Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేంద్ర సంస్థలపై స్పష్టత ఇవ్వండి

కేంద్ర హోం మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి.. -త్వరలోనే పరిష్కరిస్తామన్న రాజ్‌నాథ్‌సింగ్ -ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం బృందం -హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు మంత్రి స్మృతి ఇరానీ హామీ -కాంపా నిధుల విడుదలకు పర్యావరణ మంత్రి హామీ -సమగ్ర సర్వే ఇతర రాష్ర్టాలకు రోల్‌మాడల్‌గా అభివర్ణించిన జవదేకర్

KCR with Home minister Rajnath Singh

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై పేర్కొన్న అంశాలమీద స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఆ చట్టంలోని షెడ్యూలు 9, 10లో పేర్కొన్న అంశాలు అక్షరాలా అమలు చేసేందుకు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రెండో రోజు ఆదివారం బిజీబిజీగా గడిపారు. ఉదయంనుంచి సాయంత్రం దాకా ముగ్గురు కేంద్ర మంత్రులు.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పర్యావరణ, సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీలను విడివిడిగా కలుసుకున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు, ఐఏఎస్ అధికారులతో కలిసి జరిపిన ఈ భేటీల్లో మంత్రుల నుంచి అనేక విషయాల్లో సానుకూలంగా హామీలు లభించాయి.

హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరలోనే స్పష్టత ఇస్తామని హామీ ఇవ్వగా, వచ్చే సంవత్సరం రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ భరోసా ఇచ్చారు. రాష్ర్టానికి కాంపా నిధుల్లో తెలంగాణ వాటా తక్షణమే విడుదల చేసేందుకు, ప్రభుత్వం చేపడుతున్న హరితహారం పథకానికి ఆర్థిక సహకారం అందించేందుకు, అలాగే సింగరేణిలో చేపట్టే విద్యుత్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కూడా వెంటనే ఇచ్చేందుకు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్రసర్వేకు, హరితహారం పథకానికి కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్‌ నుంచి అభినందనలు లభించాయి.

ఏపీతో మాట్లాడుతా.. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణపై పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 అంశాల మీద ఏపీ ప్రభుత్వంతో కూడా చర్చించి స్పష్టత ఇస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ఎంపీలు, అధికారుల బృందం ఆదివారం ఆయన్ను కలుసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలు, ప్రస్తుత పరిస్థితిని ఆయనకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ రకాల సంస్థల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం వీటి విషయంలో పర్యవేక్షించాలని కోరారు. సమావేశం అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్ కుమార్ మీడియాకు ఈ భేటీ వివరాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న వివిధ ఉన్నత సంస్థలు, పరిశోధనా సంస్థలు తెలంగాణ రాష్ర్టానికే చెందుతాయని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొనబడిన విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చామని చెప్పారు. తమ విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారని, తెలంగాణ రాష్ట్ర వైఖరి తెలిసింది కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణను కూడా తెలుసుకున్న తర్వాత తగిన రీతిలో స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

కాంపా నిధుల విడుదల.. అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సీఎం బృందం సమావేశమైంది. తెలంగాణ రాష్ర్టానికి రావలిసిన కాంపా (కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధులు తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హరితహారం పథకం ప్రస్తావనకు వచ్చింది. ఈ పథకాన్ని మంత్రి ప్రశంసించారు. తెలంగాణ మొత్తం విస్తీర్ణంలో 33శాతం భూభాగంలో అడవులను పెంచాలని నిర్ణయించామని కేసీఆర్ మంత్రికి చెప్పారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావడంతో నర్సరీల్లో మొక్కల పెంపకం జరుగుతోందని, వచ్చే సంవత్సరం వీటిని నాటుతామని, కనీసం కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్రమంత్రికి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంపా నిధుల కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర రూ. 2310 కోట్లు ఉన్నాయని, ఇందులో తెలంగాణ రాష్ట్రం వాటా రూ. 1104 కోట్లు ఉందని, ఇందులో నుంచి అడవుల పెంపకానికి నిధులను విడుదల చేయాలని కోరారు.

KCR 05

జూన్ నెలలో రూ. 35 కోట్లను కేంద్రం విడుదల చేసిందని, అయితే హరితహారం పథకానికి ఈ నిధులు సరిపోవని చెప్పారు. నూతన రాష్ట్రంగా తెలంగాణ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపా నిధుల్లో పదిశాతం నిబంధన సవరించి 30శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి వెంటనే నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా సింగరేణిలో వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపనకు కూడా వెంటనే పర్యావరణ అనుమతులను మంజూరు చేస్తామని కేసీఆర్ చేసిన మరో విజ్ఞప్తిపై మంత్రి బదులిచ్చారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత ఎలాంటి ఆలస్యం లేకుండా పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు.

కేసీఆర్ సూచనలపై కేంద్ర మంత్రి ఆసక్తి పరిశ్రమల స్థాపన, పర్యావరణ పరిరక్షణ అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మదిలోని అంశాలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఆ అంశాలను కేంద్రమంత్రి ఆసక్తిగా విన్నారు. ఏవైనా ప్రాజెక్టులను ప్రారంభించడానికి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ముందస్తుగా అనుమతులు లభించాల్సి ఉంటుందని, పరిశ్రమకు పర్యావరణ క్లియరెన్స్ ఇచ్చే సమయానికి అన్ని రకాల అనుమతులను ఒకేసారి ఇస్తే చాలా సమయం కలిసి వస్తుందని సూచించారు. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు.

సమగ్ర సర్వేకు జవదేకర్ ప్రశంస తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర సర్వే గురించి ఇరువురి మధ్య ప్రస్తావన వచ్చింది. ఈ సర్వే అవసరాన్ని, పూర్తి చేసిన విధానాన్ని, దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో ప్రభుత్వ సిబ్బంది పోషించిన పాత్రను, దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల పటిష్ట అమలు సాధ్యాసాధ్యాల గురించి కేసీఆర్ మంత్రికి వివరించారు. ఒక్కరోజులోనే సర్వేను పూర్తి చేయడం, దాని ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించడం పట్ల కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఈ సర్వేపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని, ఇప్పుడవన్నీ సమసిపోయాయని జవదేకర్ వ్యాఖ్యానించారు. ఈ సర్వే చాలా రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా ఉంటుందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులను కలిసిన సీఎం బృందంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలచారి, రామచంద్రు తెజావత్, పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు.

చానెళ్ల బంద్‌తో మాకు సంబంధం లేదు.. తెలంగాణ రాష్ట్రంలో టీవీ చానెళ్ల ప్రసారాలను ఎమ్మెస్వోలు నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది ఆయా చానెళ్లు, ఎమ్మెస్వోలకు సంబంధించిన అంశం మాత్రమేనని స్పష్టం చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ తెలంగాణ ప్రాంతానికి చెందిన టీ-న్యూస్ లాంటి చానెళ్ల ప్రసారాలు లేనే లేవని, అక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందిన పత్రికలకు కూడా పంపిణీ కాకుండా అనేక ఇబ్బందులు ఉన్నాయని, అయినా ఏనాడూ దీనిపైన చర్చ జరగలేదని కేంద్ర మంత్రి జవదేకర్‌కు వివరించారు.

తిరుమల-తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా టీ-న్యూస్ టీవీ చానెల్ ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి కోరితే పరుషమైన పదజాలంతో చేదు అనుభవం ఎదురైందని కేసీఆర్ మంత్రికి చెప్పారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీ-న్యూస్ టీవీ చానెల్, నమస్తే తెలంగాణ పత్రికలకు చెందిన పాత్రికేయులకు పాస్‌లు కూడా మంజూరు చేయలేదని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇలాంటి వివక్ష చోటుచేసుకోలేదని, మీడియా స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా పాటించిందని తెలిపారు. రెండు టీవీ చానెళ్లు ప్రసారం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని, రాయలేని తీరులో భాషను, పదజాలాన్ని వినియోగించారని, ఈ వైఖరి ఇప్పటికీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పారు.

అయితే ఈ రెండు చానెళ్లు ప్రసారాలను నిలిపివేసిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనికి స్పందించిన ప్రకాష్ జవదేకర్ దేశంలో సుమారు 700కు పైగా టీవీ చానెళ్లు ఉన్నాయని, ఎమ్మెస్వోలు అన్ని ఛానెళ్ళ ప్రసారాలను అందించడం కూడాసాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఆయా చానెళ్లు ఎమ్మెస్వోల మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో కూడా తాము పరిశీలించామని చెప్పారు. అలాంటి ఒప్పందాలు ఉంటేనే చట్టపరంగా సామరస్య పరిష్కారం కనుగొనడం సాధ్యమవుతుందని ఇప్పటికే ఆయా చానెళ్ల ప్రతినిధులకు స్పష్టం చేసినట్లు జవదేకర్ తెలిపారు.

వచ్చే ఏడు తెలంగాణకు ఐఐఎం అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలుసుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కావాలంటే అప్పటికల్లా ఐఐఎం స్థాపన జరగాలని, దీనికి అవసరమైన స్థలాన్ని గుర్తించి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్రం నుంచి ఆమోదం రావడంతోనే స్థలాన్ని కేటాయిస్తామని కేసీఆర్ వివరించారు. ఇప్పటికే ఈ విషయమై టీఆర్‌ఎస్ ఎంపీలు స్వయంగా విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. దీనికి స్పందించిన మంత్రి రానున్న విద్యా సంవత్సరంలో తెలంగాణకు ఐఐఎంను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది.. బడ్జెట్ సమావేశాలు కూడా ముగిశాయి కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా ఐఐఎంను ఇస్తామని చెప్పారు.

KCR with Shmruthi irani

అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పర్యవేక్షణలో అమలవుతున్న సర్వశిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా భారత్, రాజీవ్ విద్యా మిషన్ తదితర పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకు అవసరమైన నిధులను కేంద్రం తన వాటాగా అందిస్తుందని మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇలాంటి పథకాలకు రూ. 300 కోట్ల మొదలు రూ. 800 కోట్ల వరకు కేంద్రం కేటాయించనుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికల హాస్టళ్ళ నిర్మాణం, పాఠశాలల్లో బాలురకు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణం తదితరాలను చేపట్టాలని, వీటికి ఒకవేళ అదనంగా నిధులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకు రావాలని కోరారు. కొన్ని చోట్ల పాఠశాలల నిర్మాణంలో స్థల సమస్య కూడా ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం వీటిని పరిష్కరించాలని ఆమె చేసిన సూచనకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

కేసీఆర్ ఢిల్లీ టూర్ సక్సెస్ – విద్యుత్ సహా పలు అంశాలపై కేంద్రం హామీ – హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రెండు రోజుల ఢిల్లీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేసీఆర్ కోరారు. విద్యుత్ సమస్యతోపాటు ప్రత్యేక హోదా తదితరాలపై కేంద్రంతో చర్చించి పలు అంశాలపై హామీలు పొందారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన పూర్తి విజయవంతమైందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సహకార ధోరణి మరింత బలపడుతున్నదని.. తాజా పర్యటన ఇందుకు నిదర్శనమని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. క్లీన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా బాలికల పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి చేసిన విజ్ఞప్తికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.