Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేంద్ర విధానాలకు నిరసనగా జాతీయ రైతు ఉద్యమం

-జెండా లేవాల్సిందే.. ఉద్యమం రగలాల్సిందే!

-రైతుల కోసం చివరి రక్తంబొట్టు వరకూ పోరాటం

-టీఆర్‌ఎస్‌ పార్టీయే నాయకత్వం వహిస్తది

-సాగు చట్టాలపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తం

-ఉత్తరాది రాష్ట్రాల రైతులను కలుపుకొని పోతం

-ఇది రాజకీయ సమస్య కాదు.. రైతుల జీవన్మరణ సమస్య

-కేంద్ర సర్కారుపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

అవసరం అనుకొంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రైతాంగ సమస్యల కోసం తానే లీడర్‌షిప్‌ తీసుకొంటది. ముందుకు పోతది. మీ మెడలు గ్యారంటీగా వంచుతది. మీ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చివరి రక్తపు బొట్టు దాకా పోరాటం చేస్తం తప్ప, మిమ్ములను వదిలిపెట్టం.ఈ యుద్ధం ఈ రోజుతో అయిపోయేది కాదు. చివరివరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. మన హక్కులు సాధించే వరకు, మన రైతాంగం ప్రయోజనాలు పరిరక్షించే వరకు.. ఉత్తర భారత రైతాంగం చేస్తున్న పోరాటాలను కలుపుకొని ముందుకు వెళ్తాం. ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ఉధృతం చేస్తం.- ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఆకలి కేకలు.. సిగ్గు చేటు

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లోని 116 దేశాల్లో భారత్‌ స్థానం 101 ఉండటం సిగ్గుచేటు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ కంటే కిందిస్థాయిలో ఉన్నం. దేశాన్ని పాలించిన పార్టీల వైఫల్యమే దీనికి కారణం. దేశంలో కోట్ల మంది రైతులున్నరు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములున్నయి. ప్రకృతి ప్రసాదించిన జీవ నదులున్నయి. అద్భుతమైన సైంటిస్ట్‌లు ఉన్నరు. అయిప్పటికీ భారత్‌ ఆకలి రాజ్యంగా మిగిలిపోతున్నది. వ్యవసాయ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నరు? ఎవరి కోసం నిర్లక్ష్యం చేస్తున్నరు? అసలు కేంద్రం పాలసీ ఏమిటి? రైతులను బతకనిస్తరా? లేదా?

ఎలక్షన్‌ రాంగనె భైంసా మొదలైతది

అక్కరున్నప్పుడల్లా.. ఎలక్షన్‌ వచ్చినప్పుడల్లా.. ఒక డ్రామా కొట్టి.. మత విద్వేషాలు రెచ్చగొట్టి.. ప్రజల మధ్య పోరాటాలు పెట్టి.. సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకొని రాజకీయాలు నడుపుతున్నరు. మీకు కాలం చెల్లిపోయింది. మీ విషయం అందరికీ అర్థమైపోయింది. ఎలక్షన్లు వస్తే భైంసా చూపెట్టాలె.. హిందూ, ముస్లింల కొట్లాట పెట్టాలె.. ఎలక్షన్‌ వస్తే పాకిస్థాన్‌ పేరుతో సెంటిమెంట్‌ రెచ్చగొట్టాలె.. ఇదా రాజకీయం?

5 లక్షల టన్నుల వడ్లు బీజేపీ ఆఫీసుపై గుమ్మరిస్తం

బిడ్డా మేం ఒక్కటే చెపుతా ఉన్నం. తీసుకొంటమని చెప్పి ఎఫ్‌సీఐ లెటర్‌ ఇస్తే మీకు గత యాసంగిలో 50 లక్షల టన్నుల బియ్యం ఇచ్చినం. ఇంకా 5 లక్షల టన్నులు అక్కడే ఉన్నయ్‌.. మీరు తీసుకోకపోతే మా రైతుల మీద చుట్టూ తిప్పి దిష్టి తీసినట్టు చేసి, ఆ బియ్యం తెచ్చి మీ బీజేపీ ఆఫీసు మీద కుమ్మరిస్తం జాగ్రత్త.

వ్యవసాయంపై కేంద్రం విధానమేంది?

-అయిష్టంగానే చెప్తున్నా.. అమ్ముడుపోని వరి పంట వేయొద్దు

-యాసంగిలో వెయ్యాల్నా? వద్దా? దండం పెట్టి అడిగినా చెప్పలే

-సీదా చెప్పండి.. మా చావేదో చస్తం.. మీకు చావు డప్పు కొడతం

-ఏడేండ్లుగా కేంద్రంతో రాష్ర్టానికి ఇబ్బందులు.. దేశమంతా ఇంతే

-పచ్చి అబద్ధాలతో పాలిస్తున్న బీజేపీ.. సెంటిమెంట్లపై రాజకీయం

-రైతు సమస్యలకు కేంద్రమే కారణం.. నట్టేట ముంచే రాష్ట్ర బీజేపీ

-మహాధర్నాలో కేసీఆర్‌ గర్జన.. పోరు కొనసాగుతుందని ప్రతిజ్ఞ

-ఇందిరా పార్కు వద్ద ధర్నాకు మంత్రులు, ప్రజాప్రతినిధుల హాజరు

రైతుల సంక్షేమం కోసం కచ్చితంగా ఉద్యమ జెండా లేవాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రణన్నినాదం చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగ ప్రయోజనం కోసం ఉద్యమం రగలాల్సిందేనన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి ఇంటికీ చేర్చాలని.. ఇందుకు తెలంగాణ నాయకత్వం వహించాలని, మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు, వ్యవసాయ చట్టాలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘ఇది ఈ రోజుతో పూర్తి అయ్యే ధర్నా కాదు. ఇది ఆరంభం మాత్రమే. గ్రామ గామాల్లో వివిధ రకాల పోరాట రూపాలతో ముందుకు కొనసాగుతం. కేంద్రం దిగి వచ్చి మన రైతాంగానికి న్యాయం చేసేవరకు పోరాటం ఆగదు. ఈ పోరాటానికి శ్రీకారంగా మన రాజధాని నగరంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది ఉధృతమై, ఉప్పెనలా మారుతుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆలోచింపచేసి, దిగి వచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుంది’ అని గర్జించారు. ధర్మంగా, న్యాయంగా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. ఈ రోజు కేంద్ర విధానాల వల్ల దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎందాకైనా వెళ్తాం

తెలంగాణ రైతు ప్రయోజనాలు కాపాడేందుకు, వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి, కేంద్రానికి మన రైతు గోసను, గోడును వినిపించారని గుర్తుచేశారు. మన బాధలను వివరించి, పంజాబ్‌లో కొంటున్నట్లే మన రైతులు పండించే పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దండం పెట్టి ప్రార్థించి వచ్చారన్నారు. ‘నేను, మంత్రులు, అధికారులు అందరం వెళ్లి దండం పెట్టి ఆ కేంద్ర మంత్రిని అయ్యా మీరు వడ్లు కొంటరా.. కొనరా? కొనకపోతే చెప్పండి.. వేరే పంటలు వేయాలని మేం రైతులకు చెప్తం. పండినకాడికే బతుకుతం. కానీ పండించి ఆగం కావొద్దని చెప్పి అడిగితే.. ఇవ్వాల్టి వరకు ఉలుకూ పలుకూ లేదు. ఫోన్‌లలో మాట్లాడితే, మేం విదేశాలకు పోయినం.. ఇంకో వారానికి చెప్తం.. అంటూ 50 రోజులు గడిచిపోయాయి. స్వయంగా ప్రధానికి లేఖ రాసినా ఇప్పటివరకు ఉలుకు పలుకు లేకుండా కేంద్రం నిద్ర నటిస్తున్నది’ అని కేసీఆర్‌ విమర్శించారు.

అందుకే.. వీళ్లు వడ్లు కొనేటట్లు లేరు.. యాసంగిలో వేస్తే బాధపడుతమని, వరి వొద్దని వ్యవసాయ మంత్రి చెప్పారని తెలిపారు. కానీ రాష్ట్ర బీజేపీ వాళ్లు వడ్లే వేయాలె అని మాట్లాడుతున్నారని చెప్పారు. మన బాధ దేశానికి, ప్రపంచానికి తెలియాలనే ఈ ధర్నా చేపట్టినట్లు వివరించారు. ‘నేను ప్రధాని మోదీని సూటిగా అడుగుతున్నా. ఈ సభలో మీ సీఐడీలు ఉన్నరు. నేను మాట్లాడే మాట పావుగంటలో మీ టేబుల్‌ మీదకు వస్తది. ఆ విషయం నాకు తెలుసు. అయ్యా ప్రధానమంత్రిగారూ మీకు దండంపెట్టి రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా నేను అడుగుతా ఉన్న. అనురాధ కార్తె 19వ తారీఖున వస్తది. మేము యాసంగిలో వరి వేయాల్నా వద్దా? ఒక్కటే మాట చెప్పండి.. తీసుకుంటరా, తీసుకోరా? తేల్చండి. లేదంటే మా చావేదో మేము చస్తం. ఏ దారి పట్టాల్నో ఆలోచిస్తాం’ అని సీఎం అన్నారు. తమ సమస్యకు పరిష్కారం దొరకకుంటే యుద్ధాన్ని ప్రజ్వలింపజేస్తామని, సమస్యను ఎక్కడిదాక తీసుకొని పోవాల్నో అక్కడిదాక తీసుకొని పోతామని స్పష్టంచేశారు. ఈ విషయంపై ఇప్పటికే తాను చాలామందితో మాట్లాడుతున్నట్లు చెప్పిన సీఎం కేసీఆర్‌.. కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి..

కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకొంటూ, వ్యవసాయరంగాన్ని చక్కదిద్దుకున్నామని సీఎం కేసీఆర్‌ వివరించారు. ఆ ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత, నిల్వచేయగలిన సామర్థ్యం కేంద్రం వద్దనే ఉన్నదని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా కేంద్రం లక్షా, రెండు లక్షల కోట్లను ఖర్చుచేసైనా రైతులను ఆదుకోవాలని, ధాన్యాన్ని సేకరించాలని, ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా ఆలోచనలుచేయాలని డిమాండ్‌చేశారు.

పచ్చి అబద్ధాల బీజేపీ..

బీజేపీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో దేశాన్ని పాలిస్తున్నదని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మాట్లాడితే అబద్దాలు.. వాట్సప్‌, ఫేస్‌బుక్కుల్లో వితండవాదాలు, వ్యక్తుల క్యారెక్టర్‌ను కించపరిచేలా ప్రచారాలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ఏడేండ్లుగా తెలంగాణను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసిందని మండిపడ్డారు. ఏడు మండలాలను లాగి ఏపీకి కట్టబెట్టారని, సీలేరు పవర్‌ ప్లాంట్‌ను లాగేసుకొన్నారని చెప్పారు. రాష్ర్టానికి ఏపీ విద్యుత్‌ ఇవ్వకున్నా కేంద్రం తెలంగాణను ఆదుకోలేదని, గిరిజన యూనివర్సిటీని, నవోదయ పాఠశాలలను మంజూరుచేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు సమయం వచ్చిందని, కేంద్రం మెడలు వంచుతామని అన్నారు.

తీర్మానాలపై సమధానం ఏది?

అనేక సమస్యలను కేంద్రం పెండింగ్‌లో పెట్టిందని కేసీఆర్‌ అన్నారు. దళితుల వర్గీకరణ కోసం శాసనసభ తీర్మానంచేసి పంపిస్తే ఇప్పటివరకు దాని మీద కుయ్యి లేదు, కుటుకు లేదన్నారు. రాష్ట్రంలో గిరిజన జనాభా శాతం పెరిగిందన్న కేసీఆర్‌.. వారికి రిజర్వేషన్లు ఇయ్యండని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానంచేస్తే దానికి దిక్కు లేకుండా పోయిందని చెప్పారు. బీసీలు దేశంలో 50% ఉన్నారని, కుల గణన చేస్తే వారికి న్యాయం జరుగుతదని, జన గణనలో కుల గణన చేయండని అసెంబ్లీ తీర్మానంచేస్తే దానికీ సమాధానం రావడంలేదన్నారు.

సెంటిమెంట్‌ రాజకీయాలు నడుపుతున్నారు

ప్రజా సమస్యలు, అనేక విషయాలు పక్కన పెట్టి, అక్కరున్నప్పుడల్లా.. ఓట్లు వచ్చినప్పుడల్లా.. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకొని రాజకీయాలు నడుపుతున్నారని బీజేపీపై సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మీకు కాలం చెల్లిపోయిందని, మీ విషయం అందరికీ అర్థమైపోయిందని అన్నారు. మీ సర్జికల్‌ స్ట్రైక్‌లు.. మీరు సరిహద్దుల్లో ఆడే నాటకాలు, మీరుచేసే మోసాలు మొత్తం బట్టబయలై బయటికి వచ్చేశాయన్నారు. ఎలక్షన్లు వస్తే భైంసా చూపెట్టాలె.. హిందూ, ముస్లింల కొట్లాట పెట్టాలె.. పాకిస్థాన్‌ పేరుతో సెంటిమెంట్‌ రెచ్చగొట్టాలె.. ఇదా రాజకీయం? దీని కోసమా మిమ్ములను ప్రజలు ఎన్నుకున్నది?’ అని సీఎం నిలదీశారు. ఇలాంటి విధానాలతోనే తెలంగాణను కూడా ఏడిపిస్తున్నారని తెలిపారు.

నీళ్ల విషయంలో తగవు పెడుతున్నారు..

ఈ దేశానికి ప్రకృతి ఇచ్చిన సంపద 65 వేల టీఎంసీల నీళ్లున్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో దేశం మొత్తం వాడుకునేది 35 వేల నుంచి 36 వేల టీఎంసీలు కూడా లేదన్నారు. ఇంకో 30 వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయన్నారు. చాట్ల తవుడు పెట్టి కుక్కలకు కొట్లాట పెట్టినట్లు.. రాష్ర్టాల మధ్య తగువులు పెట్టి నీళ్లు ఇవ్వకుండా మొత్తం దేశాన్ని, రైతాంగాన్ని అల్లల్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఉండే వ్యవసాయ భూమి మొత్తం 40 కోట్ల ఎకరాలనీ, ప్రతి ఎకరానికీ నీళ్లిచ్చినా ఇంకా 25 వేల టీఎంసీలు మిగిలే ఉంటాయన్నారు. ప్రతి ఇంటికీ తెలంగాణలో ఇచ్చినట్లు మిషన్‌ భగీరథ నీళ్లు ఇచ్చి.. 10 వేల టీఎంసీలు వాడుకొన్నా, మరో 15 వేల టీఎంసీల మిగులు ఉంటుందని, మరో వందేండ్ల దాకా ఈ దేశానికి ఢోకానే ఉండదని కేసీఆర్‌ చెప్పారు. ఇవన్నీ చేసే తెలివితేటలు, పరిష్కార మార్గాలు చూసే సంస్కృతి, ఆలోచన, మేధావితనం కేంద్రానికి లేదని ఎద్దేవాచేశారు.

మేమిచ్చిన కరెంట్‌.. వేరేవాళ్లు ఎందుకియ్యలే?

కేసీఆర్‌ కన్నా దొడ్డుగ ఉన్నోళ్లు, పొడుగున్నోళ్లు ఈ రాష్ర్టానికి చాలామంది సీఎంలుగా చేశారని, కానీ 30 ఏండ్లు ఎలా ఏడ్చినం కరెంట్‌ కోసం? ఎందుకు ఇవ్వలేదు కరెంట్‌? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోతలు లేని, నాణ్యమైన కరెంటు ఎలా ఇవ్వగలుగుతున్నామో ఆలోచించాలన్నారు. సమర్థత, శక్తి, అకుంఠితమైన దీక్ష ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు. ఇవాళ వడ్లతో పోరాటాన్ని ప్రారంభించామని, రానున్న రోజుల్లో తప్పకుండా దేశంకోసం కూడా పోరాటం చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఈ దేశం ఎటుపోతున్నదో.. ఏం జరుగుతున్నదో చెప్పాల్సిన బాధ్యత తనపై ఉన్నదని తెలిపారు. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల కరెంట్‌ అందుబాటులో ఉంటే.. ఏ రోజూ రెండు లక్షల మెగావాట్లకు మించి వాడుకోవడం లేదన్నారు. మన రాష్ర్టాన్ని పక్కనపెడితే, ఏ ఒక్క రాష్ట్రంలోనూ 24 గంటలు కరెంట్‌ ఇవ్వడం లేదని చెప్పారు. ఇది ఎవరి చేతకానితనమని ప్రశ్నించారు. కరెంట్‌ అందుబాటులో ఉన్నది కానీ దేశానికి ఇచ్చే తెలివితేటలు లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. కానీ.. కరెంట్‌ మోటర్లకు మీటర్లు పెట్టండి.. ముక్కు పిండి రైతుల దగ్గర బిల్లులు వసూలు చేయుర్రి.. ఏ రాష్ట్రం వసూలు చేయదో వాళ్ల అప్పులు అపేస్తాం.. వాళ్లను కష్టపెడుతాం.. వాళ్లకు రానియ్యం.. అంటున్నారన్న కేసీఆర్‌.. ఇదా పాలసీ అని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో మీటర్లు లేవు.. నీటి తీరువా లేదు..

‘ఇవాళ మన కరెంట్‌ మోటర్లకు మీటర్లు పెట్టమంటున్నది కేంద్రం. పెడుదమా?’ అని ధర్నాకు హాజరైన రైతులనుద్దేశించి కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం చేసేప్పుడు ఈ మీటర్ల లొల్లి ఉండేదని, రాష్ట్రం తెచ్చుకొన్నాక ఇవాళ మీటర్లు లేవని చెప్పారు. ‘రైతుకు ఏకాణ కష్టం లేకుండా కరెంట్‌ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు, రైతుబీమా ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు మత్తళ్లు పారిచ్చే ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్‌ఎస్‌.. ఇవన్నీ వాస్తవం కాదా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందే

ఈ గోలుగుండం గాళ్లకు, కరెంటు ఉన్నా వాడలేని అసమర్థులకు, దేశంలో నీళ్లున్నా ప్రజలకు ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడితేనే ఈ దేశానికి నిష్కృతి లభిస్తుందని కేసీఆర్‌ అన్నారు. మన సమస్యలకు పరిష్కారం చిప్ప పట్టుకొని బిచ్చమెత్తుకుంటేనో, బతిమిలాడితేనో దొరకదని చెప్పారు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్లు కాదన్నారు. పంట పండించి దేశానికి అన్నం పెడతామంటే తీసుకొనే తెలివి లేక గోల్‌మాల్‌ చేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. మాట్లాడితే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారన్న కేసీఆర్‌.. వీరి చర్యలతో దేశం మూగబోతున్నదన్నారు. ఏమి కేసులు పెడతారో పెట్టండని సవాల్‌ చేశారు.

మిగిలిన బియ్యం కొనకుంటే.. బీజేపీ ఆఫీస్‌ మీద కుప్ప పోస్తం

‘బియ్యం వేసేందుకు ఆర్డర్‌ తీసుకొని రా.. నేనే నిలబడి.. విత్తనాలు, ఎరువులు, కరెంట్‌ సప్లయ్‌ చేసి, బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చి 70 లక్షల ఎకరాలు వరి వేయిస్త.. అంటే దానికి సమాధానం రాదు. వానకాలం బియ్యం కొంటారా.. కొనరా? అంటే సమాధానం లేదు. కానీ బీజేపీవాళ్లు యాసంగిలో వడ్లు వేయాలని రైతులను ప్రోత్సహిస్తామంటే ఏం కావాలె? వీళ్ల నీతి ఏంది? బియ్యం కొనాలే కానీ మేం కొనం.. ఈడ బజార్ల పోయాలే.. దాని మీద మేం రాజకీయ నాటకం ఆడాలే.. ఇదేనా నాటకం? బిడ్డా మేం ఒక్కటే చెపుతా ఉన్నం. తీసుకొంటమని చెప్పి ఎఫ్‌సీఐ లెటర్‌ ఇస్తే మీకు గత యాసంగిలో 50 లక్షల టన్నుల బియ్యం ఇచ్చినం. ఇంకా 5 లక్షల టన్నులు అక్కడే ఉన్నాయ్‌.. మీరు తీసుకోకపోతే మా రైతుల మీద చుట్టూ తిప్పి దిష్టి తీసినట్లు చేసి, ఆ బియ్యం తెచ్చి మీ బీజేపీ ఆఫీసు మీద కుమ్మరిస్తాం జాగ్రత్త.

పిచ్చికూతలు మానుకోండి

కేసీఆర్‌కు భయం అంటే ఏందో చూపిస్తామని బీజేపీ నాయకులు మాట్లాడటంపై స్పందిస్తూ.. ‘కేసీఆర్‌ భయపడతడా? కేసీఆర్‌ భయపడితే తెలంగాణ వచ్చునా?’ అని ప్రశ్నించారు. పిచ్చికూతలు మానుకోవాలన్న కేసీఆర్‌.. ‘మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే.. స్ట్రైయిట్‌గా చెప్పండి. వానకాలంలో వడ్లు కొంటరా లేదా? గత యాసంగి ఐదు లక్షల టన్నుల బియ్యం కొంటరా లేదా? యాసంగిలో వరి వేయమంటరా? తప్పు చెప్పినమని ముక్కు నేలకి రాస్తరా? చెంపలేసుకొని సమాధానం చెప్పండి’ అన్నారు.

ఇది రైతుల జీవన్మరణ సమస్య

ఇది రాజకీయ సమస్య కాదని, రైతుల జీవన్మరణ సమస్యని, రైతుల బతుకుదెరువు సమస్యని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘వేసిన పంట అమ్ముడుపోకపోతే రైతు ఏమి చేయాలె? రైతులు మళ్లీ విషం తాగి చనిపోవాలా? చెట్లకు శవాలు వేలాడాలా? ఆత్మహత్యలు చేసుకోవాలా? కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం ఇంత అరాచకంగా వ్యవహరించవచ్చునా? ఇంత గోల్‌మాల్‌ తిప్పొచ్చునా? ఇది రాజకీయమా? ఈ రాజకీయాన్ని ఎదిరించే, ప్రశ్నించే అవసరం లేదా? ప్రజలు మూగబోవాల్నా? మీ దుర్మార్గమైన చట్టాల కింద నలిగిపోవాల్నా? నాశనం కావాల్నా?’ అంటూ కేసీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాలు, కోట్లాటలు తర్వాత చేసుకోవచ్చని, ముందు ప్రజల జీవితాలతో ముడిపడివున్న ఈ అంశానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా విరివిగా, వివిధ ప్రక్రియల ద్వారా ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తామన్నారు. తాను అధికారులు, ఇతరులతోపాటు రైస్‌ మిల్లర్లతో మాట్లాడుతున్నానని, ఏ పరిష్కారం దొరుకుతుందో, కేంద్రం నీతి ఎలా ఉంటుందో వేచిచూస్తామని, వారి వైఖరికి అనుగుణంగా తమ తదుపరి ప్రయాణాన్ని నిర్ధారిస్తామని చెప్పారు.

అయిష్టంగానే వరి వద్దంటున్నం..

రైతులను ఆదుకోవాల్సిన కేంద్రమే కార్లను ఎక్కించి చంపుతున్నదని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మొత్తం ప్రైవేట్‌పరం చేస్తామని, మార్కెట్లను రద్దు చేస్తామంటున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం వస్తున్న వానకాలం ధాన్యాన్నే కొనుగోలు చేయడం లేదని, యాసంగికి వచ్చే ధాన్యం ఇంకేం కొంటుందని.. ఇష్టం లేకపోయినా.. అమ్ముడుపోని వరి మనకొద్దని అంటున్నామని చెప్పారు. నాలుగు పైసలు వచ్చే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను కోరుతున్నామని వివరించారు. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలు వడ్లే వేయాలంటూ రైతులను నట్టేట ముంచే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

సాఫ్‌ సీదా ముచ్చట.. ఒక్కటే ప్రశ్న..

రైతుబంధుతోపాటు పూర్తిచేస్తున్న సాగునీటి ప్రాజెక్టుల ఫలితంగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగిందని కేసీఆర్‌ చెప్పారు. ఆ ధాన్యాన్ని కొంటరా? కొనరా అని అడిగితే కేంద్రంలోని బీజేపీ స్పష్టతనివ్వకుండా వంకర టింకర సమాధానాలు చెప్తూ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సాఫ్‌సీదా ముచ్చట.. తెలంగాణ ధాన్యం కొంటరా.. కొనరా.. చెప్పాలె’ అన్నారు. ఇది ఒక్క తెలంగాణ సమస్య కాదని, యావత్‌ దేశ రైతాంగం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నదని వివరించారు. కేంద్రంచేసిన చట్టాలతో అన్నదాతల బతుకులు ఆగమైతున్నయని ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీ రాజధానిలో ఏడాదికాలంగా లక్షలమంది రైతులు ధర్నా చేస్తున్నా కేంద్రం వారి మొరను ఆలకించడంలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ దేశాన్ని దశాబ్దాలుగా పాలిస్తున్న పార్టీలే కారణమని విమర్శించారు.

ఎందుకు కల్లాల కాడికి పోతున్నరు?

‘మంత్రి నిరంజన్‌రెడ్డి ఢిల్లీకి పోయి ‘అయ్యా తెలంగాణలో 62 లక్షల ఎకరాలు ఉంటది’ అంటే.. ‘లేదు’ అని అబద్ధాలు మాట్లాడారు. ‘అరే నాయన.. మేం ఎందుకు అబద్ధాలు చెప్తాం? మేం రైతు ఖాతాలో రైతుబంధు వేసెటోళ్లం.. ఏ రైతు సాగు చేస్తుండో మాకు తెలుసు’ అని చెప్పి మొత్తం లెక్కలు తీసుకుపోయి ఇస్తే.. ‘ఆ ఉన్నది.. ఉన్నది.. 59 లక్షల ఎకరాలు ఉన్నది’ అంటరు’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మీరు అదరకొడితే.. మేం మాట్లాడకపోతే మీరు చెప్పేది నిజం అయితదా.. అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వడ్లు పండనే లేదు.. 62 లక్షల ఎకరాల్లో లేదనేటోళ్లు కల్లాల కాడికి ఎందుకు పోతున్నారని బండి సంజయ్‌ని ఉద్దేశించి ప్రశ్నించారు.

ప్రతి గ్రామంలో చావు డప్పు కొడదాం

మక్కలు వేయవద్దని తాను గతంలో చెప్తే ఆ మాట మన్నించి ఎక్కువమంది వేయలేదని కేసీఆర్‌ గుర్తుచేశారు. రైతులు ఆర్థికంగా నష్టపోవద్దన్నదే తన ఆకాంక్ష అన్నారు. ‘దేశంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి సహా మెత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ధర్నా చేస్తరా?’ అని ప్రశ్నించారు. ఇప్పటికీ కేంద్రం కదిలి రాకపోతే ఏమి చేయాలో ఆలోచన చేస్తామన్న కేసీఆర్‌.. ‘అవసరమైతే ప్రతి గ్రామంలో చావు డప్పు కొడదాం. పోరాటం చేద్దాం. ఎక్కడిదాకనైనా పోయేందుకు ప్రయత్నం చేద్దాం. ఏమి సమాధానం వస్తదో చూద్దాం. సమాధానం వస్తదా, రాదా, ఏమి చెప్తరో చూద్దాం’ అని అన్నారు. రాజకీయాలు పక్కకు పెడితే రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్‌ఎస్‌కు మించిన పార్టీయే లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. తాము యుద్ధం ప్రారంభిస్తే చివరిదాక కొట్లాడుతామని, దేనికీ భయపడమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు కాపాడుకొంటామని, వారిని కడుపులో పెట్టుకొంటామని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.
ఏడేండ్లుగా తెలంగాణను కేంద్రం అనేక ఇబ్బందులు గురిచేసింది. ఏడు మండలాలను లాగి ఏపీకి కట్టబెటింది. సీలేరు పవర్‌ ప్లాంట్‌ను లాగేసుకొన్నది. రాష్ర్టానికి ఏపీ విద్యుత్‌ ఇవ్వకున్నా కేంద్రం తెలంగాణను ఆదుకోలేదు. గిరిజన యూనివర్సిటీని, నవోదయ పాఠశాలలను మంజూరుచేయడం లేదు. – సీఎం కేసీఆర్‌

ఢిల్లీ వరకు యాత్ర చేయాల్సి వస్తుంది…

‘తెలంగాణ పోరాటాల గడ్డ, విప్లవాల గడ్డ. తనను తాను ఎలా రక్షించుకోవాలో బాగా తెలిసిన గడ్డ. పరాయి పాలకుల విషకౌగిలి నుంచి బయటపడి స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని, అద్భుతమైన పద్ధతిలో ముందుకుపోతున్న రాష్ట్ర రైతాంగానికి అశనిపాతంలాగా కేంద్రం నిర్ణయాలు దాపురిస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి వాళ్ల కండ్లు తెరిపించుకోవడానికి ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టాం. దేశాన్ని పరిపాలించే పార్టీ నాయకులు వితండవాదాలు చేస్తున్నారు.నియోజకవర్గాల్లో ధర్నా చేస్తే.. ప్రభుత్వమే ధర్నా చేస్తదా? అని అంటున్నరు. మేం 2 గంటల వరకే ధర్నాల కూర్చుంటే, 2006లో గుజరాత్‌ సీఎం హోదాలో మోదీ 51 గంటలు ధర్నాలో కూర్చున్నారు. సీఎంలు, మంత్రులు ధర్నా చేయనటువంటి పరిస్థితి కల్పించే బాధ్యత ప్రధాని అయ్యాక ఆయన మీదున్నది. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాలో కూర్చొని డిమాండ్‌ చేసే దిక్కుమాలిన పరిస్థితులు దేశంలో ఇంకా ఉన్నాయనే సందేశం పోతున్నది. పనిలేక ధర్నాలో కూర్చోలేదు. అలాంటి పరిస్థితి కేంద్రం కల్పించింది. పరిస్థితి విషమించినా కేంద్రంలో ఉలుకు పలుకు లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకొన్నాం. ఇంకా చాలా పోరాటాలున్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో ప్రజానీకానికి తెలియజేస్తాను.

రైతులను బతుకనిస్తరా.. బతుకనివ్వరా..

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లోని మొత్తం 116 దేశాల్లో భారత్‌ స్థానం 101 ఉండటం సిగ్గుచేటని సీఎం కేసీఆర్‌ అన్నారు. బంగ్లాదేశ్‌, పొరుగున ఉన్న పాకిస్థాన్‌ కంటే కిందిస్థాయిలో ఉన్నామని, అందుకు దేశాన్ని పాలించిన పార్టీల వైఫల్యమే కారణమని నిప్పులు చెరిగారు. ‘దేశంలో కోట్ల మంది రైతులున్నారు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ప్రకృతి ప్రసాదించిన జీవనదులున్నాయి. అద్భుతమైన సైంటిస్ట్‌లు ఉన్నారు. అయిప్పటికీ భారత్‌ ఆకలి రాజ్యంగా మిగిలిపోతున్నది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘వ్యవసాయ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.. ఎవరి కోసం నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు కేంద్రం పాలసీ ఏమిటి? రైతులను బతకనిస్తరా? లేదా?’ అని కేంద్రాన్ని నిలదీశారు.

రైతు సమస్యలపై టీఆర్‌ఎస్‌ లీడర్‌షిప్‌ తీసుకుంటది

‘మీరు అనుకుంటున్నరేమో ముఖ్యమంత్రి, మంత్రి పదవుల కోసం మేం భయపడుతామని! పదవులను ఎట్ల చిత్తు కాగితాల్లా విసిరేసినమో.. ఎన్నిసార్లు రాజీనామా చేసినమో.. మంత్రి పదవులు, కేంద్రమంత్రి పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు ఎన్నిసార్లు తెలంగాణ కోసం పారేసినమో మీకు తెలుసు. అవసరం అనుకొంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రైతాంగ సమస్యల కోసం తానే లీడర్‌షిప్‌ తీసుకొంటుంది. ముందుకు పోతుంది. మీ మెడలు గ్యారంటీగా వంచుతది. మీ కుటిల నీతి, మీ దుర్మార్గమైన విధానాలు, మీ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చివరి రక్తపు బొట్టు దాకా పోరాటం చేస్తాం తప్ప మిమ్ములను వదిలిపెట్టం’ అని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.