Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆరే సీనియర్

-ఏడు టర్మ్‌లు ఎమ్మెల్యేగా రికార్డు
-23 మంది కొత్తవారు.. 76 మంది పాతవారు
-ఇతరసభల నుంచి వచ్చినవారు నలుగురు
-కొలువుదీరనున్న తెలంగాణ రెండో అసెంబ్లీ
-రేపు ప్రొటెం స్పీకర్ ప్రమాణం
-గురువారం ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
-స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరనుంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన 119 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ప్రొటెంస్పీకర్‌గా ఎంఐఎం సభ్యుడు ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో బుధవారం గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. గురువారం ఎమ్మెల్యేలందరిచేత ప్రొటెంస్పీకర్ ప్రమాణం చేయిస్తారు. తాజా శాసనసభలో అనేక విశేషాలున్నాయి. తాజాగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అందరికంటే సీనియర్ సభ్యుడిగా ఉన్నారు. అత్యధికసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అరుదైన రికార్డు సీఎం కేసీఆర్ సొంతమైంది. ఆయన తర్వాత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్, రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు. వీరు ముగ్గురు ఆరుసార్లు (టర్మ్) ఎమ్మెల్యేలుగా ఎన్నికైన రికార్డు సొంతంచేసుకొన్నారు. ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల్లో 23 మంది శాసనసభావ్యవహారాలకు పూర్తిగా కొత్తవారే. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో కాలుమోపుతున్నారు.

వీరితోపాటు మరో ఐదుగురు కూడా అసెంబ్లీలో అడుగుపెడుతున్నప్పటికీ, చట్టసభలకు కొత్తవారు కాదు. వీరిలో బాల్క సుమన్, చామకూర మల్లారెడ్డి ఎంపీలుగా, పట్నం నరేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా పనిచేశారు. అసెంబ్లీకి మాత్రం ఈ నలుగురు కొత్తవారే. ఇక గడచిపోయిన శాసనసభలో (2014-18) ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో 76 మంది తిరిగి ఎన్నికయ్యారు. గత శాసనసభలో నామినేటెడ్‌గా ఉన్న స్టీఫెన్‌సన్ తాజా అసెంబ్లీలో కూడా నామినేటెడ్ సభ్యుడు కావడం విశేషం. ఆయనతో కలిపితే మొత్తం 77 మంది గత అసెంబ్లీలోని సభ్యులు ప్రస్తుత అసెంబ్లీలోనూ కనిపించనున్నారు. 2009-2014 మధ్య శాసనసభ్యులుగా గెలిచి.. 2014-2018 మధ్య సభ్యులుగా లేనివారిలో 16 మంది తిరిగి సభకు వస్తున్నారు.

వయోవృద్ధుడు వనమా.. యువ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ తాజా అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వయసురీత్యా అత్యంత సీనియర్. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన తర్వాత అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం (72), ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ (70) ఉన్నారు. పిన్నవయస్కురాలైన సభ్యురాలిగా ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ (29) గుర్తింపు పొందనున్నారు. ఆ తర్వాత తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి (34), చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ (35), తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ (37) ఉన్నారు. మొత్తం సభ్యుల్లో ముస్లిం మైనార్టీ సభ్యులు ఎనిమిది మంది ఉండగా వారిలో ఏడుగురు ఎంఐఎం పార్టీకి చెందినవారే. తాజా అసెంబ్లీలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ముగ్గురు చొప్పున మహిళా సభ్యులు ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆరే సీనియర్.. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పార్లమెంటరీ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతంచేసుకొన్నారు. మొట్టమొదటి ఎన్నిక మినహాయిస్తే.. పోటీచేసిన అన్ని ఎన్నికల్లోనూ అప్రతిహతంగా గెలిచిన నాయకుడు కేసీఆర్. ఒక ఉపఎన్నికను తీసివేస్తే మొత్తం ఏడు టర్మ్‌లు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. మరోసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీచేసి ఎంపీ పదవి ఉంచుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేశారు. ప్రస్తుత శాసనసభలో ఎనిమిదిసార్లు శాసనసభకు గెలిచిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే కావడం గమనార్హం. 1985 నుంచి ఇప్పటివరకు పోటీచేసిన అన్ని ఎన్నికల్లోనూ ఆయనను విజయం వరించింది. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కంటే కేసీఆరే ఎక్కువసార్లు చట్టసభలకు ఎన్నికయ్యారు. శాసనసభావ్యవహారాలకు సంబంధించిన పీఏసీ సహా అనేక కమిటీల్లో చైర్మన్‌గా.. సభ్యుడిగా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఇంచార్జి మంత్రిగా, ఉపసభాపతిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కూడా రికార్డు సృష్టించారు. వయసురీత్యా చాలామంది జాతీయ నేతలకంటే చిన్నవాడే అయినప్పటికీ, సమకాలీన దేశ రాజకీయాల్లో కేసీఆర్ వంటి నేత మరొకరు లేరు. సుదీర్ఘ పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని స్థాయిల్లో ఇన్ని రికార్డులున్నవారు అరుదనే చెప్పాలి. జాతీయస్థాయి నాయకుల్లో ఎలాంటి నేరచరిత్ర, అవినీతి మరకలు లేకుండా ఉన్న నాయకుడు కేసీఆరే.

సభానాయకుడిగా తొలి ప్రమాణం చేయనున్న కేసీఆర్ శాసనసభలో ప్రమాణస్వీకారానికి కొన్ని నిబంధనలున్నాయి. సభలోని సీనియర్ సభ్యుల్లో ఒకరితో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. ఆ శాసనసభ్యుడే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. గవర్నర్ ప్రమాణం చేయించిన క్షణం నుంచి ఆయనకు శాసనసభాపతికి ఉండే అన్ని సౌకర్యాలు, హోదా వర్తిస్తాయి. ప్రస్తుత సభ లో సీనియర్ నేత అయిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా బుధవారం ప్రమాణం చేస్తారు. ఆ మరుసటి రోజు శాసనసభ్యులుగా మిగిలిన 119 మంది సభ్యులతో (నామినేటెడ్ సభ్యుడిని కలిపి) ప్రొటెంస్పీకర్ ప్రమాణం చేయిస్తారు. సభానాయకుడిగా సీఎం కేసీఆర్ మొదటగా ప్రమాణం చేస్తారు. ఆయన తర్వాత మహిళాసభ్యులతో ప్రమాణం చేయిస్తారు. వారి తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్‌లో ఉన్న పేర్లలో అక్షరమాల ప్రకారం (ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో) ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. శాసనసభ్యులు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషుల్లో ఏ భాషలోనైనా ప్రమాణం చేయవచ్చు. సభ్యులందరూ విధిగా రెండు ప్రమాణాలు స్వీకరించాల్సి ఉంటుంది. దీంట్లో భారత రాజ్యాంగానికి బద్ధులై ఉం టానని ఒకటి, శాసనసభ నియమనిబంధనలకు బద్ధుడనై ఉం టానని మరొకటి ఉంటుంది. ఈ కార్యక్రమం తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నిక పూర్తయ్యేవరకు ప్రొటెంస్పీకర్ అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. స్పీకర్‌గా ఎన్నికైనవారిని ఆ స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత ప్రొటెంస్పీకర్ బాధ్యత తీరిపోతుంది. తర్వాత ఎమ్మెల్యేగా తన స్థానానికి వెళ్తారు.

స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీఅయ్యింది. సభ్యులుగా ఎన్నికైనవారు ఎవరైనా నిర్దేశించిన ఫార్మాట్‌లో నామినేషన్లను వేయవచ్చు. ఈనెల 17వ తేదీ గురువారం ఉదయం పదిన్నర నుంచి ఐదు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. సాధారణంగా స్పీకర్ ఎన్నిక లాంఛనంగానే ఉంటుంది. అధికార పక్షానికి మెజార్టీ ఉన్నందున ఆ పార్టీ నిర్ణయించిన వ్యక్తులే శాసనసభాపతిగా ఎన్నికవుతారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.