Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇక్కడి మలయాళీలు మావాళ్లే!

-వారికి సమాన హక్కులు ఉంటాయి.. తెలంగాణ పునర్నిర్మాణంలో వారూ పాల్గొనాలి -350 మంది పేద మలయాళీలకు డబుల్ బెడ్‌రూంల ఇండ్లు.. సీఎం కేసీఆర్ ప్రకటన -తెలంగాణతో మాది ఆత్మబంధం: కేరళ సీఎం ఊమెన్‌చాందీ -శబరిమలైలో తెలంగాణ భవన్ కోసం నీలక్కల్ వద్ద ఐదు ఎకరాలు -ఫిల్మ్‌నగర్‌లో కేరళభవన్‌కు శంకుస్థాపన -ఓనం- విజయోత్సవం 2015లో పాల్గొన్న ఇద్దరు ముఖ్యమంత్రులు

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ఇక్కడున్న మలయాళీలు అందరూ తెలంగాణవారే. కొత్తరాష్ట్రమైన తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. మీ సహకారాన్ని కొనసాగించాలి. హైదరాబాద్ నగరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు హాయిగా ఉన్నారు. మా ప్రజలు కూడా అందరితో కలిసి మెలిసి ఉన్నారు. ఈ నగరం ప్రపంచంలోనే గొప్పనగరం. కాస్మోపాలిటన్ సిటీకి నిజమైన ఉదాహరణ. నేను గత సంవత్సరం కేరళీయం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కేరళ భవన్‌కు స్థలం కేటాయిస్తానని ఇచ్చిన ప్రామిస్‌ను పూర్తిచేశాను. ఎకరం స్థలంతో పాటు కోటి రూపాయలు మంజూరు చేశాం.

CM-KCR-addressing-the-gathering-at-Kerala-bhavan-inauguration

ఇవాళ ఆ కేరళ భవన్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగాఉంది. ఇదే సమయంలో మరో కానుక కూడా ప్రకటించబోతున్నాను. నిజమైన పేద మలయాళీలను గుర్తించాలని బెంజిమెన్‌కు చెప్పాను. ఆయన 350 మంది ఉంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ ఉచితంగా 350 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తుంది. వాటిని ఇక్కడే ఇపుడే మంజూరు చేస్తున్నా. అని ప్రకటించారు.

CM-KCR-inaugurated-Kerala-Bhavan

దేశంలోనే గొప్ప నేత.. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని దేశంలోనే గొప్పనేతగా సీఎం అభివర్ణించారు. దేశమంతా అందరికీ తెలిసిన నాయకుడని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు సహకరిస్తామని ఆయన చెప్పారని తెలిపారు. తెలంగాణలో నిరక్ష్యరాస్యతను రూపుమాపేందుకు కలిసి నడుస్తామని అన్నారు. కేరళ రాష్ట్రం సౌత్ ఇండియా కాశ్మీర్…ఎంతో అందమైన ప్రదేశమని కేసీఆర్ అన్నారు. కేరళకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్నాయంటూ తెలంగాణ రాష్ర్టానికి కూడా గొప్ప చరిత్ర, సంప్రదాయాలున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలను ఇలాగే కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణలోని మలయాళీలు ఇక్కడి సంస్కృతిలో, భాషలో కలిసిపోయారని మెచ్చుకున్నారు. కేరళీయులు ఎక్కువ మంది సర్వీస్ రంగంలో ఉన్నారు..నాన్‌ప్రాఫిట్ స్కూళ్లు నడిపిస్తున్నారు.. కేరళ నర్సులు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని చెప్పారు. వారి సేవాతత్పరతకు గర్వపడుతున్నానని అన్నారు. కేరళ భవన్‌ను ప్రస్తావిస్తూ ఏడునెలల క్రితం మనం కల కన్నాం. ఇవాళ శంకుస్థాపన చేశాం. ఏడాది, ఏడాదిన్నరలో దేశంలోనే అందమైన కేరళ భవన్‌ను తయారు చేసుకుందాం అని తెలిపారు.

అందరూ సంతోషంగా ఉన్నారు.. తెలంగాణతో తమ బంధం ఆత్మబంధమని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అన్నారు. ఈ బంధం ఎప్పుడూ కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, నిజమైన కాస్మోపాలిటన్ సిటీకి హైదరాబాద్ మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. కేరళ మహిళలు ఇక్కడి సంప్రదాయాలు తెలుసుకోవాలని, ఇక్కడి ప్రజల్లో భాగం కావాలని సూచించారు. గతంలో చాలాసార్లు హైదరాబాద్‌కు వచ్చానని, అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రావడం ఇదే మొదటిసారి అంటూ ఈసారి కేరళభవన్‌కు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు.

కేరళ భవన్ నిర్మాణానికి రూ.కోటి, ఎకరం స్థలం మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. శబరిమలైలో తెలంగాణ భవన్ కోసం నీలక్కల్ వద్ద ఐదు ఎకరాలు కేటాయించామని చెప్పారు. అయ్యప్ప భక్తుల కోసం అక్కడ భవన్ నిర్మాణం తలపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణయేనని, తెలంగాణ కంటే ముందు అక్కడ భవన్ కోసం స్థలం కావాలని ఏ రాష్ట్రం వారు అడగలేదని చెప్పారు.

మా కల నెరవేరింది.. సీటీఆర్‌ఎంఎ అధ్యక్షుడు లిబీ బెంజిమెన్ మాట్లాడుతూ ఇక్కడి మలయాళీల కలను ఇద్దరు సీఎంలు కలిసి తీర్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి మనం అనేక ప్రయోజనాలను పొందుతున్నామని, ఈ రుణం తీర్చుకోవాలని అన్నారు. మలయాళీలు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుతో చేతులు కలిపి ఈ రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దేవుడు పంపిన మనిషి, ప్రపంచంలోనే నెంబర్ వన్ వ్యక్తి అని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో కేరళ, తెలంగాణ రాష్ర్టాలకు సంబంధించిన కళలను ప్రదర్శించారు. కేరళ సంప్రదాయ నృత్యాలతోపాటు తెలంగాణ చిందు, పేరిణి నృత్య ప్రదర్శనలు జరిగాయి. ముఖ్యమంత్రులిద్దరినీ సీటీఆర్‌ఎంఎ తరపున ఘనంగా సన్మానించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, పద్మారావు, జూపల్లి కృష్ణారావు, టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు, కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, శ్రీనివాస్‌గౌడ్, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఐఏఎస్ అధికారి వెంకటేశ్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియలిస్టు ప్రవీణ్ గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, యాదాద్రి ఆలయ అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం ఇస్తానని ప్రకటించారు.

కేసీఆర్ పథకాలు బాగున్నాయి… హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం హైదర్‌గూడ శివానగర్ డోనాల్డ్ ప్రైవేటు పాఠశాలలో తెలంగాణ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ సొసైటీని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇక్కడ నివసించే కేరళీయులు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

క్యాంపు కార్యాలయానికి చాందీ.. హైదరాబాద్‌కు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు చేరుకున్న కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయనకు సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. సుమారు 30 నిమిషాలపాటు ఇద్దరూ ముచ్చటించుకున్నారు. కేరళ భవన్‌కు స్థలం కేటాయించినందుకు చాందీ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపగా.. శబరిమలలో తెలంగాణ అయ్యప్పస్వాముల వసతి కోసం తలపెట్టిన భవనానికి 5 ఎకరాల స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కూడా చాందీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శబరిమలలో తెలంగాణ భవన్‌కు త్వరలో శంకుస్థాపన జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వం తరపున సహకారం అందించాలని కేసీఆర్ చాందీని కోరగా.. పూర్తిస్థాయిలో సహకారం అందచేస్తామని ఆయన హామీఇచ్చారు.

CM-KCR--with-kerala-cm-umen-chandi-

కాగా ఇరువురి చర్చల్లో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, వర్షాలు, పర్యాటక రంగం తదితర అంశాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం, చైనా పర్యటన విశేషాలను సీఎం ఆయనకు తెలిపారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు సహకారం అందించాలని సీఎం ఆయనను అభ్యర్థించారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహాయ సహకారాలు ఉండాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. తెలంగాణలో తమ రాష్ట్రీయులకు ప్రభుత్వంనుంచి అందుతున్న సహకారంపట్ల చాందీకూడా పూర్తి సంతృప్తిని వ్యక్తంచేసినట్టు తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.