-వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయం.. వారికి మద్దతు కేసీఆర్ దార్శనికత
-మోదీ హుందాగా చెప్పారు.. రాష్ట్ర బీజేపీ నేతలూ ఆయనలా పశ్చాత్తాప పడాలి
-వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్ పోరాటం ఆగదు.. తెలంగాణ ధాన్యం కొనాల్సిందే
-రైతు వ్యతిరేక విద్యుత్తు సవరణ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి
-మీడియాతో మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి

మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం దేశ రైతులందరి విజయమని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం వెనక్కి తగ్గడం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, వ్యూహరచనా చాతుర్యానికి నిదర్శనమని చెప్పారు. సాగు చట్టాల మాదిరిగానే విద్యుత్తు సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తన తప్పు గ్రహించి రైతులకు క్షమాపణ చెప్పటం హుందాగా ఉన్నదని ప్రశంసించారు. ఏడాది పోరాటంలో ప్రాణాలర్పించిన రైతులకు ఆయన నివాళి అర్పించారు. మరణించిన రైతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాల వల్ల ప్రయోజనం కలుగుతుందని విశ్లేషించిన స్వయం ప్రకటిత మేధావులు ఇప్పటికైనా జాతికి క్షమాపణ చెప్పాలని కోరారు.
కేసీఆర్ వ్యూహాన్ని అర్థం చేసుకునే రద్దు
పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే వ్యవసాయ చట్టాలు రైతాంగానికి అశనిపాతంలా మారుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. జాతీయస్థాయిలో రైతాంగాన్ని కూడగట్టి, ఉద్యమిస్తామని కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే మోదీ మేల్కొన్నారని పేర్కొన్నారు. ఉత్తరాది ఆందోళనలు దక్షిణాదికి విస్తరిస్తే, వాటికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే, తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని భావించే ప్రధాని రైతు చట్టాలను రద్దుచేశారని అభిప్రాయపడ్డారు. జాతీయ రైతాంగ ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని మహాధర్నాలో కేసీఆర్ ప్రకటించడంలోని ఆంతర్యాన్ని మోదీ గ్రహించారని చెప్పారు. అత్యంత ప్రజాదరణ కలిగిన, దేశ సంస్కృతి, భాషపై పట్టుఉన్న కేసీఆర్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఏమి జరుగుతుందో అంచనాతోనే మోదీ చట్టాలను రద్దుచేశారని పేర్కొన్నారు.
వడ్ల కొనుగోళ్ల పోరాటం ఆగదు
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతుల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పశ్చాత్తాపం ప్రకటించిన విధంగానే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆయనను అనుసరించాలని హితవు చెప్పారు. మోదీ తన తప్పును అంగీకరించినా, చట్టాలను అర్దం చేసుకోలేని రాష్ట్ర బీజేపీ నేతలు అవివేకంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యవసాయరంగం నిర్వీర్యం కావటానికి కాంగ్రెస్, బీజేపీ కారణమని చెప్పారు. దేశంలో ఆహారనిల్వలు పేరుకుపోయాయని కేంద్రం అర్దరహితమైన వాదన చేస్తున్నదని విమర్శించారు. ఎఫ్‌సీఐని పునర్వ్యవస్థీకరించాలని 2015లోనే శాంతకుమారి కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం రూ.6 లక్షల కోట్లను మాఫీ చేసిన కేంద్రం రైతు ప్రయోజనాల కోసం ఆలోచించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్తు చట్టాలను వెనక్కి తీసుకోవాలి -మంత్రి జగదీశ్‌రెడ్డి
సాగు చట్టాల మాదిరిగానే రైతు వ్యతిరేక విద్యుత్తు సవరణ చట్టాలను కూడా రద్దు చేయాలని, రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. చలి, ఎండ, వానలను లెక్క చేయకుండా రాత్రింబవళ్లు రైతులు సాగించిన వీరోచిత పోరాటం వల్లనే కేంద్రం దిగొచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతుల కోసం ఉద్యమ నాయకత్వాన్ని చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మరుసటిరోజే ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలన్నీ ఒకెత్తు అయితే, ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ చేపట్టిన మహాధర్నా మరొక ఎత్తు అని అన్నారు. కేసీఆర్ దేశ రైతాంగం పక్షాన నిలబడితే తట్టుకోవడం కష్టమనే గ్రహింపుతోనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇది రైతుల విజయమని, సీఎం కేసీఆర్ వ్యూహచతురతకు నిదర్శనమని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలతోపాటు నిత్యావసర సరుకుల ధరలు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ జెండా ఎత్తుకుంటే తట్టుకోలేమని ప్రధాని మోదీ గ్రహించారని చెప్పారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, వార్షిక వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బాల సుమన్, ఎమ్యెల్యేలు మెతుకు ఆనంద్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత తాత మధు పాల్గొన్నారు.
రైతులకు అభినందనలు
ఏడాది పాటు పోరాడి విజయం సాధించిన రైతులకు అభినందనలు. రైతుల సమస్యల పట్ల, రైతుల ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి, ఆలోచన లేకపోవడం వల్లనే మోదీ నూతన సాగు చట్టాలను తెచ్చారు. అవసరమైతే దేశంలోని రైతుల పక్షాన పోరాటానికి నాయకత్వం వహిస్తానని మహాధర్నాలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వాటిని రద్దు చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచే విద్య కేసీఆర్‌కు వెన్నతో పెట్టిందే.
– సత్యవతి రాథోడ్, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి
పోరాటం ఫలించింది
నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పడం హర్షణీయం. ఏడాది కాలంగా ఉత్తరాది రైతులు, నెల రోజులుగా రైతులతో కలిసి టీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఫలించింది. కేసీఆర్ నాయకత్వంలో రైతులంతా ఏకమవుతారని మోదీ అప్రమత్తమయ్యారు. ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నా సంకేతాలను మోదీ గ్రహించారు. పోరాటాల ఫలితంగానే దిగొచ్చారు. ఉద్యమంలో మృతిచెందిన రైతు కుటుంబాలకు వెంటనే ఆర్థికసాయం అందించాలి.
– కొప్పుల ఈశ్వర్, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి
మహాధర్నాతో రైతులకు లబ్ధి
సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాధర్నాతో 24గంటల్లోనే కేంద్రం దిగొచ్చింది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు మూడింటిని రద్దు చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కష్టాలు పడకూడదనేది కేసీఆర్ ఉద్దేశం. రైతుల ఇబ్బందులు తెలిసిన సీఎం కేసీఆర్ రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయించారు. వరి పంటను కేంద్రం కొనబోమని ప్రకటించడంతో సింహంలా మహాధర్నా చేపట్టారు.
-శ్రీనివాస్‌గౌడ్, పర్యాటకశాఖ మంత్రి
చరిత్రాత్మక విజయం
భారత రైతాంగం చరిత్రాత్మక విజయం సాధించారు. అలుపెరగని పోరాటంలో అమరులైన రైతులకు నివాళి అర్పిస్తున్నాం.
-కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ