Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్ ఫెడరల్‌యాత్ర విజయవంతం

-ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా సానుకూలత
-రాష్ర్టాల పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్
-త్వరలో మలి విడత పర్యటన.. మేధావులు, నిపుణులతోనూ భేటీలు
-ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయం.. సంక్రాంతి తర్వాత శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ పర్యటన విజయవంతమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణలో అసెం బ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి విడుత పర్యటనను దిగ్విజయంగా పూర్తిచేశారు. ఈ పర్యటనలో రాజకీయపార్టీల నేతలతోపాటు వివిధ రంగాల్లో నిపుణులు, మేధావులను కలిశారు. దేశంలో ప్రధాన సమస్యలకు పరిష్కారాలు, ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై కొంతకాలంగా వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. మూడునెలలుగా అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న కేసీఆర్.. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ స్పష్టమైన మెజార్టీ రాదని.. దీంతో ఆ పార్టీలను ప్రాంతీయపార్టీల వద్దకు వచ్చేలాచేయాలని, తద్వారా అధికారాల వికేంద్రీకరణ, హక్కులను సాధించాలనే ఉద్దేశంతో ముందుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు అమలుచేస్తామని, దీనికి రూ.3.50 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా కూడా వేశారు. దీంతోపాటుగా రాజ్యాంగంలో ఉమ్మడి అంశాలుగా ఉన్నవాటిని రాష్ట్రాలకు బదలాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎజెండా అంశాలతోనే కేసీఆర్ వివిధ పార్టీల నాయకులను కలుస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పర్యటనల కోసం నెలరోజులపాటు విమానాన్ని అద్దెకు తీసుకున్న కేసీఆర్ ఈ నెల 23 నుంచి పలువురు ప్రముఖులను కలుసుకున్నారు.

ఒడిశా, బెంగాల్ సీఎంలతో భేటీ..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యాత్రకు ముందు విశాఖపట్నంలోని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకొన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా ఏపీ పర్యటనకు వెళ్లిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. విశాఖపట్నం విమానాశ్రయం, శారదా పీఠం వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. శారదాపీఠంలో స్వరూపానదేంద్ర సరస్వతి స్వామిని కలిసి, సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన అనంతరం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో బీజేడీ నేత, సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, ఉద్దేశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో మరోసారి భేటీ అవుదామని ఇరువురు నాయకులు చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రెండ్ అంటూ సంబోధించారు. కేసీఆర్ అమలుచేస్తున్న వ్యవసాయ పథకాలు బాగున్నాయంటూ నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. 24న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య దాదాపుగా గంటకు పైగా చర్చలు సాగాయి. కేసీఆర్ ప్రతిపాదిత ఫ్రంట్‌పై దీదీ సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో శుభవార్త వింటారంటూ ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీలో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ కావాల్సి ఉన్నా.. ఆయన ముందుగా నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో కుదరలేదు. తానే స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలుస్తానని మీడియా ముందు ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ఆయన ప్రశంసించారు. కేసీఆర్ చొరవ ప్రశంసనీయమన్నారు. ఇలా వివిధ పార్టీల నేతలు ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామ్యం కావడానికి ముందుకొస్తున్నారు. అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొంతమంది ప్రాంతీయ పార్టీల నేతలు, వివిధ రంగాల్లోని మేధావులను కలువనున్నారు.

ప్రధానితో భేటీ..
రెండోసారి సీఎం అయ్యాక కే సీఆర్ తొలిసారిగా ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరిష్కరించాలని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. 16 అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడే హైకోర్టు విభజనపై ఉత్తర్వులు జారీఅయ్యాయి.

ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం
-అనువైన స్థలాలను పరిశీలించిన ఎంపీలు
-సంక్రాంతి తర్వాత శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
-ఉగాదికల్లా నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలోనూ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణలో ప్రతి జిల్లాకేంద్రంలోనూ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. ఢిల్లీలోనూ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం శుక్రవారం ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ స్థలాలను పరిశీలించారు. వీటిలో అనువైన స్థలాన్ని ఎంపికచేసి పార్టీకి కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. సంక్రాంతి తరువాత పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. ఉగాదికల్లా నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించారు. ఎంపీలతోపాటుగా పార్టీ అధ్యక్షుడు ఢిల్లీకి వచ్చినప్పుడు కార్యకలాపాలను సమీక్షించడానికి అనువుగా ప్రత్యేక గదిని నిర్మించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్‌సభ, రాజ్యసభపక్ష నేతలు, ఎంపీల కోసం ప్రత్యేకంగా గదులు నిర్మించనున్నారు. సమావేశమందిరం, విశ్రాంతి గదులు, ఢిల్లీకి పార్టీ ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ప్రత్యేక గదులను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంతో అనుసంధానిస్తూ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కోసం కూడా ప్రత్యేక గదిని ఏర్పాటుచేయనున్నారు. ఇందులో తెలంగాణ వంటకాలతో ప్రత్యేక క్యాంటీన్ ఉంటుంది.

2004లోనే ఆలోచన…
ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని అధ్యక్షుడు కేసీఆర్ 2004లోనే ఆలోచించారు. నాటిప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రాంతీయపార్టీలకు స్థలాలను కేటాయించారు. ప్రాంతీయపార్టీలకు ఢిల్లీలో స్థలాలను కేటాయించాలంటే కనీసం ఐదుగురు ఎంపీలు ఉండాలి. ఐదుగురు ఎంపీలు ఉంటే 500 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. 15 మందికి పైగా ఉంటే 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. అయితే, టీఆర్‌ఎస్‌కు 2004లో ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉండటంతో కేసీఆర్ ఆ సమయంలో కార్యాలయం కోసం స్థలాన్ని వాయిదావేశారు. పార్టీకి ప్రస్తుతం 20 మంది ఎంపీలున్నారు. వెయ్యిగజాల స్థలం కేటాయించడానికి నిబంధనలు అంగీకరిస్తాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలు స్థలాలను పరిశీలించారు. టీఎంసీ, డీఎంకే, ఏఐఏడీఎంకే, సమాజ్‌వాది పార్టీ తదితర పార్టీలకు ఢిల్లీలో కార్యాలయాలున్నాయి.

సకల వసతులతో నిర్మాణం: ఎంపీ వినోద్‌కుమార్
ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని అన్ని వసతులతో నిర్మిస్తామని ఎంపీ వినోద్‌కుమార్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ ప్రముఖపాత్ర వహించనున్న నేపథ్యం లో పార్టీ కార్యాలయం ఢిల్లీలో కీలకంగా మారుతుందన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు, సమావేశాలకు కార్యాలయం వేదికగా మారుతుందన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేవారికి భోజన వసతులు కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.