Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్‌ జీ..దేశం కోసం ముందుకు రండి

-జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర అవసరం
-మీ పరిపాలన అనుభవం దేశానికి కావాలి
-సీఎం కేసీఆర్‌ను కోరిన లాలూ, తనయుడు తేజస్వి
-కేంద్రంలో మోదీ ప్రభుత్వానిది విచ్ఛిన్నకర పాలన
-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ వ్యతిరేక బీజేపీ
-కలిసి కేంద్రంపై పోరాటం చేద్దామని ప్రతిపాదన
-హైదరాబాద్‌లో సీఎంతో తేజస్వి బృందం చర్చలు
-ప్రజాస్వామిక శక్తుల ఐక్యతను నొక్కిచెప్పిన నేతలు

ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రం సాధించుకొని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు. దేశం గర్వించేలా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది. అనేక రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచింది. ముఖ్యంగా రైతులకోసం చేపట్టిన నీటి ప్రాజెక్టులు, ఇంటింటికీ నీళ్లు ఇచ్చే పథకం బాగున్నాయి. అన్ని వర్గాలకు అనుకూలంగా సాగుతున్న మీ పాలన అనుభవం దేశానికి ఎంతో అవసరం. దేశంలో ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నది. దేశాన్ని రక్షించుకొనేందుకు లౌకికవాద శక్తులన్నీ ఒక్కటి కావాలి. దేశాన్ని నాశనం కానివ్వకుండా చూడాలి. మీరు జాతీయ రాజకీయాల్లో తగిన పాత్ర పోషించాలి. లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలి. అందుకు మీరు ముందుకు రావాలి.

సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌
దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న విచ్ఛిన్నకర, అప్రజాస్వామిక పరిపాలనను అంతమొందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత.. రాజకీయ కురువృద్ధుడు లాలూ ప్రసాద్‌యాదవ్‌, ఆయన తనయుడు, ఆర్జేడీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తేజస్వి యాదవ్‌ అభిలషించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో తమ పార్టీ కీలక నేతలు అబ్దుల్‌ బారి సిద్ధిఖి, సునీల్‌సింగ్‌, భోలాయాదవ్‌తో కలిసి సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావులను తేజస్వి యాదవ్‌ కలిశారు. ఈ సమావేశంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా దేశ రాజకీయాలపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. దేశంలో ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, వాటి రద్దు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం గురించి, అనంతరం ఇబ్బందులను అధిగమించిన తీరు, సాధిస్తున్న అభివృద్ధిపై కేసీఆర్‌.. తేజస్వికి వివరించి చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకంతోపాటు.. మిషన్‌ భగీరధ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల విజయాల గురించి తాము విన్నామని ఆర్జేడీ సభ్యులు చెప్పారు.

లౌకిక శక్తులు ఏకం కావాలి
జాతీయ రాజకీయాల గురించి జరిగిన చర్చ సందర్భంగా.. బీజేపీ విచ్ఛిన్నకర, అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు లౌకిక శక్తులన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన తక్షణావసరం ఉన్నదని ఇరు పార్టీల నేతలు ఏకాభిప్రాయం వ్యక్తంచేసినట్టు తెలిసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకొనేందుకు ఒక్క మంచి పని కూడా చేయలేదని కేసీఆర్‌, తేజస్వి అభిప్రాయపడినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలు, రైతులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని గద్దె దించేవరకు పోరాడాల్సిన అవసరమున్నదని ఇద్దరు నేతలూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే రూపొందించుకొందామని అనుకొన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెగనమ్మి, అదే అభివృద్ధి అన్న భ్రమను కేంద్రం కల్పిస్తున్నదని, రాజకీయ కక్ష సాధింపులు తప్ప మరో కార్యక్రమం బీజేపీకి లేదని తేజస్వి అన్నట్టు తెలిసింది.

వామపక్షాలూ ఇదే అభిప్రాయంతో ఉన్నాయి..
బీజేపీ సర్కారు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టివేసిందన్న అభిప్రాయాన్ని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు తన వద్ద వ్యక్తం చేసినట్టు ఈ సమావేశంలో కేసీఆర్‌ ప్రస్తావించారు. ఇటీవలే సీపీఎం, సీపీఐ కేంద్ర కమిటీ నాయకులు హైదరాబాద్‌కు వచ్చి తనతో సమావేశమయ్యారని చెప్పారు. బీజేపీ ముక్త్‌ భారత్‌ దిశగా కార్యాచరణ ఉండాలని, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఒక్కటిగా ఉండాలని వారు ఆకాంక్షించినట్టు తెలిపారు. తేజస్వి కూడా తామూ (ఆర్జేడీ) ఇదే అభిప్రాయంతో ఉన్నామని, ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్య సంఘటన దిశగా రాజకీయ పోరాటం ఉండాలని పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని ఉధృతంగా సాగించాలని తేజస్వి అభిప్రాయపడ్డట్టు ఆర్జేడీ వర్గాలు చెప్పాయి. దేశ సమగ్రతను కాపాడే దిశగా జాతీయ రాజకీయాలను బలోపేతం చేయాలని ఆర్జేడీ నేతలు అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో తాము కూడా కలిసి వస్తామని, దీని కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానపాత్ర పోషించాల్సిన అవసరమున్నదని తేజస్వి చెప్పారని సమాచారం. ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ దిశగా కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ తరఫున తేజస్వి సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిసింది.

యూపీలో బీజేపీ వ్యతిరేక పవనాలు..
ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరిగింది. సమావేశం జరుగుతున్నప్పుడే యూపీ బీజేపీ క్యాబినెట్‌ మంత్రి పార్టీకి రాజీనామా చేసినట్టు, ఆయన బాటలోనే మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడినట్టు సమాచారం వచ్చింది. దీనిపై తేజస్వి స్పందిస్తూ.. ‘బీజేపీకి యూపీలో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది. పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఈసారి ఉత్తరప్రదేశ్‌ను నిలబెట్టుకోవడం బీజేపీకి అంత ఈజీ కాదు’ అని విశ్లేషించినట్టు సమాచారం. ఒక్కొక్కరుగా బీజేపీని వీడటమే ఆ పార్టీ పతనానికి నాందిగా అభివర్ణించారని తెలిసింది. దీంతోపాటు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అఖిలేశ్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారని, ఈ పరిణామాలన్నీ సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలమని అభిప్రాయపడ్డారు.

‘రావు సాబ్‌.. కైసే హో..?’
‘రావు సాబ్‌.. కైసే హో! ఆప్‌ కీ రాజ్య్‌ బన్‌ గయీ.. తెలంగాణా కే బారేమే సున్‌కే హమ్‌ కో బహుత్‌ అచ్చా లగా. బహుత్‌ బహుత్‌ బధాయి హో’ అంటూ బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అభినందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయాన్ని ఇరువురు నేతలూ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆర్జేడీ పార్లమెంటులో మద్దతు ఇచ్చిన విషయాన్ని, ప్రణబ్‌ కమిటీకి లేఖ ఇవ్వటాన్ని ఈ సందర్భంగా లాలూ ప్రస్తావించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో తనతో సమావేశమైన తేజస్వి యాదవ్‌తో కేసీఆర్‌ మాట్లాడుతూ.. లాలూ ఆరోగ్యం, క్షేమ సమాచారాన్ని అడిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి లాలూతో ముచ్చటించారు. తెలంగాణ అభివృద్ధి గురించి తాను వింటున్నానని ఈ సందర్భంగా లాలూ చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం మీరు (కేసీఆర్‌) ఎంతో పోరాటం చేశారని, ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రం సాధించుకొని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. దేశం గర్వించేలా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని, అనేక రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచిందని ప్రశంసించారు. ముఖ్యంగా రైతులకోసం చేపట్టిన నీటి ప్రాజెక్టులు, ఇంటింటికీ నీళ్లు ఇచ్చే పథకం బాగున్నాయని చెప్పారు. ‘అన్ని వర్గాలకు అనుకూలంగా సాగుతున్న మీ పాలన అనుభవం దేశానికి ఎంతో అవసరం’ అని లాలూ ఆకాంక్షించారు. ‘దేశంలో ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నది. దేశాన్ని రక్షించుకొనేందుకు లౌకిక శక్తులన్నీ ఒక్కటి కావాలి. దేశాన్ని నాశనం కానివ్వకుండా చూడాలి. మీరు జాతీయ రాజకీయాల్లో తగిన పాత్ర పోషించాలి. లౌకిక, ప్రజాస్వామిక వాతావారణాన్ని కాపాడుకోవాలి. అందుకు మీరు ముందుకు రావాలి’ అని లాలూ అన్నట్టు సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.