-ప్రాంతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు
-అన్నివర్గాలకు అందుతున్న అభివృద్ధి ఫలాలు
-ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు
-టీఎస్పీఎస్సీ ద్వారా 108 నోటిఫికేషన్లు ఇచ్చాం
-శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీ హరీశ్‌రావు
-పలుశాఖలకు చెందిన ఆరు పద్దులు ఆమోదం
ప్రాంతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రమంతటా సమన్యాయపాలన అందిస్తున్నారని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రులు సంకుచిత ధోరణితో ఆలోచించేవారని, పాలనలో పక్షపాతం చూపించేవారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్షపాతిగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నారని చెప్పారు. ఆదివారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ఏ పార్టీవారైనా అక్కడి నియోజకవర్గ ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలే అని భావించి సీఎం కేసీఆర్ అందరికీ సమానంగా ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రతి పథకం అమలులో ఇదే పద్ధతిని అనుసరిస్తున్నామని, పింఛన్లు, పథకాలు, ఇతర ఫలాల పంపిణీ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నదని చెప్పారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలకు రూ.3 కోట్లు ఇచ్చి వారి హుందాతనాన్ని పెంచామన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌ను అనుసరిస్తూ ఇక్కడి పథకాలను వారి రాష్ర్టాల్లో అమలుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. తెలంగాణ పథకాలు దేశం మొత్తం ప్రచారం కావడం వెనుక మీడియా పాత్ర ఎంతో ఉందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రచారం చేయడం వల్లనే తెలంగాణ అన్ని రాష్ర్టాలకు పరిచయమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి ఆరా తీస్తున్నాయని చెప్పారు. పలు రాష్ర్టాలు తెలంగాణలో పథకాలను పరిశీలించడానికి తమ ప్రతినిధులను పంపిన విషయాన్ని హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. మూడున్నరేండ్లలో ఇంతఖ్యాతి గడించినందుకు ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడుతున్నాడని అన్నారు. అనంతరం సభ వివిధ శాఖలకు చెందిన ఆరు పద్దులను ఆమోదించింది.
టీఎస్పీఎస్సీ నుంచి 108 నోటిఫికేషన్లు.. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు 108 నోటిఫికేషన్లు విడుదల చేసినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 6,463 మందిని రిక్రూట్ చేశామని, 12,813 పోస్టుల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయని చెప్పారు. టీఎస్పీఎస్సీతోపాటు పోలీసు, ఆర్టీసీ తదితర డిపార్ట్మెంట్లు కూడా అదనంగా రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టాయని మంత్రి హరీశ్‌రావు వివరించారు.
జర్నలిస్టు సంక్షేమ సర్కార్.. జర్నలిస్టుల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించినట్టు మరెవరూ ఆలోచించడం లేదని, జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్‌కార్డులు ఇచ్చి కార్పొరేట్ వైద్యాన్ని అందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మండలాల్లో పనిచేసే కంట్రిబ్యూటర్లకు సైతం తెలంగాణ ప్రభుత్వం వైద్య సేవలందిస్తున్నదని తెలిపారు. జర్నలిస్టుల కోసం సంక్షేమనిధిని ఏర్పాటుచేసి, బడ్జెట్లో నిధులు కేటాయించిన తొలి ప్రభుత్వం తమదేనని మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇప్పటికే రూ. 34.54 కోట్లు ఇచ్చామని, ఈసారి మరో రూ.20 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణలో మొత్తం 35,862 హెల్త్‌కార్డులు జారీచేశామని, ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని తెలిపారు. 16,793 మందికి రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో అక్రెడిటేషన్లు ఇచ్చామని చెప్పారు. మరణించిన 151 మంది జర్నలిస్టుల కుటుంబాల ఆర్థికసహాయం, 52 మందికి వైద్య చికిత్సల కింద రూ. 2.19 కోట్లు అందజేసినట్టు మంత్రి వివరించారు.
చిన్న పత్రికలకు అండగా ఉంటున్నాం.. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అన్ని పత్రికలకు ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇస్తునట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రం నుంచి వివిధ భాషల్లో వెలువడుతున్న సుమారు 170 చిన్న పత్రికలకు నెలకు రూ. 36 లక్షల చొప్పున ప్రకటనలు ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. 45 ఉర్దూ పత్రికలను కొత్తగా ఎంప్యానెల్ చేసి అక్రెడిటేషన్ ఇచ్చామని, చిన్న పత్రికల కోసం ప్రతిఏటా రూ.4.32 కోట్లు ఖర్చుచేస్తున్నామని చెప్పారు.