణామం సత్ఫలితాలను ఇస్తున్నది. ఇప్పటివరకు పార్టీని ఇబ్బంది పెట్టేస్థాయిలో అసంతృప్తులు ఎక్కడా వ్యక్తంకాలేదు. ఆశావహులందరితో ఎప్పటికప్పుడు మాట్లాడటంతో పరిస్థితిలో మార్పువచ్చింది.


హాల్ మీటింగ్స్.. అనుబంధ సంస్థలతో సమావేశాలు

ఎన్నికల నేపథ్యంలో అన్ని వర్గాలతో సమావేశమయ్యేందుకు టీఆర్‌ఎస్ ఎక్కడికక్కడ హాల్ మీటింగ్‌లను ఏర్పాటుచేస్తున్నది. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వైద్యులు, న్యాయవాదులు, యువత, మహిళలు, కాలనీల ప్రతినిధులు, గేటెడ్ కమ్యూనిటీలవారీగా, అపార్టుమెంట్లవారీగా సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంట్లో కొన్ని సమావేశాలు పూర్తయ్యాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు దగ్గరయ్యేందుకు సదస్సు ఏర్పాటుచేశారు.

వీటికి మంచి స్పందన వచ్చింది. ఇక పార్టీ అనుబంధ సంఘాలతో కూడా సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో పార్టీ మహిళా, కార్మిక, రైతు తదితర విభాగాలతో కూడా సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాలస్థాయిలో కూడా ఇలాగే సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రులంతా తమ పరిధిలోని అనుబంధ సంఘాలు, కార్మిక సంఘాలతో సమావేశమయ్యేలా పార్టీ వ్యూహాన్ని సిద్ధంచేసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.