-పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. 23న ‘పల్లా’ నామినేషన్

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. తొలిరోజు ఒక నామినేషన్ మాత్రమే రాగా రెండో రోజు అసలేమీ నామినేషన్లు దాఖలు కాలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. మూడు పాత జిల్లాలతో కూడిన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ ముఖ్యనేతలను, ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను, శ్రేణులను, పట్టభద్ర ఓటర్లు, మిత్రులను తన నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ మేరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఉదయం 10గంటల వరకు అంతా నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. పల్లా బుధవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ బీ ఫాం అందుకున్నారు. మరోసారి పార్టీ అభ్యర్ధిగా పోటీచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.