Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

చైనా మొబైల్ కంపెనీలతో కేసీఆర్ చర్చలు

– జెడ్‌టీఈకి ముఖ్యమంత్రి ఆహ్వానం – స్మార్ట్‌ఫోన్ యూనిట్ల ఏర్పాటుపై సానుకూల చర్చలు – దిగ్గజ కంపెనీలతో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ భేటీలు -సీసీపీఐటీ ప్రతినిధులతో వాణిజ్య అంశాలపై చర్చ -షెన్‌జాన్ ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన – హాంగ్‌కాంగ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

స్మార్ట్‌ఫోన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్‌టీఈ కంపెనీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ఆహ్వానించారు. సోమవారం షెన్‌జాన్‌లో ఆ కంపెనీ ప్రతినిధులతో సీఎం సమావేశమై తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. జెడ్‌టీఈకి చెందిన యూనిట్లను తెలంగాణలో ఏర్పాటుచేయడంపై ముఖ్యమంత్రి, కంపెనీ ప్రతినిధుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయి.

చైనా పర్యటనలో భాగంగా ఎనిమిదో రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం షెన్‌జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్(షిప్) సందర్శనతో పాటు చైనా కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (సీసీపీఐటీ) ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంది. ముందుగా సీసీపీఐటీ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో అంతర్జాతీయ వాణిజ్య అంశాల మీద ఇరుపక్షాలు చర్చించాయి. తెలంగాణ రాష్ట్రం రూపొందించిన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వివరించి.. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు- ప్రయోజనాలను తెలియచెప్పారు. 1952లో ఏర్పాటైన సీసీపీఐటీ ప్రధానంగా చైనా తరఫున ఇతర దేశాలతో వాణిజ్య సహకారం ఒప్పందాల విషయంలో కీలకపాత్ర పోషిస్తున్నది. దౌత్య వాణిజ్య సంబంధ అంశాల్లో సహకరిస్తుంది.

CM-KCR-visits-Shenzhen-High-Tech-Industrial-Park

జెడ్‌టీఈ సందర్శన సీసీపీఐటీ సమావేశం తర్వాత సీఎం బృందం షెన్‌జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్ (షిప్)ను సందర్శించింది. అనేక ప్రఖ్యాత కంపెనీలకు నెలవైన ఈ పార్కులో ముందుగా మ్బైల్ రంగంలో పేరెన్నికగన్న జెడ్‌టీఈ కార్పొరేషన్ కార్యాలయంలో ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైంది. జెడ్‌టీఈ చైనా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, మొబైల్ రంగంలో టాప్-5 స్థానంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా టాప్ -10లో చోటు దక్కించుకుంది. షెన్‌జాన్ కేంద్రంగా మూడు వ్యాపార విభాగాలను నిర్వహిస్తున్నది. క్యారియర్ నెట్‌వర్క్స్, టెర్మినల్స్, టెలీకమ్యూనికేషన్స్ వీటిలో ఉన్నాయి.

వైర్‌లెస్, ఎక్సేంజ్-ఆక్సెస్, ఆప్టికల్ ట్రాన్స్‌మిషన్, డాటా టెలీకమ్యూనికేషన్స్ గేర్, మొబైల్ ఫోన్స్, టెలీ కమ్యూనికేషన్స్ సాఫ్ట్‌వేర్ వంటి వివిధ అంశాలకు కంపెనీ విస్తరించింది. ఇక్కడ సీఎం జరిపిన సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో ఈ కంపెనీ యూనిట్లు ఏర్పాటు చేసే అంశం మీద సానుకూల చర్చలు జరిగాయి.

షిప్ విశిష్ఠతలు.. ఆ తర్వాత షెన్‌జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్ (షిప్)ను సందర్శించిన కేసీఆర్ దీన్ని అభివృద్ధి పరిచిన తీరుపై షిప్ ప్రతినిధులకు అభినందనలు తెలియచేశారు. 1996లో ఏర్పాటైన షిప్ చైనాలో ఐదో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. నాన్సన్ జిల్లాలో 11.5 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ పార్క్ వ్యాపారవేత్తలకు అంతర్గత సేవలు, పరిశోధనలు, పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తున్నది. దేశంలో ఎగుమతుల ఆధారిత హైటెక్ ఉత్పత్తులకు చైనా ప్రభుత్వంచే ఎంపికైంది. దీంతోపాటు అసియా-పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (అపెక్) హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్, అడ్వాన్స్‌డ్ స్టేట్ లెవెల్ హైటెక్ ఇండస్ట్రీ ఏరియా, నేషనల్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ బేస్‌గా కూడా ఎంపికయింది.

షిప్ సాధించిన విజయాలను సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి బృందానికి వివరించారు. ఐబీఎం, ఫిలిప్స్, కాంపాక్, ఒలింపస్, ఎప్సన్, ల్యూసెంట్, హ్యారీస్ ఆండ్ థామ్సన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈ పార్క్ ఆకర్షించింది. చైనా దేశీయ కంపెనీల్లో పేరెన్నికగన్న హువాయ్, జెడ్‌టీఈ, లెనొవా, టీఎస్‌ఎల్, స్కైవర్త్, గ్రేట్‌వాల్, పవరైజ్ వంటి సంస్థలు కూడా షిప్‌లో కొలువయ్యాయి. ప్రస్తుతం కంప్యూటర్, టెలీ కమ్యూనికేషన్స్, నెట్‌వర్కింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్, బయోలాజికల్ ఇంజినీరింగ్, న్యూ మెటిరియల్స్‌పై దృష్టి సారించి వాటిని అభివృద్ధి పరిచే దిశగా కృషిచేస్తున్నారు. ఈ పార్కులో పర్యటిస్తున్న సందర్భంగా కేసీఆర్ ఆయా కంపెనీల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు. షిప్ సందర్శన అనంతరం ఒకరోజు షెన్‌జాన్ పర్యటనకు వీడ్కోలు పలికిన సీఎం బృందం సభ్యులు చైనానుంచి హాంగ్‌కాంగ్‌కు చేరుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.