Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కెసీఆర్ కు ఖమ్మం జేజేలు

-మురికివాడలను చుట్టేసిన ముఖ్యమంత్రి.. అడుగడుగునా ఘనస్వాగతం పలికిన ప్రజలు -గల్లీల్లో నాలుగు గంటల పర్యటన.. అన్నింటికీ పెద్ద కొడుకును నేనున్నానని భరోసా ఇచ్చిన కేసీఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఖమ్మం పట్టణంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం ఖమ్మంకు చేరుకున్న సీఎం రోజంతా నగరంలో సుడిగాలి పర్యటన జరిపారు. సుమారు 4 గంటలపాటు వివిధ బస్తీలను కాలినడకన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతిచోటా ప్రజలు సీఎంకు నీరాజనాలు పట్టారు. మంగళహారతులతో స్వాగతం పలికారు. అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్‌లో లేకపోయినా, అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న బస్తీల్లో విస్తృతంగా పర్యటించారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ కనీసం కాలుపెట్టని బడుగువాడల్లో కలియతిరుగుతూ ప్రజలను పలుకరించారు. పేదల ఇండ్లలోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాల మీద అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇరుకిరుకు ఇండ్లలో మగ్గుతున్న పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పలువురికి పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వృద్ధులు, మహిళలు, మైనారిటీలతో పలుచోట్ల సమావేశాలు నిర్వహించారు. పింఛన్లు మొదలుకొని బస్తీ సమస్యలదాకా వారితో చర్చించారు. పెద్ద కొడుకుగా వచ్చాను..అంతా కలిసికట్టుగా పనిచేసి బాగుపడదామని వారిలో భరోసా నింపారు. సామాన్య ప్రజలతో ముఖ్యంగా మహిళలతో ముఖ్యమంత్రి మాట్లాడటంతో వారి ఆనందం వెల్లివిరిసింది. సమస్యలు చెప్పుకోవడానికి ఎగబడ్డారు. సీఎం వివిధ పథకాలు మంజూరు చేస్తూ ప్రకటన చేసినపుడు జేజేలు పలికారు.

CM KCR visit to Khammam district (12)

బిజీబిజీగా.. సోమవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1.03 గంటలకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంకు చేరుకున్నారు. ఆ వెంటనే నగరంలో పర్యటన ప్రారంభమైంది. స్టేడియం నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరిన ముఖ్యమంత్రి తొలుత బైపాస్ రోడ్డులోని ఎన్నెస్పీకి చేరుకుని నూతనంగా నిర్మించబోయే బస్టాండ్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా రాపర్తినగర్ బోర్డు డంపింగ్ యార్డుకు చేరుకున్నారు. సుమారు 2 కిలో మీటర్లకు పైగా మట్టిరోడ్డుపై ప్రయాణించిన సీఎంకు దారిపొడవున రాపర్తి నగర్, జర్నలిస్టు కాలనీ, టీఎన్‌జీవో కాలనీకి చెందిన మహిళలు హారతులిస్తూ స్వాగతం పలికారు. సుమారు 38 ఎకరాల్లో విస్తరించిన డంపింగ్ యార్డు వివరాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి బైపాస్ రోడ్డు గుండా రమణగుట్ట శివారు ప్రాంతానికి చేరుకున్నారు. రమణగుట్ట కాలనీ, వికలాంగుల కాలనీ, రజబ్‌అలీనగర్ కాలనీలను ముఖ్యమంత్రి సందర్శించి కాలనీవాసులతో మాట్లాడారు. రమణగుట్టలో వీధి పంపును ప్రారంభించారు. వారి సమస్యలు విని అందరి సమస్యలను పరిష్కరించడానికే వచ్చానని భరోసానిచ్చారు. రజబ్‌అలీనగర్ సెంటర్‌లో ఆ కాలనీవాసులు సీఎం కేసీఆర్‌కు నుదుట తిలకందిద్ది, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. కాలనీవాసుల సమస్యల గురించి స్థానిక నాయకులను అడిగి మిగతా సమస్యలపై కూలంకషంగా చర్చించేందుకు మొగిలి ఫంక్షన్‌హాల్‌కు రావాలని సూచించారు. అనంతరం వికలాంగుల కాలనీలో కూడా ముఖ్యమంత్రికి ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం 4 గంటలకు ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా లకారం చెరువుకు చేరుకుని పనుల వివరాలు వాకబు చేశారు.

ఏ ముఖ్యమంత్రి రాలేదు సార్,,! ఖమ్మం కాల్వొడ్డు నుంచి త్రీటౌన్ ప్రాంతంలోని డాబాల బజార్, పంపింగ్‌వెల్‌రోడ్, సుందరయ్యనగర్ మీదుగా శ్రీనివాసనగర్‌లో పర్యటించిన సీఎం కాలినడకనే నిరుపేదల వద్దకు వెళ్లారు. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం ఘనస్వాగతం పలికారు.. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా మాదగ్గరికి రాలేదు సార్. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చూసిన పాపాన పోలేదు. ఇంతకాలం తర్వాత మీరు వచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది.. అని వారు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను సీఎంకు పోటీపడి చెప్పుకున్నారు. బస్తీ పరిస్థితులకు చూసిన సీఎం తక్షణమే ఇండ్ల సర్వేను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అంతవరకూ కనీసమౌలిక వసతులు కల్పించాలని సూచించారు. గుడిసెలను కూల్చివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని స్థానిక మహిళలు కొందరు సీఎంకు ఫిర్యాదు చేయగా ఆందోళన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు. కొత్త ఇండ్లు కట్టే వరకూ పాతవాటిని ముట్టుకోవటం జరగదని హామీ ఇచ్చారు. మీ అందరికీ నేనున్నా ఏమున్నా నాకు చెప్పండి అంటూ అభయమిచ్చారు.

బతుకుమీద ఆశ కల్పించారు.. తర్వాత మాన్ట్‌ఫోర్ట్ స్కూల్ మీదుగా వెళ్తున్న కాన్వాయ్‌ని సీఎం ఆపించి ఎదరురోడ్డులోని గల్లీలోకి వెళ్లి పేదలను పలుకరించారు. అక్కడ నివాసముంటున్న రేష్మా, రంజాన్‌బీలు సీఎంకు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇరుకు ఇండ్లలో పిల్లలతో అవస్తలు పడుతున్నామని వాపోయాయారు. సీఎం స్పందిస్తూ పేదలందరికీ ఇండ్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి అవసరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీనివాస్‌నగర్‌లోని ఇరుకైన ప్రాంతాల్లో సైతం ముఖ్యమంత్రి వెళ్లి ప్రజలను పలుకరించారు. అక్కడ ఎదురైన మహిళలు అన్నమ్మ, నీలం జయమ్మలు సార్.. మాకు బతుకుపై ఆశ కల్పిస్తూ పింఛన్లు ఇచ్చారు..అలాగే మీరు కట్టించే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనూ మా లాంటి పేదలకు అవకాశం ఇవ్వండి అని విన్నవించారు. స్పందించిన సీఎం హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో మాదిరిగా ఖమ్మంలోకూడా పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని సంకల్పించామని చెప్పారు. అధికారులు మీ ప్రాంతానికి వచ్చి రేపే సర్వే చేస్తారని, వారి వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇన్షా అల్లాహ్.. జరూర్ కరేంగే.. ఇరుకైన రహదారులు. కనీసం కారు కూడా వెళ్లలేని ఇరుకైన రహదారులతో అభివృద్ధి ఆనవాళ్లుకూడాలేని శుక్రవారిపేటలో సీఎం గల్లీగల్లీలో పర్యటించారు. అత్యధికంగా ముస్లిం ప్రజలు నివసించే ఆ ప్రాంతంలో వారితో ఉర్దూలో మాట్లాడుతూ వారి స్థితిగతులను వాకబు చేశారు. స్థానిక మసీదు వద్దకు వెళ్లి, ప్రార్ధనలు నిర్వహించారు. ఇరుకు పెంకుటిండ్లు, రేకుల షెడ్లలో నివసిస్తున్న ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకున్నారు. చాలామంది ఇండ్లు, ఇండ్ల స్థలాలు కావాలని, కబేళా నిర్మించాలని కోరారు. వెంటనే ఇక్కడి ప్రజలకు కావాల్సిన అవసరాలను నివేదిక తయారుచేసి పంపించాలని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే అందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇన్షా అల్లాహ్.. జరూర్ కరేంగే అంటూ ఉర్ధూలో వారిలో మనోధైర్యం నింపారు. దీనితో స్థానిక ప్రజలు జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. శుక్రవారిపేట పర్యటనలో అన్వర్ అనే వ్యక్తిని చూసి మీ బస్తీలో ఏఏ సమస్యలున్నాయని స్వయంగా సీఎం అడుగడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

ఇక్కడ 30 ఏండ్లనుంచి ఉన్నాం. ఏ ఒక్కరూ తమను పట్టించుకోలేదని వాపోయాడు. ఇక్కడ అర్హులైన వారికి పింఛన్ రావడం లేదని చెప్పారు. ఇండ్లు లేవని చెప్పుకున్నాడు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్ మంజూరు చేస్తామని, అలాగే ఇక్కడ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కచ్చితంగా కట్టిస్తామని..నేనే స్వయంగా వచ్చి మీ ఇంటి తాళాలు ఇస్తా అని అతనికి భరోసా ఇచ్చారు. లతీఫ్ వ్యక్తి తన తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదని చెప్పగా అతని మెడికల్ రిపోర్టును సీఎం స్వయంగా పరిశీలించి, వైద్యసదుపాయం కోసం డబ్బు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అతడి వద్ద ఫోన్ నంబర్ తీసుకున్న సీఎం నేనే నీకు ఫోన్ చేస్తా.. హైదరాబాద్‌కు రావాలని సూచించారు.

పెద్ద కొడుకు ఉన్నాడనే విషయాన్ని మరువొద్దు.. సాయంత్రం మురికివాడల ప్రాంతమైన గోళ్లపాడు ఛానల్ ప్రాంతంలో సీఎం పర్యటించారు ఛానల్ మీద గుడిసెలు వేసుకున్న దళితుల ఇండ్ల వద్దకు వెళ్లి, మురుగు కాలువ నుంచి భరించలేని వాసన రావటం చూసి ఇంతటి దుర్భర పరిస్థితుల్లో ఎలా నివసిస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. చేకూరి మాదయ్య ఇంటి దగ్గర ఆగిన సీఎం కేసీఆర్ మాదయ్య, రాణి దంపతులను పలకరించి సమస్యలు వాకబు చేశారు. తర్వాత కాలనీలో మహిళలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఓపికగా సమస్యలు విని కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే ప్రత్యేక తీర్మానాలను చేసి జిల్లా అధికారులకు అందివ్వాలని సూచించారు. గోళ్లపాడు కెనాల్‌పై ఉన్న పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తనదేనన్నారు. పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తించాలన్నారు. రెండురోజుల్లోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించే స్థలాన్ని రెవెన్యూ అధికారులు చూపిస్తారని, ఆ స్థలం నచ్చితేనే ఇండ్ల నిర్మాణం మొదలవుతుందన్నారు. ఇండ్లలో గృహప్రవేశం జరిగిన తరువాతే గోళ్లపాడు కెనాల్‌పై ఉన్న ఇళ్లను తొలగిస్తారని హామీ ఇచ్చారు. ఈ హామీలను నెరవేర్చితేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మీ ముందుకు వస్తామని తేల్చి చెప్పారు. కొంత మంది మహిళలు పింఛన్లు అందటం లేదని ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు ఇస్తే ఒక్క రోజులోనే పింఛన్ మంజూరు చేయిస్తానని చెప్పారు. అనంతరం సుందరయ్య నగర్ కాలనీలో వడ్డెబోయిన విజయలక్ష్మి అనే మహిళతో ముచ్చటించారు.సారథినగర్, బురద రాఘవాపురం, పంపింగ్ వెల్ రోడ్డు, సుందరయ్యనగర్, ప్రాంతాలలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు.

పేదల బస్తీలు చూసి చలించిన సీఎం సీఎం స్పందన చూసి అక్కడి కాలనీవాసులు ఉద్వేగానికి గురయ్యారు. ఆవేదన నిండిన స్వరంతో ఒక్కో సమస్యనూ చెప్పుకున్నారు. తర్వాత ఖిల్లా ప్రాంతంలో సీఎం పర్యటన అధికారులకు, ప్రజలను కూడా ఆశ్చర్య చకితులను చేసింది. కారుకూడా వెళ్లలేని ఇరుకు గల్లీల్లో దాదాపు రెండు కిలోమీటర్ల పాటు సీఎం కలియతిరిగారు. పెద్దఎత్తున యువకులు ఆయనను అనుసరించారు. సీఎం కనిపించిన ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ఆ ప్రాంతంలోని మసీదులో ముస్లిం పెద్దలతో ఇష్టాగోష్టిగా చాలా సేపు మాట్లాడారు. సీఎం చొరవకు వారంతా విస్మయానికి గురయ్యారు. ఇంతవరకూ తమ గల్లీల్లోకి మంత్రులు కూడా వచ్చిన పాపాన పోలేదని, ఇవాళ ఏకంగా సీఎం తమతో కలసి ఒక సామాన్యుడిగా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని మాట్లాడడం, మేం చెప్పేది శ్రద్ధగా ఆలకించటం నమ్మలేకపోతున్నామని అన్నారు. సీఎం మాతో కూర్చోవటం ఏమిటి?..మేం ఇప్పటికీ నమ్మలేక పోతున్నాం అని వారు చెప్పడంతో మీ సమస్యలు తెలుసుకుందామనే వచ్చానని సీఎం వారితో అన్నారు. పట్టణంలో ముస్లింలకు మరో షాదీఖానా కావాలని వారు కోరగా తక్షణమే మంజూరు చేశారు. నగరంలో ముస్లింలకు రెండు రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని, డబుల్‌బెడ్‌రూం పథకంలో 10 శాతం ముస్లింలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.కబేళా సమస్యను కూడా వారు సీఎం దృష్టికి తీసుకురాగా సానుకూలంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మొత్తానికి సీఎం ఖమ్మం పర్యటన పట్టణంలో చర్చనీయాంశమైంది.

ఖిల్లాలో ముస్లింలతో ముఖాముఖి.. పేదల బస్తీలు చూసి చలించిన సీఎం ఖమ్మం పట్టణంలోని పేదల బస్తీల్లో సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జరిపిన పర్యటనలో అనేక ఉద్వేగ సంఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలో నాలుగు గంటలపాటు నిర్విరామంగా పర్యటించిన సీఎం కొన్ని బస్తీల్లో పేదల బతుకులను చూసి చలించిపోయారు. సుందరయ్యనగర్ కాల్వ ఒడ్డు, గోళ్లపాడు ఛానెల్ ప్రాంతంలో పేదలు, దళితుల పరిస్థితులు చూసి విస్మయానికి గురయ్యారు. భరించరాని దుర్గంధం వెదజల్లే కాలువల పక్కన నివసిస్తున్నవారి దీనస్థితిని చూసి ఆయన కండ్లలో నీరు ఉబికింది. ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారని అడిగారు. ఇలాంటి స్థితిలో మనుషులనేవాళ్లు ఎలా బతుకుతారు? అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి పరిస్థితిలో బతుకుతుంటే పాలనకు అర్థమేమిటని ఆవేదన చెందారు. ఎంతఖర్చయినా భరిస్తాం.. తక్షణం సర్వే జరిపి వీరికి ఇండ్లు నిర్మించాలని కలెక్టర్‌ను తర్వాత ఖిల్లా ప్రాంతంలోని మసీద్ వద్ద ముస్లిం నాయకులు ఎండీ షౌకత్‌అలీ, ఖమర్, కలీమ్, అజీమ్, అక్రమ్, మదార్‌సాహెబ్‌లతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం నగరంలో రూ. కోటితో మరో షాదీఖానా నిర్మిస్తామని చెప్పారు.

నగరంలో ముస్లింలకు రెండు రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని, డబుల్‌బెడ్‌రూం పథకంలో 10 శాతం ముస్లింలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల కోరిక మేరకు వన్‌టౌన్ ప్రాంతంలో 24 గంటల వైద్యసదుపాయం అందే విధంగా నూతన ప్రైమరీ వైద్యశాలను నిర్మిస్తామని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పించేందుకు కమిటీ వేశామని, త్వరలోనే ఏకే ఖాన్‌ను ఖమ్మం ఖిల్లాకు పంపించి ముస్లింల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో టీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హరిత హారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గిస్, కొత్తగూడెం, ఖమ్మం, ఇల్లందు, వైరా, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య, బాణోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పూల రవీందర్, బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఎస్ పీఎస్‌సీ సభ్యురాలు బాణోత్ చంద్రావతి, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఎస్పీ షానవాజ్‌ఖాసీం, జాయింట్ కలెక్టర్ డీ దివ్య, డీఐజీ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌బీ బేగ్, ఆర్జేసీ కృష్ణ తదితరులున్నారు.

సీఎం తొలిరోజు పర్యటన సాగింది ఇలా.. ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఖమ్మం జిల్లాకు సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వచ్చారు. ఖమ్మంలో అడుగుపెట్టినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు క్షణం తీరిక లేకుండా తన తొలి రోజు పర్యటనను పూర్తి చేశారు.

-మధ్యాహ్నం 1 గంటకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సీఎం హెలికాప్టర్ దిగారు. -1.04 గంటలకు.. మంత్రి తుమ్మల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పుష్పగుచ్ఛాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. -1.08 గంటలకు.. బుల్లెట్ ఫ్రూఫ్ కారులో పర్యటనకు బయలుదేరారు. -1.12 గంటలకు.. స్టేడియం ప్రధాన ద్వారం వద్ద కారు నుంచి బస్సులోకి సీఎం -1.13 గంటలకు.. స్టేడియం నుంచి బైపాస్ రోడ్డు మీదుగా ఎన్నెస్పీ స్థల పరిశీలనకు -1.17 గంటలకు.. ఎన్నెస్పీలోని ప్రతిపాదిత నూతన బస్టాండ్ స్థలం పరిశీలన -1.22 గంటలకు.. ఎన్నెస్పీ నుంచి రాపర్తినగర్ డంపింగ్ యార్డు దగ్గరకు పయనం -1.32 గంటలకు.. డంపింగ్ యార్డుకు వద్దకు సీఎం కేసీఆర్ -1.37 గంటలకు .. డంపింగ్ యార్డు నుంచి తిరుగు ప్రయాణం -1.45 గంటలకు.. రమణగుట్టకు ముఖ్యమంత్రి రాక.. -2.20 గంటలకు.. వికలాంగుల కాలనీ నుంచి గెస్ట్‌హౌజ్‌కు ప్రయాణం -2.28 గంటలకు గెస్ట్‌హౌజ్‌కు చేరుకున్న సీఎం -మధ్యాహ్న భోజన అనంతరం సాయంత్రం 4 గంటలకు లకారం చెరువు సందర్శన -4.10 గంటలకు.. లకారం చెరువు నుంచి తిరుగు ప్రయాణం -4.15 గంటలకు.. గోళ్లపాడు చానల్‌కు చేరుకున్న సీఎం -5 గంటలకు.. సుందరయ్యనగర్ నుంచి బయలుదేరిన సీఎం -5.10 గంటలకు.. శ్రీనివాస్‌నగర్‌లో పర్యటన -5.20 గంటలకు.. శుక్రవారి పేటలోని ముస్లిం బస్తీలో సీఎం -5.45 గంటలకు.. ఖిల్లాకు చేరుకున్న సీఎం -6.10 గంటల కు.. ఖిల్లా నుంచి ఎన్నెస్పీ గెస్ట్‌హౌజ్‌కు.. -6.30- రాత్రి 9 గంటలకు.. జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.