– కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సాహసం – తెలంగాణ ప్రజలకోసం ఎక్కువగంటలు పనిచేస్తాం – సీఎంతో భేటీ అనంతరం తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైనవని ఉద్యోగసంఘాల నేతలు అన్నారు. అమరుల కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించి.. ప్రభుత్వం అమరుల పక్షాన ఉందని కేసీఆర్ నిరూపించారని పేర్కొన్నారు. గురువారం టీ ఉద్యోగసంఘాల నాయకులు సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రితో జరిపిన చర్చల వివరాలను వివరించారు. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ఉద్యోగులకు గొప్ప వరాలను ప్రకకటించినందుకు వ్యక్తిగతంగా ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియచేశామని తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులపై అధ్యయనం చేసి వారినందరినీ రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సాహసమైన నిర్ణయమని అన్నారు. అదేవిధంగా ఔట్‌సోర్సింగ్ విధానంపైన కూడా తెలంగాణ ప్రభుత్వం విచారణ జురుపుతున్నదని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల్లోకి వచ్చిన వారిని కూడా ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిపాలనలోకి వచ్చిన తర్వాత 45రోజుల్లోనే అసాధారణమైన 42 నిర్ణయాలను ప్రకటించి దేశంలోని ముఖ్యమంత్రులందరికీ కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని అభిప్రాయపడ్డారు. అమరుల కుటుంబాలకు 10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి.. ప్రభుత్వం అమరుల పక్షాన ఉందని నిరూపించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకులతో చర్చించి ఉద్యోగుల జీవనప్రమాణాలు మెరుగుపడేవిధంగా జీతభత్యాలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారులసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యమఫలాలను తెలంగాణ ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ మాట్లాడుతూ ఇంతవరకు దేశంలో గుజరాత్ నమూనా అభివృద్ధిపైన చర్చ జరిగిందనీ, భవిష్యత్తులో తెలంగాణ నమూనా అభివృద్ధిపై చర్చ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం కేబినేట్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైనవని అన్నారు.
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ వీఆర్‌ఏలకు మూడుమాసాల వేతనం రూ.45 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఇంక్రిమెంట్ చరిత్రాత్మక నిర్ణయమని ఇంటర్‌జేఏసీ చైర్మన్ పీ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎంతో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతల్లో టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు కస్తూరి వెంకటేశ్వర్లు, బండారు రేచల్, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఓంప్రకాశ్, తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ హర్షణీయం – సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన పారామెడికల్ సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్‌ఎంపీలు (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) , పీఎంపీలకు (ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్) శిక్షణ ఇస్తామని, సర్టిఫికెట్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించడంపై రాష్ట్రంలోని పారామెడికల్ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రజలకు వచ్చే 60శాతం చాలావరకు జబ్బులకు ప్రథమ చికిత్స, చిన్నపాటి వైద్యంతో నయం చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఇలాంటి వైద్యమే చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సరైన అవగాహన లేక వీరి చికిత్స వికటించి.. కొందరు రోగులు మరణించిన ఘటనలూ ఉన్నాయి.
అయితే, గ్రామీణులకు సత్వరమే ప్రథమచికిత్స అందిస్తుండటంలో వీరి పాత్ర ఎనలేనిది. వీరికి నిపుణులైన వైద్యులతో శిక్షణ ఇప్పిస్తే.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. గతంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గత ప్రభుత్వం శిక్షణ ఇచ్చినా.. ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయలేదు. సీఎం నిర్ణయంపై తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ టీ రాజయ్యను కలిసి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ఉక్కుల, మహిళా అధ్యక్షురాలు గీత, ప్రధాన కార్యదర్శి శివకుమార్, నాగారాజు, లింగం, ఉపేందర్‌గౌడ్, ఎన్ శ్రీనివాస్, బీ ఉపేందర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటనపై తెలుగునాడు కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు నాదెండ్ల కిషోర్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.