
-కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా -ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా పీపుల్స్ ఎజెండా -ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.25 కోట్లకు పెంచాలి -చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి -నాలుగు లక్ష్యాలతో ఎంపీగా బరిలో.. -ట్విట్టర్ ఆస్క్ ఎంపీ కవిత కార్యక్రమంలో ఎంపీ కవిత
కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నది.. రాహుల్‌గాంధీ గ్రాఫ్ పైకి రావడం లేదు.. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి.. 2019 తర్వాత ఆ పార్టీలదే హవా ఉంటుంది. ఫెడరల్ ఫ్రంట్‌కు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణలో మార్పు తెచ్చినట్టుగానే దేశవ్యాప్త మార్పుకోసం ముందుకుసాగుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా పీపుల్స్ ఎజెండా అని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో బుధవారం ట్విట్టర్ సంస్థ నిర్వహించిన ఆస్క్ ఎంపీ కవిత కార్యక్రమంలో ఆమె దేశవ్యాప్తంగా వివిధవర్గాల నుంచి వచ్చిన ట్వీట్లకు సమాధానాలు ఇచ్చారు. ప్రత్యక్షంగా హాజరైన యువత, విద్యార్థులు, మహిళలు పలు ప్రశ్నలు అడిగారు.
ఎంపీ కవిత సమాధానాలు ఆమె మాటల్లోనే.. రాజకీయాల్లో ప్రియాంకది అతిథి పాత్ర. తల్లి కోసం, అన్న కోసం గెస్ట్‌రోల్‌గా వచ్చి తిరిగి వెళ్లిపోతుంది. కాంగ్రెస్‌కు 70 ఏండ్లు అధికార మిచ్చినా ఏమీ చేయలేదు. ప్రస్తుతం ఇస్తున్న రూ.5 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు.. కనీసం రూ. 25 కోట్లకు పెంచాలి. మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నా, పరిపాలనలో భాగస్వాములు కావాలన్నా 33శాతం రిజర్వేషన్ రావాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నీతి ఆయోగ్ సూచించిన విధంగా రూ. 24 వేల కోట్లు కేంద్ర బడ్జెట్లో ఇవ్వాలి. రాష్ట్రానికి ఏం కావాలో, అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలిసిన ఏకైకవ్యక్తి కేసీఆర్. 29 శాతం అభివృద్ధి సాధించి తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది.
నాలుగున్నరేండ్లు కష్టపడితే ఇది సాధ్యమైంది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అందరికీ తెలిసిందే. వారిని రాజకీయాల వైపు ప్రోత్సహించడంలో టీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుంది. గల్ఫ్ మోసాలను అరికట్టేందుకు జాతీయస్థాయిలో చట్టం తీసుకురావాలని విదేశాంగమంత్రిని కలిసి విన్నవించాం. ఈరోజే ఇరాక్ నుంచి పద్నాలుగుమంది బాధితులను ఇండ్ల కు చేర్చాం. గల్ఫ్‌లో ఉపాధికి సంబంధించి టాంకామ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణలో లక్షలాది మంది బీడీ కార్మికులు జీవనభృతి అందిస్తున్నాం. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి ఇంటివద్దే పని కల్పించే కృషి జరుగుతున్నది.
జగన్‌ను కేటీఆర్ కలిస్తే బాబుకేం ఇబ్బంది జగన్‌ను కేటీఆర్ కలిస్తే చంద్రబాబుకు వచ్చే ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఎవరిని కలిసినా మాకు అవసరం లేదు. కేటీఆర్ జగన్‌ను కలిసిన విషయం కూడా ఆయనకు అనవసరం. మీ టూ ఉద్య మం బాధితుల్లో ఎంతో ధైర్యాన్ని నింపింది. మహిళల భద్రత, సంరక్షణకు తెలంగాణలో మంచి కార్యక్రమాలు అమలవుతున్నాయి. పంట పెట్టుబడి సాయం, రైతుబీమా తదితర పథకాలు అనేక రాష్ర్టాలను ఆకర్షించాయి.
రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు.. చిన్నప్పుడు నర్సులు, వారి డ్రెసింగ్, సేవలు చూసి నర్సును కావాలని అనుకునేదాన్ని. తర్వాత వ్యాపారంలో రాణించే మహిళగా ఎదుగాలనుకున్నా. అనంతరం చదువులు, అమెరికా.. అక్కడ వ్యాపారం నిర్వహించా. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడంతో ఉద్యమంలోకి అడుగుపెట్టా. ఉద్యమం రాజకీయాల్లో అడుగుపెట్టేలా చేసింది. ఇందులో మాత్రం నాకు రిటైర్మెంట్ లేదు. నాలుగు న్నరేండ్లలో ఎంపీగా పెట్టుకున్న లక్ష్యాల్లో పసుపు బోర్డు మినహా మిగిలిన లక్ష్యాలను సాధించా. ఈసారి మరో నాలుగు లక్ష్యాలు నిర్దేశించుకున్నా. పసుపు బోర్డును సాధించి తీరడం, ఇండ్లులేని వారికి సొంతింటి కల సాకారం చేయడం, ఐటీ రంగంలో ఉద్యోగాలను కల్పించడం, జిల్లాను బెస్ట్ ఇండస్ట్రీస్ జిల్లాగా మార్చడం లక్ష్యాలుగా పెట్టుకున్నాను.
పనితీరును ప్రజలే నిర్ణయిస్తారు.. కేసీఆర్ కుటుంబసభ్యులు ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వారి పనితీరును ఎన్నికల్లో ప్రజలే ఇస్తారు. అన్నగా కేటీఆర్‌కు పదికి పది మార్కులిస్తా. పొలిటికల్ లీడర్‌గా అయితే ప్రజలే చెప్తూ ఉన్నారు.