-ఆత్మగౌరవంతో ఇండ్లలోకి అడుగుపెట్టిన పేదలు -సీఎం కేసీఆర్ ఆత్మీయ పలుకరింపు -ఆనందంతో లబ్ధ్దిదారుల్లో భావోద్వేగం

కూలీ చేస్తేనే పూట గడిచేవారికి నెలనెలా ఇంటి కిరాయిలు కట్టడం భారమే. అలాంటివారికోసం సీఎం కేసీఆర్ డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించడం, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సౌకర్యాలు కల్పించడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సిద్దిపేటలోని నర్సపురం వద్ద కేసీఆర్ నగర్ పేరిట నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో గురువారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఇంటిముందు రంగవల్లులు, గుమ్మాలకు తోరణాలతో బంధువుల మధ్య లబ్ధిదారులు సంబురంగా గృహ ప్రవేశాలు జరుపుకొన్నారు. ఆత్మగౌరవంతో ఇంటిలోకి అడుగుపెట్టారు. వ్రతాలు చేసి ఇంటి ఆడపడుచులకు ఒడిబియ్యం పోశారు. ఇల్లు కట్టించిన దేవుడే మా ఇంటికొచ్చారంటూ సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. సార్‌కు ఏమిచ్చి రుణం తీర్చుకుంటామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతకుముందు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పైలాన్ అవిష్కరించారు. సర్వమత ప్రార్థనలు అనంతరం అధికారులతో గ్రూప్ ఫొటో దిగారు. సమీకృత మార్కెట్‌ను, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ హాల్‌ను ప్రారంభించారు. బ్లాక్‌నంబర్-9లో లబ్ధ్దిదారులచే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిలతో కలిసి సీఎం కేసీఆర్ గృహప్రవేశాలను చేయించారు.
సార్‌ను జీవితంలో మరిచిపోం 30 ఏండ్లుగా సొంతిల్లులేదు. సీఎం కేసీఆర్‌సార్ చేతుల మీదుగా కొత్తింట్లోకి పోవడం సంతోషంగా ఉన్నది. సీఎం సారుకు, హరీశ్‌రావు సారుకు రుణపడి ఉంటాం. ఇల్లు ప్రారంభించిన తరువాత సీఎం సార్ ఆశీర్వాదం తీసుకున్నాం. సార్ మమ్ముల్ని ఏం చేస్తారని అడిగితే.. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తానని చెప్పా. ఇల్లు మంచిగున్నదా.. మీకు సంతోషమేనా? అని అడిగారు. మంచిగుంది అని చెప్పగానే కంగ్రా ట్స్ అన్నరు. ఇది మా జీవితంలో మరువలేని రోజు. – కొడిమెల స్వాతి, దేవేందర్ చారి
జీతం బతకడానికే సరిపోతుండే డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్న. ముర్షద్ గడ్డ వద్ద పదేండ్ల నుంచి కిరాయి ఇంట్ల ఉంటున్నం. నెలకు రూ.2,500 కిరాయి కడుతున్నం. వచ్చే జీతం బతకడానికే సరిపోక పోతుండే. ఇప్పుడు ఇంత మంచిఇల్లు ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చింది. పేదోళ్లకు ఇంత మంచి ఇల్లు ఇచ్చి ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ఎన్నిఏండ్లు డ్రైవింగ్ చేసినా ఇసొంటి ఇల్లు కట్టుకోపోతుంటిమి. సీఎం కేసీఆర్ సార్ వచ్చి సంతోషంగా ఉందా? అని అడిగాడు. చాలా సంతోషంగా ఉంది అని చెప్పినం. – ఎండీ సద్దాం
కేసీఆర్, హరీశ్ సార్లే పెద్దదిక్కు నా భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు. నాకు ఇప్పుడు కేసీఆర్ సారు, హరీశ్‌రావు సార్లే పెద్దదిక్కు. పెద్ద కొడుకు రెండేండ్ల కిందట అనారోగ్యంతో చనిపోయిండు. ఇల్లు లేక బాధపడుతుంటే వాళ్లే నన్ను అక్కున చేర్చుకుని ఇల్లు ఇచ్చిర్రు. సార్ల రుణం ఎట్ల తీర్చుకోవాల్నో అర్థమైతలేదు. నా కొడుకులు ఉంటే ఇంకా ఎంతో సంబురపడేటోళ్లు. చాన పైసలున్నోల్లు కట్టుకున్నట్టుగా ఈ ఇండ్లు ఉన్నాయి. ఇంత మంచి ఇల్లు మాకు ఇచ్చినందుకు ఈ జన్మ మొత్తం వాళ్లకు రుణపడి ఉంటా. – ఎర్రవల్లి సుజాత

ఆరేండ్లలో ఆరోసారి సిద్దిపేటకు సీఎం కేసీఆర్ సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సిద్దిపేటకు ఆరేండ్లలో ఆరోసారి వచ్చారు. సీఎం హోదాలో తొలిసారిగా హరితహారం కార్యక్రమానికి హాజరుకాగా.. రెండోసారి మిషన్ భగీరథ పథక రూపకల్పనలో భాగంగా సిద్దిపేటలో ఇంటింటికీ తాగునీరు అందించిన తీరును తెలుపడానికి రాష్ట్ర మంత్రులను తీసుకునివచ్చారు. మూడోసారి జిల్లా ఆవిర్భావం, నాలుగోసారి కలెక్టరేట్, మెడికల్ కళాశాల శంకుస్థాపనలు, ఐదోసారి 2018 ఎన్నికల ప్రచారం, ఆరోసారి గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవంతోపాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు విచ్చేశారు.
డిసెంబర్ 10.. ఆణిముత్యం సీఎం కేసీఆర్ సిద్దిపేట సభలో ప్రసంగిస్తూ మంత్రి హరీశ్‌రావు ఆణిముత్యమన్నారు. ఈ మాటకు ఒక ప్రత్యేకత ఉంది. 2014 డిసెంబర్ 10న సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా అణిముత్యం అని సంబోధించిన సీఎం కేసీఆర్.. సరిగ్గా ఆరేండ్ల తర్వాత 2020 డిసెంబర్ 10న అదే మాట పలుకడం విశేషం. దీంతో హరీశ్ ఆణిముత్యం అన్న మాటకు ప్రత్యేకత వచ్చింది.
మసీదు నుంచి అజాన్.. ప్రసంగాన్ని నిలిపేసిన సీఎం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే మసీదు నుంచి అజాన్ వినిపించింది. దీంతో కేసీఆర్ ఒక్కసారిగా తనప్రసంగాన్ని ఆపివేశారు. అజాన్ ముగిశాక మళ్లీ కొనసాగించారు. మత విశ్వాసాలు, మనోభావాలను గౌరవించడంపై సభకు విచ్చేసిన ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.