-నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఒక్క రూపాయీ ఇవ్వలేదు -విభజన చట్టం హామీలను ప్రస్తావించలేదు -పెట్రోల్ ధరలపై నాడేమన్నారు? నేడు ఏమిచేశారు? -నిర్మల పద్దుపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను విస్మరించడం పట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని, కేంద్ర బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ శనివారం ట్విట్టర్‌లో స్పందించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేలకోట్ల నిధులివ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసును కేంద్రం పట్టించుకోలేదని, ఈ పథకాలకు కనీసం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో కనీసం ఒకదానికైనా జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తిని కేంద్రం విస్మరించిందని, ఐదేండ్లు పూర్తయినా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తూ తెలంగాణకు ప్రత్యేక సాయాన్ని అందజేయాలన్న ఆర్థిక సర్వే సూచనలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం గురించి కేంద్ర బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్- ఫార్మా, ఐటీ, టెక్స్‌టైల్ రంగాలు ఎంతో ముఖ్యమైనవని, వీటికి సంబంధించిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీఐఆర్, ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగాలకు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు.
మోదీ చెప్పిందేమిటి? నిర్మల చేసిందేమిటి? యూపీఏ హయాంలో పెట్రోలు ధరలు భారీగా పెరుగడాన్ని విమర్శిస్తూ నరేంద్రమోదీ (అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు) 2012 మే 23న ట్వీట్ చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు గుర్తుచేశారు. పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల ప్రజలపై విపరీతమైన భారం పడుతుందని నాడు మోదీ పేర్కొంటే.. నేడు నిర్మలా సీతారామన్ తన పద్దులో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలకు వాతలు పెట్టారని, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగి సామాన్యుల జీవితాలు మరింత దుర్భరమవుతాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట స్ఫూర్తితోనే ఆ పథకం.. సీఎం కేసీఆర్ 1998లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు (గుజరాత్‌లో కంటే 12 ఏండ్ల ముందే) ఆ నియోజకవర్గంలో చేపట్టిన సమగ్ర తాగునీటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిషన్ భగీరథను రూపొందించామని, గుజరాత్ నమూనాను అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని ప్రధాని కోరితేనే ఆ రాష్ట్రాన్ని సందర్శించానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో చేపట్టిన మిషన్ భగరథను కేంద్రం స్ఫూర్తిగా తీసుకుని హర్ ఘర్ జల్ యోజనను తీసుకొస్తున్నదని కేటీఆర్ పేర్కొంటూ.. ఈ విషయమై గుజరాత్‌లోని సూరత్ నగర బీజేపీ ఉపాధ్యక్షుడు పీవీఎస్ శర్మ చేసిన వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిచ్చారు.
నిధులు రావడంలేదు: మాజీ ఎంపీ కవిత కేంద్రం నుంచి తెలంగాణకు ప్రశంసలే తప్ప నిధులు రావడంలేదని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఓ మహిళ దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వకారణమని, అయితే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు దక్కకపోవడం బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.